లక్నో: ‘‘మా తమ్ముడు అర్వింద్ కుమార్‌కు చాలా సార్లు ఫోన్ చేశాను. తన నుంచి సమాధానం రాలేదు. కాసేపటి తర్వాత వేరొక వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేశారు. భవనం పైకప్పు కూలిపోయిందని చెప్పారు. వెంటనే నేను అక్కడికి బయల్దేరాను. నా తమ్ముడిని కాపాడుకోవాలని శతవిధాలా ప్రయత్నించాను. శిథిలాలల్లో కూరుకుపోయిన తన మృతదేహాన్ని బయటకు తీసుకురావడానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. అయినా ఆశ చావక తనను ఆస్పత్రికి తీసుకువెళ్లాను. కానీ అప్పటికే తన ప్రాణం పోయిందని వైద్యులు ధ్రువీకరించారు. అంతా ముగిసిపోయింది. నా తమ్ముడు మమ్మల్ని వదిలివెళ్లాడు’’ అంటూ శ్మశాన ప్రమాదంలో తన కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్న రాకేశ్ కుమార్ కన్నీటి పర్యంతమయ్యాడు.
ఈ ఘటనలో తన తల్లి స్వల్ప గాయాలతో బయటపడిందని, అయితే 36 ఏళ్ల వయస్సులోనే ఈ లోకాన్ని వీడిన తన చిన్న కొడుకుని తలచుకుంటూ విలపిస్తున్న ఆమెను ఓదార్చాడం తమ వల్ల కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు శ్మశానవాటికకు వెళ్లిన 23 మంది మృత్యువాత పడిన విషయం విదితమే. ఉత్తరప్రదేశ్‌లోని మురాద్‌నగర్‌లో గల స్థానిక శ్మశానవాటికలో ఉఖ్లార్సికి చెందిన జైరామ్‌కు తుది వీడ్కోలు పలుకుతున్న సమయంలో వర్షం కారణంగా పక్కనే ఉన్న భవనం పైకప్పు కూలిన ఈ ఘటన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. తన తాతయ్యను కడసారి చూసేందుకు ఢిల్లీ నుంచి యూపీ వచ్చిన అర్వింద్ కుమార్ సహా 22 మంది ప్రాణాలు కోల్పోయారు.(చదవండి: శ్మశానంలో విషాదం)
నాతో మాట్లాడుతూనే..
ఈ ప్రమాదంలో మృత్యువాత పడిన జైవీర్ సింగ్(50) సోదరుడు ఉమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘గంటన్నర తర్వాత, క్రేన్ సహాయంతో రక్షణ బృందాలు తనను బయటకు తీశారు. అప్పుడు నాతో ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ తన వల్ల కాలేదు. అలా నా కళ్ల ముందే తను చనిపోయాడు’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఈ ఘటనలో గాయపడిన ఉద్ధమ్ సింగ్(25) అనే యువకుడు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇంతటి విషాదం చోటుచేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన కళ్లముందే ఇద్దరు వ్యక్తులు విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయారని, ఈ ప్రమాదానికి యోగి సర్కారు బాధ్యత వహించాలని పేర్కొన్నాడు.
కాంట్రాక్టర్‌ను అరెస్టు చేయాలి
‘‘దాదాపు 20 నిమిషాల పాటు నేను స్పృహలో లేను. కళ్లు తెరచి చూసే సరికి శిథిలాల పడి ఉన్నా. ఇద్దరు స్నేహితులు వచ్చి నన్ను బయటకు తీశారు. నిజానికి దాదాపు నెలరోజుల క్రితమే ఈ షెల్టర్ నిర్మించారు. కానీ ఒకసారి వర్షం పడగానే కప్పు కూలిపోయింది. దీనిని నిర్మించిన కాంట్రాక్టర్‌ను వెంటనే జైలుకు పంపించాలి’’ అని ఉద్ధమ్ సింగ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment