భేటీలో పాల్గొన్న రాహుల్ గాం«దీ, మల్లికార్జున ఖర్గే, నితీశ్, లాలూ యాదవ్
పట్నా: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీ గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు ఏకం కావడంలో అడుగు ముందుకు పడింది. బిహార్ రాజధాని పట్నాలో శుక్రవారం జరిగిన విపక్షాల మెగా సమావేశం కొంతమేరకు సత్ఫలితాలనిచ్చింది. పార్టీల మధ్యనున్న విభేదాలను పక్కన పెట్టి లోక్‌సభ ఎన్నికల్లో 17 పార్టీలు కలసికట్టుగా పోటీ చేయడానికి అంగీకరించాయి. ఎన్నికల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాన్ని రచించడానికి వచ్చే నెల సిమ్లాలో మరోసారి సమావేశం కావాలని విపక్ష పార్టీలు నిర్ణయించాయి.
జూలై 10 లేదా 12వ తేదీన సిమ్లాలో ఈ సమావేశం ఉండవచ్చని సమాచారం. దాదాపుగా 4 గంటల సేపు సమావేశమైన చర్చించిన ప్రతిపక్ష పార్టీల నాయకులందరూ ఐక్యంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విపక్ష పార్టీల సమావేశానికి ఆతిథ్యమిచ్చిన బిహార్ సీఎం నితీశ్ మాట్లాడుతూ.. ‘‘సమావేశం బాగా జరిగింది. చాలా మంది నేతలు తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఎన్నికల్లో కలిసి పని చెయ్యడానికి ఒక అంగీకారానికి వచ్చారు’’ అని చెప్పారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. ఎన్నికల వ్యూహం, సీట్ల సర్దుబాటు వంటి అంశాలను త్వరలో నిర్ణయిస్తామని చెప్పారు. మీడియా సమావేశానికి ఢిల్లీ సీఎం కేజ్రివాల్, తమిళనాడు సీఎం స్టాలిన్ గైర్హాజరయ్యారు. అయితే వారికి ఫ్లైట్ టైమ్ అయిపోవడంతోనే వెళ్లిపోయారని నితీశ్ సమర్థించుకున్నారు.
కాంగ్రెస్ ఆప్ మధ్య ఆర్డినెన్స్ చిచ్చు
ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి లోక్‌సభ ఎన్నికల్ని ఎదుర్కొంటాయని బయటకి చెబుతున్నప్పటికీ సమావేశంలో కాంగ్రెస్, ఆప్ మధ్య మాటల యుద్ధం జరిగిందని తెలుస్తోంది. ఢిల్లీలో అధికారులపై నియంత్రణకు కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తమకు కాంగ్రెస్ మద్దతుగా ఉంటేనే కలిసి ముందుకు నడుస్తామని పట్టుపట్టారు. దీనిపై సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మౌనం వహించడం కేజ్రీవాల్‌కు మింగుడు పడలేదు. విపక్షాల సమావేశానంతరం ఆప్ ఒక ప్రకటనలో కాంగ్రెస్‌తో తాము కలిసి ముందుకు వెళ్లడం కష్టమంటూ బాంబు పేల్చింది. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఆర్డినెన్స్ అంశం పార్లమెంటులో తేలాల్సిందే కాబట్టి తాము అక్కడే తమ వైఖరి చెబుతామని, ఇతర వేదికలపై ఎందుకు వెల్లడించాలని ఆయన ప్రశ్నించారు.
‘‘జూలైలో సిమ్లాలో సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చిస్తాం. ఆ సమావేశంలో ఉమ్మడి ఎజెండా రూపొందించాలని నిర్ణయించాం. కేంద్రంలో అధికార బీజేపీని గద్దె దించడానికి ప్రతీ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక ప్రణాళిక రూపొందిస్తాం’’
– మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
‘‘వచ్చే ఎన్నికల్లో జరిగేది సిద్ధాంతాల మధ్య యుద్ధం. పార్టీల మధ్య కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ కలసికట్టుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించాం. మా సిద్ధాంతాలను పరిరక్షించుకుంటూనే ఉమ్మడిగా పని చేస్తాం’’
– రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకుడు
‘‘బీజేపీని గద్దె దింపడానికి పట్నాలో మొదలైన ఈ కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంటుంది. మేమంతా ఒక్కటిగా ఉన్నాం. బీజేపీపై ఐక్యంగా పోరాడుతాం. ఈ నియంత ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే భవిష్యత్‌లో ఎన్నికలు ఉండవు. బీజేపీ చరిత్ర మార్చాలని అనుకుంటోంది. మేము చరిత్రను కాపాడతాం’’
– మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి
‘‘మా ఐక్య ఫ్రంట్‌కు ప్రజా దీవెనలు కచ్చితంగా లభిస్తాయి.’’
– శరద్ పవార్, ఎన్‌సీపీ అధినేత
‘‘పట్నా సమావేశం విస్పష్టమైన సందేశాన్నిచ్చింది. మేమంతా ఐక్యంగా పనిచేసి దేశాన్ని కాపాడతాం’’
– అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత
‘‘మేమంతా కలసికట్టుగా పోరాడతాం. విపక్షాలన్నీ చేతులు కలపకపోతే ఓట్లు చీలిపోతాయన్న ఆందోళన అందరిలోనూ ఉంది. భజరంగ భళి మాతో ఉన్నారు’’
– లాలూప్రసాద్ యాదవ్, ఆర్‌జేడీ అధినేత
Comments
Please login to add a commentAdd a comment