
తిరువనంతపురం: తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య శబరిమల ఆలయంలో నేటి సాయంత్రం నుంచి పూజలు ప్రారంభం కానున్నాయి. అన్ని వయసుల మహిళలను అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆలయం తెరుచుకోవడం ఇది మూడోసారి. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్ష భేటీ విఫలమైంది. కోర్టు ఆదేశాలను అమలు చేయడమే తమ కర్తవ్యమని గట్టిగా చెబుతున్న సీఎం విజయన్.. ప్రత్యేకంగా కొన్ని రోజులు 50 ఏళ్ల లోపు మహిళలను దర్శనానికి అనుమతించాలని యోచిస్తున్నామన్నారు. అయితే, రివ్యూ పిటిషన్లు సుప్రీం ముందుకు విచారణకు వచ్చే జనవరి 22 వరకు ఉత్తర్వుల అమలును ఆపాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను సీఎం ఆమోదించకపోవడంపై కాంగ్రెస్, బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయ్యప్ప దర్శనానికి వస్తున్న తనకు రక్షణ కల్పించాలని రాసిన లేఖకు కేరళ ప్రభుత్వం స్పందించలేదని హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్ తెలిపారు.
అఖిలపక్షంలో ఏకాభిప్రాయం కరువు
శబరిమల ఆలయంలోకి రుతుస్రావం వయస్సులో ఉన్న మహిళలను కూడా అనుమతించాలన్న సెప్టెంబర్ 28వ తేదీ నాటి సుప్రీంకోర్టు తీర్పు తరువాత ఇప్పటి వరకు రెండుసార్లు ఆలయాన్ని తెరవగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలతోపాటు 16 నుంచి ప్రారంభమై రెండు నెలలపాటు కొనసాగే ‘మండల మకరవిలక్కు’ పూజల కోసం ఆలయాన్ని తెరవనుండటంతో కేరళ ప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దాదాపు మూడు గంటలపాటు సాగిన ఈ సమావేశం బీజేపీ, కాంగ్రెస్‌ల వాకౌట్‌తో ఎలాంటి పరిష్కారం చూపకుండానే ముగిసింది.
మహిళల ప్రవేశానికి మేం వ్యతిరేకం
అఖిలపక్షం అనంతరం ముఖ్యమంత్రి విజయన్.. పండాలం రాచకుటుంబం, శబరిమల ఆలయ ప్రధాన పూజారితో వేర్వేరుగా సమావేశమయ్యారు. పండాలం రాచకుటుంబం ప్రతినిధి శశికుమార్ వర్మ మాట్లాడుతూ.. సంప్రదాయానికి విరుద్ధంగా ఆలయంలోకి మహిళల ప్రవేశానికి మేం వ్యతిరేకం. ఈ విషయంలో మా వైఖరిలో ఎలాంటి మార్పులేదు’ అని ప్రకటించారు. అయితే, ప్రభుత్వ ప్రతిపాదనలపై తమ కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నామన్నారు. ప్రధాన పూజారి కందరారు రాజీవరు మాట్లాడుతూ..‘10 నుంచి 50 ఏళ్ల మహిళా భక్తులను శబరిమలకు రావద్దని మాత్రం వేడుకుంటున్నా’ అన్నారు.
నేటి సాయంత్రం 5 గంటలకు...
శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఇద్దరు ఆలయ ప్రధాన పూజారులు ఎంఎల్ వాసుదేవన్ నంబూద్రి, ఎంఎన్ నారాయణన్ నంబూద్రి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆలయ ద్వారాలను తెరుస్తారు. అయితే, రాత్రి 9 గంటల వరకే భక్తులను స్వామి దర్శనానికి అనుమతిస్తారు.
నిషేధాజ్ఞలు అమల్లోకి..
గురువారం అర్ధరాత్రి నుంచి వారంపాటు ఆలయ పరిసరాల్లో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని రాష్ట్ర డీజీపీ లోక్‌నాథ్ బెహరా తెలిపారు. ‘గత సంఘటనలను దృష్టిలో ఉంచుకుని బేస్ క్యాంప్ నిలక్కల్ మొదలుకొని ఆలయ పరిసర ప్రాంతాల్లో బందోబస్తును రెట్టింపు చేశాం. లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున 15వేలకు పైగా సిబ్బందిని వినియోగిస్తున్నాం. రాత్రి ఆలయం మూసివేసిన తర్వాత సన్నిధానంలో ఉండేందుకు భక్తులను అనుమతించబోం’ అని అన్నారు.