cremation ground
-
చితిపై బతికొచ్చాడు
జైపూర్: మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించిన ఓ వ్యక్తి శ్మశానంలో చితిపైకి చేర్చగానే శ్వాస పీల్చడం ప్రారంభించాడు. అతడు ప్రాణాలతోనే ఉన్నట్లు తేలింది. దీంతో ఆంత్యక్రియలకు వచ్చినవారంతా షాక్ తిన్నారు. అయితే, కొన్ని గంటల తర్వాత ఆ వ్యక్తి తుదిశ్వాస విడిచాడు. ఆశ్చర్యకరమైన ఈ సంఘటన రాజస్తాన్‌లోని జుంఝున్లో చోటుచేసుకుంది. ప్రాణంతో ఉన్న వ్యక్తి మరణించినట్లు ప్రకటించడంతోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ముగ్గురు వైద్యులను జుంఝునూ జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. 25 ఏళ్ల రోహితాశ్ కమార్ దివ్యాంగుడు. వినలేడు, మాట్లాడలేడు. అతడి కుటుంబం ఏమైందో, ఎక్కడుందో తెలియదు. అనాథగా మారాడు. అనాథాశ్రమంలో ఉంటున్నాడు. గురువారం హఠాత్తుగా అనారోగ్యం పాలయ్యాడు. అపస్మారక స్థితికి చేరుకోవడంతో జుంఝునూ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అతడు చనిపోయినట్లు గురువారం మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్లు ప్రకటించారు. దాంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. రెండు గంటలపాటు అక్కడే ఉంచారు. పోలీసులు పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని అంత్యక్రియల కోసం శ్మశానానికి తరలించారు. దహనం చేయడానికి చితిపైకి చేర్చారు. చితికి నిప్పంటించడానికి సిద్ధమవుతుండగా రోహితాశ్ శ్వాస పీల్చుకోవడం ప్రారంభించాడు. అతడు బతికే ఉన్నట్లు గుర్తించి వెంటనే అంబులెన్స్ రప్పించారు. జుంఝునూలోని బీడీకే హాస్పిటల్‌కు తరలించారు. ఐసీయూలో చేర్చి చికిత్స ప్రారంభించారు. మెరుగైన చికిత్స కోసం శుక్రవారం జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలిస్తుండగా, మధ్యలోనే ప్రాణాలు విడిచాడు. బతికి ఉన్న వ్యక్తి మరణించినట్లు నిర్ధారించినందుకు జుంఝున్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్ సందీప్ పచార్తోపాటు మరో ఇద్దరు డాక్టర్లను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. -
PM Narendra Modi: ఆ ఆలోచన మానుకోండి
సోనీపట్/న్యూఢిల్లీ: ఆర్టికల్ 370ని శ్మశాన వాటికలో పూడ్చిపెట్టామని, దాన్ని మళ్లీ వెనక్కి తీసుకురావాలన్న ఆలోచన విరమించుకోవాలని కాంగ్రెస్ పారీ్టకి ప్రధాని మోదీ హితవు పలికారు. ఇప్పుడు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలను కురుక్షేత్రంగా సంగ్రామంగా అభివరి్ణంచారు. ఈ రణరంగంలో ఒకవైపు అభివృద్ధికి కట్టుబడి ఉన్న మోదీ సర్కారు, మరోవైపు ఓటు జిహాద్ మోహరించాయని అన్నారు. శనివారం హరియాణాలోని అంబాల, గొహనా, దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రచార సభల్లో మోదీ మాట్లాడారు. దేశ వ్యతిరేక అజెండాను కాంగ్రెస్ దాచుకోవడం లేదని అన్నారు. బహిరంగ సభల్లో ప్రధాని మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే... పాకిస్తాన్‌కు భయపడతామా? ‘‘ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలన్న స్వప్నాన్ని కాంగ్రెస్ మర్చిపోవాలి. లేకపోతే మీరు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఆర్టికల్ 370ను రద్దుచేసిన తర్వాత జమ్మూకశీ్మర్ అభివృద్ధి మార్గంలో పయనిస్తోంది. కాంగ్రెస్ అధికారానికి దూరమై పదేళ్లవుతోంది. ఆ పార్టీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. రిమోట్ కంట్రోల్‌తో ప్రభుత్వాన్ని శాసించిన ఆ పాత రోజులను గుర్తుచేసుకుంటున్నారు. అప్పట్లో ప్రభుత్వ పథకాలకు కేవలం ఒకే ఒక కుటుంబం పేరు పెట్టారు. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు. కాంగ్రెస్ పాలనలో సరిహద్దుల్లో నిత్యం కాల్పులు, కాల్పుల విరమణ ఒప్పందాల ఉల్లంఘనలు జరుగుతుండేవి. మా ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారిపోయింది. శత్రువు అప్పటి శత్రువే. కానీ, ప్రజల ఓటు పరిస్థితిని మొత్తం మార్చేసింది. సరిహద్దుల్లో ఉన్న మన సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. ఇదంతా కాంగ్రెస్‌కు, విపక్ష ఇండియా కూటమికి నచ్చడం లేదు. కాంగ్రెస్ మనుషులు పాకిస్తాన్ అధికార ప్రతినిధులుగా మాట్లాడుతున్నారు. మనం పాకిస్తాన్‌కు భయపడతామా? ఇప్పుడున్నది నరేంద్ర మోదీ పరిపాలన. శత్రువులను వారి భూభాగంలో అడుగుపెట్టి మరీ దెబ్బకొడతాం.’’ -
ఎన్నికల్లో గెలుపు కోసం తాంత్రిక పూజలా?
భోపాల్: కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ తన గెలుపుకోసం మంత్ర పూజలు చేయిస్తున్నట్లుగా వస్తున్న వార్తలు వైరల్‌గా మారాయి. ఉజ్జయినిలోని ఓ శ్మశానంలో ఓ తాంత్రికుడు కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ చిత్రపటం ఎదురుగా పెట్టుకుని నిమ్మకాయలు, పూలు, క్షుద్రపూజల సామగ్రితో పూజలు చేస్తున్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కమల్‌నాథ్ ముఖ్యమంత్రి కావాలనే ఈ పూజలు జరిపిస్తున్నట్లు తాంత్రిక పూజారి భయ్యూ మహరాజ్ ‘ఇండియా టుడే’టీవీ ప్రతినిధికి చెప్పడం విశేషం. ఈ వ్యవహారంపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ‘ఎవరైనా భక్తి మార్గంలో లేదా ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమవ్వాలనుకుంటే, దానిని స్వచ్ఛంగా, ధర్మబద్ధంగా నిర్వహించుకోవాలి. అదికాదని, ఇలా క్షుద్రపూజలు చేయడం చూస్తే ఆశ్చర్యమేస్తుంది’అని పేర్కొన్నారు. ‘మేం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలకు చేరువవుతున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవలు చేయాలి. వారి విశ్వాసాన్ని గెలుచుకోవడానికి, వారికి సేవ చేయడానికి ఇదే మార్గం. కొందరు మాత్రం శ్మశానవాటికలో ‘తాంత్రిక క్రియ’లు నిర్వహిస్తున్నారు. వీటితో దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు ఏమైనా ఉపయోగముందా?’అని చౌహాన్ ప్రశ్నించారు. -
అంత్యక్రియలు చేశారు.. అస్థికలు మరిచారు
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గంలోని (జూబ్లిహిల్స్ రోడ్డు) వైకుంఠ మహాప్రస్థానంలో శాస్త్రోక్తంగా జలాల్లో కలపాల్సిన అస్థికలు ఏళ్లుగా అక్కడే ఉండిపోతున్నాయి. కొందరు మృతుల బంధువులు వాటిని తీసుకుపోకుండా అస్థికలు భద్రపరిచే రూంలోనే అమానవీయంగా వదిలేస్తుండటమే దీనికి కారణం. దాదాపు నాలుగేళ్ల నుంచి పలువురి అస్థికలు నిలువ ఉంటున్నాయి. దీంతో మహాప్రస్థానం ట్రస్టు స్పందించింది. అంత్యక్రియలు నిర్వహించి చాలాకాలంగా వదిలేసిన అస్థికలను సంబంధితులు తీసుకువెళ్లాలని రాయదుర్గంలోని వైకుంఠ మహాప్రస్థానం ట్రస్టు తెలిపింది. అంతిమ సంస్కారాలు చేసిన పలువురి అస్థికలు 2019 నుంచి మహాప్రస్థానంలోని గదిలోనే ఉండిపోతున్నాయని పేర్కొంది. అస్థికలను తీసుకుపోకుండా అలాగే ఉంచడం సరికాదని వివరించింది. కరోనా సమయంలోనూ చాలా మంది అంతిమ సంస్కారాలు మహాప్రస్థానంలో జరిగాయి. అప్పటినుంచీ కొందరి అస్థికలు అలాగే ఉంటున్నాయి. దీంతో మహాప్రస్థానం ట్రస్టు స్పందించి.. ఈ నెల 30నాటికి అస్థికలను సంబంధికులు తీసుకువెళ్లాలని సూచించింది. లేని పక్షంలో అక్టోబర్ 14న ట్రస్టు ఆద్వర్యంలో సంప్రదాయబద్దంగా పూజా క్రతువులు నిర్వహించి, జలాల్లో కలుపుతామని స్పష్టం చేశారు. వివరాలకు 9703153111, 9703158111 నెంబర్లకు సంప్రదించాలని కోరారు. ఇదీ చదవండి: సెల్‌ఫోన్ వాడొద్దన్నందుకు బాలిక ఆత్మహత్య -
అమ్మ రుణం ఇలా తీర్చుకున్నారు!
మచిలీపట్నం: నవ మాసాలు కని పెంచిన తల్లి రుణాన్ని కుమార్తెలు ఇలా తీర్చుకున్నారు. మరణించిన తల్లి భౌతికకాయాన్ని ఉంచిన పాడెను శ్మశానం వరకు మోసి అంత్యక్రియలు సైతం నిర్వహించారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని మాచవరం కాలనీకి చెందిన కె.విజయలక్ష్మి అనారోగ్యంతో శుక్రవారం ఉదయం మృతిచెందారు. ఆమె భర్త సుబ్రహ్మణ్యం మూడేళ్ల కిందటే మరణించారు. సుబ్రహ్మణ్యం, విజయలక్ష్మి దంపతులకు మగబిడ్డలు లేరు. ముగ్గురు కుమార్తెలకు పెళ్లి చేసి పంపించారు. చదవండి: డప్పు రమేష్ కన్నుమూత శుక్రవారం తల్లి మృతి వార్త తెలియగానే కుమార్తెలు ముగ్గురూ వచ్చారు. అల్లారు ముద్దుగా పెంచిన అమ్మ దూరమైపోయిందని భోరున విలపిస్తూనే నెరవేర్చవలసిన అంతిమ సంస్కార కార్యక్రమాలన్నీ తామే నిర్వహించారు. ముగ్గురు కుమార్తెలు, తమ భర్తలతో పాటు తామూ పాడె మోసి శ్మశానం వరకు వెళ్లడమే కాకుండా అంత్యక్రియలు సైతం నిర్వహించారు. అమ్మ రుణం ఇలా తీర్చుకున్నారంటూ డివిజన్ కార్పొరేటర్ పరింకాయల విజయ్, కాలనీ వాసులు వారిని ప్రశంసించారు. -
మృతదేహాన్ని అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన
వేంసూరు (ఖమ్మం): ఖమ్మం జిల్లాలోని వేంసూరులో అమానుష సంఘటన జరిగింది. కాలనీలో ఇళ్ల సమీపాన దహన సంస్కారాలు నిర్వహించవద్దంటూ స్థానికులు ఆందోళన చేశారు. అయితే మరీ చితిపై కూర్చుని నిరసన వ్యక్తం చేసిన దౌర్భాగ్య పరిస్థితి. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా వేంసూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో అంత్యక్రియలు జరిపేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కొద్దికాలంగా కాలనీ సమీపాన మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తుండగా ఆ తర్వాత మరోచోట ప్రభుత్వం వైకుంఠధామాన్ని నిర్మించింది. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం అయినా గురువారం ఓ వ్యక్తి మృతి చెందగా ఆ మృతదేహానికి కాలనీ సమీపంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు, బంధువులు తీసుకెళ్లారు. అయితే కాలనీవాసులు అడ్డుకున్నారు. దహన సంస్కారాలతో తాము ఇబ్బంది పడుతున్నామంటూ మృతదేహాన్ని అడ్డుకున్నారు. అంతేకాకుండా అప్పటికే సిద్ధం చేసిన చితిపై కూర్చుని నిరసన తెలిపారు. చివరకు మృతుడి బంధువులు నచ్చచెప్పగా, దహన సంస్కారాలకు ఒప్పుకోవడంతో వివాదం సద్దుమణిగింది. చదవండి: తెలంగాణ శాసన సభాసమరానికి సర్వం సిద్ధం -
ఢిల్లీ హత్యాచార ఘటన: రాహుల్ చేష్టలపై సీరియస్
Delhi Dalit Minor Case: ఢిల్లీ మైనర్ హత్యాచార ఘటన దేశంలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించడం పరస్పర రాజకీయ విమర్శలకు దారితీసింది. ఈ తరుణంలో బాధితురాలి తల్లిదండ్రుల ఫొటోల్ని తన ట్విటర్లో రాహుల్ పోస్ట్ చేయడంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(NCPCR) సీరియస్ అయ్యింది. శ్మశాన వాటికలో మంచి నీళ్ల కోసం వెళ్లిన బాలికపై అక్కడున్న కొందరు హత్యాచారానికి పాల్పడ్డారని, ఆపై తల్లిదండ్రుల సమ్మతి లేకుండా అంత్యక్రియలు నిర్వహించారన్న కేసు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ తరుణంలో తొమ్మిదేళ్ల దళిత మైనర్ బాధితురాలి తల్లిదండ్రులను పరామర్శించిన అనంతరం రాహుల్ గాంధీ తన ట్విటర్లో ఫొటో పోస్ట్ చేశాడు. అయితే జువెనైల్ జస్టిస్-పోక్సో చట్టాల ప్రకారం.. అలా ఫొటోల్ని, వివరాల్ని బయటపెట్టడానికి వీల్లేదు. తద్వారా బాధితురాలి ఐడెంటిటీ బయటపడే అవకాశం ఉంది. ఇది చట్ట విరుద్ధం కూడా. ఈ నేపథ్యంలోనే బాలల కమిషన్ స్పందించింది. రాహుల్ పోస్ట్‌పై మూడు రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు, ట్విటర్‌కు ఎన్సీపీసీఆర్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ట్విటర్ రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్‌కు సదరు ట్వీట్‌ను తొలగించాలంటూ ఓ లేఖ కూడా రాసింది. ఇక రాహుల్ చర్యలపై జువెనైల్ జస్టిస్ యాక్ట్, పోక్సో యాక్ట్, ఐపీసీ సెక్షన్ల చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఢిల్లీ డీసీపీ(నైరుతి విభాగం)కి మరో ప్రత్యేక లేఖలో కేసుకు సంబంధించి పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని 48 గంటల డెడ్‌టైన్ విధించింది ఎన్సీపీసీఆర్. ఇక ‘ఓటేసే ముందు నిర్భను గుర్తు తెచ్చుకోండి’ అంటూ గతంలో మోదీ చేసిన ప్రచారాన్ని తెర మీదకు తెచ్చిన కాంగ్రెస్.. తీవ్ర స్థాయిలో బీజేపీపై విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్‌పై కౌంటర్ దాడులు చేస్తోంది. -
శ్మశానానికి రూ.6 కోట్ల భూమి విరాళం
భీమారం (వరంగల్): గజం స్థలం కోసం సొంతవాళ్లతో ఘర్షణ పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఓ వ్యక్తి ఏకంగా రూ.6 కోట్ల విలువైన భూమిని దానం చేసి తన ఉదారతను చాటుకున్నారు. వరంగల్ నగరం పరిధిలోని గుండ్లసింగారానికి చెందిన గంగు గోపాల్రావుకు స్థానికంగా కొంత వ్యవసాయ భూమి ఉంది. గ్రామానికి శ్మశాన వాటిక లేకపోవడాన్ని గమనించి తనకున్న భూమిలోనుంచి మూడెకరాలను దానికి ఇవ్వాలని నిర్ణయించాడు. అక్కడ ఎకరం బహిరంగ మార్కెట్లో రూ.2 కోట్లు పలుకుతోంది. ఈ మేరకు టీఆర్ఎస్ జిల్లా నేత అల్వాల రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీ దయాకర్‌ను కలిసి తన నిర్ణయాన్ని వివరించాడు. ఈ మేరకు శనివారం ఎంపీలు దయాకర్, బండా ప్రకాశ్ చేతుల మీదుగా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంత్‌కు పత్రాలు అందజేశారు. గోపాల్‌రావు దానమిచ్చిన మూడెకరాలలో మోడల్ శ్మశానవాటిక నిర్మిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. పెద్దమనసు చాటుకున్న గోపాల్‌రావును కలెక్టర్ అభినందించారు. -
థియేటర్లో కాదు.. శ్మశానాల్లో ‘హౌస్ ఫుల్’
బెంగళూరు: హౌస్‌ఫుల్ బోర్డులు మనం ఇప్పటివరకు సినిమా థియేటర్లకే చూశాం.. కానీ ఇప్పుడు కరోనా కల్లోలంతో శ్మశాన వాటికలకు హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి. కర్నాటకలో మహమ్మారి కరోనా తీవ్రస్థాయిలో దాడి చేస్తోంది. దీంతో పెద్ద ఎత్తున కేసులు.. మరణాలు సంభవిస్తున్నాయి. ఆదివారం ఒక్కరోజే 217 మరణాలు సంభవించాయి. ఆ రాష్ట్రంలో మరణాలు భారీగా చోటుచేసుకుంటుండడంతో శ్మశానాలన్నీ నిండుకుంటున్నాయి. మృతదేహాలు భారీగా చేరుకుంటుండడంతో శ్మశానాలు కిటకిటలాడుతున్నాయి. కరోనాతో చనిపోయిన శవాలు భారీగా వస్తుండడంతో శ్మశాన వాటిక నిర్వాహకులు వాటికి అంత్యక్రియలు చేయలేకపోతున్నారు. ఖననం చేయడానికి శ్మశానాల్లో ఖాళీ ఉండడం లేదు. దీంతో బెంగళూరులోని పలు శ్మశానవాటికలు ‘హౌస్‌ఫుల్’ అనే బోర్డులు తగిలేస్తున్నాయి. చామ్‌రాజ్‌పేటలోని శ్మశాన వాటిక ‘హౌస్‌ఫుల్’ అనే బోర్డు తగిలేసింది. శ్మశానంలో రోజుకు 20కి పైగా కరోనాతో మరణించిన మృతదేహాలు వస్తుండడంతో ఈ మేరకు శ్మశాన వాటిక నిర్వాహకులు బోర్డు పెట్టేశారు. బెంగళూరులో 13 విద్యుత్ దహన వాటికలు ఉండగా అవి నిరంతరం బిజీగా ఉంటున్నాయి. శ్మశానాల కొరత ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం బృహత్ బెంగళూరు మహానగర్ పాలికె (బీబీఎంపీ)కి 230 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. వాటిలో అంత్యక్రియల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ప్రభుత్వం అంత్యక్రియలపై ఆలోచన చేసింది. మృతుల కుటుంబీకులే తమ సొంత ప్లాట్లు, ఫామ్‌హౌస్, పొలాలు ఉంటే అక్కడే ఖననం.. లేదా అంత్యక్రియలు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం కర్నాటకలో కరోనా కేసులు 16 లక్షలు దాటాయి. కొత్తగా 37,733 కేసులు నమోదు కాగా, మరణాలు 217 సంభవించాయి. ఇవి అధికారికంగా ప్రకటించినవే. అనధికారికంగా ఎన్నో ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చదవండి: డీఎంకే విజయంలో ‘ఇటుక’దే కీలక పాత్ర చదవండి: ఊహించని షాక్: 3 రాష్ట్రాల్లో బీజేపీకి ఘోర పరాభవం -
తల్లి మృతదేహాన్ని స్మశానంలోనే వదిలేసిన కొడుకు
సాక్షి, నిజామాబాద్: కరోనా వైరస్ సోకిందని ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన సంఘటనలు చూశాం. ఇక కోవిడ్‌తో మరణిస్తే మృతదేహాలను సైతం వదిలివెళ్లిన వార్తలను కూడా విన్నాం. అయితే తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న తల్లి చనిపోతే దహనం చేయకుండా స్మశాన వాటికలో మృతదేహాన్ని వదిలేసి వెళ్లాడు. ఈ ఘటన జిల్లాలోని ప్రగతినగర్ సర్వజనిక్ స్మశాన వాటికలో జరిగింది. ఓ వృద్ధురాలి మృతదేహాన్ని దహన సంస్కారాల కోసం తీసుకొచ్చిన ముగ్గురు వ్యక్తులు స్మశానంలోనే వదిలిపెట్టి వెళ్లిపోయారు. మృతదేహాన్ని స్మశానవాటికలో వదిలేసి కట్టెలు తీసుకు వస్తామని చెప్పిన ముగ్గురు వ్యక్తులు మళ్లీ తిరిగిరాని రాలేదు. ఎంత సమయం గడిచినా వాళ్లు తిరిగి రాకపోవడంతో స్మశానవాటిక వాచ్‌మెన్‌కి అనుమానం వచ్చిది. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వృద్ధురాలి మృతదేహాన్నిపోలీసులు ఆస్పత్రి మార్చురీకి తరలించారు. స్మశానంలో మృతదేహాన్ని వదిలి వెళ్లిన వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే ఆ ముగ్గురు వ్యక్తుల్లో వృద్ధురాలి కన్న కొడుకు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తన తల్లి కరోనా సోకి మరణించిందనే అనుమానంతో స్మశానంలో మృతదేహాన్ని వదిలివెళ్లినట్లు తెలుస్తోంది. చదవండి: ఓఎల్ఎక్స్ వేదికగా సోఫా కొంటానని.. -
ఖమ్మం నగరంలో మోడల్ ‘వైకుంఠధామం’
సాక్షి, ఖమ్మం: పేరుకు అది మరుభూమే కానీ.. అన్ని హంగులతో ‘మనిషి చివరి మజిలీ’ యాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా రూపుదిద్దుకుంది. ఖమ్మం నగరంలోని హిందూ శ్మశానవాటిక (వైకుంఠధామం) ఆధునిక సొబగులద్దుకుంది. రాష్ట్రంలోనే మోడల్‌గా నిలుస్తోన్న ఈ ధామాన్ని త్వరలో మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. మున్నేటి ఒడ్డున ఒకటి.. బల్లేపల్లిలో మరొకటి ఖమ్మం నగరానికి సమీపాన మున్నేరు సమీపంలో కాలువ ఒడ్డున నిజాం కాలం నుంచీ దహన, ఖనన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏటికేడాది జనాభా పెరగడంతో పట్టణం.. నగరంగా మారింది. దీంతో ఈ శ్మశానవాటికలో వసతులు లేక అంతిమయాత్ర నిర్వహించే వారికి ఇబ్బందులు తప్పట్లేదు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యత కార్యక్రమాల్లో భాగంగా శ్మశానవాటికలను వైకుంఠధామాల పేరుతో ప్రభుత్వం నిర్మిస్తోంది. గ్రామాలు, పట్టణాల్లో వీటికి స్థలాలు సేకరించి నిర్మాణాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఖమ్మం నగరంలోని ఈ వైకుంఠధామాన్ని రూ.2 కోట్లతో ఆధునీకరించారు. 3.5 ఎకరాల్లోని ఈ వైకుంఠధామానికి స్వాగత ద్వారం ఐటీ హబ్ ఆర్చ్‌ని తలపిస్తోంది. ఐదు దహన వాటికలు, అంత్యక్రియలకు వచ్చిన వారు కూర్చునేందుకు వెయిటింగ్ గ్యాలరీ, కేశఖండన, సాన్నాల గదులు, మరుగుదొడ్లు ఉన్నాయి. సీసీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్తో పాటు వైకుంఠధామంలో 20 అడుగులతో ఏర్పాటుచేసిన శివుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కడియం నుంచి తెచ్చిన అందమైన పూల మొక్కలు వైకుంఠధామం చుట్టూ నాటారు. అలాగే, ఖమ్మం నగరం పరిధిలోని బల్లేపల్లిలో నాలుగెకరాల విస్తీర్ణంలో మరో వైకుంఠధామాన్ని నిర్మించారు. గతేడాది డిసెంబర్లో ప్రారంభమైన ఈ వాటికలోనూ ఆధునిక హంగులతో పాటు 20 అడుగుల శివుని విగ్రహాన్ని పెట్టారు. అంత్యక్రియల కోసం వచ్చిన బంధువులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన గ్యాలరీలు -
‘నా కళ్ల ముందే చచ్చిపోయారు.. అంతా ముగిసిపోయింది’
లక్నో: ‘‘మా తమ్ముడు అర్వింద్ కుమార్‌కు చాలా సార్లు ఫోన్ చేశాను. తన నుంచి సమాధానం రాలేదు. కాసేపటి తర్వాత వేరొక వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేశారు. భవనం పైకప్పు కూలిపోయిందని చెప్పారు. వెంటనే నేను అక్కడికి బయల్దేరాను. నా తమ్ముడిని కాపాడుకోవాలని శతవిధాలా ప్రయత్నించాను. శిథిలాలల్లో కూరుకుపోయిన తన మృతదేహాన్ని బయటకు తీసుకురావడానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. అయినా ఆశ చావక తనను ఆస్పత్రికి తీసుకువెళ్లాను. కానీ అప్పటికే తన ప్రాణం పోయిందని వైద్యులు ధ్రువీకరించారు. అంతా ముగిసిపోయింది. నా తమ్ముడు మమ్మల్ని వదిలివెళ్లాడు’’ అంటూ శ్మశాన ప్రమాదంలో తన కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్న రాకేశ్ కుమార్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ ఘటనలో తన తల్లి స్వల్ప గాయాలతో బయటపడిందని, అయితే 36 ఏళ్ల వయస్సులోనే ఈ లోకాన్ని వీడిన తన చిన్న కొడుకుని తలచుకుంటూ విలపిస్తున్న ఆమెను ఓదార్చాడం తమ వల్ల కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు శ్మశానవాటికకు వెళ్లిన 23 మంది మృత్యువాత పడిన విషయం విదితమే. ఉత్తరప్రదేశ్‌లోని మురాద్‌నగర్‌లో గల స్థానిక శ్మశానవాటికలో ఉఖ్లార్సికి చెందిన జైరామ్‌కు తుది వీడ్కోలు పలుకుతున్న సమయంలో వర్షం కారణంగా పక్కనే ఉన్న భవనం పైకప్పు కూలిన ఈ ఘటన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. తన తాతయ్యను కడసారి చూసేందుకు ఢిల్లీ నుంచి యూపీ వచ్చిన అర్వింద్ కుమార్ సహా 22 మంది ప్రాణాలు కోల్పోయారు.(చదవండి: శ్మశానంలో విషాదం) నాతో మాట్లాడుతూనే.. ఈ ప్రమాదంలో మృత్యువాత పడిన జైవీర్ సింగ్(50) సోదరుడు ఉమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘గంటన్నర తర్వాత, క్రేన్ సహాయంతో రక్షణ బృందాలు తనను బయటకు తీశారు. అప్పుడు నాతో ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ తన వల్ల కాలేదు. అలా నా కళ్ల ముందే తను చనిపోయాడు’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఈ ఘటనలో గాయపడిన ఉద్ధమ్ సింగ్(25) అనే యువకుడు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇంతటి విషాదం చోటుచేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన కళ్లముందే ఇద్దరు వ్యక్తులు విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయారని, ఈ ప్రమాదానికి యోగి సర్కారు బాధ్యత వహించాలని పేర్కొన్నాడు. కాంట్రాక్టర్‌ను అరెస్టు చేయాలి ‘‘దాదాపు 20 నిమిషాల పాటు నేను స్పృహలో లేను. కళ్లు తెరచి చూసే సరికి శిథిలాల పడి ఉన్నా. ఇద్దరు స్నేహితులు వచ్చి నన్ను బయటకు తీశారు. నిజానికి దాదాపు నెలరోజుల క్రితమే ఈ షెల్టర్ నిర్మించారు. కానీ ఒకసారి వర్షం పడగానే కప్పు కూలిపోయింది. దీనిని నిర్మించిన కాంట్రాక్టర్‌ను వెంటనే జైలుకు పంపించాలి’’ అని ఉద్ధమ్ సింగ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. -
శ్మశానంలో ప్రమాదం.. 23 మంది మృతి
ఘజియాబాద్: బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు శ్మశానవాటికకు వెళ్లిన 23 మందిని మృత్యువు కబళించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. మురాద్‌నగర్‌లోని ఉఖ్లార్సికి చెందిన జైరామ్ అంత్యక్రియలు స్థానిక శ్మశానవాటికలో జరుగుతున్నాయి. అదే సమయంలో వర్షం ప్రారంభం కావడంతో హాజరైన చాలామంది అక్కడే ఉన్న భవనంలోకి చేరుకున్నారు. అకస్మాత్తుగా భవనం పైకప్పు కూలి వారిపై పడింది. దీంతో అక్కడికక్కడే 23 మంది చనిపోగా మరో 15 మంది గాయపడ్డారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నాయి. డాగ్‌స్క్వాడ్ సాయంతో శిథిలాల్లో చిక్కుకుపోయిన వారిని గుర్తించి వెలికితీశారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఆదివారం సాయంత్రం వరకు మృతుల్లో 18 మందిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఇటీవలే నిర్మించిన ఈ కట్టడం కూలి, అనూహ్యంగా ప్రాణ నష్టం సంభవించడంపై సీఎం పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. మృతదేహాలను తరలిస్తున్న దృశ్యం -
కన్నీళ్లు లేని కరోనా కథలు
హడావుడిగా అంతిమ వీడ్కోలు.. కన్నబిడ్డలు పక్కన ఉండరు.. కన్నీళ్లు కార్చడానికి కావల్సిన వారు రాలేరు.. కాడె మోసే వాళ్లు కనిపిం చరు.. శ్మశానం దాకా ఎవరూ వెంట రారు.. ఒక అనాథలా అంతిమ సంస్కారాలు జరిగిపోతున్నాయి.. కరోనా సృష్టించిన భయోత్పాతంతో అంతిమ వీడ్కోలు భారంగా మారింది.కన్నబిడ్డలు పక్కన ఉండరు. కన్నీళ్లు కార్చడానికి కావల్సిన వారు రాలేరు. పాడె మోసే వాళ్లు కనిపించరు. శ్మశానం దాకా ఎవరూ వెంటరారు. ఒక అనాథలా అంతిమ సంస్కారాలు జరిగిపోతున్నాయి. కరోనా సృష్టించిన భయోత్పాతంతో అంతిమ వీడ్కోలు భారంగా మారింది. చెన్నై, ముంబై: దేవాలయాలన్నీ వెలవెలబోతున్నాయెందుకు? దేవుళ్లందరూ వైద్యుల రూపంలో కరోనా రోగులకు చికిత్స చేస్తున్నారు. ఇదీ ఈ మధ్యకాలంలో వాట్సాప్‌లో తిరుగుతున్న ఒక సందేశం మరి అలాంటి దేవుళ్లనే కరోనా కాటేస్తూ ఉంటే వారికి తుది వీడ్కోలు చెప్పే దిక్కు కూడా లేదు. మొన్నటికి మొన్న నెల్లూరుకి చెందిన ఓ డాక్టర్ కోవిడ్–19తో పోరాడి చెన్నై ఆస్పత్రిలో మరణిస్తే స్థానికుల నిరసనల మధ్య ఆదరాబాదరాగా అంతిమ సంస్కారం నిర్వహించాల్సి వచ్చింది. అదే వారంలో మేఘాలయలో వైద్యుడు కోవిడ్–19 బాధితులకు చికిత్స చేసి తాను కూడా ప్రాణాలు కోల్పోతే మున్సిపాల్టీ కార్మికులే దహన ప్రక్రియలు పూర్తి చేశారు. వైద్యులే కాదు ఇప్పటివరకు భారత్‌లో కరోనాతో 775 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వారి అంతిమ సంస్కారాలన్నీ ఇలాగే జరుగుతున్నాయి. కరోనా మృతదేహం దగ్గరకి వెళ్లాలంటే అయినవారు కూడా హడలెత్తిపోతున్నారు. స్థానిక ప్రజలు మృతదేహాన్ని తీసుకువెళుతున్నా అడ్డుకుంటున్నారు. రాళ్లతో దాడులకూ దిగుతున్నారు. పటిష్టమైన బందోబస్తు మధ్య వారికి అంతిమ సంస్కారం నిర్వహించాల్సి వస్తోంది. వాస్తవానికి కోవిడ్‌తో మరణించినప్పటికీ మృతదేహం నుంచి వైరస్ సోకదు. అయినా ప్రజల్లో నెలకొన్న భయం, అవగాహనారాహిత్యం వారిలో సున్నితత్వాన్ని కూడా చంపేస్తోంది. దహనమా? ఖననమా? పంజాబ్ గాయకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత కోవిడ్–19తో మృతి చెందితే ఆయన మృతదేహాన్ని దహనం చేయడానికి ఆయన ఊరి ప్రజలే అంగీకరించలేదు. దహనం చేస్తే అందులోంచి వచ్చే పొగ వల్ల వైరస్ సోకుతుందని అంతిమ సంస్కారాన్ని అడ్డుకున్నారు. శ్మశానవాటికకు తాళాలు కూడా వేశారు. దీంతో ఆయన మృతదేహాన్ని ఊరి శివారు ప్రాంతాలకు తరలించి దహనం చేశారు. పంజాబ్‌లో కపుర్తాలాకు చెందిన ఒక మహిళ మరణిస్తే చివరి చూపు చూడడానికి కూడా కన్న కొడుకు రాలేదు. కరోనా భయంతో రావడానికి నిరాకరిస్తే మున్సిపాల్టీ సిబ్బందే మృతదేహాన్ని అంతిమ వీడ్కోలు పలికారు. మరోవైపు ముంబై కార్పొరేషన్ కోవిడ్‌తో మరణించే వారు ఎవరైనా, మతంతో సంబంధం లేకుండా దహనం చేస్తామంటూ నోటీసులు ఇచ్చింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో రాష్ట్ర మైనార్టీ వ్యవహారాల శాఖ ఆ నోటీసులు వెనక్కి తీసుకునేలా చేసింది. దీంతో మృతదేహాన్ని ఖననం చేయడానికి యంత్రాంగం అనుమతిచ్చినా స్థానికులు అడ్డుకుంటున్నారు. మృత దేహాలను దహనమే చేయాలని, లేకపోతే వైరస్ సోకుతుందని అంటున్నారు. భౌతిక దూరం నిబంధనల కారణంగా అయిన వారు మరణించినా అయిదారుగురి కంటే ఎక్కువ మంది హాజరవడానికి ఎక్కడా అనుమతులివ్వడం లేదు. కోవిడ్‌తో మరణిస్తే పోలీసులు, కార్పొరేషన్ సిబ్బంది హడావుడిగా అంతిమ సంస్కారాలు నిర్వహించడమే తప్ప, కన్నీళ్లు రాల్చేవారూ కరువయ్యారు. ఇంతకు మించిన విషాదం ఏముంటుంది? న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్న వైద్యుడి భార్య ఇదో వైద్యుడి భార్య వ్యథ. చెన్నైకి చెందిన ఓ డాక్టర్ కోవిడ్ రోగులకి అలుపెరుగకుండా చికిత్స చేశారు. దీంతో ఆ మహమ్మారి ఆయనకీ అంటుకుంది. కొద్ది రోజులు ప్రాణాలతో పోరాడి కన్నుమూశారు. ఆ డాక్టర్ మృతదేహం నుంచి వైరస్ తమకు ఎక్కడ అంటుకుంటుందోనని స్థానికులు ఆయన మృతదేహాన్ని తీసుకువెళుతున్న అంబులెన్స్‌ని అడ్డుకున్నారు. రాళ్లతో దాడి చేశారు. దీంతో వెలంగాడు శ్మశాన వాటికలో మున్సిపల్ అధికారులు హడావుడిగా పూడ్చి పెట్టేశారు. అయితే ఆయన భార్య ఆనంది సైమన్ తన భర్త చివరి కోరిక మేరకు కిల్పాకలోనే మతపరమైన ప్రార్థనలు నిర్వహించాకే అంతిమ సంస్కారం చేయాలని పట్టుపడుతోంది. మృతదేహం నుంచి వైరస్ సోకదని డబ్ల్యూహెచ్ఓ చెప్పినా ప్రజల్లో అవగాహన లేకపోవడం విచారకరమని కన్నీరు మున్నీరవుతోంది. దీనిపై ఎంత దూరమైనా వెళతానని న్యాయపోరాటానికైనా సిద్ధమని చెబుతోంది. డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పింది ? కరోనా వైరస్‌తో కన్నుమూస్తే ఆ మృతదేహం నుంచి వైరస్ సోకే అవకాశం లేదు. రోగి ప్రాణాలు కోల్పోయిన రెండు, మూడు గంటల్లో వైరస్ కూడా చచ్చిపోతుంది. అందుకే అంతిమ సంస్కారాలు వారి కోరిక మేరకు నిర్వహించుకోవచ్చు. -
భయానకం : మనిషి మాంసంతో కూర వండాడు
లక్నో : తాగిన మైకంలో ఓ వ్యక్తి దెయ్యంలా ప్రవర్తించాడు. స్మశానవాటికకు వెళ్లి ఓ మృతదేహం చేయిని తీసుకువచ్చి కూర వండాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్ టిక్కోపూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. సంజయ్(32) అనే వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు. నిత్యం మద్యం సేవిస్తూ కుటుంబ సభ్యులను హింసించేవాడు. పిచ్చిగా ప్రవర్తించేవాడు. తండ్రిపై కూడా ఇటీవలే దాడి చేశాడు. అయితే సోమవారం మధ్యాహ్నం సమయంలో గ్రామానికి సమీపంలో ఉన్న స్మశానవాటికకు వెళ్లాడు. అక్కడ ఓ మృతదేహం చేయిని ఇంటికి తీసుకొచ్చాడు. చేతి వేళ్లను సెపరేట్ చేసి.. కూర వండాడు. ఈ విషయాన్ని గమనించిన అతని భార్య తీవ్ర భయాందోళనకు గురైంది. వెంటనే పక్కింటివారి సహాయంతో పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు అక్కడికి చేరుకుని సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
మృతదేహం అంత్యక్రియల్లో హైడ్రామా
విజయనగరం, పూసపాటిరేగ: పక్క గ్రామానికి చెందిన మృతదేహానికి తమ గ్రామ శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేసేందుకు వీల్లేదని గ్రామస్తులు అడ్డుపడడంతో వివాదం నెలకొంది. దీంతో మృతదేహం సుమారు గంట పాటు గ్రామ సరిహద్దులోనే ఉండిపోయింది. చివరకు మాజీ సర్పంచ్ జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. వివరాల్లోకి వెళ్తే...గోవిందపురం గ్రామానికి చెందిన బంగారు రాముడు(70) శుక్రవారం మృతి చెందాడు. గోవిందపురం గ్రామస్తులు కూడా భరిణికాం శ్మశాన వాటికనే దశాబ్దాల తరబడి వినియోగిస్తున్నారు. బంగారురాముడు ఎస్సీ కులానికి చెందినవాడు కావడంతో తమ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు వీల్లేదని భరిణికాం మహిళలు మృతదేహాన్ని అడ్డుకున్నారు. వెనక్కి తీసుకువెళ్లాలని చెప్పడంతో సుమారు గంట పాటు మృతదేహం మార్గమధ్యలోనే ఉండిపోయింది. విషయం తెలుసుకున్న గోవిందపురం మాజీ సర్పంచ్ విక్రం జగన్నాధం భరిణికాం గ్రామస్తులతో చర్చించారు. మృతదేహాన్ని అడ్డుకోవద్దని గట్టిగా చెప్పడంతో భరిణికాం గ్రామస్తులు అడ్డు తొలగారు. దీంతో బంగారురాముడు మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి. -
బతికుండగానే తల్లిని శ్మశానానికి...
* కన్నతల్లిని శ్మశానంలో వదిలేసి పరారైన ఓ తనయుడు * ఆస్పత్రిలో చేర్చిన పోలీసులు, కొడుకుపై కేసు నమోదు అమలాపురం టౌన్: కొడుకు తనని నిర్దయగా శ్మశానంలో వదిలి వెళ్తున్నా ఆగ్రహించని ఆ మాతృహృదయం ‘‘ సరే.. వదిలేస్తే వదిలేశావ్, కనీసం ఏదైనా గుడి దగ్గరైనా వదిలేయ్రా..’’ అంటూ ప్రాధేయపడింది. అయినా కనికరించని ఆ పాషాణ హృదయం ఆ పండుటాకును మరుభూమిలోనే నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్లిపోయింది.. తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన ఉప్పు సత్యవతి (75) దుస్థితి ఇది. ఆమె పట్టణానికి సమీపంలోని పేరూరు పేటలో అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఆమె ఏకైక కుమారుడు హనుమంతరావు బతుకుదెరువు కోసం రాజమహేంద్రవరం వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. అతను తల్లికి డబ్బులు పంపిస్తుండగా స్థానికులు కొంత సాయపడుతున్నారు. ఇంతలో సత్యవతి అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని కొత్త ఇల్లు కట్టుకునే యత్నంలో ఆమెను ఖాళీ చేయమన్నాడు. విషయం తెలిసీ హనుమంతరావు బుధవారం పేరూరుపేట వచ్చి తల్లిని రాజమహేంద్రవరం తీసుకెళ్లాడు. అరుుతే తన ఇంటికి కాకుండా ఏదైనా ఆశ్రమంలో చేర్చాలని ప్రయత్నించాడు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆమెకు ఆశ్రయం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రాత్రి 9 గంటలకు అమలాపురంలోని ఏఎంజీ కాలనీకి ఆనుకుని ఉన్న శ్మశానానికి తీసుకెళ్లి అక్కడ ఉంచి ఆమెచేతిలో రూ.300 పెట్టి ఆటోలో పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్ గురువారం ఆమెకు ఆహారం అందించి వైద్యం కోసం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సీనియర్ సిటిజన్స్ యాక్టు ప్రకారం ఆమె కొడుకుపై కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆమెను ప్రభుత్వ షెల్టర్ హోమ్‌కు తరలిస్తామన్నారు.