
బనస్కాంత:గుజరాత్‌లోని బనస్కాంతలోని అగ్ని ప్రమాదం(fire accident) చోటుచేసుకుంది. దీసాలోని జీఐడీసీ ప్రాంతంలోని ఒక బాణసంచా కర్మాగారంలో మంగళవారం ఉదయం ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. బాయిలర్‌లో పేలుడు సంభవించడంతో మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో ప్రాథమికంగా ముగ్గురు మృతిచెందారని భావించారు. అయితే ఆ తరువాత మరో పది మృతదేహాలు లభించడంతో మృతుల సంఖ్య 13కి చేరింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఫ్యాక్టరీలోని మండే పదార్థాల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి.
అగ్నిమాపక సిబ్బంది(Fire fighters) సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. స్థానిక ఎమ్మెల్యే ప్రవీణ్ మాలి సహా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. పేలుడు కారణంగా భవనంలోని కొంత భాగం కూలిపోయిందని ప్రవీణ్ మాలి తెలిపారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.