సమస్యల కొల్లేరు ఆశల సెలయేరు
నెరవేరేనా ఈ మారు
రేపు కొల్లేటికోటకు కేంద్రమంత్రుల రాక
కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలతో సమావేశం
ఆశలన్నీ కాంటూరు కుదింపుపైనే..
కోల్లేటివాసుల జీవనప్రదాయినిగా.. అంతులేని మత్స్యసంపదకు ఆలవాలంగా.. ప్రకృతి రమణీయతకు పట్టుకొమ్మగా విలసిల్లుతున్న కొల్లేరు సిరుల సెలయేరు. ప్రశాంతతకు చిహ్నంగా.. శాంతికపోతంగా పైకి కనిపించే ఈ సరస్సు వెనుక ఏళ్ల తరబడి కన్నీరు ప్రవాహమై ఉరకలేస్తోంది. ఎన్నో సమస్యలు.. ఎంతోమంది పాలకులు.. వచ్చిపోయే వారే గానీ పరిష్కారం చూపేవారే లేక.. కొల్లేరు కన్నీటి ఏరై నెమ్మదిగా కదులుతోంది.
ఆ కన్నీళ్లను తుడుస్తానంటూ.. ఆశల పల్లకీని మోసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం కోసం కొల్లేరువాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన హామీ మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో కలిసి శుక్రవారం హెలికాప్టర్‌లో కొల్లేరులో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం కైకలూరు మండలం కొల్లేటికోట గ్రామంలో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలతో బహిరంగ సమావేశం నిర్వహించనున్నారు. కొల్లేటి సమస్యల పరిష్కారానికి ఈ సమావేశం కీలకం కానుంది. - కైకలూరు
కొల్లేటి సమస్య ఎప్పుడూ ప్రభుత్వాలకు సవాల్‌గానే మారుతోంది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 77వేల 131 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు అభయార ణ్యం విస్తరించి ఉంది. ఇక్కడి ఆక్రమిత చెరువుల వల్ల పర్యావరణం దెబ్బతింటోందని సుప్రీంకోర్టులో పర్యావరణవేత్తలు పిల్ వేయడంతో 2006లో ఇరు జిల్లాల్లోనూ 31వేల 125.75 ఎకరాల విస్తీర్ణంలో ఆక్రమిత చేపల చెరువులను ధ్వంసం చేశారు. అప్పటి నుంచి కొల్లేరు వాసులు కొల్లేరు కాంటూరు పరిధిని +5 నుంచి +3 వరకు కుదించాలని కోరుతున్నారు. అదేవిధంగా కృష్ణాజిల్లాలో కొల్లేరు ఆపరేషన్ సమయంలో ధ్వంసం చేసిన 7,500 ఎకరాలను పంపిణీ చేయాలని చెబుతున్నారు.
ఆ ఆశలు నెరవేరేనా..
కొల్లేరు ప్రజల చిరకాల ఆశలు ఈసారైనా నెరవేరుతాయా అనే అనుమానం ఇక్కడి ప్రజల్లో నెలకొంది. ప్రతిసారీ నాయకులు రావడం.. వాగ్దానాలు చేసి వెళ్లడం పరిపాటిగా మారింది. అప్పటి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జైరాం రమేష్ 2010 ఫిబ్రవరిలో కొల్లేటికోటలో సమావేశం నిర్వహించారు. కాంటూరు కుదింపుపై సానుకూలంగా మాట్లాడారు. అంతా బాగుంటుందనే సమయానికి 2010 మే 21న చిత్తడి నేలల చట్టం పరిధిలోకి కొల్లేరును చేరుస్తూ కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ముసాయిదా విడుదల చేసింది. దేశంలోని 25 చిత్తడి ప్రాంతాల్లో కొల్లేరును చేర్చింది. అనంతరం 2010 సెప్టెంబరు 19 నుంచి 24వ తేదీ వరకు ప్రముఖ పర్యావరణవేత్త ఆజీజ్ నేతృత్వంలో కమిటీ కొల్లేరులో పర్యటించి నివేదిక అందించింది. ఆ నివేదికలో కూడా పర్యావరణానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్ మరణాంతరం 2013లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొల్లేరుపై సబ్‌కమిటీ వేస్తానని చెప్పారు. ఆ హామీలన్నీ నీటిమూటలుగానే మిగిలిపోయాయి. ప్రస్తుతం వస్తున్న బీజేపీ కేంద్ర మంత్రులు ఏ మేరకు న్యాయం చేస్తారా అని కొల్లేరు ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
కొల్లేరు ప్రజలు వలసపోతున్నారు
కొల్లేరు ప్రజలు ఉపాధిలేక వలస పోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొల్లేరు 5 నుంచి 3వ కాంటూరు వరకు కుదించాలి. పేదలకు భూములు పంచాలి. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలి. కొల్లేరు మత్స్యకారుల వేటకు ఉపయోగించే వలలను శుక్రవారం జరిగే కేంద్రమంత్రుల సమావేశంలోనైనా పంపిణీ చేయాలి.
- దూలం నాగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ కైకలూరు సమన్వయకర్త
మిగులు భూములు పంచాలి
కొల్లేరు కాంటూరును కుదించి మిగులు భూములను ప్రజలకు పంపిణీ చేయాలి. కాంటూరు కుదింపు అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. కొల్లేరు ఆపరేషన్ సమయంలో జిల్లాలో అదనంగా ధ్వంసం చేసిన 7,500 ఎకరాల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. ఈ భూములను ముందుగా పంపిణీ చేస్తే కొల్లేరు ప్రజలకు ఊరట కలుగుతుంది.
- జయమంగళ వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే, కైకలూరు
కాంటూరు కుదింపు ప్రమాదం
కాంటూరు కుదింపు కొల్లేరు మనుగడకే ప్రమాదం. ఇప్పటికే కొల్లేరుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. కొల్లేరు ఆపరేషన్ సమయంలో అదనంగా ధ్వంసం చేసిన 7,500 ఎకరాలను పంపిణీ చేయాలి. గోదావరి నది నుంచి కొల్లేరుకు నీరు చేరేలా ప్రణాళిక రూపొందించాలి. కొల్లేరులో రెగ్యులేటర్ నిర్మించాలి. దీనివల్ల కొల్లేరులో నీరు ఎప్పుడూ నిల్వ ఉంటుంది.
- ఎర్నేని నాగేంద్రనాథ్,
కొల్లేరు సరస్సు పునరుద్ధరణ సమితి అధ్యక్షుడు
ఆశలు అడియాసలు చేయొద్దు
కొల్లేరు ప్రజలు కాంటూరు కుదింపుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గతంలో మంత్రులు ఇచ్చిన వాగ్దానాలు అమలు కాలేదు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ మాగంటి బాబు మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. కొల్లేరు ఆపరేషన్ సమయంలో చెరువులు కోల్పోయిన జిరాయితీ రైతులు అనేక కష్టాలు పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొల్లేరు సమస్యలపై సానుకూలంగా స్పందించాలి.
- నబిగారి రాంబాబు, కొల్లేరు అభివృద్ధి సంఘ జిల్లా అధ్యక్షుడు