నర్సు మృతి.. ఐదుగురు ఎయిమ్స్ వైద్యుల సస్పెన్షన్
సొంత సిబ్బంది విషయంలోనే నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ముగ్గురు సీనియర్ వైద్యులతో పాటు ఇద్దరు జూనియర్ డాక్టర్లపై ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సస్పెన్షన్ వేటు వేసింది. ప్రసవం కోసం చేరిన నర్సు మరణించడంతో ఎయిమ్స్ ఈ చర్య తీసుకుంది. దాంతో ఇప్పుడు నర్సుల యూనియన్లు, రెసిడెంట్ డాక్టర్ల యూనియన్లు పరస్పరం తలపడుతున్నాయి. రాజ్బీర్ కౌర్ (28) ఎయిమ్స్‌లోని మెడిసిన్ డిపార్టుమెంటులో నర్సింగ్ ఆఫీసర్‌గా పనిచేసేవారు. ఆమె జనవరి 16న ప్రసవం కోసం ఆస్పత్రిలోని గైనకాలజీ విభాగంలో అడ్మిట్ అయ్యారు. ప్రసవానికి కొద్ది గంటల ముందు శిశువు గుండె కొట్టుకునే వేగం బాగా తక్కువగా ఉందని వైద్యులు గుర్తించారు. శిశువు ప్రాణాలకు ముప్పు ఉండటంతో వెంటనే సిజేరియన్ చేయాలని నిర్ణయించారు. కానీ, అనెస్థటిస్టు ఆలస్యంగా రావడంతో ఆపరేషన్ లేటయింది.
ఎట్టకేలకు సిజేరియన్ ఆపరేషన్ చేసినా, మృత శిశువు బయటపడింది, కౌర్‌కు తీవ్రంగా కార్డియాక్ అరెస్ట్ అయ్యింది. ఆమెకు కార్డియో పల్మనరీ రీససికేషన్ (సీపీఆర్) చేసినా ఫలితం లేకపోవడంతో కౌర్ కోమాలోకి వెళ్లిపోయారని ఎయిమ్స్ నర్సింగ్ యూనియన్ అధ్యక్షుడు హరీష్ కుమార్ కజ్లా చెప్పారు. నొప్పులు రప్పించడానికి కౌర్‌కు బాగా ఎక్కువ మొత్తంలో మందు ఇవ్వడం వల్లే ఆమెకు తీవ్ర అనారోగ్యం వచ్చిందని ఆయన ఆరోపించినా, ఆస్పత్రి వర్గాలు ఖండించాయి. ఈ విషయమై నిజానిజాలు తెలుసుకోడానికి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ డీకే శర్మ అధ్యక్షతన నిజనిర్ధారణ కమిటీని నియమించామని, రెండు రోజుల్లో ప్రాథమిక నివేదిక వస్తుందని ఎయిమ్స్ అధికార ప్రతినిధి డాక్టర్ అమిత్ గుప్తా తెలిపారు. కాగా ఇప్పటికే ఎనస్థీషియా శాఖకు చెందిన ఇద్దరు జూనియర్ డాక్టర్లు, గైనకాలజీ విభాగానికి చెందిన ముగ్గురు సీనియర్ డాక్టర్లపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే వైద్యుల సస్పెన్షన్‌పై రెసిడెంట్ డాక్టర్ల సంఘం తీవ్రంగా మండిపడి, సమ్మె చేస్తామని బెదిరించింది. మరోవైపు ఎయిమ్స్‌కు చెందిన 500 మంది నర్సింగ్ ఆఫీసర్లు ఇప్పటికపే డైరెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. తప్పు చేసినవారచిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తాము తమ సహోద్యోగిని కోల్పోయామని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు.