కోచింగ్‌ సెంటర్‌లో మంటలు.. 20 మంది విద్యార్థుల దుర్మరణం | Surat Fire Kills 20 At Coaching Centre | Sakshi
Sakshi News home page

కోచింగ్‌ సెంటర్‌లో మంటలు.. 20 మంది విద్యార్థుల దుర్మరణం

Published Sat, May 25 2019 2:20 AM | Last Updated on Sat, May 25 2019 6:20 AM

Surat Fire Kills 20 At Coaching Centre - Sakshi

సూరత్‌: గుజరాత్‌లోని సూరత్‌లో శుక్రవారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోచింగ్‌ క్లాసులు నడుస్తున్న 4అంతస్తుల వాణిజ్య భవనంలో మంటలు వ్యాపించి 20 మంది విద్యార్థులు మరణించారు. మంటల నుంచి తప్పించుకునేందుకు మూడో, నాల్గో అంతస్తుల నుంచి కిందకు దూకడం వల్లే ఎక్కువ మంది విద్యార్థులు చనిపోగా, పొగకు ఊపిరాడకపోవడం వల్ల మరికొందరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు చెప్పారు. ఈ ఘటనలో మరికొందరు గాయపడ్డారు. మంటల నుంచి తమనుతాము కాపాడుకునేందుకు విద్యార్థులు కిందకు దూకుతున్న భయానక దృశ్యాలను టీవీ చానళ్లు ప్రసారం చేశాయి.

సూరత్‌లోని సర్థానా ప్రాంతంలో ఉన్న తక్షశిల కాంప్లెక్స్‌ అనే భవనంలో శుక్రవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. దాదాపు 10 మంది విద్యార్థులు భవనం నుంచి దూకారనీ, ఈ ఘటనలో గాయపడిన వారందరినీ వైద్యశాలకు తరలించామని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. 19 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పి సహాయక చర్యలు చేపట్టామని చెప్పారు. విద్యార్థులను కాపాడేందుకు స్థానిక పోలీసులు, ప్రజలు అగ్నిమాపక దళ సిబ్బందికి సాయం చేశారు. చనిపోయిన విద్యార్థుల బంధువులకు రూ. 4 లక్షల ఆర్థిక సహాయం చేస్తామని గుజరాత్‌ సీఎం రూపానీ ప్రకటించారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించామనీ, బాధ్యులను వదిలిపెట్టబోమని గుజరాత్‌ ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌ తెలిపారు. ప్రమాదం సమయంలో దాదాపు 50 మంది విద్యార్థులు అక్కడ ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

మోదీ, రాహుల్‌ విచారం..
సూరత్‌లో అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మోదీ ఓ ట్వీట్‌ చేస్తూ ‘సూరత్‌లో అగ్నిప్రమాదం నన్ను తీవ్రంగా వేదనకు గురిచేసింది.  గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని తెలిపారు. ‘బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌గాంధీ హిందీలో ట్వీట్‌చేశారు.

కోచింగ్‌ సెంటర్‌లో మంటలు
భవనంపైన రేకులతో వేసిన షెడ్డు వంటి నిర్మాణాల నీడలో ఈ తరగతులు నిర్వహించేవారనీ, ఇది అక్రమ నిర్మాణమేమో పరిశీలిస్తామని సీఎం చెప్పారు. ముందుగా కింది అంతస్తులో మంటలు మొదలవడంతో అక్కడ ఉన్నవారు భయంతో భవనంపైకి వెళ్లారనీ, తర్వాత మంటలు పైకి ఎగబాకాయి. పైన ఏసీ కంప్రెసర్లు, టైర్లు వంటివి ఉండటంతో వాటికి మంటలు అంటుకుని దట్టమైన పొగలు వెలువడి, పైన రేకులు ఉండటంతో పొగలు ఆకాశంలోకి వెళ్లక విద్యార్థులకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది. భవనం పైన నుంచి విద్యార్థులు తప్పించుకునేందుకు మరో మార్గం లేదనీ, మంటలను ఆర్పడానికి అగ్నిమాపక పరికరాలను యాజమాన్యం ఏర్పాటు చేయలేదని అధికారి మీడియాకు వెల్లడించారు. కోచింగ్‌ సెంటర్లను అన్నింటినీ తనిఖీ చేసి అవి భద్రతా ప్రమాణాల ప్రకారం ఉన్నాయో లేదో అధికారులు ధ్రువీకరించే వరకు నగరంలోని కోచింగ్‌ సెంటర్లను మూసేయాల్సిందిగా అహ్మదాబాద్‌ నగరపాలక అధికారులు ఆదేశాలిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement