సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యుల వేతనాల సవరణలకు సంబంధించి ముగ్గురు సభ్యులతో కూడిన స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ఎంపీల వేతనాలతో పాటు ఇతర అలవెన్సులపై త్రిసభ్య కమిటీ కేంద్రానికి సిఫార్సులను చేయనుంది. చివరిసారిగా ఎంపీల వేతనాల సవరణ 2010లో జరిగింది. ప్రస్తుతం ఎంపీలు రూ.50 వేల మూలవేతనం పొందుతున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూలన శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అధ్యక్షతన వైజాగ్‌లో 29వ తేదీన ప్రారంభమవనున్న రెండు రోజుల అఖిల భారత విప్‌ల సమావేశంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటు ప్రతిపాదనపై చర్చ జరగనుంది. పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగడానికి ఎంపీలు, అలానే అసెంబ్లీలో శాసనసభ్యుల మధ్య సమన్వయం కోసం అంతర్ పార్టీల ఫోరం ఏర్పాటు అంశంపై కూడా చర్చ జరుగుతుంది.