రోడ్డుపైనే మృతదేహంతో వేచి ఉన్న గోవిందపురం గ్రామస్తులు
విజయనగరం, పూసపాటిరేగ: పక్క గ్రామానికి చెందిన మృతదేహానికి తమ గ్రామ శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేసేందుకు వీల్లేదని గ్రామస్తులు అడ్డుపడడంతో వివాదం నెలకొంది. దీంతో మృతదేహం సుమారు గంట పాటు గ్రామ సరిహద్దులోనే ఉండిపోయింది. చివరకు మాజీ సర్పంచ్ జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. వివరాల్లోకి వెళ్తే...గోవిందపురం గ్రామానికి చెందిన బంగారు రాముడు(70) శుక్రవారం మృతి చెందాడు. గోవిందపురం గ్రామస్తులు కూడా భరిణికాం శ్మశాన వాటికనే దశాబ్దాల తరబడి వినియోగిస్తున్నారు. బంగారురాముడు ఎస్సీ కులానికి చెందినవాడు కావడంతో తమ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు వీల్లేదని భరిణికాం మహిళలు మృతదేహాన్ని అడ్డుకున్నారు. వెనక్కి తీసుకువెళ్లాలని చెప్పడంతో సుమారు గంట పాటు మృతదేహం మార్గమధ్యలోనే ఉండిపోయింది. విషయం తెలుసుకున్న గోవిందపురం మాజీ సర్పంచ్ విక్రం జగన్నాధం భరిణికాం గ్రామస్తులతో చర్చించారు. మృతదేహాన్ని అడ్డుకోవద్దని గట్టిగా చెప్పడంతో భరిణికాం గ్రామస్తులు అడ్డు తొలగారు. దీంతో బంగారురాముడు మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment