రెండేళ్ల చిన్నారిని నడుముకు కట్టుకుని మహిళ ఆత్మహత్య
తుప్పల్లో అమ్మ మృతదేహంతోనే రెండు రోజులున్న చిన్నారి
ఒంటి నిండా దోమకాట్లతో ఏడుస్తూ రోడ్డుపైకి..
అరకులోయ రూరల్: ఆ అమ్మ మనసుకు తట్టుకోలేని గాయమైంది. ఆత్మహత్యే శరణ్యం అనుకుంది. తన రెండేళ్ల చిన్నారిని నడుముకు కట్టుకుని ఊరి చివర తుప్పల్లో చెట్టుకు ఉరేసుకుంది. ఈ విషయం తెలియని చిన్నారి అమ్మతోనే ఉన్నాననుకుని ధైర్యంగా ఉంది. ఓపక్క ఆకలి.. చుట్టూ చీకటి.. కీచురాళ్ల అరుపులు.. దోమల కాట్లు.. అయినా అమ్మ ఉందన్న నమ్మకం రెండు రోజులు బతికించింది. అమ్మతో పాటే ఆ చెట్టుకు వేలాడింది. రెండు రోజుల తర్వాత కట్టు విడిపోవడంతో కింద పడి ఏడ్చుకుంటూ సమీపంలోని రోడ్డుపైకి వచి్చంది. ఈ హృదయ విదారక ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం పెదలబుడు పంచాయతీ పానిరంగిని గ్రామంలో జరిగింది.
స్థానిక సీఐ రుద్రశేఖర్, ఎస్‌ఐ సంతోష్, గ్రామస్తుల కథనం ప్రకారం.. అరకు మండలంలోని పద్మాపురం గ్రామానికి చెందిన పాంగి పద్మ (24) భర్త, ఇద్దరు పిల్లలు, అత్త, మామతో కలిసి జీవిస్తోంది. ఆమె బుధవారం తన రెండేళ్ల కుమార్తె చిన్నితో కలిసి పానిరంగిని గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లింది. ఉదయం భోజనం తర్వాత బంధువులు వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి వచ్చేసరికి పద్మ ఇంటి వద్ద లేదు. ఆమె పద్మాపురం వెళ్లిపోయి ఉంటుందని వారు భావించారు. అయితే శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఏడ్చుకుంటూ పానిరంగిని గ్రామ సమీపంలోని తుప్పల నుంచి చిన్నారి బయటకు రావడం గ్రామస్తులు గమనించారు. దోమల కాట్లతో వీపంతా ఎర్రగా కందిపోయిన ఆ చిన్నారిని చూసి పద్మ కుమార్తెగా గుర్తించారు.
ఆ సమాచారాన్ని వారు వెంటనే బంధువులకు అందించారు. దీంతో అక్కడకు వెళ్లి పరిశీలించగా పద్మ చెట్టుకు ఉరివేసుకుని చనిపోయి ఉంది. చిన్నారిని నడుముకు కట్టుకుని బుధవారం మధ్యాహ్నమే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని, కట్టువీడటంతో చిన్నారి బయటపడి రోడ్డుపైకి వచి్చందని, తల్లివద్ద పాలుతాగి ఆకలి తీర్చుకుని ఉంటుందని భావిస్తున్నారు.
వారం క్రితం మద్యం మత్తులో ఉండగా పద్మకు, భర్తకు గొడవ జరిగిందని, మనస్తాపానికి గురయ్యి పద్మ ఆత్మహత్య చేసుకుని ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. పాడేరు నుంచి వచ్చిన క్లూస్ టీం వేలిముద్రలు సేకరించింది. పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ సంతో‹Ù చెప్పారు. ఘటనా స్థలాన్ని సర్పంచ్ సుస్మిత పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment