మహువాపై వేటు | Trinamool Congress MP Mahua Moitra was expelled from the Lok Sabha | Sakshi
Sakshi News home page

మహువాపై వేటు

Published Sat, Dec 9 2023 4:27 AM | Last Updated on Sat, Dec 9 2023 4:27 AM

Trinamool Congress MP Mahua Moitra was expelled from the Lok Sabha - Sakshi

న్యూఢిల్లీ: తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌ సభ సభ్యురాలు మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడింది. ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు స్పీకర్‌ ఓం బిర్లా శుక్రవారం ప్రకటించారు. డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగిన కేసులో ఆమెను దోషిగా తేలుస్తూ లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ ఇచి్చన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

దీనిపై విపక్షాలు అభ్యంతరాలు వెలిబుచ్చగా స్పీకర్‌ నిర్ణయాన్ని తృణమూల్‌ కాంగ్రెస్‌ తీవ్రంగా తప్పుబట్టింది. తనపై వేటును మొయిత్రా తీవ్రంగా నిరసించారు. స్పీకర్‌ చర్య అనర్హులైన జడ్జిలతో కూడిన (కంగారూ) కోర్టు ఉరిశిక్ష తీర్పు వెలువరించినట్టుగా ఉందంటూ ఎద్దేవా చేశారు. ఆమె పశి్చమబెంగాల్‌లోని కృష్ణనగర్‌ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మాట్లాడే చాన్సివ్వని స్పీకర్‌
మొయిత్రా ఉదంతంపై విచారణ జరిపిన బీజేపీ ఎంపీ వినోద్‌కుమార్‌ సోంకర్‌ సారథ్యంలోని ఎథిక్స్‌ కమిటీ శుక్రవారం మధ్యాహ్నం లోక్‌సభకు నివేదిక సమరి్పంచింది. ఆమెను దోషిగా తేలి్చనట్టు పేర్కొంది. ‘‘మొయిత్రా అనైతిక ప్రవర్తనకు పాల్పడ్డారు. తన లోక్‌సభ  పోర్టల్‌ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను అనధికారిక వ్యక్తులకు ఇచ్చారు. తద్వారా దేశ భద్రతకు తీవ్ర విఘాతం కలిగించే పని చేశారు’’ అని తెలిపింది.

అనంతరం మొయిత్రాను సభ నుంచి బహిష్కరించాలంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ తీర్మానం ప్రవేశపెట్టారు. ‘‘మొయిత్రా ప్రవర్తన ఒక ఎంపీ స్థాయికి తగ్గట్టుగా లేదని తేలింది. ఒక వ్యాపారవేత్త నుంచి డబ్బు, కానుకలు తీసుకుని ప్రతిగా అతని ప్రయోజనాల కోసం ఇలాంటి పనులు చేయడం గర్హనీయం’’ అని అందులో పేర్కొన్నారు. మొయిత్రా సభ్యత్వ రద్దుకు కమిటీ చేసిన సిఫార్సును ఆమోదించాల్సిందిగా సభను మంత్రి కోరారు.

తృణమూల్‌తో పాటు కాంగ్రెస్‌ సహా ఇతర విపక్షాలు ఇందుకు తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి. మొయిత్రాకు తన వాదన విని్పంచే అవకాశమివ్వాలని డిమాండ్‌ చేశాయి. గత ఉదంతాలను ఉటంకిస్తూ అందుకు స్పీకర్‌ నిరాకరించారు. ‘‘2005లో నగదుకు ప్రశ్నల కుంభకోణానికి పాల్పడ్డ 10 మంది లోక్‌సభ సభ్యులను నాటి స్పీకర్‌ సోమనాథచటర్జీ సభ నుంచి బహిష్కరించారు.

ఆ సందర్భంగా సదరు ఎంపీలకు తమ వాదన చెప్పుకునే అవకాశమివ్వలేదు. అంతేకాదు, ఈ ఉదంతంపై ఎథిక్స్‌ కమిటీ నివేదిక సభకు అందిన రోజే దాని సిఫార్సు మేరకు వారిపై అనర్హత వేటు వేయాలని సభను కోరుతూ నాటి లోక్‌సభ నేత ప్రణబ్‌ ముఖర్జీ తీర్మానం ప్రవేశపెట్టారు’’ అని గుర్తు చేశారు. అనంతరం నివేదిక, తీర్మానంపై కాసేపు వాడివేడి చర్చ జరిగింది.

నివేదికను విశ్లేíÙంచేందుకు సభ్యులకు కనీసం మూడు నాలుగు రోజుల సమయమివ్వాలని  సభ్యుడు అ«దీర్‌ రంజన్‌ చౌదరి (కాంగ్రెస్‌) కోరగా స్పీకర్‌ తిరస్కరించారు. ఒక సభ్యున్ని బహిష్కరించాలంటూ సిఫార్సు చేసే అధికారం ఎథిక్స్‌ కమిటీకి లేదని కాంగ్రెస్‌ సభ్యుడు మనీశ్‌ తివారీ వాదించారు. అనంతరం మూజువాణి ఓటుతో తీర్మానాన్ని సభ ఆమోదించింది. దీన్ని నిరసిస్తూ విపక్షాలు వాకౌట్‌ చేశాయి. అనంతరం మహువాతో కలిసి  గాం«దీజీ విగ్రహం వద్ద నేతలు నిరసన తెలిపారు.

ప్రజాస్వామ్యానికి ఉరి: మమత
డార్జిలింగ్‌: మొయిత్రాను బహిష్కరించడం ద్వారా ప్రజాస్వా మ్యాన్ని హత్య చేశారని తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్, పశి్చమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈ చర్య పార్లమెంటుకే మచ్చ తెచి్చందన్నారు. ‘‘పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఇది దుర్దినం. ఎన్నికల్లో తమను ఓడించలేక బీజేపీ ఇలా కక్షసాధింపు రాజకీయాలకు దిగుతోంది’’ అని ఆరోపించారు. మొయిత్రాకు పార్టీ పూర్తిగా మద్దతుగా నిలుస్తుందన్నారు.

‘‘500 పేజీల నివేదిక సభ ముందు పెట్టి, కేవలం 30 నిమిషాల చర్చతో తీర్పు వెలువరించడమా? అంత తక్కువ సమయంలో సభ్యులు నిర్ణయానికి ఎలా రాగలరు?’’ అని మమత ప్రశ్నించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తథ్యమన్నారు. మొయిత్రాకు దన్నుగా నిలిచినందుకు ఇండియా కూటమికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్‌తో పాటు బీఎస్పీ, ఎస్పీ, సీపీఐ, పీడీపీ తదితర పారీ్టల నేతలు కూడా బహిష్కరణను తప్పుబట్టారు.

ఏం జరిగింది?
వ్యాపారవేత్త దర్శన్‌ హీరా నందానీ నుంచి మొయిత్రా భారీగా డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకుని ఆయనకు లబ్ధి చేకూర్చేలా అదానీ సంస్థ తదితరాలపై లోక్‌సభలో ప్రశ్నలడిగారంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే గత అక్టోబర్‌లో తీవ్ర ఆరోపణలు చేశారు.

అంతేగాక మొయిత్రా తన లోక్‌సభ వెబ్‌సైట్‌ లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ను కూడా నందానీకి ఇచ్చారని దూబేతో పాటు ఆమె మాజీ సన్నిహితుడు జై అనంత్‌ దేహద్రాయ్‌ కూడా ఆరోపించారు. అది నిజమేనంటూ నందానీ ఎథిక్స్‌ కమిటీకి అఫిడవిట్‌ సమరి్పంచారు. దీనిపై మొయిత్రాను ఎథిక్స్‌ కమిటీ విచారణకు పిలిచింది. అసభ్యకరమైన ప్రశ్నలడిగారంటూ విచారణను ఆమె బాయ్‌కాట్‌ చేశారు. ఈ కేసులో సీబీఐ ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేసింది.

ప్రశ్నలడిగేది నా పీఏనే!
మొయిత్రా ఉదంతంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో జేడీ(యూ) సభ్యుడు గిరిధారీ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ‘‘నాకసలు కంప్యూటర్‌ ఎలా ఆపరేట్‌ చేయాలో కూడా తెలియదు. అందుకే నేను ఒక్క లిఖిత ప్రశ్న కూడా స్వయంగా అడగలేదు. నా లోక్‌సభ పోర్టల్‌ లాగిన్‌ఐడీ, పాస్‌వర్డ్‌ నా పీఏ దగ్గరుంటాయి. నా తరఫున నా ప్రశ్నలన్నింటినీ అతనే అందులో అడుగుతాడు’’ అని చెప్పుకొచ్చారు! దాంతో అంతా అవాక్కయ్యారు. అలా ఇతరులతో ప్రశ్నలు తయారు చేయించకూడదంటూ ఎంపీని స్పీకర్‌ మందలించారు.  

ఏ ఆధారాలతో వేటు?
తనకు వ్యతిరేకంగా ఏ ఆధారాలూ లేకపోయినా ఎథిక్స్‌ కమిటీ తప్పుడు సిఫార్సు చేసిందని మొయిత్రా ఆరోపించారు. విపక్షాలను లొంగదీసుకునేందుకు మోదీ సర్కారు చేతిలో ఆయుధంగా కమిటీ పని చేస్తోందని దుయ్యబట్టారు. ‘‘నాకు డబ్బు గానీ, కానుకలు గానీ ఇచి్చనట్టు ఒక్క ఆధారమన్నా ఉందా? పైగా, అసలు ఉనికిలోనే లేని నైతిక నియామవళిని ఉల్లంఘించానని తేల్చడం మరీ విడ్డూరం’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘ఎథిక్స్‌ కమిటీ నివేదిక నియమావళిలోని ప్రతి రూల్‌నూ ఉల్లంఘించింది.

సభ ఆమోదించి ప్రోత్సహించిన రోజువారీ విధానాన్ని పాటించినందుకు నన్ను శిక్షిస్తున్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించి చరిత్ర సృష్టించిన 17వ లోక్‌సభే 78 మంది మహిళా ఎంపీల్లో ఒకరినైన నన్ను ఫక్తు కక్షసాధింపు రాజకీయాల్లో భాగంగా వెంటాడి వేధించిన ఉదంతానికి కూడా వేదికైంది. బంగ్లాదేశ్‌ సరిహద్దులను ఆనుకున్న సుదూర లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏ రాజకీయ నేపథ్యమూ లేని నావంటి తొలిసారి ఎంపీని అనుక్షణం వేధించింది’’ అంటూ ధ్వజమెత్తారు.

విరుద్ధ వాంగ్మూలాలు
ఫిర్యాదుదారుల్లో ఒకరు తన మాజీ సహచరుడని మొయిత్రా గుర్తు చేశారు. ‘‘అతడు తప్పుడు ఉద్దేశంతో నాపై బురదజల్లాడు. కేవలం ఇద్దరు ప్రైవేట్‌ వ్యక్తులిచి్చన వాంగ్మూలాల ఆధారంగా నాపై వేటు వేశారు. వారి వాంగ్మూలాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నా పట్టించుకోలేదు. కనీసం వారిని విచారించను కూడా లేదు. వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీ కూడా పిలిచి విచారించలేదు’’ అంటూ ఆక్షేపించారు.

‘‘నందానీ వ్యాపార ప్రయోజనాల కోసం అతని దగ్గర డబ్బులు, కానుకలు తీసుకుని సభలో ప్రశ్నలడిగానని ఎంపీ దూబే తన ఫిర్యాదులో ఆరోపించారు. నందానీ మాత్రం నేనే నా సొంత అజెండాను ముందుకు తీసుకెళ్లడానికి వీలైన ప్రశ్నలు లోక్‌సభ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసేలా తనపై ఒత్తిడి తెచ్చానని సుమోటో అఫిడవిట్‌ దాఖలు చేశారు. వీటిలో ఏది నిజం?’’ అని ప్రశ్నించారు.

లాగిన్‌ రూల్స్‌ ఉన్నాయా?
లోక్‌సభ పోర్టల్‌ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఇతరులకు ఇచ్చానన్న ఏకైక అభియోగంపైనే తనను బహిష్కరించారని మొయిత్రా గుర్తు చేశారు. కానీ ఈ విషయంలో ఎలాంటి నియమ నిబంధనలూ లేవని వాదించారు.

30 ఏళ్లైనా పోరాడతా: మొయిత్రా
ఎథిక్స్‌ కమిటీ నివేదికను మొయిత్రా తూర్పారబట్టారు. నిబంధనలకు పాతరేస్తూ తనపై హడావుడిగా వేటు వేశారని ఆరోపించారు. స్పీకర్‌ నిర్ణయం అనంతరం విపక్ష ఇండియా కూటమి నేతలు సోనియాగాం«దీ, రాహుల్‌ గాంధీ తదితరులతో కలిసి పార్లమెంటు ఆవరణలో మొయిత్రా మీడియాతో మాట్లాడారు. ‘‘రేపు కచ్చితంగా సీబీఐని నా ఇంటిపైకి ఉసిగొల్పుతారు. మరో ఆర్నెల్ల పాటు నన్నిలాగే వేధిస్తారు.

కానీ పారిశ్రామికవేత్త అదానీ అక్రమాల మాటేమిటి? ఆయన పాల్పడ్డ రూ.13 వేల కోట్ల బొగ్గు కుంభకోణంకేసి సీబీఐ, ఈడీ కన్నెత్తి కూడా చూడవెందుకు?’’ అని ప్రశ్నించారు. మోదీ సర్కారుకు అదానీ ఎంతటి ముఖ్యుడో తనపై వేటుతో మరోసారి నిరూపితమైందన్నారు. ‘‘లోక్‌సభ నుంచి బహిష్కరించి నా నోరు మూయించవచ్చని, పారిశ్రామికవేత్త అదానీ ఉదంతం నుంచి బయట పడొచ్చని భావిస్తే పొరపాటు. నాకిప్పుడు 49 ఏళ్లు. మరో 30 ఏళ్ల దాకా పార్లమెంటు లోపల, బయట మీపై పోరాడుతూనే ఉంటా’’ అని ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement