అధికార, విపక్షాలు ఒక్కటైన వేళ!
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేతో పాటు.. ప్రతిపక్షంలో ఉన్న యూపీఏ, ఇతర పార్టీలు అన్నీ ఒక్క అంశం మీద ఏకాభిప్రాయానికి వచ్చాయి. మహిళా బిల్లు, జీఎస్టీ లాంటి అంశాలపై జుట్లు పట్టుకుని కొట్టుకునే ఈ పార్టీలు అన్నీ.. ఒకే మాట మీద నిలబడ్డాయి. ఏ విషయంలోనో తెలుసా.. ఎంపీల జీతాలు పెంచుకునే విషయంలో. వేతనాలు, ఇతర అలవెన్సులు అన్నింటినీ రెట్టింపు చేసుకోడానికి అందరూ మద్దతు పలికారు. ఈ బిల్లు పార్లమెంటు తదుపరి సమావేశాలలో ఆమోదం పొందే అవకాశం ఉంది. ఎంపీల జీతాలను ఇప్పుడున్న రూ. 50 వేల నుంచి లక్షకు పెంచాలని, అలాగే నియోజవర్గాల అలవెన్సును కూడా రూ. 45వేల నుంచి రూ. 90వేలకు పెంచాలని పార్లమెంటరీ కమిటీ ఒకటి సూచించింది. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే.. ఎంపీలకు ప్రతి నెలా ఇప్పుడు వస్తున్న రూ. 1.40 లక్షలకు బదులు రూ. 2.80 లక్షలు వస్తుంది. బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఈ కమిటీ.. పింఛన్లను 75 శాతం పెంచాలని, జీతాల సవరణ కూడా ఎప్పటికప్పుడు ఆటోమేటిక్‌గా జరగాలని సూచించింది. ఎంపీల జీతాలు ఇంతకుముందు ఆరేళ్ల క్రితం పెరిగాయి. పెంపు విషయమై కేబినెట్ నోట్ ఒకదాన్ని అన్ని మంత్రిత్వశాఖలకు పంపారు.
అయితే జీతాల పెంపుపై కమిటీ ఇచ్చిన నివేదికను మీడియా ఒత్తిడి వల్ల ఎవరికీ చెప్పకుండా తొక్కేశారని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ రాజ్యసభలో మండిపడ్డారు. ఎంపీల సత్ప్రవర్తన కారణంగా వాళ్లకు జీతాలు పెరగాల్సిందేనని, చాలామంది ఎంపీలు ఇది కోరుకుంటున్నా, భయంతో బయటకు మాట్లాడలేకపోతున్నారని అన్నారు. ఈ జీతంతో మూడు ఇళ్లు నిర్వహించాలంటే అసాధ్యం అవుతోందని చెప్పారు. ద్రవ్యోల్బణం ప్రభావం అందరిమీదా పడుతోందని, ఎంపీలు కూడా ఇబ్బంది పడుతున్నారని.. అందువల్ల జీతాల పెంపు విషయంలో నరేష్ అగర్వాల్‌ను తాను సమర్థిస్తానని రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ అన్నారు.