all party meet
-
వాడివేడిగా అఖిలపక్ష భేటీ.. ‘నీట్’పై నిలదీసిన విపక్షాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఆదివారం(జులై 21) అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. పార్లమెంట్ అనెక్స్ భవనంలో ఈ భేటీ కొనసాగుతోంది. జులై 22 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పలు అంశాలపై ప్రభుత్వం విపక్షాలతో చర్చిస్తోంది. బడ్జెట్‌తో పాటు సభ ముందుకు రానున్న పలు బిల్లుల జాబితాను వారికి వివరిస్తోంది. నీట్ పేపర్ లీకేజీ, రైల్వే భద్రత అంశాలపై అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నిలదీసింది. బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని జేడీయూ ఈ సమావేశాల్లో కోరినట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి జైరామ్ రమేశ్, కె.సురేశ్, జేడీయూ, ఆప్, సమాజ్‌వాదీ, ఎన్సీపీ పార్టీల ప్రతినిధులు అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి. కేంద్ర ప్రభుత్వం జులై 23న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం ఆరు బిల్లులను తీసుకురానుంది. -
ఈ నెల 17న అఖిలపక్ష భేటీకి కేంద్రం పిలుపు..
ఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు కేంద్రం సన్నద్ధమౌతోంది. స్పెషల్ మీటింగ్ ఎజెండాపై చర్చించేందుకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ నివాసంలో నేడు కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి అమిత్ షా, అనురాగ్ ఠాకూర్లు హాజరయ్యారు. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 17న అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీ అనంతరం ఎజెండాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై కొన్ని రోజులుగా దేశంలో రాజకీయంగా వివాదం నెలకొంది. ఈ ప్రత్యేక సమావేశంలోనే దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చనున్నారనే ఊహాగానాలు వెలుగులోకి వచ్చాయి. పాత పార్లమెంట్ భవనం నుంచి కొత్త పార్లమెంట్‌లోకి అధికారికంగా మారనున్నారనే మరికొందరు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఈ నెల17న అఖిలపక్ష భేటీ ఉంటుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. 17న సాయంత్రం 4:30కి నేతలందర్ని మీటింగ్‌కు ఆహ్వానించారు. Ahead of the parliament session from the 18th of this month, an all-party floor leaders meeting has been convened on the 17th at 4.30 PM. The invitation for the same has been sent to concerned leaders through email. Letter to follow ಇದೇ ಸೆಪ್ಟೆಂಬರ್ 18 ರಿಂದ ಆರಂಭವಾಗಲಿರುವ ವಿಶೇಷ… — Pralhad Joshi (@JoshiPralhad) September 13, 2023 ఇప్పటికే ఈ స్పెషల్ సెషన్ ఎజెండా తెలపాలని కాంగ్రెస్ ఛైర్పర్సన్ సోనియా గాంధీ ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. ఏ రాజకీయ పార్టీతో చర్చించకుండానే ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంపై ఆమె మండిపడ్డారు. ప్రధాన ఉద్ధేశం ఏంటో తెలిపాలని కోరారు. ప్రత్యేక సమావేశాలను వినాయక చవితి రోజున నిర్వహించడంపై శివ సేన (యూబీటీ) నేత సుప్రీయా సూలే కేంద్రంపై మండిపడ్డారు. హిందువుల పవిత్ర పండగ రోజున పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఎలా నిర్వహిస్తారని దుయ్యబట్టారు. Just read about the upcoming Special Parliament Session (13th Session of 17th Lok Sabha & 261st Session of Rajya Sabha) happening from Sep 18-22. Whilst we all look forward towards meaningful discussions and dialogue, the dates coincide with the Ganpati Festival, a major… — Supriya Sule (@supriya_sule) August 31, 2023 ఇటీవల జీ20 డిన్నర్ మీటింగ్ ఆహ్వానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పిలవడంతో దేశం పేరును మార్చనున్నారనే పుకార్లు మొదలయ్యాయి. ఈ నెల నిర్వహించనున్న ప్రత్యేక సమావేశాల్లోనే ఈ బిల్లును చర్చకు తీసుకువస్తారని ఊహాగానాలు ప్రారంభం అయ్యాయి. ఇదీ చదవండి: నేడు ఇండియా కూటమి సమన్వయ కమిటీ భేటీ.. ప్రధాన సవాళ్లు ఇవే.. -
నియంతృత్వ శక్తులను ఓడిద్దాం: తేజస్వీ యాదవ్
పట్నా: దేశంలోని నియంతృత్వ శక్తులను ఓడిద్దామని కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను ఆర్జేడీ నేత, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ పరోక్షంగా విమర్శించారు. పట్నాలో శుక్రవారం విపక్ష పార్టీల భేటీపై శనివారం బిహార్ డెప్యూటీ సీఎం అయిన తేజస్వీ స్పందించారు. ‘ కన్యాకుమారి నుంచి కశీ్మర్దాకా నేతలంతా నియంతృత్వ శక్తులను ఓడిద్దామని విపక్షాలభేటీలో ప్రతినబూనారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు మోదీ గురించో మరే ఇతర వ్యక్తి గురించో కాదు. ప్రజా సంక్షేమం గురించి. విపక్షాల ఉమ్మడి కార్యాచరణ తదితర అంశాలపై వచ్చేనెలలో సిమ్లాలో జరిగే సమావేశంలో చర్చిస్తాం. ప్రస్తుతానికి ఇక్కడ తొలి అడుగు పడింది. గతంలో చరిత్రాత్మక చంపారన్ సత్యాగ్రహ ఉద్యమం, జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమాలు బిహార్ నుంచే మొదలయ్యాయి ’ అని అన్నారు. ‘ సమావేశంలో ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. ప్రతీ అంశాన్ని సామరస్యపూర్వక పరిష్కారం కోసమే స్వీకరించి చర్చించాం’ అని చెప్పారు. ఢిల్లీలో పరిపాలన సేవలపై కేంద్రం తెచి్చన ఆర్డినెన్స్‌లో కాంగ్రెస్ వైఖరి వెల్లడించాలని ఆప్ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ నిరాకరిస్తుండటంతో శుక్రవారం భేటీ తర్వాత సంయుక్త పత్రికా సమావేశంలో పాల్గొనకుండానే కేజ్రీవాల్ ఢిల్లీకి వెనుతిరిగారు. ఈ విషయంపైనే తేజస్వీపైవిధంగా స్పందించారు. విపక్షాల భేటీని బీజేపీ అగ్రనేత అమిత్ షా ఫొటో సెషన్‌గా పేర్కొంటూ విమర్శించడంపై తేజస్వీ స్పందించారు. ‘ ఫొటో సెషన్ అంటే ఏమిటో వారికే బాగా తెలుసునన్నారు. -
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 17 పార్టీలు ఉమ్మడిగా పోటీ
పట్నా: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీ గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు ఏకం కావడంలో అడుగు ముందుకు పడింది. బిహార్ రాజధాని పట్నాలో శుక్రవారం జరిగిన విపక్షాల మెగా సమావేశం కొంతమేరకు సత్ఫలితాలనిచ్చింది. పార్టీల మధ్యనున్న విభేదాలను పక్కన పెట్టి లోక్‌సభ ఎన్నికల్లో 17 పార్టీలు కలసికట్టుగా పోటీ చేయడానికి అంగీకరించాయి. ఎన్నికల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాన్ని రచించడానికి వచ్చే నెల సిమ్లాలో మరోసారి సమావేశం కావాలని విపక్ష పార్టీలు నిర్ణయించాయి. జూలై 10 లేదా 12వ తేదీన సిమ్లాలో ఈ సమావేశం ఉండవచ్చని సమాచారం. దాదాపుగా 4 గంటల సేపు సమావేశమైన చర్చించిన ప్రతిపక్ష పార్టీల నాయకులందరూ ఐక్యంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విపక్ష పార్టీల సమావేశానికి ఆతిథ్యమిచ్చిన బిహార్ సీఎం నితీశ్ మాట్లాడుతూ.. ‘‘సమావేశం బాగా జరిగింది. చాలా మంది నేతలు తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఎన్నికల్లో కలిసి పని చెయ్యడానికి ఒక అంగీకారానికి వచ్చారు’’ అని చెప్పారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. ఎన్నికల వ్యూహం, సీట్ల సర్దుబాటు వంటి అంశాలను త్వరలో నిర్ణయిస్తామని చెప్పారు. మీడియా సమావేశానికి ఢిల్లీ సీఎం కేజ్రివాల్, తమిళనాడు సీఎం స్టాలిన్ గైర్హాజరయ్యారు. అయితే వారికి ఫ్లైట్ టైమ్ అయిపోవడంతోనే వెళ్లిపోయారని నితీశ్ సమర్థించుకున్నారు. కాంగ్రెస్ ఆప్ మధ్య ఆర్డినెన్స్ చిచ్చు ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి లోక్‌సభ ఎన్నికల్ని ఎదుర్కొంటాయని బయటకి చెబుతున్నప్పటికీ సమావేశంలో కాంగ్రెస్, ఆప్ మధ్య మాటల యుద్ధం జరిగిందని తెలుస్తోంది. ఢిల్లీలో అధికారులపై నియంత్రణకు కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తమకు కాంగ్రెస్ మద్దతుగా ఉంటేనే కలిసి ముందుకు నడుస్తామని పట్టుపట్టారు. దీనిపై సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మౌనం వహించడం కేజ్రీవాల్‌కు మింగుడు పడలేదు. విపక్షాల సమావేశానంతరం ఆప్ ఒక ప్రకటనలో కాంగ్రెస్‌తో తాము కలిసి ముందుకు వెళ్లడం కష్టమంటూ బాంబు పేల్చింది. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఆర్డినెన్స్ అంశం పార్లమెంటులో తేలాల్సిందే కాబట్టి తాము అక్కడే తమ వైఖరి చెబుతామని, ఇతర వేదికలపై ఎందుకు వెల్లడించాలని ఆయన ప్రశ్నించారు. ‘‘జూలైలో సిమ్లాలో సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చిస్తాం. ఆ సమావేశంలో ఉమ్మడి ఎజెండా రూపొందించాలని నిర్ణయించాం. కేంద్రంలో అధికార బీజేపీని గద్దె దించడానికి ప్రతీ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక ప్రణాళిక రూపొందిస్తాం’’ – మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు ‘‘వచ్చే ఎన్నికల్లో జరిగేది సిద్ధాంతాల మధ్య యుద్ధం. పార్టీల మధ్య కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ కలసికట్టుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించాం. మా సిద్ధాంతాలను పరిరక్షించుకుంటూనే ఉమ్మడిగా పని చేస్తాం’’ – రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకుడు ‘‘బీజేపీని గద్దె దింపడానికి పట్నాలో మొదలైన ఈ కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంటుంది. మేమంతా ఒక్కటిగా ఉన్నాం. బీజేపీపై ఐక్యంగా పోరాడుతాం. ఈ నియంత ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే భవిష్యత్‌లో ఎన్నికలు ఉండవు. బీజేపీ చరిత్ర మార్చాలని అనుకుంటోంది. మేము చరిత్రను కాపాడతాం’’ – మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ‘‘మా ఐక్య ఫ్రంట్‌కు ప్రజా దీవెనలు కచ్చితంగా లభిస్తాయి.’’ – శరద్ పవార్, ఎన్సీపీ అధినేత ‘‘పట్నా సమావేశం విస్పష్టమైన సందేశాన్నిచ్చింది. మేమంతా ఐక్యంగా పనిచేసి దేశాన్ని కాపాడతాం’’ – అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ‘‘మేమంతా కలసికట్టుగా పోరాడతాం. విపక్షాలన్నీ చేతులు కలపకపోతే ఓట్లు చీలిపోతాయన్న ఆందోళన అందరిలోనూ ఉంది. భజరంగ భళి మాతో ఉన్నారు’’ – లాలూప్రసాద్ యాదవ్, ఆర్జేడీ అధినేత -
ఓటు వలస వెళుతుందా? రిమోట్ ఓటింగ్‌పై పెరుగుతున్న రాజకీయ వేడి
ఓటు. ప్రజాస్వామ్యం మనకిచ్చిన శక్తిమంతమైన ఆయుధం. అయినా దానిని వినియోగించుకోవడంలో ఏదో తెలీని ఉదాసీనత కనిపిస్తోంది. ముఖ్యంగా ఉపాధి కోసం వేరే ఊళ్లు వెళ్లే వలసదారులు ఓటు వెయ్యడానికి సుముఖత చూపించడం లేదు. అందుకే దేశంలో ఎక్కడ నుంచైనా ఓటు వెయ్యడానికి వీలు కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం విప్లవాత్మక మార్పులకి శ్రీకారం చుట్టింది. అవే రిమోట్ ఓటింగ్ మెషీన్లు(ఆర్వీఎం). ఈ ఓటింగ్ మెషీన్ల ద్వారా సొంతూరుకి వెళ్లకుండా తాముండే ప్రాంతం నుంచి తమ నియోజకవర్గం అభ్యర్థిని ఎన్నుకునే అవకాశం లభిస్తుంది. ఈ నమూనా ఆర్వీఎంలను ప్రదర్శించడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 16న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ సహా 13 పార్టీలు వీటిని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇప్పటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై విశ్వాసమే లేకుండా ఉన్న ఈ సమయంలో ఈ కొత్త ప్రక్రియకు తెరతీసి ఓటింగ్ వ్యవస్థను గందరగోళం చెయ్యడమెందుకనే చర్చ మొదలైంది. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీ, జనతా దళ్ (యూ), శివసేన (ఉద్ధవ్ వర్గం), ఎన్సీపీ, సీపీఎం వ్యతిరేకంగా ఉండడంతో నమూనా ఆర్వీఎంల ప్రదర్శన జరగకుండానే సమావేశం ముగిసింది. అయితే వలస ఓటర్ల ఓటింగ్ శాతం పెంపు లక్ష్యంగా తాము చేస్తున్న ప్రయత్నాలను ముందుకు తీసుకువెళ్లడానికి సీఈసీ రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఫిబ్రవరి 28 వరకు గడువు పెంచింది. ఎందుకీ ఆర్వీఎంలు ? వలస ఓటర్లలో మూడో వంతు మంది ఎన్నికల్లో తమ ఓటు హక్కుని వినియోగించుకోవడం లేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 67.4శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. దాదాపుగా 30 కోట్ల మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఉన్న చోటు నుంచి సొంతూరికి వెళ్లే అవకాశం లేకపోవడం, ఓటర్ల జాబితాలో పేరు లేకపోవడం వంటి ఎన్నో కారణాలతో వారు ఓటు వెయ్యడం లేదు. భారత ప్రధాన ఎన్నికల అధికారిగా రాజీవ్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వలస ఓటర్లపై దృష్టి కేంద్రీకరించి రిమోట్ ఓటింగ్ ప్రక్రియకు తెరతీశారు. ఆర్వీఎంలు ఎలా పని చేస్తాయి ? ప్రస్తుతం ఎన్నికల్లో వినియోగిస్తున్న ఎలక్ట్రానింగ్ ఓటింగ్ మెషీన్లకు (ఈవీఎం) ఇది సవరించిన వెర్షన్. ఇతర ప్రాంతాల్లో ఉన్న వలస ఓటర్లు తమ నియోజకవర్గంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తాము ఏ ప్రాంతం నుంచి ఓటు హక్కు వినియోగించుకుంటారో రిజిస్టర్ చేసుకోవాలి. అలా రిజిస్టర్ చేసుకున్న వారిని రిమోట్ ఓటర్లు అని పిలుస్తారు. తమ ప్రాంతంలో ఉన్న రిమోట్ పోలింగ్ బూత్‌కు వెళితే ఆ ఓటరు నియోజకవర్గం వివరాలను కానిస్టిట్యూయెన్సీ కార్డ్ రీడర్ (సీసీఆర్) ద్వారా స్కాన్ చేసి గుర్తిస్తారు. అప్పుడు ఆర్వీఎం మెషీన్ల్లపై ఆ నియోజకవర్గానికి సంబంధించిన బ్యాలెట్ పత్రం డిస్ప్లే అవుతుంది. తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేస్తే రాష్ట్రం కోడ్, నియోజకవర్గం, అభ్యర్థుల నెంబర్ వివరాలన్నీ రిమోట్ కంట్రోల్ యూనిట్లో రికార్డు అవుతాయి. ఓటు నమోదైనట్టుగా వీవీప్యాట్ స్లిప్ వస్తుంది. ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తయారు చేసిన ఆర్వీఎంలు ఇంటర్నెట్ అవసరం లేకుండా పని చేస్తాయి. ప్రతిపక్షాల అభ్యంతరాలు ఇవీ ► సీఈసీ ప్రతిపాదనలేవీ సమగ్రంగా లేవు. ఆర్వీఎంల వ్యవస్థ పైపైన రూపొందించినట్టుగా ఉంది. ► ఈవీఎంల పని తీరుపైనే సవాలక్ష సందేహాలున్న ప్రస్తుత పరిస్థితుల్లో అదే నమూనాలో రూపొందించిన ఆర్వీఎంలతో ఒనగూరే ప్రయోజనం ఉండదు. ► ప్రాంతీయ పార్టీలకు, చిన్న పార్టీలకు ఈ వ్యవస్థ ఏ మాత్రం అనుకూలం కాదు. దేశవ్యాప్తంగా ఏర్పాటయ్యే వివిధ పోలింగ్ బూత్‌లలో వారు తమ ఏజెంట్లను ఏర్పాటు చేసుకునే వనరులు ఆ పార్టీలకు ఉండవు. ► ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు వేరే రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉండకపోవడం వల్ల అక్కడ ఉండే వలస ఓటర్లని రాజకీయ పార్టీలు సులభంగా ప్రలోభ పెట్టొచ్చు ► ఓటరు స్థానికంగా నివాసం లేకపోతే రాజకీయ పార్టీలపై ఏర్పరచుకునే అభిప్రాయాలు, ఓటు వేయడంలో వారు తీసుకునే నిర్ణయాల్లో తప్పిదాలు జరిగే అవకాశం ఉంటుంది. ► దేశంలో ఒక చోట ఎన్నికలు జరుగుతూ ఉంటే, మరెక్కడి నుంచో ఓటు వేసే వ్యక్తి అసలు సిసలు ఓటరేనని ఎలా నమ్మాలి. ఓటింగ్‌లో జరిగే అక్రమాలు ఇకపై వివిధ నియోజకవర్గాలకు విస్తరిస్తాయి. ఈసీ ఎదుట ఉన్న సవాళ్లు ► అసలు వలస ఓటర్లు అంటే ఎవరు ? వారిని ఎలా గుర్తించాలి. వలస ఓటర్లను గుర్తించడంలో ఏర్పడే న్యాయపరమైన చిక్కుల్ని ఎదుర్కోవడం ► ఈవీఎంలకు సవరించిన వెర్షన్‌గా రూపొందించిన ఆర్వీఎంలలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలకు పరిష్కారం కనుగొనడం ► ఎన్నికల్లో ఎన్ని రిమోట్ ఓటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న దానిపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవడం ► ఒక రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతూ ఉంటే వలస ఓట్లు ఉండే అన్ని ప్రాంతాల్లోనూ ఎన్నికల నియమావళిని అమలు చేయడానికి ఎలాంటి కసరత్తు చేయాలి. ఇలాంటి సవాళ్లను అధిగమించడానికే ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరుతోంది. రిమోట్ ఓటింగ్ అనేది ఎన్నికల ప్రకియలో ఒక విప్లవాత్మకమైన మార్పు. పట్టణ ప్రాంతాల్లో, యువతలోనూ ఓటుపై ఆసక్తి పెంచడమే ధ్యేయంగా పని చేస్తున్నాం. కానీ దీని అమలులో ఎన్నో సవాళ్లున్నాయి. ఇది అంత సులభంగా జరిగేది కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిర్ణయాలు తీసుకోవడానికి సమయం పడుతుంది. మేం వేసే ప్రతీ అడుగు ముందడుగానే ఉంటుంది. రాజీవ్ కుమార్, సీఈసీ ధనిక పార్టీ అయిన బీజేపీకి ఇలాంటి ప్రక్రియలు అనుకూలంగా ఉంటాయి. ప్రాంతీయ పార్టీల ఆందోళనలో అర్థం ఉంది. రిమోట్ బూత్‌లున్న ప్రతిచోటా పోలింగ్ ఏజెంట్లను తెచ్చిపెట్టుకునే సామర్థ్యం వారికి ఉండదు. ఎన్నికల బరిలో ఉన్న పార్టీలకు చెందిన పోలింగ్ ఏజెంట్లు లేకుండా రిమోట్ ఓటింగ్ ప్రక్రియను నిర్వహించడం సరి కాదు. జగ్దీప్ చొకార్, అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫారమ్స్ సహ వ్యవస్థాపకుడు ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో చివరి గంటలో 10 నుంచి 12% ఓట్లు పోలయినట్టు గుర్తించాం. అంటే ప్రతీ 25–30 సెకండ్లకి ఒక ఓటు పోలయినట్టు లెక్క. అదెలా సాధ్యం. ఒక ఓటు నమోదు కావడానికి కనీసం 60 సెకండ్ల సమయం పడుతుంది. ఈవీఎంలలో కళ్లకు కట్టినట్టు ఇన్ని దారుణాలు జరుగుతూ ఉంటే ఆర్వీఎం అవసరం ఏమొచ్చింది..? జైరామ్ రమేష్, కాంగ్రెస్ ఎంపీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
సభా విలువలు కాపాడాలి
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని అఖిలపక్ష నేతలకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా విజ్ఞప్తి చేశారు. సభలో సభ్యత, క్రమశిక్షణ పాటించాలని కోరారు. సభా సంప్రదాయాలను, విలువలను కాపాడాలన్నారు. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓం బిర్లా శనివారం అఖిలపక్ష భేటీ నిర్వహించారు. అగ్నిపథ్ పథకం, నిరుద్యోగం, రైతుల సమస్యలపై ఉభయ సభల్లో చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, డీఎంకే, ఐయూఎంఎల్, ఎల్జేపీ, ఆప్నాదళ్ తదితర పార్టీల నేతలు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తరపున పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ, సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు. -
లంక విద్యార్ధులపై విరిగిన లాఠీ
కొలంబో: ఆర్థికంగా అధ్వాన్న స్థితికి చేరుకున్న లంకలో సామాజిక పరిస్థితులు కూడా కట్టు తప్పుతున్నాయి. ప్రజాగ్రహాన్ని నియంత్రించడంలో విఫలమైన ప్రభుత్వం దమనకాండకు దిగుతోంది. ప్రభుత్వ నిర్ణయాలపై నిరసనకు దిగిన వర్సిటీ విద్యార్ధులపై ఆదివారం పోలీసులు లాఠీ చార్జ్, బాష్పవాయు ప్రయోగం చేశారు. ఆల్‌పార్టీ ప్రభు త్వం ఏర్పాటుకు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం ప్రభుత్వ ఆజ్ఞలు లెక్కచేయని ప్రతిపక్ష సమగి జన బలవెగయ పార్టీ కొలంబోలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించింది. లంకలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని ప్రతిపక్ష నేత హర్ష డిసిల్వా ప్రకటించారు. నిరసనలో భాగంగా కొలంబోలోని ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్దకు ప్రతిపక్షాలు లాంగ్‌మార్చ్ నిర్వహించాయి. దేశ పశ్చిమ ప్రాంతంలో పోలీసులు కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనకు 664మందిని అరెస్టు చేశారు. ప్రజాహక్కుల పరిరక్షణకే నిరసనలని ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస చెప్పారు. ప్రతిపక్షాలకు మద్దతుగా పలువురు సోషల్ మీడియా యాక్టివిస్టులు ఆన్లైన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఆల్‌పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంక్షోభ పరిష్కారాన్ని వెతకాలని మాజీ మంత్రి విమల వీరవంశ సూచించారు. ఈ సూచనపై అధ్యక్షుడు, ప్రధాని సానుకూలంగా స్పందించారన్నారు. లంక ఆర్థిక వ్యవస్థను కొందరు వ్యక్తులు గుప్పిట్లో ఉంచుకున్నారని, వీరికి ప్రజల్లో మద్దతు పోయిందని మాజీ క్రికెటర్ మహెళ జయవర్ధనే విమర్శించారు. వీరంతా వెంటనే గద్దె దిగాలన్నారు. ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో క్రీడలు, యువజన మంత్రి పదవికి నమల్ రాజపక్సా రాజీనామా చేసినట్లు వార్తలొచ్చాయి. సోషల్ మీడియాపై నిషేధం, ఎత్తివేత ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం విధించిన శ్రీలంక.. తిరిగి 15 గంటల్లోనే ఎత్తివేసింది. 36 గంటల కర్ఫ్యూలో భాగంగా సోషల్ మీడియాపై శనివారం రాత్రి నిషేధం విధించింది. దీన్ని మంత్రులు వ్యతిరేకించడంతో వెనక్కు తగ్గింది. కిలో బియ్యం రూ.220! శ్రీలంకలో ద్రవ్యోల్బణం అదుపు తప్పింది. నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. ఇంధనం, నిత్యావసరాల కోసం జనం భారీగా క్యూ కడుతున్నారు. అయినా ఏ కొందరికో సరుకులు లభిస్తున్నాయి. సూపర్మార్కెట్లలో కిలో బియ్యం రూ. 220, గోధుమలు రూ.190, పంచదార రూ.240, పాల పౌడర్ రూ.1900 చేరడంతో లీటర్ కొబ్బరి నూనె రూ. 850, గుడ్డు రూ.30 పలుకుతున్నాయి. -
అఖిలపక్ష భేటీ.. ‘మద్దతు’కు చట్టబద్ధత
న్యూఢిల్లీ: మూడు సాగు చట్టాలను ఉపసంహరించడంతోపాటు పంటలకు కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ) చట్టబద్ధత కల్పించాలని ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. రైతాంగం సమస్యలు, దేశంలో ధరల పెరుగుదల, చమురు ధరల మంట, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, కరోనా మహమ్మారి వ్యాప్తి– నియంత్రణ చర్యలు, దిగజారుతున్న దేశ ఆర్థిక పరిస్థితి, పెగాసస్ స్పైవేర్ వ్యవహారం, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, భారత భూభాగంలో చైనా సైనికుల చొరబాట్లు, సరిహద్దు రాష్ట్రాల్లో బీఎస్ఎఫ్ పరిధి పెంపు, మహిళా రిజర్వేషన్లు తదితర కీలక అంశాలపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చర్చించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని పట్టుబట్టాయి. పార్లమెంట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానునున్న నేపథ్యంలో కేంద్రం ఆదివారం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ నిర్వహించింది. 31 ప్రతిపక్షాల నేతలు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలన్నీ సహకరించాలని రాజ్‌నాథ్ కోరారు. ఉభయ సభల సభాపతులు అనుమతించే అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రజా సమస్యలపై పార్లమెంట్లో కచ్చితంగా చర్చించాలని ప్రతిపక్ష నేతలు సూచించారు. అఖిలపక్ష భేటీకి ప్రధాని నరేంద్ర మోదీ రాకపోవడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, అఖిలపక్ష సమావేశానికి ప్రధానమంత్రి హాజరయ్యే సంప్రదాయం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ గుర్తుచేశారు. ‘ఎంఎస్పీ’పై చర్యలు తీసుకోవాలి అఖిలపక్ష సమావేశంలో 15 అంశాలను లేవనెత్తాం. రైతుల సమస్యలను ప్రస్తావించాం. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని విన్నవించాం. విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాం. ఎంఎస్పీకి చట్టబద్ధతపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పాం. సాగు చట్టాల వ్యతిరేక పోరాటంలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని విన్నవించాం. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపాం. పార్లమెంట్ 19 రోజులపాటే పనిచేయనుంది. అన్ని అంశాలపై చర్చించేందుకు సమయం సరిపోదు. లోక్‌సభ సక్రమంగా కొనసాగడానికి డిప్యూటీ స్పీకర్‌ను నియమించాలి. పార్లమెంట్లో మీడియాపై విధించిన ఆంక్షలను తొలగించాలి – మల్లికార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి,కాంగ్రెస్ నేతలు మహిళా రిజర్వేషన్ బిల్లును చేపట్టాలి పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే తదితర పార్టీలు అఖిలపక్ష సమావేశంలో కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. పార్లమెంట్లో ఈ బిల్లుపై చర్చించాలని కోరాయి. విధాన నిర్ణయాలు తీసుకోవడంలో మహిళలకు వారి వంతు భాగస్వామ్యం కల్పించాల్సిన సమయం వచ్చిందని సూచించారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు గత 15 ఏళ్లుగా మోక్షం లభించడం లేదు. సమాఖ్య వ్యవస్థను దెబ్బతీయొద్దు దేశ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ పరిధిని 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు పెంచడం సరైంది కాదు. ఇలా చేయడం రాష్ట్రాల హక్కులకు విఘాతం కలిగిస్తూ దేశ సమాఖ్య వ్యవస్థను దెబ్బతీయడమే అవుతుంది. అఖిలపక్ష భేటీలో 10 అంశాలను లేవనెత్తాం – డెరెక్ ఓ బ్రెయిన్, సుదీప్ బందోపాధ్యాయ, తృణమూల్ నేతలు మాట్లాడనివ్వలేదు.. అఖిలపక్ష సమావేశంలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. రైతు ల సమస్యలు, ఎంఎస్పీకి చట్టబద్ధత అంశాన్ని లెవనెత్తడానికి అనుమతించలేదు. అందుకే వాకౌట్ చేశాం – సంజయ్ సింగ్, ఆప్ నాయకుడు జమ్మూకశ్మీర్‌కు తక్షణమే రాష్ట్ర హోదా కల్పించాలి – ఫరూక్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత పార్లమెంట్ పనితీరుపై సుప్రీం వ్యాఖ్యలు ఆందోళనకరం వెంకయ్యతో విపక్ష నేతలు పార్లమెంట్‌తోపాటు ఇతర చట్టసభల పనితీరు, చట్టాలను రూపొందిస్తున్న విధానం పట్ల ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై పలువురు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. చట్టసభల హక్కులకు, మర్యాదలకు భంగం వాటిల్లకుండా, ఇతర రాజ్యాంగబద్ధ వ్యవస్థలు చట్టసభలపై ప్రతికూల వ్యాఖ్యలు చేయకుండా సభాపతులే(ప్రిసైడింగ్ ఆఫీసర్లు) తగిన చర్యలు తీసుకోవాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడి దృష్టికి తీసుకొచ్చారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వెంకయ్య ఆదివారం తన నివాసంలో దాదాపు 40 పార్టీల నేతలతో సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై వారు వెలిబుచ్చిన అభిప్రాయాలను తెలుసుకున్నారు. ‘‘మీ ఆందోళనను అర్థం చేసుకోగలను. ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తిందో గమనించాలి. చట్టసభల్లో తరచూ అంతరాయాలు కలుగుతున్నాయి. సభ్యులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. చట్టసభల్లో మన ప్రవర్తన గౌరవంగా, హూందాగా ఉంటే ప్రజాబాహుళ్యం నుంచి ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు వినిపించవు’’ అని సూచించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో 70 శాతం సమయం వృథా అయ్యిందని, శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరిస్తామని పలువురు నేతలు వెల్లడించారు. ప్రభుత్వం, ప్రతిపక్షాలు తరచుగా కలిసి మాట్లాడుకుంటే, పార్లమెంట్లో గొడవలకు ఆస్కారం ఉండదని వెంకయ్య నాయుడు తెలిపారు. -
సభా సమరం షురూ..!
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అర్థవంతమైన, ఆరోగ్యకరమైన చర్చలు జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. అన్ని పార్టీ లు సహకరించాలని, ఈ సమావేశాలు సజావుగా సాగుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా కొందరు సభ్యులు మృతిచెందడం పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. సోమవారం నుంచి వర్షాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రతిపక్షాల నుంచి నిర్మాణాత్మక సూచనలు అవసరమని, ఇవి చర్చలను మరింత ఫలప్రదంగా మారుస్తాయని చెప్పారు. సభ్యుల్లో అధికులు టీకాలు తీసుకున్నందున సభలు మరింత సజావుగా సాగుతాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ఏ అంశంపైనైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఉభయ సభలు సజావుగా సాగడానికి అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. సమస్యలపై నిర్మాణాత్మక చర్చలు జరగాలన్నారు. సోమవారం నుంచి ఆగస్టు 13 వరకూ నిర్వహించే వర్షాకాల సమావేశాల్లో మొత్తం 19 సార్లు సభ సమావేశం అవుతుందన్నారు. 30 పైచిలుకు బిల్లులు వర్షాకాల సమావేశాల సందర్భంగా రెండు ఆర్థిక బిల్లులు సహా మొత్తం 30కి పైచిలుకు బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు ప్రహ్లాద్ జోషి తెలిపారు. వీటిలో ఇప్పటికే జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లు, ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్టసీ కోడ్ బిల్లు, హోమియోపతి సెంట్రల్ కౌన్సిల్ తదితర బిల్లులున్నాయి. వీటితో పాటు పలు కీలక బిల్లులు సైతం సమావేశాల్లో చర్చకు రానున్నాయి. ఈ అఖిలపక్ష సమావేశంలో టీఎంసీ, డీఎంకే, వైఎస్సార్సీపీ, శివసేన, జేడీయూ, బీజేడీ, ఎస్పీ, టీఆర్ఎస్, ఏఐడీఎంకే, బీఎస్పీ, ఎన్సీపీ, టీడీపీ, అకాలీదళ్ సీపీఐ, ఆప్ సహా 33 పార్టీల నేతలు పాల్గొన్నారు. వీరిలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ సింగ్, టీఎంసీకి చెందిన డెరిక్ ఓబ్రెయిన్, డీఎంకే నుంచి తిరుచ్చి శివ, ఎస్పీ నుంచి రామ్‌గోపాల్ యాదవ్, బీఎస్పీకి చెందిన సతీష్ మిశ్రా, అప్నాదళ్ నేత అనుప్రియ, ఎల్జేపీ నేత పశుపతి పరాస్ ఉన్నారు. ప్రధానితో పాటు హోం, రక్షణ మంత్రులు, రాజ్యసభ లీడర్ ఆఫ్ హౌస్ పీయూష్ గోయల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేబినెట్ తాజా విస్తరణ అనంతరం జరుగుతున్న తొలి సమావేశాలు కావడంతో వీటిపై ఆసక్తి నెలకొంది. అందుకు ఒప్పుకోం దేశంలో కరోనా పరిస్థితిని పార్లమెంట్ ఉభయసభల ఎంపీలకు పార్లమెంట్ బయట ఏర్పాటు చేసే సమావేశంలో ప్రధాని వివరిస్తారనే కేంద్ర ప్రతిపాదనకు ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. ఇది పార్లమెంటరీ నియమాలను ఉల్లంఘించేందుకు మరోమార్గమని దుయ్యబట్టాయి. జూలై 20న ప్రధాని రెండు సభల ఎంపీలనుద్దేశించి పార్లమెంట్ అనుబంధ భవనంలో ప్రసంగిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జోషీ ప్రకటించగానే, తొలుత టీఎంసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్లమెంటు జరుగుతోందని, సభకు వచ్చి మాట్లాడాలని ఆపార్టీ ఎంపీ డెరిక్ అభిప్రాయపడ్డారు. దీనికి పలు ఇతర పక్షాల నేతలు కూడా మద్దతు ప్రకటించారని తెలిసింది. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కొందరు నేతలు సూచించారు. పార్లమెంట్ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఏం చెప్పాలన్నా సభలోనే చెప్పాలన్నది తమ అభిప్రాయమని సీపీఎం వ్యాఖ్యానించింది. వేరుగా ఎంపీలనుద్దేశించి ప్రసంగించడం తగదని పేర్కొంది. సోమవారం సభలు ఆరంభం కాగానే ఉప ఎన్నికల్లో ఎన్నికైన నూతన ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. ఎన్డీఏ నేతలతో ప్రధాని భేటీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆరంభమవుతున్న సందర్భంగా ప్రధాని మోదీ ఎన్డీఏలోని పార్టీల పార్లమెంటరీ నేతలతో ఆదివారం సమావేశమయ్యారు. హోంమంత్రి అమిత్‌షా, రక్షణమంత్రి రాజ్నా«థ్, బీజేపీ అధ్యక్షుడు నడ్డా కూడా పాల్గొన్నారు. ఎన్డీఏ పక్షాల నేతల్లో అప్నాదళ్‌కు చెందిన అనుప్రియ, జేడీయూ నేత రామ్‌నాథ్ ఠాకూర్, ఏఐఏడీఎంకే నేత నవనీతకృష్ణన్, ఆర్పీఐ నేత రామ్‌దాస్ అథవాలే, ఎల్జేపీ నేత పశుపతి పరాస్ తదితరులున్నారు. ఈ సమావే శాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో ప్రధాని చర్చించారు. సభ పవిత్రతను గౌరవించాలి: ఓం బిర్లా సభ పవిత్రత, గౌరవాన్ని సభ్యులందరూ గౌరవించాలని సభాపతి ఓంబిర్లా తెలిపారు. ఆదివారం సభాపతి ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సభ సజావుగా సాగడానికి గత సమావేశాల మాదిరిగానే సహకరించాలని పార్టీల నేతలను ఓం బిర్లా కోరారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి అందరికీ తగిన సమయం కేటాయిస్తానన్నారు. త్వరలోనే ఒక యాప్ తీసుకొస్తున్నామని పార్లమెంటరీ వ్యవహారాలకు సంబంధించి వన్‌స్టాప్ సొల్యూషన్‌గా అది ఉపకరిస్తుందని ఓం బిర్లా తెలిపారు. కరోనా నేపథ్యంలో సభ్యులు, సిబ్బంది, మీడియా అందరికీ తగిన భద్రతా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ఓం బిర్లా మీడియాతో మాట్లాడుతూ.. దేశ ఆకాంక్షలకు సభ ప్రాతినిధ్యం వహిస్తుందని, ప్రజల సమస్యలను తెలియజేయడం సభ్యుల బాధ్యత అన్నారు. ప్రజా ప్రయోజనాలపై చర్చించడానికి అవకాశం ఉండాలని .. చిన్నపార్టీలు, ఏక సభ్యుడున్న పార్టీలకు కూడా తగిన సమయం కేటాయిస్తానని సభాపతి ఓంబిర్లా తెలిపారు. సమావేశంలో వైఎస్సార్సీపీ, టీడీపీ, టీఆర్ఎస్ లోక్‌సభాపక్షనేతలు మిథున్‌రెడ్డి, రామ్మోహన్నాయుడు, నామా నాగేశ్వరరావులు పాల్గొన్నారు. ఎంపీలాడ్ ఫండ్స్ పునరుద్ధరించాలి! రాజకీయ పార్టీల డిమాండ్ ఎంపీ లాడ్ నిధులను పునరుద్ధరించాలని కాంగ్రెస్ సహా పలు పార్టీలు డిమాండ్ చేశాయి. వర్షాకాల సమావేశాల నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పలు పార్టీలు ఈ డిమాండ్‌ను వినిపించాయి. పార్టీల డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని స్పీకర్ హామీ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సమావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జోషీ ముందు ఎంపీ లాడ్ నిధులు మరలా ఇవ్వాలనే డిమాండ్‌ను వైఎస్ఆర్సీపీ నేత మిథున్ రెడ్డి, కాంగ్రెస్ నేత అధిర్ రంజన్, టీఎంసీ నేత సుదీప్ బందోపాధ్యాయ లేవనెత్తారు. ప్రజాప్రయోజన అంశాలపై మాట్లాడేందుకు సభ్యులకు తగిన సమయం ఇస్తానని ఈ సందర్భంగా స్పీకర్ హామీ ఇచ్చారు. ఎంపీలంతా సభ సజావుగా నడిచేందుకు సహకరించాలని కోరారు. ఐదు సెషన్లుగా పార్లమెంట్ సాఫీగా జరిగేందుకు సహకరించినందుకు నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆటంకాలు లేకుండా సభ నడిచేందుకు సహకరిస్తామని పార్టీల నేతలు స్పీకర్‌కు చెప్పినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కోవిడ్ నేపథ్యంలో సభా సమావేశాల ఏర్పాట్లను కట్టదిట్టం చేశామని స్పీకర్ చెప్పారు. -
సభ సజావుగా సాగేందుకు సహకరించాలి
సాక్షి, న్యూఢిల్లీ: సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఒకరికొకరు సహకరించుకోవాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు కోరారు. శనివారం ఉపరాష్ట్రపతి నివాసంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో వివిధ రాజకీయపక్షాల నేతలు తమ అభిప్రాయాలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళారు. కోవిడ్ వల్ల దేశంలో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా ప్రజల పక్షాన నిలబడాలని, సంబంధిత అంశాలపై చర్చించాలని వెంకయ్య నాయుడు కోరారు. వర్షాకాల సమావేశాల్లో 6 ఆర్డినెన్స్‌లతో కలిపి మొత్తం 29 బిల్లులను సభ ముందు ఉంచుతున్నామని, సభ సజావుగా సాగేందుకు అన్ని పార్టీల సహకారాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కోరారని సమాచారం. ఈ సమావేశానికి రాజ్యసభ నాయకుడు పీయూష్ గోయల్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రైల్వే, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. -
అప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేయను: ముఫ్తీ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో అణచివేత శకానికి ముగింపు పలికితేనే ఇక్కడి ప్రధాన రాజకీయ పార్టీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సంప్రదింపులు ప్రక్రియకు విశ్వసనీయత ఉంటుందని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ (62) తేల్చిచెప్పారు. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా అసమ్మతి గళం వినిపించడం నేరమేమీ కాదని.. దీన్ని అర్థం చేసుకోవాలని హితవు పలికారు. ఆమె తాజాగా ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. ప్రజలకు ఊపిరిపీల్చే హక్కు ఉండాలని, ఆ తర్వాతే ఏదైనా అని వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్ ప్రజలు ఎన్నో బాధలు ఎదుర్కొంటున్నారని అన్నారు. 14 మంది నేతల బృందంతో గురువారం ప్రధాని మోదీ నిర్వహించిన భేటీతో ఈ బాధల ఉపశమనానికి ఒక మార్గం ఏర్పడిందని భావిస్తున్నట్లు చెప్పారు. మెహబూబా ముఫ్తీ ఇంకా ఏం మాట్లాడారంటే... ఉద్యోగాలు, భూములపై హక్కులను కాపాడాలి ‘‘జమ్మూకశ్మీర్ పార్టీల నాయకులతో చర్చల ప్రక్రియకు విశ్వసనీయత అనేది కేంద్రం పరిధిలోనే ఉంది. ప్రజల్లో విశ్వాసాన్ని పాదుకొల్పే చర్యలను ప్రారంభించాలి. జమ్మూకశ్మీర్ వాసులను ఊపిరి పీల్చుకోనివ్వాలి. వారి ఉద్యోగాలను, వారి భూములపై హక్కులను కాపాడాలి. ఊపిరి పీల్చుకోనివ్వండి అనడంలో నా ఉద్దేశం ఏమిటంటే.. ప్రభుత్వానికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే చాలు జైల్లో విసిరేస్తున్నారు. ఇటీవలే తన మనోభావాలను వ్యక్తం చేసిన ఓ పౌరుడిని జైల్లో పెట్టారు. కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసినప్పటికీ అధికారులు జైలు నుంచి విడుదల చేయలేదు. మరోవైపు ప్రధానమంత్రి మోదీ మాత్రం దిల్ కీ దూరీ.. దిల్లీ కీ దూరీ (హృదయాల మధ్య దూరం.. ఢిల్లీతో అంతరం) అంతం కావాలని కోరుకుంటున్నానని చెబుతున్నారు. అంతకంటే ముందు జమ్మూకశ్మీర్ ప్రజలపై అణచివేతను అంతం చేయండి. ప్రజలకు వ్యతిరేకంగా క్రూరమైన ఉత్తర్వులు జారీ చేయడం వెంటనే నిలిపివేయాలి. రాష్ట్రం ఒక జైలుగా మారింది జమ్మూకశ్మీర్‌ను నేను ఒక రాష్ట్రంగానే పరిగణిస్తా. ఈ మొత్తం రాష్ట్రం ఇప్పుడొక జైలుగా మారిపోవడం దారుణం. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాలి. జమ్మూకశ్మీర్‌తోపాటు లద్దాఖ్‌లో పర్యాటకం, వ్యాపార రంగాల్లో ఉన్నవారు ఆర్థికంగా నష్టపోయారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలి, తగిన సాయం అందించాలి. ప్రజల కష్టాల పట్ల ప్రభుత్వ ప్రతిస్పందనను అంచనా వేయడానికే ఢిల్లీలో ప్రధాని మోదీతో జరిగిన చర్చల్లో పాల్గొన్నా. పవర్ పాలిటిక్స్ కోసం వెళ్లలేదు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించే దాకా ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనని గతంలోనే చెప్పా. అదే మాటకు కట్టుబడి ఉన్నా. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూకశ్మీర్ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను అందరి దృష్టికి తీసుకెళ్లడానికి ప్రధానితో జరిగిన భేటీని ఒక అవకాశంగా భావించా. జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగానే కొనసాగితే ఎన్నికల్లో నేను పోటీ చేసే ప్రసక్తే లేదు. అదే సమయంలో రాజకీయంగా లాభపడే అవకాశాన్ని మరొకరికి ఇవ్వడం మాకు ఇష్టం లేదు. అందుకే గత ఏడాది జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికల్లో గుప్కర్ కూటమితో కలిసి మా పార్టీ పోటీ చేసింది. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికలను ప్రకటిస్తే కలిసి కూర్చొని, చర్చించుకొని, నిర్ణయం తీసుకుంటాం’’అని మెహబూబా ముఫ్తీ తెలిపారు. -
24న కశ్మీర్ అఖిలపక్షంతో ప్రధాని భేటీ
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన, రాష్ట్ర హోదా పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. కశ్మీర్లో వివిధ రాజకీయ పక్షాలతో ఈ నెల 24న సమావేశాన్ని ఏర్పాటు చేసి నలుగురు మాజీ ముఖ్యమంత్రులు సహా 14 మంది నేతలకు ఆహ్వానం పంపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాసంలో జరిగే ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా హాజరవుతారు. జమ్మూ కశ్మీర్ భవిష్యత్ ప్రణాళికపై చర్చించడానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా కశ్మీర్ నేతల్ని స్వయంగా ఫోన్ ద్వారా ఆహ్వానించినట్టుగా ప్రభుత్వ అధికారులు శనివారం వెల్లడించారు. సమావేశానికి ఆహ్వానం అందుకున్న నేతల్లో నలుగురు మాజీ సీఎంలు... నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులామ్ నబీ ఆజాద్, పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ ఉన్నారు. ఇక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రులుగా పని చేసిన కాంగ్రెస్ నేత తారా చంద్, పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత ముజాఫర్ హుస్సేన్ బేగ్, బీజేపీ నేతలు నిర్మల్ సింగ్, కవీందర్ గుప్తాలను కూడా ఆహ్వానించింది. సీపీఐ(ఎం) నేత యూసఫ్ తరిగామి, జమ్ము కశ్మీర్ అప్నీ పార్టీ (జేకేఏపీ) చీఫ్ అల్తాఫ్ బుఖారీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ సజ్జద్ లోనె, జేకే కాంగ్రెస్ హెడ్ జీ ఏ మిర్, బీజేపీకి చెందిన రవీందర్ రైనా, పాంథర్స్ పార్టీ నేత భీమ్ సింగ్‌లకు ఆహ్వానం అందింది. వీరంతా తప్పనిసరిగా కోవిడ్–19 నెగిటివ్ రిపోర్ట్‌తో సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుంది. మంచుకొండల్లో రాజకీయ వేడి జమ్మూ కశ్మీర్ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేసే ఆర్టికల్ 370ని 2019లో ఆగస్టులో రద్దు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా రాజకీయ ప్రక్రియకి తెర తీయడంతో మంచుకొండల్లో రాజకీయ వేడి రాజుకుంది. ఈ సమావేశానికి హాజరవడానికి వివిధ రాజకీయ పక్షాలు సన్నాహాలు చేస్తున్నాయి. పీడీపీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఆదివారం సమావేశమై దీనిపై చర్చించనుంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఎన్నికలు ? ఆర్టికల్ 370 రద్దు సమయంలో జమ్ము కశ్మీర్‌ని కేంద్ర పాలిత ప్రాంతం చేసినప్పటికీ మళ్లీ ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్ర హోదా కల్పిస్తామని అప్పట్లోనే కేంద్రం చెప్పింది. జమ్ము కశ్మీర్‌లోని రాజకీయ పార్టీల సహకారంతో ఈ ఏడాది నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసి రాష్ట్ర హోదాను కల్పించాలని భావిస్తోంది. ఈ ఏడాది నవంబర్–డిసెంబర్, లేదంటే వచ్చే ఏడాది మార్చి–ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం ఆలోచనగా ఉన్నట్టు అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. -
సీఎంలతో నేడు మోదీ చర్చలు
న్యూఢిల్లీ: కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14వ తేదీ తరువాత ఎత్తివేయాలా? వద్దా? అన్న అంశంపై ప్రధాని మోదీ శనివారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరపనున్నారు. ఈ సమావేశం అనంతరమే లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రధాని ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రుల అభిప్రాయాలను, సలహా, సూచనలను తీసుకోనున్నారు. అయితే పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్డౌన్ పొడిగింపునకు మద్దతు తెలిపిన నేపథ్యంలో తుది నిర్ణయం కూడా ఇదే దిశగా ఉండవచ్చునని అంచనా. పార్లమెంటులో వేర్వేరు రాజకీయ పార్టీల నేతలతో మోదీ మూడు రోజుల క్రితం మాట్లాడుతూ ఏప్రిల్ 14వ తేదీ తరువాత ఒకేసారి లాక్డౌన్ ఎత్తివేయడం సాధ్యం కాదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ప్రతి ప్రాణాన్ని కాపాడుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కూడా ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రాలు, జిల్లా స్థాయి యంత్రాంగం, నిపుణులు కూడా లాక్‌డౌన్‌ను పొడిగించాలనే సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒడిశా ఒకడుగు ముందుకేసి ఏప్రిల్ 30వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ను పొడిగించింది కూడా. ప్రధాని మోదీ సీఎంలతో సంప్రదింపులు జరపడం ఇది రెండోసారి. ఏప్రిల్ 2న తొలి సమావేశంలో దశలవారీ లాక్డౌన్ ఎత్తివేతకు అనుకూలంగా ప్రధాని మాట్లాడారు. సమూహ వ్యాప్తి లేదు: కేంద్రం న్యూఢిల్లీ/భువనేశ్వర్/చండీగఢ్: కరోనా వైరస్‌కు సంబంధించి భారత్‌లో ఇప్పటివరకు సమూహ వ్యాప్తి(కమ్యూనిటీ ట్రాన్స్మిషన్) దశ రాలేదని కేంద్రం ప్రకటించింది. అలాంటిదేమైనా ఉంటే, ప్రజల్లో అప్రమత్తత పెంచేందుకు ముందు మీడియాకే చెప్తామని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ శుక్రవారం వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ బారిన పడిన 104 మందిలో 40 మందికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ కానీ, పాజిటివ్‌గా తేలిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న చరిత్ర కానీ లేదని తేలిందని ఐసీఎంఆర్ ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించగా, లవ్ అగర్వాల్ పై సమాధానం ఇచ్చారు. మరోవైపు, కోవిడ్–9పై సమర్ధవంతంగా పనిచేస్తుందని తేలిన హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఎగుమతి చేయాలంటూ పలు దేశాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని విదేశాంగ శాఖ పేర్కొంది. అయితే, భారత్‌కు అవసరమైన స్టాక్ ఉన్న తరువాత, మిగతా స్టాక్‌ను ఎగుమతి చేయాలని నిర్ణయించామని తెలిపింది. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కు తీసుకువచ్చే విషయంపై.. కరోనా వ్యాప్తి పరిస్థితిని సమీక్షించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి దమ్ము రవి తెలిపారు. అది ప్రమాదకరం కరోనా వైరస్‌ను పూర్తిగా కట్టడి చేయకముందే తొందరపడి ఆంక్షలను ఎత్తివేస్తే అత్యంత ప్రమాదకర పరిస్థితి నెలకొంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అలా చేస్తే.. వైరస్ వ్యాప్తి అడ్డుకోలేని దశకు చేరుకునే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. లాక్‌డౌన్‌పై మీ అభిప్రాయం ఏమిటి? దేశవ్యాప్త లాక్‌డౌన్‌పై తమ అభిప్రాయాలు తెలపాల్సిందిగా కేంద్ర హోం శాఖ శుక్రవారం రాష్ట్రాలను కోరింది. ఏప్రిల్ 14 తరువాత మరో రెండు వారాలపాటు లాక్డౌన్ కొనసాగుతుందన్న వార్తలు వస్తున్న తరుణంలో హోంశాఖ ఈ∙సమాచారం కోరడం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ రంగ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వాలన్న సూచనలు ఎక్కువగా రాష్ట్రాల నుంచి ఉన్నాయని తెలిసింది. లాక్డౌన్ సందర్భంగా ఆన్లైన్ ప్లాట్‌ఫాంతోపాటు అత్యవసర వస్తువుల విక్రయ కేంద్రాలు తెరిచే ఉంటాయని కేంద్రం ప్రకటించింది. వీటితోపాటు ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పోలీస్, మీడియా, బ్యాంకులు పనిచేస్తాయని చెప్పింది. మాస్కు లేకపోతే పెట్రోలుకు నో! ముఖానికి మాస్కు లేనివారికి పెట్రోలు పంపుల్లో ఇంధనం నింపేది లేదని ఒడిశా రాష్ట్రం ఉత్కళ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ శుక్రవారం ప్రకటించింది. కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో పంజాబ్ రాష్ట్రం లాక్‌డౌన్‌ను మే ఒకటో తేదీ వరకూ పొడిగించింది. ఒడిశా ఇప్పటికే లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30వ తేదీ వరకూ పొడిగించిన విషయం తెలిసిందే. మతపరమైన ఊరేగింపులు వద్దు ఏప్రిల్ నెలలో వివిధ పండుగల సందర్భంగా మతపరమైన ఊరేగింపులు, గుమికూడటంపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జాగరూకతతో వ్యవహరించాలని హోం శాఖ శుక్రవారం హెచ్చరించింది. అభ్యంతరకరమైన సమాచారం ఏదీ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టకుండా నిఘా ఉంచాలని, లాక్డౌన్ ఆంక్షలన్నీ కచ్చితంగా అమలయ్యేలా చూడాలని స్పష్టం చేసింది. ఈ నెలలో ఇప్పటికే కొన్ని మతపరమైన కార్యక్రమాలు పూర్తికాగా, బైశాఖీ, రోంగలి బీహూ, విషు, పోయినా బైశాఖ్, పుతాండు, మహా విశుబా సంక్రాంతి వంటి పండుగలన్నీ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వీటన్నింటిపై ప్రభుత్వ అధికారులు, మత సంస్థలు, పౌరులు అప్రమత్తంగా ఉండాలని హోం శాఖ కోరింది. లాక్డౌన్ మార్గదర్శకాల ఉల్లంఘనలపై భారతీయ శిక్షాస్మృతి, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆక్ట్ల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. -
కశ్మీర్లో టెన్షన్.. టెన్షన్!
శ్రీనగర్/జమ్మూ/న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణం ఆదివారం నాటికి మరింత ముదిరింది. ఉగ్రవాదులు దాడిచేయొచ్చన్న వార్తల నేపథ్యంలో శ్రీనగర్‌ను వీడాలని రాష్ట్ర క్రికెట్ జట్టు కోచ్ ఇర్ఫాన్ పఠాన్‌ను అధికారులు ఆదేశించారు. అదే సమయంలో జమ్మూలోని పూంఛ్, రాజౌరీ, దొడ, కిష్త్వర్ జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం భారీగా బలగాలను మోహరించింది. ఈ సందర్భంగా నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఇంట్లో సమావేశమైన అఖిలపక్ష నేతలు పరిస్థితిని మరింత దిగజార్చేలా వ్యవహరించవద్దని భారత్, పాకిస్తాన్లకు విజ్ఞప్తి చేశారు. కశ్మీర్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వం చేసేందుకు ఇదే సరైన సమయమని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వ్యాఖ్యానించారు. నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం కానున్న కేబినెట్ కశ్మీర్‌పై ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని విశ్వసనీయ వర్గాలుచెప్పాయి. కలసికట్టుగా పోరాడుతాం: అఖిలపక్షం కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆందోళనల నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధినేత ఫరూక్ అబ్దుల్లా ఇంటిలో ఆదివారం అఖిలపక్ష భేటీ జరిగింది. మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అధ్యక్షతన ఈ సమావేశానికి కాంగ్రెస్, పీడీపీ, పీపుల్స్ కాన్ఫరెన్స్, జేఅండ్‌కే మూవ్మెంట్, ఎన్సీ, సీపీఎం నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అనిశ్చితిని రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీలకు వివరించేందుకు వీలుగా ఓ ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి పంపాలని నేతలు నిర్ణయించారు. ఈ విషయమై ఫరూక్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ..‘జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగ నిబంధనల్ని కాపాడేందుకు, రాష్ట్రాన్ని ముక్కలుగా చేయాలన్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు కలసికట్టుగా పోరాడాలని అఖిలపక్ష భేటీలో నిర్ణయించాం. ఆర్టికల్ 35 ఏ, ఆర్టికల్ 370లను రాజ్యాంగవిరుద్ధంగా రద్దుచేయడమంటే జమ్మూ, కశ్మీర్, లడఖ్ ప్రజలపై దాడిచేయడమే. ఈ విషయంలో పరిస్థితులు మరింత దిగజారేలా వ్యవహరించవద్దని భారత్, పాకిస్తాన్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని కోరుతున్నాం’ అని చెప్పారు. మరోవైపు పీడీపీ అధినేత్రి, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీకి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) నోటీసులు జారీచేసింది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జమ్మూకశ్మీర్ బ్యాంకులో ఉద్యోగాల కోసం ఎవరి పేరునైనా మౌఖికంగా లేదా ఇతర మార్గాల్లో సిఫార్సు చేశారో, లేదో చెప్పాలని కోరింది. దీంతో ప్రజల్ని ఏకంచేయకుండా ప్రధాన రాజకీయ నేతల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారనీ, ఇలాంటి ప్రయత్నాలు ఫలించబోవని ముఫ్తీ స్పష్టంచేశారు. మరోవైపు రాష్ట్రంలో కర్ఫ్యూ విధించనున్న నేపథ్యంలో మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు ఇంట్లోంచి బయటకు రాకూడదని పోలీసులు ఆదేశించారు. కాంగ్రెస్ నేత ఉస్మాన్ మాజిద్, సీపీఎం ఎమ్మెల్యే ఎంవై తరిగామిలను అరెస్ట్ చేశారు. జమ్మూలోనూ బలగాల మోహరింపు.. జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాల మోహరింపుతో ఏర్పడిన అనిశ్చితి కొనసాగుతోంది. ఉగ్రముప్పు నేపథ్యంలో కశ్మీర్‌లోని ఆర్మీ స్థావరాలు, పోలీస్ ప్రధాన కార్యాలయం, విమానాశ్రయాలు, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను ఆదివారం కట్టుదిట్టం చేశారు. అలాగే జమ్మూలోని పూంఛ్, రాజౌరీ, దొడ, కిష్త్వర్ జిల్లాల్లో ముందు జాగ్రత్తగా బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను భారీగా మోహరించారు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, జమ్మూకశ్మీర్ క్రికెట్ జట్టు కోచ్ ఇర్ఫాన్ పఠాన్‌ను రాష్ట్రం విడిచిపెట్టి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. కశ్మీర్లో పరిస్థితులు మరింత దిగజారవచ్చన్న భయంతో స్థానికులు నిత్యావసర సరుకులు, పెట్రోల్ కొనేందుకు షాపుల ముందు భారీ సంఖ్యలో బారులుతీరారు. మరోవైపు పుల్వామా తరహాలో ఉగ్రవాదులు వాహనాలతో ఆత్మాహుతిదాడికి పాల్పడకుండా ఉండేందుకు భద్రతాబలగాలు రోడ్లపై చాలాచోట్ల బారికేడ్లను ఏర్పాటుచేశాయి. యాజమాన్యం ఆదేశాలతో నిట్–శ్రీనగర్ విద్యార్థులు స్వస్థలాలకు బయలుదేరారు. అమిత్ షా–దోవల్ కీలక భేటీ.. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కశ్మీర్లో నెలకొన్న అనిశ్చితి, భారత్‌లో చొరబాటుకు యత్నించిన 5–7 మంది పాక్ బ్యాట్ కమాండోలను ఆర్మీ హతమార్చడం తదితర అంశాలపై దాదాపు గంటపాటు చర్చలుజరిపారు. మరోవైపు జమ్మూ, ఉధమ్‌పూర్, కర్తా ప్రాంతాల నుంచి బయలుదేరే రైళ్లలో రాబోయే 48 గంటలపాటు టికెట్ల తనిఖీ చేయబోమని రైల్వేశాఖ ప్రకటించింది. భారీ సంఖ్యలో ఉన్న అమర్నాథ్ యాత్రికులు రిజర్వేషన్ లేకపోయినా ఇబ్బంది లేకుండా రాష్ట్రాన్ని వీడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అధికారులు, వైద్య సిబ్బంది సెలవులపై వెళ్లరాదనీ, ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయరాదని కార్గిల్ కలెక్టర్ ఆదేశించారు. దీటుగా బదులిస్తాం: పాక్ భారత్ ఎలాంటి దుస్సాహసానికి, దురాక్రమణకు పాల్పడినా దీటుగా బదులిస్తామని పాకిస్తాన్ హెచ్చరించింది. కశ్మీరీలకు తమ దౌత్య, నైతిక, రాజకీయ మద్దతును కొనసాగిస్తామని ప్రకటించింది. ఇస్లామాబాద్‌లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన ఆదివారం జరిగిన జాతీయ భద్రతా కమిటీ సమావేశానికి రక్షణ మంత్రి పర్వేజ్ ఖట్టక్, విదేశాంగమంత్రి ఖురేషీ, త్రివిధ దళాధిపతులు, ఐఎస్ఐ చీఫ్ జనరల్ ఫైజ్ హమీద్ హాజరయ్యారు. ఈ భేటీ అనంతరం పాక్ స్పందిస్తూ..‘భారత్ చర్యల కారణంగా ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతికి విఘాతం కలుగుతుంది. కశ్మీర్ అన్నది సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యే. కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దీన్ని పరిష్కరించాలని భారత్‌ను కోరుతున్నాం. తాజాగా బలగాల మోహరింపుతో కశ్మీర్లో పరిస్థితి అగ్నికి ఆజ్యం పోసినట్లే అవుతుంది’ అని హెచ్చరించింది. ట్రంప్ కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధమని చెప్పారనీ, అందుకు ఇదే సరైన సమయమని వ్యాఖ్యానించారు. జమ్మూలో హైదరాబాద్ రైలు ఎక్కుతున్న విద్యార్థులు -
జమిలి ఎన్నికలకు నవీన్ పట్నాయక్ సమర్ధన
సాక్షి, న్యూఢిల్లీ : జమిలి ఎన్నికలను తాము సమర్ధిస్తామని ఒడిసా సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ తేల్చిచెప్పారు. ఒక దేశం..ఒకే ఎన్నికలు అనే నినాదానికి తమ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఏకకాల ఎన్నికలు సహా పలు కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాగా ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జేడీయూకు చెందిన నితీష్ కుమార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్ధుల్లా, పీడీపీ చీఫ్ మెహబుబా ముఫ్తీ, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ తదితరులు హాజరయ్యారు. జమిలి ఎన్నికలతో పాటు, 2022లో దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు, మహాత్మ గాంధీ 150వ జయంతోత్సవాల నిర్వహణ సహా పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. -
అఖిలపక్ష భేటీకి వైఎస్ జగన్మోహన్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ : జమిలి ఎన్నికలతో పాటు పలు కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం పార్లమెంట్లో జరగనున్న అన్ని పార్టీల అధినేతల సమావేశంలో వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటారు. బుధవారం ఉదయం ఢిల్లీ వెళుతున్న వైఎస్ జగన్ మధ్యాహ్నం 3 గంటలకు పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్‌లో జరిగే ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఇక టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ ఈ సమావేశానికి హాజరవుతారు. దేశంలోని అన్ని చట్ట సభలకు (పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలకు) ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, 2022లో 75వ దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, ఈ ఏడాది జరిగే మహాత్మ గాంధీ 150వ జయంతి వేడుకల నిర్వహణ వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారని ఆయా పార్టీల అధినేతలకు రాసిన లేఖలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద జోషి పేర్కొన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడును కూడా ఈ సమావేశానికి ఆహ్వానిస్తూ మంత్రి ప్రహ్లాద జోషికి లేఖ రాశారు. -
శ్రీలంకలో అఖిలపక్ష భేటీ విఫలం
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం నిష్ప్రయోజనంగా ముగిసింది. ఈ సమావేశానికి మాజీ ప్రధాని రణిల్ విక్రమసింఘేతో పాటు మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స హాజరయ్యారు. కాగా, ఈ భేటీని పార్లమెంటు స్పీకర్ జయసూర్యతో పాటు పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ పార్టీ బహిష్కరించాయి. ఈ సమస్యను సృష్టించిన సిరిసేనే దీన్ని పరిష్కరించాలనీ, ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని జేవీపీ స్పష్టం చేసింది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అవసరమైతే మరోసారి పార్లమెంటును సమావేశపర్చాలని కోరగా అధ్యక్షుడు స్పందించలేదు. -
నేటి నుంచి శబరిమలలో పూజలు
తిరువనంతపురం: తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య శబరిమల ఆలయంలో నేటి సాయంత్రం నుంచి పూజలు ప్రారంభం కానున్నాయి. అన్ని వయసుల మహిళలను అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆలయం తెరుచుకోవడం ఇది మూడోసారి. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్ష భేటీ విఫలమైంది. కోర్టు ఆదేశాలను అమలు చేయడమే తమ కర్తవ్యమని గట్టిగా చెబుతున్న సీఎం విజయన్.. ప్రత్యేకంగా కొన్ని రోజులు 50 ఏళ్ల లోపు మహిళలను దర్శనానికి అనుమతించాలని యోచిస్తున్నామన్నారు. అయితే, రివ్యూ పిటిషన్లు సుప్రీం ముందుకు విచారణకు వచ్చే జనవరి 22 వరకు ఉత్తర్వుల అమలును ఆపాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను సీఎం ఆమోదించకపోవడంపై కాంగ్రెస్, బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయ్యప్ప దర్శనానికి వస్తున్న తనకు రక్షణ కల్పించాలని రాసిన లేఖకు కేరళ ప్రభుత్వం స్పందించలేదని హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్ తెలిపారు. అఖిలపక్షంలో ఏకాభిప్రాయం కరువు శబరిమల ఆలయంలోకి రుతుస్రావం వయస్సులో ఉన్న మహిళలను కూడా అనుమతించాలన్న సెప్టెంబర్ 28వ తేదీ నాటి సుప్రీంకోర్టు తీర్పు తరువాత ఇప్పటి వరకు రెండుసార్లు ఆలయాన్ని తెరవగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలతోపాటు 16 నుంచి ప్రారంభమై రెండు నెలలపాటు కొనసాగే ‘మండల మకరవిలక్కు’ పూజల కోసం ఆలయాన్ని తెరవనుండటంతో కేరళ ప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దాదాపు మూడు గంటలపాటు సాగిన ఈ సమావేశం బీజేపీ, కాంగ్రెస్‌ల వాకౌట్‌తో ఎలాంటి పరిష్కారం చూపకుండానే ముగిసింది. మహిళల ప్రవేశానికి మేం వ్యతిరేకం అఖిలపక్షం అనంతరం ముఖ్యమంత్రి విజయన్.. పండాలం రాచకుటుంబం, శబరిమల ఆలయ ప్రధాన పూజారితో వేర్వేరుగా సమావేశమయ్యారు. పండాలం రాచకుటుంబం ప్రతినిధి శశికుమార్ వర్మ మాట్లాడుతూ.. సంప్రదాయానికి విరుద్ధంగా ఆలయంలోకి మహిళల ప్రవేశానికి మేం వ్యతిరేకం. ఈ విషయంలో మా వైఖరిలో ఎలాంటి మార్పులేదు’ అని ప్రకటించారు. అయితే, ప్రభుత్వ ప్రతిపాదనలపై తమ కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నామన్నారు. ప్రధాన పూజారి కందరారు రాజీవరు మాట్లాడుతూ..‘10 నుంచి 50 ఏళ్ల మహిళా భక్తులను శబరిమలకు రావద్దని మాత్రం వేడుకుంటున్నా’ అన్నారు. నేటి సాయంత్రం 5 గంటలకు... శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఇద్దరు ఆలయ ప్రధాన పూజారులు ఎంఎల్ వాసుదేవన్ నంబూద్రి, ఎంఎన్ నారాయణన్ నంబూద్రి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆలయ ద్వారాలను తెరుస్తారు. అయితే, రాత్రి 9 గంటల వరకే భక్తులను స్వామి దర్శనానికి అనుమతిస్తారు. నిషేధాజ్ఞలు అమల్లోకి.. గురువారం అర్ధరాత్రి నుంచి వారంపాటు ఆలయ పరిసరాల్లో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని రాష్ట్ర డీజీపీ లోక్‌నాథ్ బెహరా తెలిపారు. ‘గత సంఘటనలను దృష్టిలో ఉంచుకుని బేస్ క్యాంప్ నిలక్కల్ మొదలుకొని ఆలయ పరిసర ప్రాంతాల్లో బందోబస్తును రెట్టింపు చేశాం. లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున 15వేలకు పైగా సిబ్బందిని వినియోగిస్తున్నాం. రాత్రి ఆలయం మూసివేసిన తర్వాత సన్నిధానంలో ఉండేందుకు భక్తులను అనుమతించబోం’ అని అన్నారు. -
శబరిమల వివాదంపై అఖిలపక్ష భేటీ
తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో తలెత్తిన పరిస్థితిపై చర్చించేందుకు కేరళ ప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. సెప్టెంబర్ 28న ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసేందుకు సర్వోన్నత న్యాయస్ధానం నిరాకరిస్తూ రివ్యూ పిటిషన్లను జనవరి 22న విచారించాలని తీసుకున్న నిర్ణయంపై అఖిలపక్ష భేటీ లో చర్చించారు. సుప్రీం ఉత్తర్వులను అమలు చేసేందుకు కాలపరిమితి కోరాలని, అప్పటివరకూ శాంతిభద్రతలను సక్రమంగా నిర్వహించే బాధ్యత ప్రభుత్వం చేపట్టాలని విపక్షాలు సూచించాయి. మరోవైపు ఈనెల 17 నుంచి వార్షిక మండల దీక్ష సీజన్ ప్రారంభమవుతున్న క్రమంలో భక్తుల కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపైనా అఖిలపక్ష సమావేశంలో చర్చించారు. కాగా అక్టోబర్‌లో ఐదురోజులు, ఈనెల ఆరంభంలో రెండు రోజుల పాటు పూజల కోసం శబరిమల ఆలయం తెరిచిన క్రమంలో సుప్రీం ఉత్తర్వులపై భక్తుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా చెలరేగిన హింసాత్మక నిరసనలకు సంబంధించి ఇప్పటివరకూ 3700 మందిని అరెస్ట్ చేయగా, పలువురిపై 546 కేసులు నమోదయ్యాయి. ఇక శబరిమల దర్శనం కోసం కేరళ పోలీస్ వెబ్సైట్లో 500 మంది యువతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. -
కావేరి బోర్డుపై న్యాయ పోరాటం
సాక్షి బెంగళూరు: కావేరి నది నీటి నిర్వహణ బోర్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేయాలని కర్ణాటక సర్కారు నిర్ణయించింది. సీఎం కుమారస్వామి ఆధ్వర్యంలో శనివారం విధానసౌధలో జరిగిన అఖిలపక్ష భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జూలై 2న జరిగే బోర్డు సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఇద్దరు సీనియర్ అధికారులు కర్ణాటక తరఫు వాదనలు వినిపించాలని తీర్మానించారు. అన్ని పార్టీల ఎంపీలు ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలని నిర్ణయించారు. సమావేశంలో అన్ని పార్టీల నేతలతో పాటు కేంద్రమంత్రులు సదానందగౌడ, అనంత్‌కుమార్ పాల్గొన్నారు. భేటీ అనంతరం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డీకే శివకుమార్ మాట్లాడారు. ‘కావేరీ నిర్వహణ ప్రాధికార సంస్థ, నియంత్రణ కమిటీలను కేంద్రం ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో బోర్డును హడావుడిగా నియమించాల్సిన అవసరం లేదని మాత్రమే మేం చెబుతున్నాం’ అని పేర్కొన్నారు. జూలై 2న జరిగే బోర్డు సమావేశంలో కర్ణాటక ప్రతినిధులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ వాదనలను, రైతుల నీటి కష్టాలను వివరిస్తారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై తమ న్యాయ నిపుణులు మోహన్ కటార్కి, ఫాలి నారిమన్, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తారని వెల్లడించారు. ఈ భేటీలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప పాల్గొన్నారు. -
నేటి నుంచే బడ్జెట్ సమరం
న్యూఢిల్లీ: నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం కోసం సాధ్యమైనంత కృషి చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ అంశంపై ఏకాభిప్రాయం కోసం వివిధ పార్టీలతో చర్చిస్తామంది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆదివారం పార్లమెంట్ హౌస్‌లో ప్రభుత్వం అఖిల పక్ష భేటీ నిర్వహించింది. బడ్జెట్ సమావేశాలు విజయవంతమయ్యేలా ప్రతిపక్షాలు సహకరించాలని అన్ని పార్టీలను కోరింది. సమావేశంలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, అనంత కుమార్, కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, మల్లికార్జున్ ఖర్గే, సింధియా, ములాయం సింగ్ యాదవ్ (సమాజ్‌వాదీ), డి.రాజా(సీపీఐ), కనిమొళి(డీఎంకే), డెరెక్ ఒబ్రియాన్(తృణ మూల్), తారిక్ అన్వర్ (ఎన్సీపీ) తదితరులు పాల్గొన్నారు. భేటీ అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ మాట్లాడుతూ.. ‘సమావేశం ఫలవంతంగా సాగింది. బడ్జెట్ సమావేశాల్ని విజయవంతం చేయాలని అన్ని పార్టీల నేతలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. పార్టీలు లేవనెత్తిన అంశాలకు ప్రాధాన్యమిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అదే సమయంలో నిర్మాణాత్మక చర్చ జరిగేలా సహకరించాలని ప్రధాని కోరారు. రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదానికి వీలైనంత మేర ప్రయత్నిస్తాం. అన్ని పార్టీల ఏకాభిప్రాయంతో జీఎస్టీ ఆమోదం పొందినట్లే.. ట్రిపుల్ తలాక్ బిల్లు కూడా ఆమోదం పొందుతుంది’ అని చెప్పారు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌పై ప్రశ్నించగా.. ‘బిల్లు ఇప్పుడు రాజ్యసభ ఆస్తి. సభే నిర్ణయం తీసుకుంటుంది’ అని సమాధానమిచ్చారు. పార్లమెంటరీ కమిటీల వ్యవస్థను బలోపేతం చేయాలని, జాతీయ ప్రాధాన్యత ఉన్న అంశాలపై స్టాండింగ్ కమిటీలు వాస్తవిక పరిష్కారాలు సూచించాలని పార్టీలకు ప్రధాని సూచించారు. సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీల నేతలతో స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆదివారం రాత్రి విందు సమావేశం ఏర్పాటు చేశారు. సభలో సహకారం ఉంటుందని నేతలు హామీ ఇచ్చారని ఆమె తెలిపారు. అత్యాచారాలు, వర్తకుల దుస్థితిపై నిలదీస్తాం మరోవైపు పార్లమెంట్ సమావేశాల్లో పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షం సిద్ధమైంది. అత్యాచార సంఘటనలు, మహిళలపై అకృత్యాలు, రాజ్యాంగ సంస్థలపై దాడులు, వర్తకుల దుస్థితితో పాటు ఉత్తర ప్రదేశ్‌లో మత ఘర్షణలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ చెప్పారు. ఈ అంశాల్ని లేవనెత్తేందుకు ప్రభుత్వం అనుమతించాలని, సభలో సహకార ధోరణితో వ్యవహరించాలని ఆయన కోరారు. పార్లమెంటులో వ్యవహరించాల్సిన తీరుపై వ్యూహరచన కోసం ప్రతిపక్ష పార్టీల నేతలు నేడు సమావేశం కానున్నారు. ఇక అదే ఎజెండాతో ఈ రోజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యనిర్వాహక వర్గ భేటీ కూడా జరగనుంది. ఫిబ్రవరి 9 వరకూ తొలి దశ సమావేశాలు బడ్జెట్ సమావేశాల తొలిరోజైన నేడు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. అనంతరం ప్రభుత్వం పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెడుతుంది. ఎన్డీఏ సర్కారు చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న జైట్లీ పార్లమెంటులో ప్రవేశ పెడతారు. తొలిదశ సమావేశాలు ఫిబ్రవరి 9తో ముగుస్తాయి. మార్చి 5 నుంచి ఏప్రిల్ 6 వరకూ మలిదశ సమావేశాలు జరుగుతాయి. -
జోనల్ వ్యవస్థపై అఖిలపక్షం
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు, యువకుల జీవితాలను ప్రభావితం చేసే జోనల్ వ్యవస్థపై ప్రభుత్వం ఇష్టానుసారం ప్రకటనలు చేయకుండా, తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం సీఎం కేసీఆర్‌కు ఒక బహిరంగ లేఖ రాశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో రాష్ట్రంలో జోన్లు కూడా పెంచాలని గతంలో పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు సూచించినా పెడచెవిన పెట్టి జోనల్ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. ఎంతో సున్నితమైన ఈ అంశంపై ఆచితూచి వ్యవహరించాలని సూచించారు. -
‘ప్రత్యేక హోదాపై ఆయనే చెప్పాలి’
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఎందుకు ఇవ్వడం లేదో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడే చెప్పాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు ఇవ్వమని తాము అడిగితే వెంకయ్య పదేళ్లు కావాలని అడిగిన విషయాన్ని ఏచూరి గుర్తు చేశారు. అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అసెంబ్లీ సీట్ల పెంపు మీద ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు లేదని తెలిపారున ఇప్పటికే రాజ్యసభలో 10, లోక్‌సభలో 8 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. రైతులకు మద్దతు ధర దొరికితే ఆత్మహత్యలు ఆగుతాయని అభిప్రాయపడ్డారు. జీఎస్టీ అమలు, ఇబ్బందులపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాలని నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజనపై కొన్ని అంశాలు చర్చించాల్సివుందని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత నియోజకవర్గాల పెంపుపై చర్చిస్తామని చెప్పారు. -
‘జోనల్ విధానంపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి’
హైదరాబాద్: తెలంగాణలో జోనల్ వ్యవస్థ విధి విధానాలపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన వారిని పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయి కేడర్లుగా నిర్ధారించిందని, దీంతో నిరుద్యోగులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో నోటిఫికేషన్లు కూడా నిలిచిపోయాయన్నారు. ఈ మేరకు చాడ బుధవారం సీఎం కేసీఆర్‌కు ఒక లేఖ రాశారు. జిల్లాల పునర్విభజన సందర్భంగా ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలోనే జోనల్ వ్యవస్థ అమలుపై సందేహాలు వ్యక్తం చేశామని, ఎలాంటి పరిణామాలకు ఇది దారి తీస్తుందో కూడా వివరించామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నిరుద్యోగ యవతకు జరుగుతున్న వివక్ష, అన్యాయాలపై రాజకీయ పోరాటాలు జరిగిన కారణంగానే పార్లమెంటులో 371-డి సవరణల ద్వారా తెలంగాణను 5, 6 జోన్లుగా విభజించారని పేర్కొన్నారు. పూర్వాపరాలను పట్టించుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా జోనల్ వ్యవస్థను రద్దు చేసిందన్నారు. ఇంకా ఎలాంటి జాప్యం చేయకుండా తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి విధివిధానాలు రూపొందించాలని ఆ లేఖలో కోరారు. -
ఎస్సీ వర్గీకరణ: ప్రధాని వద్దకు అఖిలపక్షం
ఎస్సీ వర్గీకరణను కేంద్ర ప్రభుత్వం తక్షణం చేపట్టాలని కోరుతూ అఖిలపక్ష బృందాన్ని ప్రధానమంత్రి వద్దకు తీసుకెళ్లేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం ఈనెల 6వ తేదీన ఆయన ప్రధాని నరేంద్రమోదీ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలంటూ తెలంగాణ అసెంబ్లీలో ఇప్పటికే తీర్మానం చేశామని, వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది కాబట్టి కేంద్రాన్ని కూడా ఈ విషయమై వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా కోరాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రధాని అపాయింట్మెంట్ దొరకడంతో.. కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, టీడీపీ, ఎంఐఎం నేతలకు ఆయన లేఖలు రాశారు. ఈనెల ఐదో తేదీకల్లా ఆయా పార్టీల నాయకులు ఢిల్లీలో అందుబాటులో ఉండాలని ఆ లేఖలో కోరారు. ఐదో తేదీన ఢిల్లీ వెళ్తున్న కేసీఆర్.. అక్కడ విస్తృతంగా పలువురితో భేటీ అవుతారు. కాగా ఎస్సీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని, ఇందుకోసం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తామని గతంలోనే కేసీఆర్ ప్రకటించారు. ఇప్పుడు దానికి అనుగుణంగానే ఆయన ప్రధాని అపాయింట్మెంట్ తీసుకుని మరీ అందరినీ తీసుకెళ్తున్నారు. ప్రధానితో సమావేశమైనప్పుడు.. అసెంబ్లీలో చేసిన ఏకగ్రీవ తీర్మానం కాపీని కూడా ఆయనకు ఇవ్వాలని నిర్ణయించారు.