shabarimala temole
-
శబరిమలకు పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్
తిరువనంతపురం: శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచేగాక కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు వెళుతున్నారు. భక్తుల సంఖ్య అధికంగా పెరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఎరుమేలికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే వాహనాలు నిలిచిపోయాయి. నేడు తెల్లవారుజాము నాలుగు గంటల నుంచే భక్తులు అవస్థలు పడుతున్నారు. ఎరుమేలి నుంచి శబరిమలకు పాదయాత్రగా వెళుతున్నారు. రోజుకు లక్ష మందికిపైగా భక్తులు శబరిమలకు రావడం వల్ల తీవ్ర రద్దీ ఏర్పడిందని కేరళ దేవాదాయశాఖ మంత్రి కె.రాధాకృష్ణన్ తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో సమస్యలు తలెత్తడం సాధారణమేనని వ్యాఖ్యానించారు. శబరిమలలో సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని స్పష్టంచేశారు. ప్రత్యేక రైళ్లు.. ఇదిలా ఉండగా.. అయ్యప్ప భక్తుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. శబరిమలకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 51 ప్రత్యేక రైళ్లను కేటాయించింది. ప్రత్యేక రైళ్లు.. డిసెంబర్, జనవరి నెలల్లో వివిధ తేదీల్లో శబరిమలకు చేరుకుంటాయి. ఇదీ చదవండి: ఉగ్రదాడిలో రిటైర్డ్ పోలీసు అధికారి మృతి -
లాక్డౌన్ : ఆ దేవాలయ నష్టం 200 కోట్లు
తిరువనంతపురం : లాక్‌డౌక్ కారణంగా దేశంలోని దేవాలయాలన్నీ మూసివేయబడ్డాయి. దీంతో ఆలయాలకు వచ్చే పెద్ద ఎత్తున విరాళాలు ఆగిపోయాయి. ఈ క్రమంలోనే కేరళలోని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోయింది. కరోనా నేపథ్యంలో గత రెండు నెలలుగా కేరళలోని దేవస్థానాల్లో పూజలు నిలిపివేశారు. ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు పరిధిలో ఉన్న దేవాలయాలు మూసివేయడం మూలంగా రూ. 200 కోట్లకుపైగా నష్టపోయామని బోర్డు అధ్యక్షుడు ఎన్ వాసు తెలిపారు. దీంతో దేవాలయాల పరిధిలో ఉన్న బంగారాన్ని, విరాళాలను బ్యాంకుల్లో తాకట్టుపెట్టి వడ్డీ తీసుకోవాలని బోర్డు నిర్ణయించినట్లు గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. బోర్డు తాజా నిర్ణయంపై కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ట్రావెన్కోర్ దేవస్థానం వారంలోపల పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. (టీటీడీ భూములు విక్రయించరాదని తీర్మానం) -
అట్టుడుకుతున్న కన్నూర్
కన్నూర్/తిరువనంతపురం/న్యూఢిల్లీ: కేరళలో రాజకీయంగా అత్యంత సున్నితమైన కన్నూర్‌తోపాటు పతనంథిట్ట, కోజికోడ్ జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీజేపీ, సీపీఎం నేతల ఇళ్లు, ఆస్తులపై బాంబు దాడులు జరిగాయి. శబరిమల ఆలయంలోకి 2వ తేదీన 50 ఏళ్లలోపు ఇద్దరు మహిళల ప్రవేశం అనంతరం రాష్ట్రంలో అల్లర్లు చెలరేగాయి. ఆలయ సంప్రదాయాలకు భంగం కలిగించడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలని సీఎం విజయన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. పలుచోట్ల బాంబు దాడులు సీపీఎం ఎమ్మెల్యే ఏఎన్ షంషీర్‌కు చెందిన మడపీడికయిల్‌లోని ఇంటిపై, వడియిల్ పీడికియలోని బీజేపీ నేత రాజ్యసభ సభ్యుడు వి. మురళీధరన్ పూర్వీకుల నివాసం, తలస్సేరిలోని సీపీఎం నేత పి.శశి ఇంటిపై శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నాటు బాంబులు విసిరారు. ఈ ఘటనలతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పొరుగునే ఉన్న కోజికోడ్ జిల్లా పెరంబ్రాతోపాటు శబరిమల ఆలయం ఉన్న పతనంథిట్ట జిల్లా మలప్పురం, ఆదూర్‌లలో శుక్రవారం అర్థరాత్రి, శనివారం వేకువజామున బీజేపీ, సీపీఎం కార్యకర్తలు పరస్పరం దాడులు, ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న అల్లర్లకు సంబంధించి 1,700 మందిని, కన్నూర్ జిల్లాలో హింసాత్మక ఘటనలకు సంబంధించి 260 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శబరిమల అంశాన్ని సున్నితంగా పరిష్కరించడానికి బదులు సీపీఎం ప్రభుత్వం రాజకీయ లబ్ది కోసం రాష్ట్రంలో హింసను ప్రేరేపిస్తోందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. అన్ని వర్గాల వారు చట్టాన్ని గౌరవించాలన్నదే తమ అభిమతమని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ప్రతినిధి ఫర్హాన్ హక్ అన్నారు. శబరిమల వివాదం కారణంగా కేరళలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుం టున్నందున అప్రమత్తంగా ఉండాలని బ్రిటన్ ప్రభుత్వం తమ పౌరులను హెచ్చరించింది. -
శబరిమలలో మళ్లీ ఉద్రిక్తత
సాక్షి, చెన్నై / పంబా: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం వద్ద మళ్లీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ ఎన్జీవో బృందంలోని రుతుస్రావ వయసు ఉన్న 11 మంది మహిళలను ఆందోళనకారులు ఆదివారం తరిమికొట్టారు. తమిళనాడుకు చెందిన మణిది అనే సంస్థ తరఫున ఈ మహిళలు అయ్యప్పను దర్శించుకునేందుకు తెల్లవారుజామున తమిళనాడు–కేరళ సరిహద్దు ద్వారా పంబాకు వచ్చారు. మార్గమధ్యంలో చాలామంది వీరి వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నించగా, పోలీసులు ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. అనంతరం ఆలయానికి వెళ్లేదారిలో వీరిని వందలాది మంది భక్తులు, ఆందోళనకారులు నిలువరించారు. ఈ సందర్భంగా స్వామి దర్శనానికి వెళితే ఉద్రిక్త పరిస్థితి తలెత్తే అవకాశముందని పోలీసులు నచ్చజెప్పగా, అయ్యప్పను దర్శించుకున్నాకే వెనక్కి వెళతామని మణిది సభ్యులు స్పష్టం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా ఆరు గంటల పాటు రోడ్డుపై బైఠాయించారు. దీంతో చివరకు మణిది సభ్యులను కొండపైకి తీసుకెళ్లేందుకు పోలీసులు యత్నించగా, వందలాది మంది భక్తులు వెంటపడి తరిమికొట్టారు. రాళ్లవర్షం కురిపించారు. అప్రమత్తమైన అధికారులు మహిళా భక్తులను సమీపంలోని భద్రతాసిబ్బంది ఉండే గదిలోకి తీసుకెళ్లారు. పరిస్థితి చేయిదాటడంతో వీరంతా అయ్యప్పను దర్శించుకోకుండానే వెనక్కు వెళ్లేందుకు అంగీకరించారు. దీంతో ఈ 11 మంది మహిళల్ని గట్టి భద్రత నడుమ సరిహద్దు దాటించారు. ఈ విషయమై మణిది సంస్థ సమన్వయకర్త సెల్వీ మాట్లాడుతూ..‘ఆందోళనల నేపథ్యంలో వెనక్కు వెళ్లాలని పోలీసులు చెబుతున్నారు. ఈ 11 మంది తొలి బృందం మాత్రమే. ఇంకా చాలామంది శబరిమలకు రాబోతున్నారు’అని చెప్పారు. అయ్యప్ప దర్శనానికి మహిళల్ని పోలీసులు తీసుకెళ్లేందుకు యత్నించడాన్ని బీజేపీ నేత కె.సురేంద్రన్ తప్పుపట్టారు. వీరి వెనుక ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. ఈ ఘటనను నిరసిస్తూ బీజేపీ, హిందుత్వ సంస్థల కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. -
నేటి నుంచి శబరిమలలో పూజలు
తిరువనంతపురం: తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య శబరిమల ఆలయంలో నేటి సాయంత్రం నుంచి పూజలు ప్రారంభం కానున్నాయి. అన్ని వయసుల మహిళలను అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆలయం తెరుచుకోవడం ఇది మూడోసారి. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్ష భేటీ విఫలమైంది. కోర్టు ఆదేశాలను అమలు చేయడమే తమ కర్తవ్యమని గట్టిగా చెబుతున్న సీఎం విజయన్.. ప్రత్యేకంగా కొన్ని రోజులు 50 ఏళ్ల లోపు మహిళలను దర్శనానికి అనుమతించాలని యోచిస్తున్నామన్నారు. అయితే, రివ్యూ పిటిషన్లు సుప్రీం ముందుకు విచారణకు వచ్చే జనవరి 22 వరకు ఉత్తర్వుల అమలును ఆపాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను సీఎం ఆమోదించకపోవడంపై కాంగ్రెస్, బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయ్యప్ప దర్శనానికి వస్తున్న తనకు రక్షణ కల్పించాలని రాసిన లేఖకు కేరళ ప్రభుత్వం స్పందించలేదని హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్ తెలిపారు. అఖిలపక్షంలో ఏకాభిప్రాయం కరువు శబరిమల ఆలయంలోకి రుతుస్రావం వయస్సులో ఉన్న మహిళలను కూడా అనుమతించాలన్న సెప్టెంబర్ 28వ తేదీ నాటి సుప్రీంకోర్టు తీర్పు తరువాత ఇప్పటి వరకు రెండుసార్లు ఆలయాన్ని తెరవగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలతోపాటు 16 నుంచి ప్రారంభమై రెండు నెలలపాటు కొనసాగే ‘మండల మకరవిలక్కు’ పూజల కోసం ఆలయాన్ని తెరవనుండటంతో కేరళ ప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దాదాపు మూడు గంటలపాటు సాగిన ఈ సమావేశం బీజేపీ, కాంగ్రెస్‌ల వాకౌట్‌తో ఎలాంటి పరిష్కారం చూపకుండానే ముగిసింది. మహిళల ప్రవేశానికి మేం వ్యతిరేకం అఖిలపక్షం అనంతరం ముఖ్యమంత్రి విజయన్.. పండాలం రాచకుటుంబం, శబరిమల ఆలయ ప్రధాన పూజారితో వేర్వేరుగా సమావేశమయ్యారు. పండాలం రాచకుటుంబం ప్రతినిధి శశికుమార్ వర్మ మాట్లాడుతూ.. సంప్రదాయానికి విరుద్ధంగా ఆలయంలోకి మహిళల ప్రవేశానికి మేం వ్యతిరేకం. ఈ విషయంలో మా వైఖరిలో ఎలాంటి మార్పులేదు’ అని ప్రకటించారు. అయితే, ప్రభుత్వ ప్రతిపాదనలపై తమ కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నామన్నారు. ప్రధాన పూజారి కందరారు రాజీవరు మాట్లాడుతూ..‘10 నుంచి 50 ఏళ్ల మహిళా భక్తులను శబరిమలకు రావద్దని మాత్రం వేడుకుంటున్నా’ అన్నారు. నేటి సాయంత్రం 5 గంటలకు... శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఇద్దరు ఆలయ ప్రధాన పూజారులు ఎంఎల్ వాసుదేవన్ నంబూద్రి, ఎంఎన్ నారాయణన్ నంబూద్రి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆలయ ద్వారాలను తెరుస్తారు. అయితే, రాత్రి 9 గంటల వరకే భక్తులను స్వామి దర్శనానికి అనుమతిస్తారు. నిషేధాజ్ఞలు అమల్లోకి.. గురువారం అర్ధరాత్రి నుంచి వారంపాటు ఆలయ పరిసరాల్లో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని రాష్ట్ర డీజీపీ లోక్‌నాథ్ బెహరా తెలిపారు. ‘గత సంఘటనలను దృష్టిలో ఉంచుకుని బేస్ క్యాంప్ నిలక్కల్ మొదలుకొని ఆలయ పరిసర ప్రాంతాల్లో బందోబస్తును రెట్టింపు చేశాం. లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున 15వేలకు పైగా సిబ్బందిని వినియోగిస్తున్నాం. రాత్రి ఆలయం మూసివేసిన తర్వాత సన్నిధానంలో ఉండేందుకు భక్తులను అనుమతించబోం’ అని అన్నారు. -
శబరిమల ప్రవేశానికి మరో మహిళ యత్నం
న్యూఢిల్లీ/పంబా: శబరిమలలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు సోమవారం మరో మహిళ విఫలయత్నం చేసింది. బిందు అనే దళిత మహిళా కార్యకర్త వినతి మేరకు పోలీసులు ఆమెను కేరళ ఆర్టీసీ బస్సులో పంబ వద్దకు తీసుకువచ్చారు. అయితే, అక్కడ పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైఠాయించిన బీజేపీ కార్యకర్తలు ఆమెను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఆమెను జీపులో ఎక్కించుకుని సురక్షిత ప్రాం తానికి తరలించారు. కాగా, సోమవారం రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసి వేయనున్న నేపథ్యంలో మరికొందరు మహిళలు ప్రవేశించేందుకు ప్రయత్నించవచ్చనే సమాచారంతో సుప్రీం తీర్పు మేరకు కేరళ సర్కారు ఆలయం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేపట్టింది. సుప్రీంకోర్టులో 19 రివ్యూ పిటిషన్లు శబరిమల తీర్పుపై దాఖలైన పలు రివ్యూ పిటిషన్ల విచారణ తేదీని నేడు సుప్రీంకోర్టు ఖరారు చేయనుంది. సన్నిధానంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ కేరళతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ సంఘాలు ఆందోళన లు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రివ్యూ పిటిషన్లను అత్యవసరమైనవిగా పరిగణించి విచారణ చేపట్టాలంటూ పిటిషన్ దాఖలైంది. -
సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన త్రిష
పెరంబూరు(తమిళనాడు): అయ్యప్పస్వామి దేవాలయంలో మహిళల ప్రవేశం గురించి సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. శబరిగిరీశుని దర్శనానికి మహిళలు అర్హులేనన్న ఆ తీర్పుపై ప్రజల్లో మిశ్రమ స్పందన వస్తున్న నేపథ్యంలో వివాదాస్పద అంశాల్లో ఎప్పుడూ ముందుండే నటి త్రిష తన నైజాన్ని మరోసారి ప్రదర్శించింది. ఈ మధ్య సహజీవనం సబబే అన్న కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పిన ఈ చెన్నై చిన్నది తాజాగా అయ్యప్పస్వామి ఆలయ ప్రవేశానికి మహిళలకు ఎలాంటి నిషేధం ఉండదని ప్రకటించిన సుప్రీంకోర్టు ఆదేశాలు స్త్రీలకు దక్కిన గౌరవం అని పేర్కొంది. ఇటీవల తను నటించిన 96 చిత్ర విలేకరుల సమావేశంలో పాల్గొన్న త్రిష మాట్లాడుతూ అయ్యప్పస్వామి ఆలయప్రవేశానికి మహిళలకు అనుమతినిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్ట్రీలకు దక్కిన గౌరవంగా పేర్కొంది. అయితే ఈ వ్యవహారం గురించి తనకు పూర్తిగా తెలియదు గానీ ఎవరినీ అడ్డుకోరాదని అంది. నటుడు విజయ్‌సేతుపతి కూడా ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. -
శబరిమలలో దర్శనమిచ్చిన మకర జ్యోతి
సాక్షి, శబరిమల : శబరిమలలో మకర జ్యోతి దర్శనమిచ్చింది. జ్యోతిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు శబరిమలకు తరలివచ్చారు. ఆదివారం సాయంత్రం 6.45 నుండి 7 గంటల మధ్యలో మకర జ్యోతిని దర్శించుకున్న భక్తజనం పులకించిపోయారు. జ్యోతి దర్శనం సమయంలో స్వామియే శరణమయ్యప్ప అంటూ శబరిమల క్షేత్రం మారుమోగింది. రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మకరజ్యోతి దర్శనం సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పులిమేఢు, నీలికాల్, పరియణా వట్టం, పంబా ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారి ఆలయానికి మరికొద్దిసేపట్లో ఆభరణాలు చేరుకోనున్నాయి. -
శబరిమలలో మహిళలపై నిషేధం రాజ్యాంగ విరుద్ధం
- స్పష్టత ఇవ్వాల్సిందిగా ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డును ఆదేశించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: ప్రఖ్యాత శబరిమల ఆలయంలోకి మహిళాభక్తులను అనుమతించకపోవటం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 'ఆలయంలోకి మహిళలను ఎందుకు అనుమతించడంలేదు? అనుమతి ఇస్తారా? లేదా? త్వరితగతిన స్పంష్టం చేయండి' అంటూ ఆలయ నిర్వాహకులైన ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డును కోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంపై కేరళ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలుచేయాలని కోర్టు పేర్కొంది. శబరిమలకు మహిళల నిరాకరణపై ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ దాఖలుచేసిన పిటిషన్ ను సోమవారం విచారించిన కోర్టు.. తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదావేసింది. గతంలో ఇదే సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసిన కేరళ హైకోర్టు.. మహిళల నిషేధాన్ని సమర్థించిన సంగతి తెలిసిందే. 10 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళలకు ఆలయప్రవేశం లేదన్న నిబంధన ఏళ్లుగా కొనసాగుతూవస్తోంది.