సమావేశంలో ప్రధాని మోదీ, రాజ్‌నాథ్, పీయూష్ గోయెల్, ప్రహ్లాద్ జోషి వివిధ పార్టీల నేతలు
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అర్థవంతమైన, ఆరోగ్యకరమైన చర్చలు జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. అన్ని పార్టీ లు సహకరించాలని, ఈ సమావేశాలు సజావుగా సాగుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా కొందరు సభ్యులు మృతిచెందడం పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. సోమవారం నుంచి వర్షాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు.
ప్రతిపక్షాల నుంచి నిర్మాణాత్మక సూచనలు అవసరమని, ఇవి చర్చలను మరింత ఫలప్రదంగా మారుస్తాయని చెప్పారు. సభ్యుల్లో అధికులు టీకాలు తీసుకున్నందున సభలు మరింత సజావుగా సాగుతాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ఏ అంశంపైనైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఉభయ సభలు సజావుగా సాగడానికి అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. సమస్యలపై నిర్మాణాత్మక చర్చలు జరగాలన్నారు. సోమవారం నుంచి ఆగస్టు 13 వరకూ నిర్వహించే వర్షాకాల సమావేశాల్లో మొత్తం 19 సార్లు సభ సమావేశం అవుతుందన్నారు.
30 పైచిలుకు బిల్లులు
వర్షాకాల సమావేశాల సందర్భంగా రెండు ఆర్థిక బిల్లులు సహా మొత్తం 30కి పైచిలుకు బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు ప్రహ్లాద్ జోషి తెలిపారు. వీటిలో ఇప్పటికే జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లు, ఇన్‌సాల్వెన్సీ, బ్యాంక్‌రప్టసీ కోడ్ బిల్లు, హోమియోపతి సెంట్రల్ కౌన్సిల్ తదితర బిల్లులున్నాయి. వీటితో పాటు పలు కీలక బిల్లులు సైతం సమావేశాల్లో చర్చకు రానున్నాయి. ఈ అఖిలపక్ష సమావేశంలో టీఎంసీ, డీఎంకే, వైఎస్సార్‌సీపీ, శివసేన, జేడీయూ, బీజేడీ, ఎస్‌పీ, టీఆర్‌ఎస్, ఏఐడీఎంకే, బీఎస్పీ, ఎన్‌సీపీ, టీడీపీ, అకాలీదళ్ సీపీఐ, ఆప్ సహా 33 పార్టీల నేతలు పాల్గొన్నారు.
వీరిలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ సింగ్, టీఎంసీకి చెందిన డెరిక్ ఓబ్రెయిన్, డీఎంకే నుంచి తిరుచ్చి శివ, ఎస్‌పీ నుంచి రామ్‌గోపాల్ యాదవ్, బీఎస్‌పీకి చెందిన సతీష్ మిశ్రా, అప్నాదళ్ నేత అనుప్రియ, ఎల్‌జేపీ నేత పశుపతి పరాస్ ఉన్నారు. ప్రధానితో పాటు హోం, రక్షణ మంత్రులు, రాజ్యసభ లీడర్ ఆఫ్ హౌస్ పీయూష్ గోయల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేబినెట్ తాజా విస్తరణ అనంతరం జరుగుతున్న తొలి సమావేశాలు కావడంతో వీటిపై ఆసక్తి నెలకొంది.
అందుకు ఒప్పుకోం
దేశంలో కరోనా పరిస్థితిని పార్లమెంట్ ఉభయసభల ఎంపీలకు పార్లమెంట్ బయట ఏర్పాటు చేసే సమావేశంలో ప్రధాని వివరిస్తారనే కేంద్ర ప్రతిపాదనకు ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. ఇది పార్లమెంటరీ నియమాలను ఉల్లంఘించేందుకు మరోమార్గమని దుయ్యబట్టాయి. జూలై 20న ప్రధాని రెండు సభల ఎంపీలనుద్దేశించి పార్లమెంట్ అనుబంధ భవనంలో ప్రసంగిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జోషీ ప్రకటించగానే, తొలుత టీఎంసీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
పార్లమెంటు జరుగుతోందని, సభకు వచ్చి మాట్లాడాలని ఆపార్టీ ఎంపీ డెరిక్ అభిప్రాయపడ్డారు. దీనికి పలు ఇతర పక్షాల నేతలు కూడా మద్దతు ప్రకటించారని తెలిసింది. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కొందరు నేతలు సూచించారు. పార్లమెంట్ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఏం చెప్పాలన్నా సభలోనే చెప్పాలన్నది తమ అభిప్రాయమని సీపీఎం వ్యాఖ్యానించింది. వేరుగా ఎంపీలనుద్దేశించి ప్రసంగించడం తగదని పేర్కొంది. సోమవారం సభలు ఆరంభం కాగానే ఉప ఎన్నికల్లో ఎన్నికైన నూతన ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది.
ఎన్‌డీఏ నేతలతో ప్రధాని భేటీ
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆరంభమవుతున్న సందర్భంగా ప్రధాని మోదీ ఎన్‌డీఏలోని పార్టీల పార్లమెంటరీ నేతలతో ఆదివారం సమావేశమయ్యారు. హోంమంత్రి అమిత్‌షా, రక్షణమంత్రి రాజ్‌నా«థ్, బీజేపీ అధ్యక్షుడు నడ్డా కూడా పాల్గొన్నారు. ఎన్‌డీఏ పక్షాల నేతల్లో అప్నాదళ్‌కు చెందిన అనుప్రియ, జేడీయూ నేత రామ్‌నాథ్ ఠాకూర్, ఏఐఏడీఎంకే నేత నవనీతకృష్ణన్, ఆర్‌పీఐ నేత రామ్‌దాస్ అథవాలే, ఎల్‌జేపీ నేత పశుపతి పరాస్ తదితరులున్నారు. ఈ సమావే శాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో ప్రధాని చర్చించారు.
సభ పవిత్రతను గౌరవించాలి: ఓం బిర్లా
సభ పవిత్రత, గౌరవాన్ని సభ్యులందరూ గౌరవించాలని సభాపతి ఓంబిర్లా తెలిపారు. ఆదివారం సభాపతి ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సభ సజావుగా సాగడానికి గత సమావేశాల మాదిరిగానే సహకరించాలని పార్టీల నేతలను ఓం బిర్లా కోరారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి అందరికీ తగిన సమయం కేటాయిస్తానన్నారు. త్వరలోనే ఒక యాప్ తీసుకొస్తున్నామని పార్లమెంటరీ వ్యవహారాలకు సంబంధించి వన్‌స్టాప్ సొల్యూషన్‌గా అది ఉపకరిస్తుందని ఓం బిర్లా తెలిపారు.
కరోనా నేపథ్యంలో సభ్యులు, సిబ్బంది, మీడియా అందరికీ తగిన భద్రతా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ఓం బిర్లా మీడియాతో మాట్లాడుతూ.. దేశ ఆకాంక్షలకు సభ ప్రాతినిధ్యం వహిస్తుందని, ప్రజల సమస్యలను తెలియజేయడం సభ్యుల బాధ్యత అన్నారు. ప్రజా ప్రయోజనాలపై చర్చించడానికి అవకాశం ఉండాలని .. చిన్నపార్టీలు, ఏక సభ్యుడున్న పార్టీలకు కూడా తగిన సమయం కేటాయిస్తానని సభాపతి ఓంబిర్లా తెలిపారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ, టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్షనేతలు మిథున్‌రెడ్డి, రామ్మోహన్‌నాయుడు, నామా నాగేశ్వరరావులు పాల్గొన్నారు.
ఎంపీలాడ్ ఫండ్స్ పునరుద్ధరించాలి!
రాజకీయ పార్టీల డిమాండ్
ఎంపీ లాడ్ నిధులను పునరుద్ధరించాలని కాంగ్రెస్ సహా పలు పార్టీలు డిమాండ్ చేశాయి. వర్షాకాల సమావేశాల నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పలు పార్టీలు ఈ డిమాండ్‌ను వినిపించాయి. పార్టీల డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని స్పీకర్ హామీ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సమావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జోషీ ముందు ఎంపీ లాడ్ నిధులు మరలా ఇవ్వాలనే డిమాండ్‌ను వైఎస్‌ఆర్‌సీపీ నేత మిథున్ రెడ్డి, కాంగ్రెస్ నేత అధిర్ రంజన్, టీఎంసీ నేత సుదీప్ బందోపాధ్యాయ లేవనెత్తారు.
ప్రజాప్రయోజన అంశాలపై మాట్లాడేందుకు సభ్యులకు తగిన సమయం ఇస్తానని ఈ సందర్భంగా స్పీకర్ హామీ ఇచ్చారు. ఎంపీలంతా సభ సజావుగా నడిచేందుకు సహకరించాలని కోరారు. ఐదు సెషన్లుగా పార్లమెంట్ సాఫీగా జరిగేందుకు సహకరించినందుకు నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆటంకాలు లేకుండా సభ నడిచేందుకు సహకరిస్తామని పార్టీల నేతలు స్పీకర్‌కు చెప్పినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కోవిడ్ నేపథ్యంలో సభా సమావేశాల ఏర్పాట్లను కట్టదిట్టం చేశామని స్పీకర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment