పంబా వద్ద రహదారిపై బైఠాయించిన మహిళలు
సాక్షి, చెన్నై / పంబా: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం వద్ద మళ్లీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ ఎన్జీవో బృందంలోని రుతుస్రావ వయసు ఉన్న 11 మంది మహిళలను ఆందోళనకారులు ఆదివారం తరిమికొట్టారు. తమిళనాడుకు చెందిన మణిది అనే సంస్థ తరఫున ఈ మహిళలు అయ్యప్పను దర్శించుకునేందుకు తెల్లవారుజామున తమిళనాడు–కేరళ సరిహద్దు ద్వారా పంబాకు వచ్చారు. మార్గమధ్యంలో చాలామంది వీరి వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నించగా, పోలీసులు ఆందోళనకారుల్ని చెదరగొట్టారు.
అనంతరం ఆలయానికి వెళ్లేదారిలో వీరిని వందలాది మంది భక్తులు, ఆందోళనకారులు నిలువరించారు. ఈ సందర్భంగా స్వామి దర్శనానికి వెళితే ఉద్రిక్త పరిస్థితి తలెత్తే అవకాశముందని పోలీసులు నచ్చజెప్పగా, అయ్యప్పను దర్శించుకున్నాకే వెనక్కి వెళతామని మణిది సభ్యులు స్పష్టం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా ఆరు గంటల పాటు రోడ్డుపై బైఠాయించారు. దీంతో చివరకు మణిది సభ్యులను కొండపైకి తీసుకెళ్లేందుకు పోలీసులు యత్నించగా, వందలాది మంది భక్తులు వెంటపడి తరిమికొట్టారు. రాళ్లవర్షం కురిపించారు. అప్రమత్తమైన అధికారులు మహిళా భక్తులను సమీపంలోని భద్రతాసిబ్బంది ఉండే గదిలోకి తీసుకెళ్లారు.
పరిస్థితి చేయిదాటడంతో వీరంతా అయ్యప్పను దర్శించుకోకుండానే వెనక్కు వెళ్లేందుకు అంగీకరించారు. దీంతో ఈ 11 మంది మహిళల్ని గట్టి భద్రత నడుమ సరిహద్దు దాటించారు. ఈ విషయమై మణిది సంస్థ సమన్వయకర్త సెల్వీ మాట్లాడుతూ..‘ఆందోళనల నేపథ్యంలో వెనక్కు వెళ్లాలని పోలీసులు చెబుతున్నారు. ఈ 11 మంది తొలి బృందం మాత్రమే. ఇంకా చాలామంది శబరిమలకు రాబోతున్నారు’అని చెప్పారు. అయ్యప్ప దర్శనానికి మహిళల్ని పోలీసులు తీసుకెళ్లేందుకు యత్నించడాన్ని బీజేపీ నేత కె.సురేంద్రన్ తప్పుపట్టారు. వీరి వెనుక ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. ఈ ఘటనను నిరసిస్తూ బీజేపీ, హిందుత్వ సంస్థల కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment