కెనడాకు పోనివ్వలేదని కన్నతల్లినే హత్య చేశాడు | A Man in Delhi Stabs Mother For Not Funding Canada Move | Sakshi
Sakshi News home page

కెనడాకు పోనివ్వలేదని కన్నతల్లినే హత్య చేశాడు

Published Sun, Nov 10 2024 9:35 AM | Last Updated on Sun, Nov 10 2024 11:32 AM

A Man in Delhi Stabs Mother For Not Funding Canada Move

ఢిల్లీలో ఘటన

న్యూఢిల్లీ: మత్తు మహమ్మారికి బానిసైన పెద్దకుమారుడు కన్నతల్లినే చంపేసిన ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకుంది. ఆగ్నేయ ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ రవిసింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం దక్షిణ ఢిల్లీలోని బాదర్‌పూర్‌ ప్రాంతంలోని మోలార్‌బంద్‌ గ్రామంలో 52 ఏళ్ల సుర్జీత్‌ సింగ్‌ భార్య గీత, పెద్దకుమారుడు కృష్ణకాంత్‌(31), చిన్న కుమారుడు సాహిల్‌ బోలీ(27) తో కలిసి ఉంటున్నారు. 

సుర్జీత్‌ స్తిరాస్థి వ్యాపారికాగా సాహిల్‌ ఒక బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు. పెద్దకొడుకు కృష్ణకాంత్‌ మాత్రం తాగుడు, మత్తుపదార్థాలకు బానిసై ఖాళీగా తిరిగేవాడు. తల్లి గీత ఎంతచెప్పినా వినేవాడు కాదు. పైగా కెనడాలో ఉద్యోగం చేస్తా, అక్కడికి వెళ్లి సెటిల్‌ అవుతానని డబ్బులు ఇవ్వాలని తరచూ గొడవ చేసేవాడు.

‘‘నీకు పెళ్లిచేస్తే అంతా సర్దుకుంటుంది. తొలుత పెళ్లి. ఆ తర్వాతే కెనడా ఆలోచన’అని తల్లి వారించేది. నవంబర్‌ ఆరో తేదీ సాయంత్రం సైతం ఎవరూలేని సమయంలో తల్లితో కృష్ణకాంత్‌ ఇదే విషయమై తీవ్ర వాగ్వాదం జరిగింది. పట్టరాని కోపంతో కత్తితో తల్లిని పలుమార్లు పొడిచి చంపేసి తండ్రికి ఫోన్‌చేసి రప్పించాడు. పై గదిలో తల్లి చనిపోయి పడిఉందని, క్షమాపణలు చెప్పి పైకి తీసుకెళ్లాడు. రక్తపుమడుగులో పడి ఉన్న భార్యను చూసి సుర్జీత్‌ నిశ్చేష్టుడై నిల్చుంటే కొడుకు గదికి బయటి నుంచి తాళం వేసి పారిపోయాడు.

ఇరుగుపొరుగు వారి సాయంతో తండ్రి ఎలాగోలా బయటపడి తల్లిని దగ్గర్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందిందని వైద్యులు ధృవీకరించారు. విషయం తెల్సుకున్న పోలీసులు అదే ప్రాంతంలో కృష్ణకాంత్‌ను అరెస్ట్‌చేసి హత్యకు కారణాలు అడిగారు. ‘‘నేను జీవితంలో ఎదగకపోవడానికి నా తల్లే కారణం. కెనడాకు వెళ్లకుండా నాకు వ్యతిరేకంగా ఆమె క్షుద్రపూజలు చేయిస్తోంది. నేనిలా ఉండటానికి ఆమే కారణం’’అని చెప్పాడు. డ్రగ్స్‌కు బానిసైన ఇతడు తల్లిని చంపేందుకు ముందే పథకరచన చేశాడని, గతంలో ఒక కత్తిని ఇందు కోసమే కొన్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement