హడావుడిగా అంతిమ వీడ్కోలు.. కన్నబిడ్డలు పక్కన ఉండరు.. కన్నీళ్లు కార్చడానికి కావల్సిన వారు రాలేరు.. కాడె మోసే వాళ్లు కనిపిం చరు.. శ్మశానం దాకా ఎవరూ వెంట రారు.. ఒక అనాథలా అంతిమ సంస్కారాలు జరిగిపోతున్నాయి.. కరోనా సృష్టించిన భయోత్పాతంతో అంతిమ వీడ్కోలు భారంగా మారింది.కన్నబిడ్డలు పక్కన ఉండరు. కన్నీళ్లు కార్చడానికి కావల్సిన వారు రాలేరు. పాడె మోసే వాళ్లు కనిపించరు. శ్మశానం దాకా ఎవరూ వెంటరారు. ఒక అనాథలా అంతిమ సంస్కారాలు జరిగిపోతున్నాయి. కరోనా సృష్టించిన భయోత్పాతంతో అంతిమ వీడ్కోలు భారంగా మారింది.
చెన్నై, ముంబై: దేవాలయాలన్నీ వెలవెలబోతున్నాయెందుకు? దేవుళ్లందరూ వైద్యుల రూపంలో కరోనా రోగులకు చికిత్స చేస్తున్నారు. ఇదీ ఈ మధ్యకాలంలో వాట్సాప్‌లో తిరుగుతున్న ఒక సందేశం మరి అలాంటి దేవుళ్లనే కరోనా కాటేస్తూ ఉంటే వారికి తుది వీడ్కోలు చెప్పే దిక్కు కూడా లేదు. మొన్నటికి మొన్న నెల్లూరుకి చెందిన ఓ డాక్టర్ కోవిడ్–19తో పోరాడి చెన్నై ఆస్పత్రిలో మరణిస్తే స్థానికుల నిరసనల మధ్య ఆదరాబాదరాగా అంతిమ సంస్కారం నిర్వహించాల్సి వచ్చింది.
అదే వారంలో మేఘాలయలో వైద్యుడు కోవిడ్–19 బాధితులకు చికిత్స చేసి తాను కూడా ప్రాణాలు కోల్పోతే మున్సిపాల్టీ కార్మికులే దహన ప్రక్రియలు పూర్తి చేశారు. వైద్యులే కాదు ఇప్పటివరకు భారత్‌లో కరోనాతో 775 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వారి అంతిమ సంస్కారాలన్నీ ఇలాగే జరుగుతున్నాయి. కరోనా మృతదేహం దగ్గరకి వెళ్లాలంటే అయినవారు కూడా హడలెత్తిపోతున్నారు. స్థానిక ప్రజలు మృతదేహాన్ని తీసుకువెళుతున్నా అడ్డుకుంటున్నారు. రాళ్లతో దాడులకూ దిగుతున్నారు. పటిష్టమైన బందోబస్తు మధ్య వారికి అంతిమ సంస్కారం నిర్వహించాల్సి వస్తోంది. వాస్తవానికి కోవిడ్‌తో మరణించినప్పటికీ మృతదేహం నుంచి వైరస్ సోకదు. అయినా ప్రజల్లో నెలకొన్న భయం, అవగాహనారాహిత్యం వారిలో సున్నితత్వాన్ని కూడా చంపేస్తోంది.
దహనమా? ఖననమా?
పంజాబ్ గాయకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత కోవిడ్–19తో మృతి చెందితే ఆయన మృతదేహాన్ని దహనం చేయడానికి ఆయన ఊరి ప్రజలే అంగీకరించలేదు. దహనం చేస్తే అందులోంచి వచ్చే పొగ వల్ల వైరస్ సోకుతుందని అంతిమ సంస్కారాన్ని అడ్డుకున్నారు. శ్మశానవాటికకు తాళాలు కూడా వేశారు. దీంతో ఆయన మృతదేహాన్ని ఊరి శివారు ప్రాంతాలకు తరలించి దహనం చేశారు. పంజాబ్‌లో కపుర్తాలాకు చెందిన ఒక మహిళ మరణిస్తే చివరి చూపు చూడడానికి కూడా కన్న కొడుకు రాలేదు. కరోనా భయంతో రావడానికి నిరాకరిస్తే మున్సిపాల్టీ సిబ్బందే మృతదేహాన్ని అంతిమ వీడ్కోలు పలికారు. మరోవైపు ముంబై కార్పొరేషన్ కోవిడ్‌తో మరణించే వారు ఎవరైనా, మతంతో సంబంధం లేకుండా దహనం చేస్తామంటూ నోటీసులు ఇచ్చింది.
దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో రాష్ట్ర మైనార్టీ వ్యవహారాల శాఖ ఆ నోటీసులు వెనక్కి తీసుకునేలా చేసింది. దీంతో మృతదేహాన్ని ఖననం చేయడానికి యంత్రాంగం అనుమతిచ్చినా స్థానికులు అడ్డుకుంటున్నారు. మృత దేహాలను దహనమే చేయాలని, లేకపోతే వైరస్ సోకుతుందని అంటున్నారు. భౌతిక దూరం నిబంధనల కారణంగా అయిన వారు మరణించినా అయిదారుగురి కంటే ఎక్కువ మంది హాజరవడానికి ఎక్కడా అనుమతులివ్వడం లేదు. కోవిడ్‌తో మరణిస్తే పోలీసులు, కార్పొరేషన్ సిబ్బంది హడావుడిగా అంతిమ సంస్కారాలు నిర్వహించడమే తప్ప, కన్నీళ్లు రాల్చేవారూ కరువయ్యారు. ఇంతకు మించిన విషాదం ఏముంటుంది?
న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్న వైద్యుడి భార్య
ఇదో వైద్యుడి భార్య వ్యథ. చెన్నైకి చెందిన ఓ డాక్టర్ కోవిడ్ రోగులకి అలుపెరుగకుండా చికిత్స చేశారు. దీంతో ఆ మహమ్మారి ఆయనకీ అంటుకుంది. కొద్ది రోజులు ప్రాణాలతో పోరాడి కన్నుమూశారు. ఆ డాక్టర్ మృతదేహం నుంచి వైరస్ తమకు ఎక్కడ అంటుకుంటుందోనని స్థానికులు ఆయన మృతదేహాన్ని తీసుకువెళుతున్న అంబులెన్స్‌ని అడ్డుకున్నారు. రాళ్లతో దాడి చేశారు. దీంతో వెలంగాడు శ్మశాన వాటికలో మున్సిపల్ అధికారులు హడావుడిగా పూడ్చి పెట్టేశారు. అయితే ఆయన భార్య ఆనంది సైమన్ తన భర్త చివరి కోరిక మేరకు కిల్పాకలోనే మతపరమైన ప్రార్థనలు నిర్వహించాకే అంతిమ సంస్కారం చేయాలని పట్టుపడుతోంది. మృతదేహం నుంచి వైరస్ సోకదని డబ్ల్యూహెచ్‌ఓ చెప్పినా ప్రజల్లో అవగాహన లేకపోవడం విచారకరమని కన్నీరు మున్నీరవుతోంది. దీనిపై ఎంత దూరమైనా వెళతానని న్యాయపోరాటానికైనా సిద్ధమని చెబుతోంది.
డబ్ల్యూహెచ్‌ఓ ఏం చెప్పింది ?
కరోనా వైరస్‌తో కన్నుమూస్తే ఆ మృతదేహం నుంచి వైరస్ సోకే అవకాశం లేదు. రోగి ప్రాణాలు కోల్పోయిన రెండు, మూడు గంటల్లో వైరస్ కూడా చచ్చిపోతుంది. అందుకే అంతిమ సంస్కారాలు వారి కోరిక మేరకు నిర్వహించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment