Members of Parliament
-
కేవీల్లో ఎంపీల కోటా పునరుద్ధరణ యోచన లేదు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు పార్లమెంట్ సభ్యుల కోటాను పునరుద్ధరించే ప్రతిపాదనేదీ లేదని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో సోమవారం కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి ఒక ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు. ఈ విద్యా సంస్థలను ప్రాథమికంగా రక్షణ, పారా మిలటరీ, కేంద్ర అటానమస్ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పిల్లల కోసం ఏర్పాటు చేసినవని వివరించారు. ఎంపీలకు కోటా ఇవ్వడం వల్ల ఒక్కో సెక్షన్లో 40 మంది విద్యార్థుల పరిమితి దాటిపోతోందన్నారు. ఇది బోధనపై ప్రభావం చూపుతోందని వివరించారు. గతంలో ఒక్కో ఎంపీ ఒక కేవీలో 10 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించాలని సిఫారసు చేసేందుకు వీలుండేది. మొత్తం 543 మంది లోక్‌సభ, 245 మంది రాజ్యసభ సభ్యులు కలిపి కేవీల్లో ఏటా తమ కోటా కింద 7,880 మంది విద్యార్థుల ప్రవేశాలకు సిఫారసు చేసేవారు. -
హెడ్మాస్టర్లలా ఉండాలనుకోవడం లేదు: బిర్లా
శ్రీనగర్: పార్లమెంట్ సభ్యులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చే సమయంలో సభా గౌరవాన్ని కాపాడాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. హద్దు మీరిన సభ్యులను స్కూల్ హెడ్మాస్టర్ల మాదిరిగా శిక్షించాలని తాము (ఉభయ సభల అధ్యక్షులు) అనుకోవడం లేదని తెలిపారు. పార్లమెంట్లో ఆటంకాలు, గందరగోళ పరిస్థితులను ఎలా నివారించాలనే దానిపై పార్టీలు కలిసి కూర్చుని చర్చించాలన్నారు. సభ్యులు సభ వెల్‌లోకి ప్రవేశించి, ప్లకార్డులు ప్రదర్శించకుండా కట్టడి చేసేందుకు అన్ని పార్టీలు చర్చించి, ఒక ప్రవర్తనా నియమావళిని రూపొందించాలన్నారు. ఇటీవల ముగిసిన వర్షాకాల సమావేశాల సమయంలో నిత్యం సభలో గందరగోళం కొనసాగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటికీ పార్లమెంట్ ఒక దిక్సూచిగా మారాలని అందరూ ఆశిస్తున్నారు. సభలో అంతరాయాలు, అదుపుతప్పిన పరిస్థితులు ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచివికావు. మనం(ఎంపీలు) అందరం పార్లమెంట్ గౌరవాన్ని కాపాడాలి, ఇంకా ఇనుమడింపజేసేందుకు ప్రయత్నించాలి’అని ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సభ్యులను కట్టడి చేసేందుకు నిబంధనలను మార్చాల్సిన అవసరం ఉందా అని అడిగిన ప్రశ్నకు ఆయన...ప్రస్తుతం ఉన్న నిబంధనలు కఠినమైనవే. పరిస్థితులు చేజారిపోతున్నట్లు భావిస్తే సభాధ్యక్షులు చర్యలు తీసుకోవాల్సి వస్తోంది’అని పేర్కొన్నారు. -
ఉగ్రదాడి.. ఇద్దరు ఎంపీలు సహా 15 మంది మృతి
మొగాదీషు : సోమాలియా రాజధాని మొగాదీషు నగరంలోని ఓ హోటల్ పై తీవ్రవాదులు బుధవారం సాయంత్రం బాంబు దాడులుకు తెగబడ్డారు. ఈ ఘటనలో కనీసం 15 మంది మృతిచెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కొందరు సాయుధులు బాంబు దాడి చేయడంతో పాటు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. మృతులలో ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్నారని సోమాలియా అధికారులు గురువారం ప్రకటించారు. కాల్పులు జరిగిన తర్వాత హోటల్ తాత్కాలికంగా మూసివేసిన అధికారులు గురువారం కూడా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హోటల్ కొందరు కాల్పులు జరపగా, మరొందరు దుండుగులు హోటల్ ముందు ఉన్న స్థానికులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. హోటల్ ముందు బాంబు దాడి జరిగినట్లు తెలుస్తోంది. తొమ్మిది మృతదేహాలను అక్కడి నుంచి తరలించామని, ప్రస్తుతం అక్కడ దుండుగులు ఉండే అవకాశాలున్నాయని పోలీసులు అనుమానాలు వ్యక్తంచేశారు. అయితే ఈ ఘటనకు పాల్పడ్డ ముగ్గురు సాయుధులను మట్టుపెట్టినట్లు ఓ అధికారి చెప్పారు. ప్రభుత్వ అధికారులు, మంత్రులు, ఇతర రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని అభిప్రాయపడుతున్నారు. ఈ ఉగ్రదాడికి తామే బాధ్యులమని ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ అల్-షబాబ్ ప్రకటించింది. -
అధికార, విపక్షాలు ఒక్కటైన వేళ!
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేతో పాటు.. ప్రతిపక్షంలో ఉన్న యూపీఏ, ఇతర పార్టీలు అన్నీ ఒక్క అంశం మీద ఏకాభిప్రాయానికి వచ్చాయి. మహిళా బిల్లు, జీఎస్టీ లాంటి అంశాలపై జుట్లు పట్టుకుని కొట్టుకునే ఈ పార్టీలు అన్నీ.. ఒకే మాట మీద నిలబడ్డాయి. ఏ విషయంలోనో తెలుసా.. ఎంపీల జీతాలు పెంచుకునే విషయంలో. వేతనాలు, ఇతర అలవెన్సులు అన్నింటినీ రెట్టింపు చేసుకోడానికి అందరూ మద్దతు పలికారు. ఈ బిల్లు పార్లమెంటు తదుపరి సమావేశాలలో ఆమోదం పొందే అవకాశం ఉంది. ఎంపీల జీతాలను ఇప్పుడున్న రూ. 50 వేల నుంచి లక్షకు పెంచాలని, అలాగే నియోజవర్గాల అలవెన్సును కూడా రూ. 45వేల నుంచి రూ. 90వేలకు పెంచాలని పార్లమెంటరీ కమిటీ ఒకటి సూచించింది. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే.. ఎంపీలకు ప్రతి నెలా ఇప్పుడు వస్తున్న రూ. 1.40 లక్షలకు బదులు రూ. 2.80 లక్షలు వస్తుంది. బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఈ కమిటీ.. పింఛన్లను 75 శాతం పెంచాలని, జీతాల సవరణ కూడా ఎప్పటికప్పుడు ఆటోమేటిక్‌గా జరగాలని సూచించింది. ఎంపీల జీతాలు ఇంతకుముందు ఆరేళ్ల క్రితం పెరిగాయి. పెంపు విషయమై కేబినెట్ నోట్ ఒకదాన్ని అన్ని మంత్రిత్వశాఖలకు పంపారు. అయితే జీతాల పెంపుపై కమిటీ ఇచ్చిన నివేదికను మీడియా ఒత్తిడి వల్ల ఎవరికీ చెప్పకుండా తొక్కేశారని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ రాజ్యసభలో మండిపడ్డారు. ఎంపీల సత్ప్రవర్తన కారణంగా వాళ్లకు జీతాలు పెరగాల్సిందేనని, చాలామంది ఎంపీలు ఇది కోరుకుంటున్నా, భయంతో బయటకు మాట్లాడలేకపోతున్నారని అన్నారు. ఈ జీతంతో మూడు ఇళ్లు నిర్వహించాలంటే అసాధ్యం అవుతోందని చెప్పారు. ద్రవ్యోల్బణం ప్రభావం అందరిమీదా పడుతోందని, ఎంపీలు కూడా ఇబ్బంది పడుతున్నారని.. అందువల్ల జీతాల పెంపు విషయంలో నరేష్ అగర్వాల్‌ను తాను సమర్థిస్తానని రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. -
ఎంపీల వేతన సిఫార్సులపై కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యుల వేతనాల సవరణలకు సంబంధించి ముగ్గురు సభ్యులతో కూడిన స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ఎంపీల వేతనాలతో పాటు ఇతర అలవెన్సులపై త్రిసభ్య కమిటీ కేంద్రానికి సిఫార్సులను చేయనుంది. చివరిసారిగా ఎంపీల వేతనాల సవరణ 2010లో జరిగింది. ప్రస్తుతం ఎంపీలు రూ.50 వేల మూలవేతనం పొందుతున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూలన శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అధ్యక్షతన వైజాగ్‌లో 29వ తేదీన ప్రారంభమవనున్న రెండు రోజుల అఖిల భారత విప్ల సమావేశంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటు ప్రతిపాదనపై చర్చ జరగనుంది. పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగడానికి ఎంపీలు, అలానే అసెంబ్లీలో శాసనసభ్యుల మధ్య సమన్వయం కోసం అంతర్ పార్టీల ఫోరం ఏర్పాటు అంశంపై కూడా చర్చ జరుగుతుంది. -
ఎన్ని‘కల ’లో?
సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: ప్రతిసారి ఎన్నికలు వస్తున్నాయి.. పోతున్నాయి.. పార్లమెంట్ సభ్యులు మారుతున్నారు. కానీ సిద్దిపేట ప్రాంతవాసుల చిరకాల స్వప్నం రైల్వేలైన్ మాత్రం ఎన్ని‘కల’గానే మిగులుతుంది. 1967లో ఏర్పడిన సిద్దిపేట పార్లమెంట్ నియోజకవర్గానికి ఎందరో మహమహులు ఎంపీలుగా పనిచేసినప్పుటికీ రైల్వేలైన్ సాధించడంలో పాలకులు వైఫల్యం చెందారనే చెప్పవచ్చు. సిద్దిపేటకు రైల్వేలైన్ మంజూరు చేయిస్తామని గుప్పెడు హామీలను కురిపించిన నేతలు ఆ దిశగా ఆశించిన స్థాయిలో కృషి చేయలేదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు రాగానే ఓట్ల కోసం ఓటర్లను ఎన్ని‘కల’ల్లో ముంచేస్తున్న అభ్యర్థులు మరోమారు సార్వత్రిక పోరులో రైల్వేలైన్ హామీని తెరమీదకి తెవడం విశేషం. మూడు దశాబ్దాలుగా ప్రతి ఎన్నికలల్లో రైల్వేలైన్ మీద హామీల వర్షం తప్పడంలేదు. పార్లమెంట్ పునర్విభజన నాటికి సిద్దిపేట నుంచి జి. వెంకటస్వామి, నంది ఎల్లయ్య, విజయరామారావు, మల్యాలరాజయ్య, సర్వే సత్యనారాయణలు ప్రాతిని ద్యం వహించారు. 2009లో పునర్విభజన జరిగినప్పటికీ సిద్దిపేటకు రైల్వేలైన్ మంజూరుకు శాయశక్తుల కృషి చేస్తానన్న సిట్టింగ్ ఎంపీ విజయశాంతి మెదక్‌లో కొంత మేరకు పనులను ముందుకు తీసుకెళ్లినా సిద్దిపేటపై మాత్రం శీతకన్ను చూపిందన్న విమర్శలున్నాయి. మరోవైపు 2004లో సిద్దిపేట ఉప ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గ ప్రశస్థని ఉటకిస్తూ రైల్వేలైన్‌ను సాధిస్తామని హామీ ఇచ్చారు. కాలక్రమేనా కేంద్ర మంత్రి వర్గంలో కేసీఆర్‌కు స్థానం లభించడంతో రెండు దశాబ్దాలుగా నోచుకొని రైల్వేలైన్‌కు మార్గం లభిస్తుందన్న అశ నియోజకవర్గ ఓటర్లలో బలంగా నెలకొంది. ఈ క్రమంలోనే 1999లో రైల్వే బడ్జెట్లో మనోహరబాద్ నుంచి సిద్దిపేట మీదుగా కొత్తపల్లి వరకు 154 కిలోమీటర్ల పొడవున మార్గానికి ప్రతిపాదనలు రూపొందించారు. సరిగ్గా ఏడు సంవత్సరాల తర్వాత పలు మార్పుల అనంతరం 2006లో సర్వేకు రైల్వే బడ్జెట్లో అమోదం లభించింది. అందులో భాగంగానే 2006లో సర్వే పనులను కూడా ప్రారంభించారు. ముఖ్యంగా భూ పరీక్షలు,లెవలింగ్‌లాంటి పనులను పూర్తి చేసి సమగ్ర నివేదికను సంబంధిత కాంట్రాక్ట్ కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. 4 సంవత్సరాల క్రితం తాత్కలిక సర్వేకోసం రూ. 40 కోట్లను ప్రకటించిన కేంద్రం ఆ తర్వాత సకాలంలో సర్వే పనులు నిర్వహించక పోవడంతో కేటాయించిన నిధులు వెనక్కి వెళ్లాయి. అప్పట్లోనే కేంద్రం నూతన రైల్వే మార్గ నిర్మాణ విషయంలో మూడు డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టింది. రైల్వే నిర్మాణ బడ్జెట్లో మూడో వంతును రాష్ట్ర ప్రభుత్వం భరించాలని, రైల్వే లైన్ కోసం అవసరమయ్యే భూసేకరణకు రాష్ట్రమే బాధ్యత వహించాలని, నూతన రైల్వే మార్గంలో అయిదేళ్ల పాటు సంభవించే నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని షరతులు విధించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో రైల్వేలైన్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ సమయంలో సార్వత్రిక ఎన్నికలు ముందుకు రావడం.. మరోసారి ఆయా పార్టీల అభ్యర్థులు రైల్వేలైన్‌పై ‘బాస’లు చేస్తుండడంతో సిద్దిపేటలో చర్చానీయంశంగా మారింది.