stones attacks
-
దానం నాగేందర్ వియ్యంకుడిపై దాడి
సాక్షి, బంజారాహిల్స్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వియ్యంకుడు అనిల్ కుమార్ కిషన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్ రోడ్ నెం. 15లో నివాసం ఉంటున్న ఎమ్మెల్యే నాగేందర్ వియ్యంకుడు అనిల్ కిషన్ సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో మీటింగ్ ముగించుకొని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ మీదుగా కళాంజలి నుంచి తన ఇంటికి కారులో వెళ్తున్నాడు. కళాంజలి షోరూం దాటగానే గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కారుపై వెనుక నుంచి రాళ్లతో దాడి చేశారు. వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్న ఆయన తన వియ్యంకుడు దానం నాగేందర్‌కు ఫోన్ చేశారు. అప్రమత్తమైన దానం జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నైట్ డ్యూటీలో ఉన్న ఎస్ఐ నాయుడు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. ఈఘటనలో కారు అద్దాలు పగిలి ఉన్నాయని, సీసీ ఫుటేజీలను పరిశీలించి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఘటనపై న్యాయసలహా అనంతరం కేసు నమోదు చేస్తామన్నారు. ఆయనకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అన్నదానిౖపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. -
కేంద్రంతో మమత ఢీ
కోల్‌కతా: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై జరిగిన దాడి ఘటన కేంద్రం, పశ్చిమబెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం మధ్య విభేదాలకు మరోసారి ఆజ్యం పోసింది. నడ్డా కాన్వాయ్‌పై అధికార టీఎంసీ కార్యకర్తలే దాడి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో గవర్నర్ ధన్కర్ కేంద్రానికి నివేదిక పంపారు. ఈ నివేదిక అందుకున్న హోం శాఖ..రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఈ నెల 14వ తేదీన స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ సీఎస్, డీజీపీలకు శుక్రవారం సమన్లు జారీ చేసింది. అయితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మొదట్నుంచీ తీవ్ర వ్యతిరేకత కనబరుస్తున్న మమతా బెనర్జీ ప్రభుత్వం.. ఈ నోటీసులకు స్పందించరాదని నిర్ణయించింది. బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ్ శుక్రవారం హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు ఈ మేరకు ఒక లేఖ రాశారు. శాంతిభద్రతలతోపాటు, జెడ్– కేటగిరీకి చెందిన కొందరిపై జరిగిన దాడిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా తీసుకుని చర్చించేందుకు 14వ తేదీన సమావేశం ఏర్పాటు చేసినందున వివరణ ఇచ్చేందుకు ఢిల్లీకి రాలేకపోతున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ విధంగా ఆయన.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు మాత్రమే లోబడి నడుచుకుంటానని పరోక్షంగా కేంద్రానికి తెలిపారు. డైమండ్ హార్బర్లో గురువారం జేపీ నడ్డా కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు చేసిన రాళ్లదాడిలో బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్‌వర్గీయ, ఆయన వాహన డ్రైవ ర్కు గాయాలు కాగా, వారి వాహన అద్దాలు ధ్వంసమైన విషయం తెలిసిందే. నిప్పుతో చెలగాటం వద్దు.. బెంగాల్ గవర్నర్ ధన్కర్ మరోసారి ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్రంగా మండిపడ్డారు. నిప్పుతో చెలగాటం వద్దంటూ హెచ్చరించారు. నడ్డా కాన్వాయ్‌పై దాడి ఘటనపై కేంద్రానికి నివేదిక పంపినట్లు వెల్లడించారు. దాడి ఘటనపై సీఎం స్పందించిన తీరు చూస్తే రాజ్యాంగం పట్ల ఆమెకు ఏమాత్రం విశ్వాసం ఉందో తెలుస్తుం దన్నారు. కోల్‌కతాలో గురువారం జరిగిన ర్యాలీలో మ మత..నడ్డా కాన్వాయ్‌పై దాడి ఘటనను బీజేపీ ఆడుతున్న నాటకంగా పేర్కొంటూ, నడ్డా పేరు ను పలు మార్లు వ్యంగ్యంగా ఉచ్చరించారు. ఈ విషయమై గవర్నర్ స్పందిస్తూ.. బెంగాలీ సంస్కృతి పట్ల గౌరవం ఉన్న వారెవరూ ఆమె మాదిరిగా మాట్లాడరని దుయ్యబట్టారు. -
నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి
డైమండ్ హార్బర్: పశ్చిమ బెంగాల్లో రెండు రోజుల పర్యటన కోసం వచ్చిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న డైమండ్ హార్బర్లో పట్టు పెంచుకోవడం కోసం నడ్డా రాష్ట్రానికి వచ్చారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనడానికి గురువారం ఉదయం డైమండ్ హార్బర్‌కి వెళుతుండగా మార్గం మధ్యలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులుగా అనుమానిస్తున్న కొందరు ఆయన కాన్వాయ్‌పై రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు. ఈ దాడిలో బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్‌వర్గీయ, ముకుల్ రాయ్ మరికొందరు నేతలు గాయపడ్డారు. ఇక కైలాస్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తూ నడ్డాకి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ దాడిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తృణమూల్ పాలనలో బెంగాల్ లో అరాచకత్వం రాజ్య మేలుతోం దన్నారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మరో వైపు ముఖ్యమంత్రి మమత ఇదంతా బీజేపీ ఆడుతున్న నాటకమని ఆరోపించారు. బీజేపీ శ్రేణులు తమపై తామే దాడులు చేసుకొని తృణమూల్ కాంగ్రెస్‌పై నేరాన్ని నెట్టేస్తున్నారని అన్నారు. సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ జవాన్లు చుట్టూ ఉండగా వారికెందుకు భయమని ప్రశ్నించారు. దుర్గమ్మ ఆశీస్సులున్నాయి: నడ్డా తన కాన్వాయ్‌పై జరిగిన దాడిని నడ్డా తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువ య్యాయని, గూండారాజ్ చేతుల్లోకి రాష్ట్రం వెళ్లి పోయిందని ధ్వజమెత్తారు. ఆ దుర్గమ్మ దయవల్లే తనకేమీ కాలేదని వ్యాఖ్యానించారు. ‘‘కాన్వాయ్‌పై జరిగిన దాడితో దిగ్భ్రాంతికి లోనయ్యాం. రాను రాను పశ్చిమ బెంగాల్లో అసహనం పెరిగిపోతోం ది. గూండాలు రాజ్యమేలుతున్నారు. భద్రత కల్పిం చడంలో అధికార యంత్రాంగం విఫలమైంది’’ అని కార్యకర్తల సమావేశంలో దుయ్యబట్టారు. గాయపడిన విజయ వర్గీయ, ఆయన కారు డ్రైవర్ దాడిలో పగిలిన కారు అద్దం -
ఇండో–చైనా సరిహద్దులో ఉద్రిక్తత
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తూర్పు లద్దాఖ్, ఉత్తర సిక్కింలోని నకూ లా పాస్ ప్రాంతాల్లో సరిహద్దుల వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో ఇరుదేశాలకు చెందిన సైనికులు గాయపడ్డారని భారత సైన్యాధికారులు ఆదివారం వెల్లడించారు. తొలి ఘటనలో.. మే 5న సాయంత్రం తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్ సరస్సు తీరం వెంబడి భారత్, చైనా దళాలకు చెందిన దాదాపు 200 మంది బాహాబాహీకి దిగడంతోపాటు, రెండు వైపులా ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. కొన్ని గంటల పాటు ఈ ఘర్షణ కొనసాగింది. చర్చల అనంతరం మర్నాడు ఉదయానికి అది ముగిసింది. ఈ గొడవలో ఇరుదేశాల సైనికులు గాయపడ్డారు. ఓ సమయంలో ఉద్రిక్తత పెరగడంతో రెండు దేశాలు మరిన్ని దళాలను ఆ ప్రాంతానికి తరలించాయి. ఈ ఘర్షణలో ఎంతమంది భారతీయ సైనికులు గాయపడ్డారనే వివరాలను అధికారులు ఇవ్వలేదు. మరో ఘటనలో.. సిక్కింలోని నకూ లా పాస్ వద్ద ఇరుదేశాలకు చెందిన సుమారు 150 మంది సైనికులు బాహాబాహీకి దిగి పిడిగుద్దులతో ఉద్రిక్త వాతావరణం సృష్టించారు. ఈ ఘటనలో 10 మంది భారతీయ సైనికులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. స్థానిక స్థాయి చర్చల అనంతరం ఇరువర్గాలు వెనక్కు తగ్గాయన్నారు. ‘సరిహద్దు సమస్య తేలకపోవడంతో ఇరు దేశాల సైనికుల మధ్య ఈ ప్రాంతాల్లో తాత్కాలిక, చిన్నస్థాయి ఘర్షణలు సాధారణమే. సిబ్బంది ఆవేశపూరిత మనస్తత్వం వల్ల కూడా ఘర్షణలు చోటు చేసుకుంటాయి. చిన్నపాటి గాయాలతో ముగుస్తాయి’ అని వివరించారు. భారత్, చైనాల మధ్య 2017లో డోక్లాం ట్రై జంక్షన్ వద్ద 73 రోజుల పాటు యుద్ధం స్థాయిలో ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వాస్తవ నియంత్రణ రేఖగా పేర్కొనే 3,488 కి.మీ. పొడవైన సరిహద్దుపై వివాదం కొనసాగుతోంది. ఐబీజీలు సిద్ధం : ఆర్మీ చీఫ్ ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ‘సమగ్ర యుద్ధ బృందాలు (ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్–ఐబీజీ)’ విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయని, కరోనా కారణంగా దీని అమలును కొంతకాలం వాయిదా వేశామని ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె తెలిపారు. యుద్ధ సామర్థ్యాలను పెంచుకునే దిశగా ప్రయోగాత్మకంగా పదాతి దళం, శతఘ్ని దళం, వైమానిక దళం, లాజిస్టిక్ యూనిట్స్‌లతో ‘ఐబీజీ’లను ఏర్పాటు చేశారు. సుమారు 5 వేల మంది సిబ్బంది ఉండే ప్రతీ ఐబీజీకి ఒక మేజర్ జనరల్ నేతృత్వం వహిస్తారు. ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కొనేందుకు వారు సుశిక్షితులై ఉంటారు. ముఖ్యంగా పాక్, చైనా సరిహద్దుల్లో వీటిని మోహరించాలని ప్రణాళిక రచించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత పర్యటనకు ముందు ప్రయోగాత్మకంగా ఐబీజీల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు అరుణాచల్ ప్రదేశ్‌లో సైనిక విన్యాసాలు నిర్వహించారు. -
కన్నీళ్లు లేని కరోనా కథలు
హడావుడిగా అంతిమ వీడ్కోలు.. కన్నబిడ్డలు పక్కన ఉండరు.. కన్నీళ్లు కార్చడానికి కావల్సిన వారు రాలేరు.. కాడె మోసే వాళ్లు కనిపిం చరు.. శ్మశానం దాకా ఎవరూ వెంట రారు.. ఒక అనాథలా అంతిమ సంస్కారాలు జరిగిపోతున్నాయి.. కరోనా సృష్టించిన భయోత్పాతంతో అంతిమ వీడ్కోలు భారంగా మారింది.కన్నబిడ్డలు పక్కన ఉండరు. కన్నీళ్లు కార్చడానికి కావల్సిన వారు రాలేరు. పాడె మోసే వాళ్లు కనిపించరు. శ్మశానం దాకా ఎవరూ వెంటరారు. ఒక అనాథలా అంతిమ సంస్కారాలు జరిగిపోతున్నాయి. కరోనా సృష్టించిన భయోత్పాతంతో అంతిమ వీడ్కోలు భారంగా మారింది. చెన్నై, ముంబై: దేవాలయాలన్నీ వెలవెలబోతున్నాయెందుకు? దేవుళ్లందరూ వైద్యుల రూపంలో కరోనా రోగులకు చికిత్స చేస్తున్నారు. ఇదీ ఈ మధ్యకాలంలో వాట్సాప్‌లో తిరుగుతున్న ఒక సందేశం మరి అలాంటి దేవుళ్లనే కరోనా కాటేస్తూ ఉంటే వారికి తుది వీడ్కోలు చెప్పే దిక్కు కూడా లేదు. మొన్నటికి మొన్న నెల్లూరుకి చెందిన ఓ డాక్టర్ కోవిడ్–19తో పోరాడి చెన్నై ఆస్పత్రిలో మరణిస్తే స్థానికుల నిరసనల మధ్య ఆదరాబాదరాగా అంతిమ సంస్కారం నిర్వహించాల్సి వచ్చింది. అదే వారంలో మేఘాలయలో వైద్యుడు కోవిడ్–19 బాధితులకు చికిత్స చేసి తాను కూడా ప్రాణాలు కోల్పోతే మున్సిపాల్టీ కార్మికులే దహన ప్రక్రియలు పూర్తి చేశారు. వైద్యులే కాదు ఇప్పటివరకు భారత్‌లో కరోనాతో 775 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వారి అంతిమ సంస్కారాలన్నీ ఇలాగే జరుగుతున్నాయి. కరోనా మృతదేహం దగ్గరకి వెళ్లాలంటే అయినవారు కూడా హడలెత్తిపోతున్నారు. స్థానిక ప్రజలు మృతదేహాన్ని తీసుకువెళుతున్నా అడ్డుకుంటున్నారు. రాళ్లతో దాడులకూ దిగుతున్నారు. పటిష్టమైన బందోబస్తు మధ్య వారికి అంతిమ సంస్కారం నిర్వహించాల్సి వస్తోంది. వాస్తవానికి కోవిడ్‌తో మరణించినప్పటికీ మృతదేహం నుంచి వైరస్ సోకదు. అయినా ప్రజల్లో నెలకొన్న భయం, అవగాహనారాహిత్యం వారిలో సున్నితత్వాన్ని కూడా చంపేస్తోంది. దహనమా? ఖననమా? పంజాబ్ గాయకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత కోవిడ్–19తో మృతి చెందితే ఆయన మృతదేహాన్ని దహనం చేయడానికి ఆయన ఊరి ప్రజలే అంగీకరించలేదు. దహనం చేస్తే అందులోంచి వచ్చే పొగ వల్ల వైరస్ సోకుతుందని అంతిమ సంస్కారాన్ని అడ్డుకున్నారు. శ్మశానవాటికకు తాళాలు కూడా వేశారు. దీంతో ఆయన మృతదేహాన్ని ఊరి శివారు ప్రాంతాలకు తరలించి దహనం చేశారు. పంజాబ్‌లో కపుర్తాలాకు చెందిన ఒక మహిళ మరణిస్తే చివరి చూపు చూడడానికి కూడా కన్న కొడుకు రాలేదు. కరోనా భయంతో రావడానికి నిరాకరిస్తే మున్సిపాల్టీ సిబ్బందే మృతదేహాన్ని అంతిమ వీడ్కోలు పలికారు. మరోవైపు ముంబై కార్పొరేషన్ కోవిడ్‌తో మరణించే వారు ఎవరైనా, మతంతో సంబంధం లేకుండా దహనం చేస్తామంటూ నోటీసులు ఇచ్చింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో రాష్ట్ర మైనార్టీ వ్యవహారాల శాఖ ఆ నోటీసులు వెనక్కి తీసుకునేలా చేసింది. దీంతో మృతదేహాన్ని ఖననం చేయడానికి యంత్రాంగం అనుమతిచ్చినా స్థానికులు అడ్డుకుంటున్నారు. మృత దేహాలను దహనమే చేయాలని, లేకపోతే వైరస్ సోకుతుందని అంటున్నారు. భౌతిక దూరం నిబంధనల కారణంగా అయిన వారు మరణించినా అయిదారుగురి కంటే ఎక్కువ మంది హాజరవడానికి ఎక్కడా అనుమతులివ్వడం లేదు. కోవిడ్‌తో మరణిస్తే పోలీసులు, కార్పొరేషన్ సిబ్బంది హడావుడిగా అంతిమ సంస్కారాలు నిర్వహించడమే తప్ప, కన్నీళ్లు రాల్చేవారూ కరువయ్యారు. ఇంతకు మించిన విషాదం ఏముంటుంది? న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్న వైద్యుడి భార్య ఇదో వైద్యుడి భార్య వ్యథ. చెన్నైకి చెందిన ఓ డాక్టర్ కోవిడ్ రోగులకి అలుపెరుగకుండా చికిత్స చేశారు. దీంతో ఆ మహమ్మారి ఆయనకీ అంటుకుంది. కొద్ది రోజులు ప్రాణాలతో పోరాడి కన్నుమూశారు. ఆ డాక్టర్ మృతదేహం నుంచి వైరస్ తమకు ఎక్కడ అంటుకుంటుందోనని స్థానికులు ఆయన మృతదేహాన్ని తీసుకువెళుతున్న అంబులెన్స్‌ని అడ్డుకున్నారు. రాళ్లతో దాడి చేశారు. దీంతో వెలంగాడు శ్మశాన వాటికలో మున్సిపల్ అధికారులు హడావుడిగా పూడ్చి పెట్టేశారు. అయితే ఆయన భార్య ఆనంది సైమన్ తన భర్త చివరి కోరిక మేరకు కిల్పాకలోనే మతపరమైన ప్రార్థనలు నిర్వహించాకే అంతిమ సంస్కారం చేయాలని పట్టుపడుతోంది. మృతదేహం నుంచి వైరస్ సోకదని డబ్ల్యూహెచ్ఓ చెప్పినా ప్రజల్లో అవగాహన లేకపోవడం విచారకరమని కన్నీరు మున్నీరవుతోంది. దీనిపై ఎంత దూరమైనా వెళతానని న్యాయపోరాటానికైనా సిద్ధమని చెబుతోంది. డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పింది ? కరోనా వైరస్‌తో కన్నుమూస్తే ఆ మృతదేహం నుంచి వైరస్ సోకే అవకాశం లేదు. రోగి ప్రాణాలు కోల్పోయిన రెండు, మూడు గంటల్లో వైరస్ కూడా చచ్చిపోతుంది. అందుకే అంతిమ సంస్కారాలు వారి కోరిక మేరకు నిర్వహించుకోవచ్చు. -
దర్బార్‌పై రాళ్లు
ఏదో సినిమాలో హీరో అంటాడు ‘అభిమానాన్ని ఆపలేం సార్’ అని. నిజమే. అభిమానాన్ని ఆపితే వచ్చేది ఆగ్రహమే. ఇప్పుడు అలాంటి ఆగ్రహానికే గురవుతున్నారు ‘దర్బార్’ చిత్రబృందం. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దర్బార్’. నయనతార కథానాయిక. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ముంబైలో జరుగుతోంది. 25 ఏళ్ల తర్వాత మళ్లీ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు రజనీకాంత్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఓ కళాశాలలో జరుగుతోంది. రజనీకాంత్ సినిమా అంటే ఆసక్తి చూపనివారు ఎవరుంటారు? దాంతో అత్యుత్సాహంతో రజనీ ఫోటోలు తీసి ఆన్లైన్లో షేర్ చేస్తున్నారు కొందరు. దీంతో షూటింగ్‌స్పాట్‌లో ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు బయటకు వస్తున్నాయి. ఇది చిత్రబృందానికి ఇబ్బందిగా మారింది. దాంతో సూపర్ స్టార్‌ని చూడ్డానికి లొకేషన్‌కి వస్తున్న స్టూడెంట్స్‌ను దూరంగా ఉంచాలని భావించింది చిత్రబృందం. మా అభిమానాన్నే అడ్డుకుంటారా? అని ఆగ్రహించిన స్టూడెంట్స్ సెట్‌పై రాళ్లు విసిరారు. ఈ సంఘటన తర్వాత షూటింగ్ లొకేషన్ మార్చాలనే ఆలోచనలో ఉందట టీమ్. -
శబరిమలలో మళ్లీ ఉద్రిక్తత
సాక్షి, చెన్నై / పంబా: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం వద్ద మళ్లీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ ఎన్జీవో బృందంలోని రుతుస్రావ వయసు ఉన్న 11 మంది మహిళలను ఆందోళనకారులు ఆదివారం తరిమికొట్టారు. తమిళనాడుకు చెందిన మణిది అనే సంస్థ తరఫున ఈ మహిళలు అయ్యప్పను దర్శించుకునేందుకు తెల్లవారుజామున తమిళనాడు–కేరళ సరిహద్దు ద్వారా పంబాకు వచ్చారు. మార్గమధ్యంలో చాలామంది వీరి వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నించగా, పోలీసులు ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. అనంతరం ఆలయానికి వెళ్లేదారిలో వీరిని వందలాది మంది భక్తులు, ఆందోళనకారులు నిలువరించారు. ఈ సందర్భంగా స్వామి దర్శనానికి వెళితే ఉద్రిక్త పరిస్థితి తలెత్తే అవకాశముందని పోలీసులు నచ్చజెప్పగా, అయ్యప్పను దర్శించుకున్నాకే వెనక్కి వెళతామని మణిది సభ్యులు స్పష్టం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా ఆరు గంటల పాటు రోడ్డుపై బైఠాయించారు. దీంతో చివరకు మణిది సభ్యులను కొండపైకి తీసుకెళ్లేందుకు పోలీసులు యత్నించగా, వందలాది మంది భక్తులు వెంటపడి తరిమికొట్టారు. రాళ్లవర్షం కురిపించారు. అప్రమత్తమైన అధికారులు మహిళా భక్తులను సమీపంలోని భద్రతాసిబ్బంది ఉండే గదిలోకి తీసుకెళ్లారు. పరిస్థితి చేయిదాటడంతో వీరంతా అయ్యప్పను దర్శించుకోకుండానే వెనక్కు వెళ్లేందుకు అంగీకరించారు. దీంతో ఈ 11 మంది మహిళల్ని గట్టి భద్రత నడుమ సరిహద్దు దాటించారు. ఈ విషయమై మణిది సంస్థ సమన్వయకర్త సెల్వీ మాట్లాడుతూ..‘ఆందోళనల నేపథ్యంలో వెనక్కు వెళ్లాలని పోలీసులు చెబుతున్నారు. ఈ 11 మంది తొలి బృందం మాత్రమే. ఇంకా చాలామంది శబరిమలకు రాబోతున్నారు’అని చెప్పారు. అయ్యప్ప దర్శనానికి మహిళల్ని పోలీసులు తీసుకెళ్లేందుకు యత్నించడాన్ని బీజేపీ నేత కె.సురేంద్రన్ తప్పుపట్టారు. వీరి వెనుక ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. ఈ ఘటనను నిరసిస్తూ బీజేపీ, హిందుత్వ సంస్థల కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. -
‘రాళ్ల మూక’లపై 1,745 కేసుల ఎత్తివేత
జమ్మూ: కశ్మీర్లో ఆందోళనల్లో 2008 నుంచి 2017 మధ్య భద్రతా దళాలపైకి రాళ్లు విసిరిన 9,730 మందిపై నమోదైన కేసులను ఉపసంహరించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కశ్మీర్ సీఎం మెహబూబా ప్రకటించారు. ఈ అంశంపై ఏర్పాటైన ఓ కమిటీ సిఫారసులను అనుసరించి, షరతులను విధించి 1,745 కేసులను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. గత రెండేళ్లలో చిన్నచిన్న ఘటనల్లో రాళ్లు విసిరిన 4 వేల మందికీ క్షమాభిక్ష పెట్టాలని ప్రభుత్వం సిఫారసు చేసినట్లు రాష్ట్ర అసెంబ్లీలో చెప్పారు. గత రెండేళ్లలో రాళ్లు విసిరిన ఘటనలకు సంబంధించి మొత్తం 3,773 కేసులు నమోదవ్వగా 11,290 మంది అరెస్టయ్యారని చెప్పారు. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ చనిపోయిన 2016తో పోలిస్తే 2017లో రాళ్ల దాడి కేసులు, అరెస్టులు తగ్గాయన్నారు. రాళ్లు విసిరిన వారిలో 56 మంది ప్రభుత్వోద్యోగులు ఉన్నారు. -
కశ్మీర్ పోలీసులకు ఆర్మీ కౌంటర్
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో జరిగిన కాల్పుల ఘటనలో ఓ మేజర్ సహా 10 మంది సైనిక సిబ్బందిపై ఆ రాష్ట్ర పోలీసులు కేసులు నమోదు చేయడంపై ఆర్మీ తీవ్రంగా స్పందించింది. కశ్మీర్ పోలీసులపై బుధవారం సైన్యం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. షోపియాన్ జిల్లాలోని గనోవ్‌పొరా నుంచి వెళ్తున్న ఆర్మీ కాన్వాయ్‌పై అల్లరిమూకలు జనవరి 27న దాడిచేసిన సంగతి తెలిసిందే. ఏడుగురు జవాన్లను గాయపర్చడంతో పాటు రాళ్లదాడిలో స్పృహ కోల్పోయిన జూనియర్ కమిషన్డ్ అధికారిని హతమార్చేందుకు, అతని సర్వీస్ తుపాకీని లాక్కునేందుకు ఆందోళనకారులు యత్నించడంతో ఆత్మరక్షణ కోసం ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో అప్పట్లో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల ఘటనపై కశ్మీర్లో తీవ్ర నిరసన వెల్లువెత్తడంతో సీఎం మెహబూబా ముఫ్తీ విచారణకు ఆదేశించారు. దీంతో పోలీసులు ఘర్వాల్ ఆర్మీ యూనిట్‌లోని ఓ మేజర్ సహా 10 మంది జవాన్లపై కేసు నమోదు చేశారు. జనవరి 27న ఆర్మీ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ మరో యువకుడు బుధవారం చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య మూడుకు చేరుకుంది. -
కాస్గంజ్లో పెరిగిన ఉద్రిక్తత
కాస్గంజ్: పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని కాస్గంజ్ పట్టణంలో గణతంత్ర దినోత్సవ ర్యాలీ సందర్భంగా రేగిన ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. శనివారం కూడా కొందరు ఆగంతకులు విధ్వంసానికి పాల్పడ్డారు. ఓ బస్సు, మూడు దుకాణాలను, ఇతర వాణిజ్య సముదాయాలను తగలబెట్టారు. దీంతో పట్టణంలో శాంతిభద్రతల పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు 144 సెక్షన్ (కర్ఫ్యూ) కొనసాగిస్తున్నారు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి 49 మందిని పోలీసులు అరెస్టు చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నగరంలో ఓ విద్యార్థి సంఘం చేపట్టిన తిరంగా ర్యాలీపై మరో వర్గం రాళ్లు రువ్వటంతో చందన్‌గుప్తా ఓ యువకుడు చనిపోగా మరో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. దీంతో వివాదం రేగింది. శనివారం గుప్తా అంత్యక్రియల అనంతరం ఓ వర్గం బస్సును తగులబెట్టగా.. ప్రత్యర్థి వర్గం దుకాణ సముదాయాలపై దాడులు చేసిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందని.. ముందు జాగ్రత్త చర్యగా నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నామని యూపీ పోలీసు అదనపు డీజీ ఆనంద్ తెలిపారు. ఈ అల్లర్ల ఘటన దురదృష్టకరమని యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులను వదిలిపెట్టబోమన్నారు. -
మనిషి గెలిచాడు..
కశ్మీర్‌లోని శ్రీనగర్ .. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ కాల్చివేత.. అనంతరం చెలరేగిన ఘర్షణలు.. కాల్పులు, రాళ్లదాడులు.. హింస.. కుయ్యికుయ్యి మంటూ పోలీసు వాహనాలు దూసుకెళ్తున్నాయి.. రోడ్డుపై మనిషన్నవాడు లేడు.. షాపులు, కార్యాలయాలు అన్నీ బంద్.. నగరమంతటా కర్ఫ్యూ.. బయటకి రావాలంటేనే అంతా భయపడుతున్న సమయమది.. ఆ సమయంలో జుబేదా బేగం.. తన భర్తతో కలిసి బయటకు వచ్చింది.. కర్ఫ్యూను ధిక్కరిస్తూ.. ఆమె చూపు పోలీసు వాహనాలపైనే ఉంది.. వాహనాల కంటపడకుండా జాగ్రత్తగా వెళ్తున్నారీ దంపతులు.. రాళ్లు విసురుతూ.. అక్కడక్కడా అల్లరి మూకలు.. ఓర్పుగా, నేర్పుగా ప్రమాదాలను తప్పించుకుంటూ నడిచి వెళ్తున్నారు జుబేదా భర్త భుజం మీద బియ్యం, పప్పుల మూట.. అలా వాళ్లు మైళ్ల దూరం నడిచారు.. ఎట్టకేలకు తమ గమ్యాన్ని చేరుకున్నారు.. - ఎవరైనా వీరిని చూస్తే.. కర్ఫ్యూ సమయంలో తమ వారి కోసం సరుకులు తెచ్చుకోవడానికి బయల్దేరిన ముస్లిం జంటలా కనిపిస్తారు.. కానీ ఇలా కర్ఫ్యూ సమయంలో ప్రాణాలకు తెగించి.. వీరు ఆహారాన్ని తీసుకువెళ్తోంది.. ఓ హిందూ కుటుంబం కోసం.. తమ నివాసానికి దూరంగా జవహర్ నగర్లో ఉన్న దివాన్‌చంద్ పండిట్, పక్కనే ఉంటున్న ఇతర హిందూ కుటుంబాల కోసం.. కర్ఫ్యూ సమయంలో వాహన సదుపాయం లేకపోవడంతో వీరు ఇలా మైళ్ల దూరం నడిచి వెళ్లారు. - దివాన్‌చంద్ పండిట్ భార్య, జుబేదా ఒకే స్కూళ్లో పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం ఆమె నుంచి జుబేదాకు ఫోన్ వచ్చింది.. రెండ్రోజులుగా పస్తు.. ఇంట్లో తినడానికి ఏమీ లేదు.. బయటకు వెళ్లే పరిస్థితి లేదు అని చెప్పింది.. అంతే.. జుబేదా ఇంకేమీ ఆలోచించలేదు.. ప్రాణాలకు తెగించింది.. భర్తతో బయల్దేరింది.. దివాన్‌చంద్ భార్య ఫోనైతే చేసింది గానీ.. జుబేదా ఇలా వచ్చేస్తుందని అనుకోలేదు.. జుబేదాను చూడగానే.. దివాన్‌చంద్ కుటుంబం కంట కన్నీరు.. అటు వారి కడుపు నిండింది.. ఇటు జుబేదా గుండె ఆనందంతో నిండిపోయింది.. బయట రాళ్ల వర్షం.. కాల్పులు కొనసాగుతునే ఉన్నాయి.. అక్కడ ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు? అప్రస్తుతం.. ఇక్కడ మాత్రం మనిషి గెలిచాడు.. మానవత్వమూ గెలిచింది...