‘కేసీఆర్‌ పిచ్చి కుక్కలా తయారయ్యాడు’ | L Ramana Fires On KCR In Press Meet | Sakshi
Sakshi News home page

‘కేసీఆర్‌ పిచ్చి కుక్కలా తయారయ్యాడు’

Published Tue, Nov 27 2018 3:11 PM | Last Updated on Tue, Nov 27 2018 6:23 PM

L Ramana Fires On KCR In Press Meet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రజాకూటమి అధికారంలోకి వస్తే కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సూచనలతో పాలన సాగుతుందని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు. మంగళవారం ‘మీట్‌ ద ప్రెస్‌’  కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ... కూటమి అధికారంలోకి వచ్చేందుకు తాను కృషి చేస్తున్నానని తెలిపారు. తాను ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయకుంటే వచ్చే నష్టమేమీ లేదని వ్యాఖ్యానించారు. ఎటువంటి పట్టింపులు లేకుండా టీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా కూటమిలో అన్ని పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులను ప్రజలు సన్నాసులుగా భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. వారికి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.

కేసీఆర్‌ పిచ్చి కుక్కలా తయారయ్యాడు
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాచ్‌డాగ్‌లా ఉంటానని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ఇప్పుడు పిచ్చి కుక్కలా తయారయ్యాడని రమణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘ బొంబాయి, బొగ్గు బావి, దుబాయ్ అని ప్రగల్బాలు పలికి ఒక్కరికి కూడా న్యాయం చేయలేదు. రైతులను నిండా ముంచారు. ప్రజలు మరోసారి అవకాశం ఇస్తే తన మనవడిని కూడా రాజకీయాల్లోకి దింపుతాడు. స్వార్థ రాజకీయాల్లో ఆయనను మించిన వారు లేరు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నా ఒక్కసారి కూడా విమర్శించలేదు. తన తప్పులు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో మోదీతో కుమ్మక్కై తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు’  అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించారు.

చంద్రబాబు వాస్తవాలకు దగ్గరగా ఉంటారు
తమ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వాస్తవాలకు దగ్గరగా ఉంటారని రమణ అన్నారు. టీడీపీని హైదరాబాద్‌లోనే ప్రారంభించారని, ఇక్కడ ఎలాంటి విపత్తు వచ్చినా స్పందించే గుణం తమ నాయకులకు ఉందని పేర్కొన్నారు. అన్ని వర్గాల వారికి న్యాయం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ లేకుండా చేయాలని కేసీఆర్‌ చేసిన కుట్రలన్నీ బెడిసి కొట్టాయని అన్నారు. లక్షల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారని ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చి తీరతామని రమణ ధీమా వ్యక్తం చేశారు. కూకట్‌పల్లి విజయంతో కేసీఆర్ పతనానికి నాంది పలుకుతామని పేర్కొన్నారు.

ప్రత్యేక రాష్ట్రం అంటే.... ప్రత్యేక రాజ్యాంగం కాదు
లక్షల మంది పోరాటంతో తెలంగాణ వచ్చిందని, కేసీఆర్‌ మాత్రం తానొక్కడినే తెలంగాణ తెచ్చినట్టు మాట్లాడుతారని రమణ ఎద్దేవా చేశారు. అయినా ప్రత్యేక రాష్ట్రం అంటే ప్రత్యేక రాజ్యాంగం ఉండదని వ్యాఖ్యానించారు. కూటమిలోని అన్ని పార్టీల మేనిఫెస్టోలకు విలువ ఇస్తూనే ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తున్నామని తెలిపారు. ఆచరణ సాధ్యమయ్యే హామీలను మాత్రమే ఇచ్చామని, వచ్చే నెల 4న సాయంత్రం పూర్తి మేనిఫెస్టో విడుదల చేస్తామని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement