dead alive
-
చితిపై బతికొచ్చాడు
జైపూర్: మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించిన ఓ వ్యక్తి శ్మశానంలో చితిపైకి చేర్చగానే శ్వాస పీల్చడం ప్రారంభించాడు. అతడు ప్రాణాలతోనే ఉన్నట్లు తేలింది. దీంతో ఆంత్యక్రియలకు వచ్చినవారంతా షాక్ తిన్నారు. అయితే, కొన్ని గంటల తర్వాత ఆ వ్యక్తి తుదిశ్వాస విడిచాడు. ఆశ్చర్యకరమైన ఈ సంఘటన రాజస్తాన్‌లోని జుంఝున్లో చోటుచేసుకుంది. ప్రాణంతో ఉన్న వ్యక్తి మరణించినట్లు ప్రకటించడంతోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ముగ్గురు వైద్యులను జుంఝునూ జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. 25 ఏళ్ల రోహితాశ్ కమార్ దివ్యాంగుడు. వినలేడు, మాట్లాడలేడు. అతడి కుటుంబం ఏమైందో, ఎక్కడుందో తెలియదు. అనాథగా మారాడు. అనాథాశ్రమంలో ఉంటున్నాడు. గురువారం హఠాత్తుగా అనారోగ్యం పాలయ్యాడు. అపస్మారక స్థితికి చేరుకోవడంతో జుంఝునూ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అతడు చనిపోయినట్లు గురువారం మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్లు ప్రకటించారు. దాంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. రెండు గంటలపాటు అక్కడే ఉంచారు. పోలీసులు పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని అంత్యక్రియల కోసం శ్మశానానికి తరలించారు. దహనం చేయడానికి చితిపైకి చేర్చారు. చితికి నిప్పంటించడానికి సిద్ధమవుతుండగా రోహితాశ్ శ్వాస పీల్చుకోవడం ప్రారంభించాడు. అతడు బతికే ఉన్నట్లు గుర్తించి వెంటనే అంబులెన్స్ రప్పించారు. జుంఝునూలోని బీడీకే హాస్పిటల్‌కు తరలించారు. ఐసీయూలో చేర్చి చికిత్స ప్రారంభించారు. మెరుగైన చికిత్స కోసం శుక్రవారం జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలిస్తుండగా, మధ్యలోనే ప్రాణాలు విడిచాడు. బతికి ఉన్న వ్యక్తి మరణించినట్లు నిర్ధారించినందుకు జుంఝున్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్ సందీప్ పచార్తోపాటు మరో ఇద్దరు డాక్టర్లను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. -
ప్రాణం లేదని.. కాటికి తీసుకెళ్తే..
సాక్షి, కందుకూరు: జీవం లేదు.. వెంటిలేటర్ తీసివేస్తే మహా అయితే రెండు గంటలు ప్రాణం ఉంటుంది.. అని ఒంగోలులోని ఓ కార్పొరేటు వైద్యశాల వైద్యులు చెప్పకొచ్చారు. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇంటికి ఎందుకు తీసుకెళ్లడం.. అని కందుకూరులోని శ్మశానానికి తీసుకెళ్లారు. పూడ్చి పెట్టేందుకు గుంత కూడా తీసిపెట్టారు... కానీ అక్కడకు తీసుకువెళ్లిన తరువాత అందరినీ ఆశ్చర్యపరిచేలా కాళ్లు, చేతులు కదిలించాడు. కళ్లు తెరిచి చూశాడు. ఈ సంఘటన చూసి అక్కడి వారందరూ అవాక్కయ్యారు. వెంటనే స్థానికంగా కందుకూరులోని వైద్యులతో మాట్లాడి వైద్యశాలలో చేర్పించారు. తరువాత కాస్త కుదుటపడ్డాడు. మజ్జిగ తాగాడు. మరలా 7 గంటలసేపు మృత్యువుతో పోరాడి మరణించాడు. కందుకూరు పట్టణంలో ఆదివారం జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్‌లోని పి.వెంకటేశ్వర్లు (56) టీవీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కాళిదాసువారి వీధిలోని అద్దె ఇంటిలో నివాసం ఉంటాడు. భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. శుక్రవారం ఉదయం బాత్రూంకు వెళ్లి జారిపడి అపస్మారక స్థితిలోనికి వెళ్లాడు. కుటుంబ సభ్యులు వెంటనే కందుకూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యం చేయించుకున్నారు. పరిస్థితి ఫర్వాలేదనడంతో ఇంటికి తీసుకువెళ్లారు. మరలా శనివారం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తరువాత కందుకూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకుని వెళ్లారు. అత్యవసర చికిత్స అవసరం అని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. రిమ్స్ వైద్యులు ఇక్కడ తలకు సంబంధించిన ఆధునిక పరికరాలు లేవు అని చెప్పడంతో ఒంగోలులోని పలు వైద్యశాలకు తీసుకుని వెళ్లినా ఖాళీలు లేక చేర్చుకోలేదు. దీంతో తన కుమారుడు మా నాన్న కు న్యాయం చేయండి.. అని కందుకూరు సామాజిక మాధ్యమాల గ్రూపుల్లో తెలియచేశాడు. దీంతో పాత్రికేయులు, స్థానికులు స్పందించారు. తోచిన విధంగా తెలిసిన వైద్యులతో మాట్లాడారు. శ్మశానంలో గుంత తీస్తున్న బంధువులు చివరగా ఓ కార్పొరేటు వైద్యశాలకు తీసుకుని వెళ్లారు. కరోనా పరీక్షలు చేసి నెగిటివ్ రావడంతో అక్కడ వైద్యం చేయించారు. వైద్యులు వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందించారు. ఆదివారం ఉదయం అక్కడ వైద్యులు పరీక్షించి పరిస్థితి విషమంగా ఉంది. ఇక్కడ ఉంచి డబ్బులు వృథా చేసుకోవడం ఎందుకు అని సలహాలు ఇచ్చారు. వెంటిలేటర్ తీసి వేస్తే మరో రెండు గంటలు ప్రాణం ఉంటుందని తరువాత ఉండదు అని చెప్పి ఇంటికి తీసుకుని వెళ్లమని చెప్పారు. కుటుంబ సభ్యులు ఎలాగా జీవం లేదన్నారు. ఇంటికి వెళ్లడానికి సొంత ఇల్లు లేదు. అద్దె ఇంటికి ఎందుకు తీసుకువెళ్లడం అని నేరుగా శ్మశానానికి తీసుకుని వెళ్లారు. అక్కడకు వెళ్లి ఆరామ క్షేత్రంలో ఉంచి.. పూడ్చిపెట్టడానికి గుంట కూడా తీసి పెట్టారు. ఈ తంతు అంతా జరుగుతున్న సమయంలో ఆ వ్యక్తి శరీరంలో మార్పులు వచ్చాయి. కాళ్లు చేతులు కదలడం ఆరంభించాయి. కళ్లు తెరిచి చూశాడు. దీంతో అక్కడివారు అవాక్కయ్యారు. వెంటనే స్థానికంగా కందుకూరులో ఉన్న వైద్యులతో మాట్లాడి పరిస్థితిని వివరించారు. వైద్యశాలకు తీసుకుని వస్తే వైద్యం చేస్తామని వారు తెలియచేయడంతో నేరుగా శ్మశానం నుంచి కందుకూరు లోని ప్రైవేటు వైద్యశాలకు తీసుకుని వెళ్లారు. అక్కడకు వెళ్లి చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. మజ్జిగ కూడా తాగినట్లు వైద్యులు తెలిపారు. పరిస్థితి మెరుగుపడుతుందనుకున్న సమయంలో ఏడుగంటల సేపు మృత్యువుతో పోరాడాడు. రాత్రి 8 గంటల సమయంలో మరణించాడు. ఇందులో నిర్లక్ష్యం ఎవరిది అనేది పక్కనపెడితే కరోనా నేపథ్యంలో వైద్యశాలలు, కుటుంబ సభ్యులు, గ్రామంలోని పరిస్థితుల ఒత్తిడులు ఇలాంటి ఘటనలు జరిగేలా చేస్తున్నాయి. -
‘సూరత్’ రియల్ హీరో
సూరత్: గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్న కోచింగ్ సెంటర్లో అన్నివైపుల నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. చాలామంది విద్యార్థులు ప్రాణాలు దక్కించుకునేందుకు నాలుగో అంతస్తు నుంచి దూకేస్తున్నారు. ఈ సందర్భంగా అందరిలానే తప్పించుకున్న కేతన్ జొరవాడియా అనే యువకుడు అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించాడు. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో విద్యార్థులు అంతెత్తు నుంచి నేలపై పడిపోకుండా కాపాడేందుకు ప్రయత్నించాడు. తొలుత మంటల్లో చిక్కుకున్న 4వఅంతస్తు నుంచి సన్నటి తాడు సాయంతో కేతన్ మూడో అంతస్తుపైకి దిగాడు. అక్కడి నుంచి తాను సురక్షితంగా తప్పించుకునే అవకాశమున్నప్పటికీ కేతన్ అక్కడే ఉండి మంటల్లో చిక్కుకున్న విద్యార్థులకు సాయం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా భయంతో బిక్కచిక్కిపోయిన ఇద్దరు యువతులు కిందకు పడిపోకుండా సురక్షితంగా పట్టుకున్నాడు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది వీరిని కాపాడారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు కేతన్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 22కు చేరుకున్న మృతులు తక్షశిల కాంప్లెక్స్‌లో చెలరేగిన మంటల్లో 20 మంది చనిపోగా, శనివారం మరో ఇద్దరు విద్యార్థులు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో మృతుల సంఖ్య 22కు చేరుకుంది. ఈ విషయమై సూరత్ ఏసీపీ పీఎల్ చౌధరి మాట్లాడుతూ.. మృతుల్లో 18 మంది అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు ఉన్నారని తెలిపారు. ఓ నాలుగేళ్ల చిన్నారికి కూడా ఈ సందర్భంగా కాలిన గాయాలయ్యాయని వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయినవారిలో ఎక్కువమంది 18 ఏళ్లలోపువారే. కోచింగ్ సెంటర్లో తగిన సౌకర్యాలు లేవని పేర్కొన్నారు. భవన యజమాని అరెస్ట్.. పలువురు విద్యార్థుల మృతికి కారణమైన భవన యజమాని భార్గవ్ బుటానిని అరెస్ట్ చేశామని ఏసీపీ పీఎల్ చౌధరి తెలిపారు. ‘సరైన వసతులు లేకుండా, ప్రమాద సమయాల్లో తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు లేకుండా ఈ భవనాన్ని నిర్మించారు. భార్గవ్‌తో పాటు ఈ భవన నిర్మాణ బాధ్యతలు చేపట్టిన బిల్డర్లు హర్షుల్ వెకరియా, జిగ్నేశ్ పరివాల్‌లపై కేసు నమోదుచేశాం. భార్గవ్‌ను ఇప్పటికే అరెస్ట్ చేయగా, ఇద్దరు బిల్డర్లు పరారీలో ఉన్నారు. ఈ దుర్ఘటనలో చనిపోయినవారిలో ముగ్గురు విద్యార్థులు శనివారం వెలువడ్డ 12వ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించారు. యశ్వీ కేవదీయా 67శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించగా, మాన్సీ వర్సని 52 శాతం, హస్థీ సురానీ 69శాతం మార్కులతో పాసయ్యారు’ అని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లలో అగ్నిప్రమాదాల సందర్భంగా తప్పించుకునేందుకు ఏర్పాట్లు ఉన్నాయా? అనే విషయమై ఆడిట్ చేపట్టాలని సీఎం ఉత్తర్వులు జారీచేశారు. అలాగే సూరత్ అగ్నిప్రమాదంపై అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో విచారణకు ఆదేశించారు. మృతులకు నివాళులర్పిస్తున్న సూరత్ విద్యార్థినులు -
కోచింగ్ సెంటర్లో మంటలు.. 20 మంది విద్యార్థుల దుర్మరణం
సూరత్: గుజరాత్‌లోని సూరత్‌లో శుక్రవారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోచింగ్ క్లాసులు నడుస్తున్న 4అంతస్తుల వాణిజ్య భవనంలో మంటలు వ్యాపించి 20 మంది విద్యార్థులు మరణించారు. మంటల నుంచి తప్పించుకునేందుకు మూడో, నాల్గో అంతస్తుల నుంచి కిందకు దూకడం వల్లే ఎక్కువ మంది విద్యార్థులు చనిపోగా, పొగకు ఊపిరాడకపోవడం వల్ల మరికొందరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు చెప్పారు. ఈ ఘటనలో మరికొందరు గాయపడ్డారు. మంటల నుంచి తమనుతాము కాపాడుకునేందుకు విద్యార్థులు కిందకు దూకుతున్న భయానక దృశ్యాలను టీవీ చానళ్లు ప్రసారం చేశాయి. సూరత్‌లోని సర్థానా ప్రాంతంలో ఉన్న తక్షశిల కాంప్లెక్స్ అనే భవనంలో శుక్రవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. దాదాపు 10 మంది విద్యార్థులు భవనం నుంచి దూకారనీ, ఈ ఘటనలో గాయపడిన వారందరినీ వైద్యశాలకు తరలించామని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. 19 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పి సహాయక చర్యలు చేపట్టామని చెప్పారు. విద్యార్థులను కాపాడేందుకు స్థానిక పోలీసులు, ప్రజలు అగ్నిమాపక దళ సిబ్బందికి సాయం చేశారు. చనిపోయిన విద్యార్థుల బంధువులకు రూ. 4 లక్షల ఆర్థిక సహాయం చేస్తామని గుజరాత్ సీఎం రూపానీ ప్రకటించారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించామనీ, బాధ్యులను వదిలిపెట్టబోమని గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ తెలిపారు. ప్రమాదం సమయంలో దాదాపు 50 మంది విద్యార్థులు అక్కడ ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. మోదీ, రాహుల్ విచారం.. సూరత్‌లో అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మోదీ ఓ ట్వీట్ చేస్తూ ‘సూరత్‌లో అగ్నిప్రమాదం నన్ను తీవ్రంగా వేదనకు గురిచేసింది. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని తెలిపారు. ‘బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీ హిందీలో ట్వీట్‌చేశారు. కోచింగ్ సెంటర్లో మంటలు భవనంపైన రేకులతో వేసిన షెడ్డు వంటి నిర్మాణాల నీడలో ఈ తరగతులు నిర్వహించేవారనీ, ఇది అక్రమ నిర్మాణమేమో పరిశీలిస్తామని సీఎం చెప్పారు. ముందుగా కింది అంతస్తులో మంటలు మొదలవడంతో అక్కడ ఉన్నవారు భయంతో భవనంపైకి వెళ్లారనీ, తర్వాత మంటలు పైకి ఎగబాకాయి. పైన ఏసీ కంప్రెసర్లు, టైర్లు వంటివి ఉండటంతో వాటికి మంటలు అంటుకుని దట్టమైన పొగలు వెలువడి, పైన రేకులు ఉండటంతో పొగలు ఆకాశంలోకి వెళ్లక విద్యార్థులకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది. భవనం పైన నుంచి విద్యార్థులు తప్పించుకునేందుకు మరో మార్గం లేదనీ, మంటలను ఆర్పడానికి అగ్నిమాపక పరికరాలను యాజమాన్యం ఏర్పాటు చేయలేదని అధికారి మీడియాకు వెల్లడించారు. కోచింగ్ సెంటర్లను అన్నింటినీ తనిఖీ చేసి అవి భద్రతా ప్రమాణాల ప్రకారం ఉన్నాయో లేదో అధికారులు ధ్రువీకరించే వరకు నగరంలోని కోచింగ్ సెంటర్లను మూసేయాల్సిందిగా అహ్మదాబాద్ నగరపాలక అధికారులు ఆదేశాలిచ్చారు. -
పూజలు చేస్తే పోయిన ప్రాణం తిరిగొస్తుందని..
బీమదేవరపల్లి(కరీంనగర్): వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న 15 ఏళ్ల బాలుడు శనివారం మృతిచెందాడు. కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులకు.. ప్రత్యేక పూజలు చేస్తే.. బాలుడు తిరిగి లేస్తాడని ఓ అపరిచిత వ్యక్తి నమ్మబలికాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన కూన దుర్గాప్రసాద్(15) స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో వారం రోజులుగా విష జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ రోజు ఉదయం నిద్రలేపడానికి వెళ్లిన తల్లి కుమారుడు ఉలుకు పలుకు లేకుండా పడి ఉండటాన్ని గమనించి.. ఆస్పత్రికి తీసుకెళ్లింది. అప్పటికే బాబు చనిపోయాడని డాక్టర్లు నిర్థారించారు. దీంతో ఆమె ఇంటికి తీసుకొచ్చింది. అదే సమయంలో ఇది గమనించిన అపరిచిత వ్యక్తి బాబు చనిపోలేదని పూజలు చేస్తే లేస్తాడని చెప్పి మూడుగంటలపాటు ప్రత్యేక పూజలు నిర్వహించాడు. అయినా ఫలితం లేకపోవడంతో.. అతన్ని తిరిగి బ్రతికించడానికి తన శక్తి చాలడం లేదని మరొకరి దగ్గరకు తీసుకెళ్దామని చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు ఇదంతా బూటకమని.. అతన్ని అక్కడి నుంచి వెళ్లగొట్టారు.