
సాక్షి, న్యూఢిల్లీ : ఈ నెల 18 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలను లేవనెత్తేందుకు తగిన సమయం కేటాయించాల్సిందిగా కోరామని వైఎస్సార్ సీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి తెలిపారు. శనివారం ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశానికి ఆయన హాజరు అయ్యారు. లోక్‌సభ సమావేశాలు సజావుగా జరిగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా కోరారని మిథున్ రెడ్డి తెలిపారు. విభజన చట్టంలోని అంశాలు, పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు, కడప స్టీల్ ఫ్లాంట్, రామయపట్నం పోర్టు అంశాలను సభలో ప్రస్తావిస్తామన‍్నారు. కాగా అఖిలపక్ష సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, టీఆర్‌ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సహా పలు పార్టీల నేతలు హాజరయ్యారు.