చితిపై బతికొచ్చాడు | Rajasthan man declared dead found alive during cremation | Sakshi
Sakshi News home page

చితిపై బతికొచ్చాడు

Published Sat, Nov 23 2024 6:13 AM | Last Updated on Sat, Nov 23 2024 6:13 AM

Rajasthan man declared dead found alive during cremation

చనిపోయాడని నిర్ధారించిన డాక్టర్లు  

చితికి నిప్పంటిస్తుండగా శ్వాసపీల్చిన వైనం  

కొన్ని గంటల తర్వాత మృతి 

నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ముగ్గురు డాక్టర్ల సస్పెన్షన్‌  

జైపూర్‌:  మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించిన ఓ వ్యక్తి శ్మశానంలో చితిపైకి చేర్చగానే శ్వాస పీల్చడం ప్రారంభించాడు. అతడు ప్రాణాలతోనే ఉన్నట్లు తేలింది. దీంతో ఆంత్యక్రియలకు వచ్చినవారంతా షాక్‌ తిన్నారు. అయితే, కొన్ని గంటల తర్వాత ఆ వ్యక్తి తుదిశ్వాస విడిచాడు. ఆశ్చర్యకరమైన ఈ సంఘటన రాజస్తాన్‌లోని జుంఝున్‌లో చోటుచేసుకుంది. 

ప్రాణంతో ఉన్న వ్యక్తి మరణించినట్లు ప్రకటించడంతోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ముగ్గురు వైద్యులను జుంఝునూ జిల్లా కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. 25 ఏళ్ల రోహితాశ్‌ కమార్‌ దివ్యాంగుడు. వినలేడు, మాట్లాడలేడు. అతడి కుటుంబం ఏమైందో, ఎక్కడుందో తెలియదు. అనాథగా మారాడు. అనాథాశ్రమంలో ఉంటున్నాడు. గురువారం హఠాత్తుగా అనారోగ్యం పాలయ్యాడు. అపస్మారక స్థితికి చేరుకోవడంతో జుంఝునూ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు.

 అతడు చనిపోయినట్లు గురువారం మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్లు ప్రకటించారు. దాంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. రెండు గంటలపాటు అక్కడే ఉంచారు. పోలీసులు పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని అంత్యక్రియల కోసం శ్మశానానికి తరలించారు. దహనం చేయడానికి చితిపైకి చేర్చారు. చితికి నిప్పంటించడానికి సిద్ధమవుతుండగా రోహితాశ్‌ శ్వాస పీల్చుకోవడం ప్రారంభించాడు. అతడు బతికే ఉన్నట్లు గుర్తించి వెంటనే అంబులెన్స్‌ రప్పించారు. 

జుంఝునూలోని బీడీకే హాస్పిటల్‌కు తరలించారు. ఐసీయూలో చేర్చి చికిత్స ప్రారంభించారు. మెరుగైన చికిత్స కోసం శుక్రవారం జైపూర్‌లోని ఎస్‌ఎంఎస్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా, మధ్యలోనే ప్రాణాలు విడిచాడు. బతికి ఉన్న వ్యక్తి మరణించినట్లు నిర్ధారించినందుకు జుంఝున్‌ ప్రభుత్వ ఆసుపత్రి ప్రిన్సిపల్‌ మెడికల్‌ ఆఫీసర్‌ సందీప్‌ పచార్‌తోపాటు మరో ఇద్దరు డాక్టర్లను జిల్లా కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement