భేటీ నుంచి బయటికొస్తున్న ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ బిర్లా, ఎంపీ మిథున్ రెడ్డి తదితరులు
న్యూఢిల్లీ: సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సభ్యులకు పిలుపునిచ్చారు. శనివారం జరిగిన అఖిల పక్ష భేటీలో ఈ మేరకు ఆయన సభ్యులను కోరారు. ప్రధాని మోదీ ఈ భేటీలో పాల్గొన్నారు. సభలో చర్చ జరగాలని, చర్చ జరిగేందుకే సభ ఉన్నదన్న విషయాన్ని గుర్తు చేశారు. సభ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, అందుకే ప్రజా సమస్యలను లేవనెత్తాల్సిందిగా సభ్యులను కోరారు.
17వ లోక్ సభ మొదటి సమావేశాల్లాగే ఈ సమావేశాలు కూడా ఫలప్రదం అవుతాయని పార్టీలన్నీ తనకు మాటిచ్చాయని చెప్పారు. భేటీ అనంతరం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బంధోపాధ్యాయ్ మాట్లాడుతూ.. పశ్చిమబెంగాల్‌లో గవర్నర్ సమాంతర పాలన నడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటివి జరగకూడదని అన్నారు. సభలో నిరుద్యోగం, ఆర్థిక స్థితి వంటి వాటిపై చర్చలు జరుగుతాయని చెప్పారు. ఉత్తర భారతంలో ఉన్న కాలుష్యం గురించి సభ మాట్లాడాలని బీఎస్పీ నేత కున్వార్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment