
బతికుండగానే తల్లిని శ్మశానానికి...
* కన్నతల్లిని శ్మశానంలో వదిలేసి పరారైన ఓ తనయుడు
* ఆస్పత్రిలో చేర్చిన పోలీసులు, కొడుకుపై కేసు నమోదు
అమలాపురం టౌన్: కొడుకు తనని నిర్దయగా శ్మశానంలో వదిలి వెళ్తున్నా ఆగ్రహించని ఆ మాతృహృదయం ‘‘ సరే.. వదిలేస్తే వదిలేశావ్, కనీసం ఏదైనా గుడి దగ్గరైనా వదిలేయ్‌రా..’’ అంటూ ప్రాధేయపడింది. అయినా కనికరించని ఆ పాషాణ హృదయం ఆ పండుటాకును మరుభూమిలోనే నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్లిపోయింది.. తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన ఉప్పు సత్యవతి (75) దుస్థితి ఇది. ఆమె పట్టణానికి సమీపంలోని పేరూరు పేటలో అద్దె ఇంట్లో నివసిస్తోంది.
ఆమె ఏకైక కుమారుడు హనుమంతరావు బతుకుదెరువు కోసం రాజమహేంద్రవరం వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. అతను తల్లికి డబ్బులు పంపిస్తుండగా స్థానికులు కొంత సాయపడుతున్నారు. ఇంతలో సత్యవతి అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని కొత్త ఇల్లు కట్టుకునే యత్నంలో ఆమెను ఖాళీ చేయమన్నాడు. విషయం తెలిసీ హనుమంతరావు బుధవారం పేరూరుపేట వచ్చి తల్లిని రాజమహేంద్రవరం తీసుకెళ్లాడు. అరుుతే తన ఇంటికి కాకుండా ఏదైనా ఆశ్రమంలో చేర్చాలని ప్రయత్నించాడు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆమెకు ఆశ్రయం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
దీంతో రాత్రి 9 గంటలకు అమలాపురంలోని ఏఎంజీ కాలనీకి ఆనుకుని ఉన్న శ్మశానానికి తీసుకెళ్లి అక్కడ ఉంచి ఆమెచేతిలో రూ.300 పెట్టి ఆటోలో పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ గురువారం ఆమెకు ఆహారం అందించి వైద్యం కోసం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సీనియర్ సిటిజన్స్ యాక్టు ప్రకారం ఆమె కొడుకుపై కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆమెను ప్రభుత్వ షెల్టర్ హోమ్‌కు తరలిస్తామన్నారు.