30 ఏళ్ల తర్వాత తన పేరు గుర్తొచ్చింది..!
21 ఏళ్ల వయస్సులో ఆయన ఇంటి నుంచి తప్పిపోయాడు. భౌతికంగా ఎదిగినా మానసికంగా పిల్లాడి తత్వమున్న వ్యక్తి.. ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయి 30 ఏళ్లయింది. అతని కోసం వెతికి వేసారిన కుటుంబసభ్యులు కూడా ఇక లాభం లేదు.. ఆయన చనిపోయి ఉంటాడని నిర్ధారణకు వచ్చారు. ఆయనను వెతకడం మానేశారు.
కానీ కెనడాకు చెందిన ఎడ్గర్ లాతులిప్కు ఒకరోజు ఉన్నట్టుండి తన పేరు గుర్తుకువచ్చింది. తాను ఎవరు, ఎక్కడివాడినన్న వివరాలూ వెలుగులోకి వచ్చాయి. దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ లాతులిప్ తన కుటుంబసభ్యులను త్వరలోనే కలుసుకోబోతున్నాడు. ఆ భావోద్వేగంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.
ఒంటారియా రాష్ట్రంలోని కిట్చెనర్కు చెందిన లాతులిప్ మానసిక పరిస్థితి బాగోలేదు. ఇంట్లో ఉన్నప్పుడు అతను కొన్నిసార్లు ఆత్మహత్యయత్నానికి ఒడిగట్టాడు. చిన్న పిల్లాడి మనస్తత్వమున్న అతను ఇంటి నుంచి వెళ్లిపోవడంతో అతని ఎవరైనా చంపేసి ఉంటారని అతని అమ్మ భయపడింది. అయితే ఈ 30 ఏళ్లు ఎలాగోలా బతికేసిన ఎడ్గర్ లాతులిప్ తన సొంతూరికి 120 కిలోమీటర్ల దూరంలోని ఓ పట్టణంలో తేలాడు. అతన్ని గుర్తించిన ఓ సామాజిక కార్యకర్త గతం గుర్తుకుతేవడానికి ప్రయత్నించాడు. అతని ప్రయత్నం సఫలమైంది. తన పేరు ఎడ్గర్ లాతులిప్ అని ఉండేదని అతను చెప్పాడు. దీంతో లాతులిప్కు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అతని కుటుంబసభ్యులతో అతని డీఎన్ఏ మ్యాచ్ కావడంతో.. ఇప్పుడు లాతులిప్, అతని కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. ప్రస్తుతం ఒట్టావాలో ఉంటున్న 76 ఏళ్ల అతని వృద్ధ తల్లి సిల్వియా విల్సన్ తన కొడుకు తిరిగి వస్తున్నాడన్న వార్తతో సంతోషాన్ని, సంభ్రమాశ్చర్యాలను వ్యక్తం చేసింది. ఇది నిజంగా నమ్మశక్యంగా లేదని ఆమె ఆనందం వ్యక్తం చేసింది.