ఉగ్రదాడి.. ఇద్దరు ఎంపీలు సహా 15 మంది మృతి
మొగాదీషు : సోమాలియా రాజధాని మొగాదీషు నగరంలోని ఓ హోటల్ పై తీవ్రవాదులు బుధవారం సాయంత్రం బాంబు దాడులుకు తెగబడ్డారు. ఈ ఘటనలో కనీసం 15 మంది మృతిచెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కొందరు సాయుధులు బాంబు దాడి చేయడంతో పాటు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. మృతులలో ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్నారని సోమాలియా అధికారులు గురువారం ప్రకటించారు. కాల్పులు జరిగిన తర్వాత హోటల్ తాత్కాలికంగా మూసివేసిన అధికారులు గురువారం కూడా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
హోటల్ కొందరు కాల్పులు జరపగా, మరొందరు దుండుగులు హోటల్ ముందు ఉన్న స్థానికులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. హోటల్ ముందు బాంబు దాడి జరిగినట్లు తెలుస్తోంది. తొమ్మిది మృతదేహాలను అక్కడి నుంచి తరలించామని, ప్రస్తుతం అక్కడ దుండుగులు ఉండే అవకాశాలున్నాయని పోలీసులు అనుమానాలు వ్యక్తంచేశారు. అయితే ఈ ఘటనకు పాల్పడ్డ ముగ్గురు సాయుధులను మట్టుపెట్టినట్లు ఓ అధికారి చెప్పారు. ప్రభుత్వ అధికారులు, మంత్రులు, ఇతర రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని అభిప్రాయపడుతున్నారు. ఈ ఉగ్రదాడికి తామే బాధ్యులమని ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ అల్-షబాబ్ ప్రకటించింది.