శ్రీనగర్: పార్లమెంట్ సభ్యులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చే సమయంలో సభా గౌరవాన్ని కాపాడాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. హద్దు మీరిన సభ్యులను స్కూల్ హెడ్‌మాస్టర్ల మాదిరిగా శిక్షించాలని తాము (ఉభయ సభల అధ్యక్షులు) అనుకోవడం లేదని తెలిపారు. పార్లమెంట్‌లో ఆటంకాలు, గందరగోళ పరిస్థితులను ఎలా నివారించాలనే దానిపై పార్టీలు కలిసి కూర్చుని చర్చించాలన్నారు. సభ్యులు సభ వెల్‌లోకి ప్రవేశించి, ప్లకార్డులు ప్రదర్శించకుండా కట్టడి చేసేందుకు అన్ని పార్టీలు చర్చించి, ఒక ప్రవర్తనా నియమావళిని రూపొందించాలన్నారు.
ఇటీవల ముగిసిన వర్షాకాల సమావేశాల సమయంలో నిత్యం సభలో గందరగోళం కొనసాగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటికీ పార్లమెంట్ ఒక దిక్సూచిగా మారాలని అందరూ ఆశిస్తున్నారు. సభలో అంతరాయాలు, అదుపుతప్పిన పరిస్థితులు ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచివికావు. మనం(ఎంపీలు) అందరం పార్లమెంట్ గౌరవాన్ని కాపాడాలి, ఇంకా ఇనుమడింపజేసేందుకు ప్రయత్నించాలి’అని ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సభ్యులను కట్టడి చేసేందుకు నిబంధనలను మార్చాల్సిన అవసరం ఉందా అని అడిగిన ప్రశ్నకు ఆయన...ప్రస్తుతం ఉన్న నిబంధనలు కఠినమైనవే. పరిస్థితులు చేజారిపోతున్నట్లు భావిస్తే సభాధ్యక్షులు చర్యలు తీసుకోవాల్సి వస్తోంది’అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment