Municipal Employees
-
AP: మున్సిపల్ కార్మికుల సమ్మె విరమణ
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించారు. కార్మిక సంఘాలతో బుధవారం సాయంత్రం మంత్రి వర్గ ఉపసంఘం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం అయిన వెంటనే సమ్మె విరమణ ప్రకటన చేశాయి సంఘాలు. దీంతో.. రేపటి నుంచి మున్సిపల్ కార్మికులు యధావిధిగా తమ విధులకు కార్మికులు హాజరు కానున్నారు. పలు డిమాండ్ల సాధనతో మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి దిగారు. అయితే గత చర్చల్లో ప్రభుత్వం వాళ్ల డిమాండ్‌కు సానుకూలంగా స్పందించినప్పటికీ.. కొన్ని విషయాలపై స్పష్టత రాలేదు. దీంతో నేడు మరోసారి భేటీ కావాల్సి వచ్చింది. చివరకు చర్చలు సఫలం కావడం.. సమ్మె విరమణకు కార్మిక సంఘాలు అంగీకరించడంతో.. ముగింపు పడినట్లయ్యింది. మున్సిపల్ కార్మికులు సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని అన్నారు బొత్స సత్యనారాయణ. ప్రభుత్వ హామీలకు కార్మిక సంఘాలు ఆమోదం తెలిపాయని పేర్కొన్నారు. 21 వేల వేతనంతో పాటు, ఇతర సదుపాయాలు కల్పిస్తామని,. సమ్మె కాలానికి జీతాలు కూడా చెల్లిస్తామని తెలిపారు. వారిపై ఉన్న కేసులు ఎత్తివేస్తామన్నారు. ఈ సంక్రాంతికి ప్రతి కార్మికునికి కొత్త బట్టల కోసం వెయ్యి రూపాయలు ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. చనిపోయిన కార్మికులు కుటుంబాలకు సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం నష్టపరిహారం అందిస్తామని మంత్రి బొత్స అన్నారు. ప్రమాదవశాత్తూ మరణిస్తే అందించే సాయాన్ని అయిదు నుంచి ఏడు లక్షలకు పెంచినట్లు తెలిపారు. 2019 నుంచి దరఖాస్తు చేసుకోని మృతుల కుటుంబాలు ఇప్పుడు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. జీవో ఇచ్చిన తర్వాత అప్లై చేసుకుంటే రెండు నెలల్లో ఎక్స్ గ్రేషియా ఇస్తామన్నారు. -
సానుకూలంగానే మున్సిపల్ కార్మికులతో చర్చలు: మంత్రి ఆదిమూలపు
గుంటూరు, సాక్షి: పారిశుధ్య కార్మిక సంఘాల ప్రతినిధులతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు ముగిశాయి. అయితే చర్చలు అసంపూర్తిగా ముగిసినప్పటికీ.. సానుకూలంగానే జరిగినట్లు ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పలు డిమాండ్లకు ఏపీ ప్రభుత్వం సానుకూలంగానే స్పందించిందని పేర్కొంటూ.. చర్చల సారాంశాన్ని ఆయన మీడియాకు వివరించారు. ‘‘కార్మికుల డిమాండ్ మేరకు హెల్త్ అలవెన్స్ రూ.6 వేలు ఇచ్చాం. ఎక్స్‌గ్రేషియాపై సానుకూలంగా స్పందించాం. సమానపనికి సమాన వేతనంపై చర్చించాం. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అమలు చేస్తామని గతంలో హామీ ఇచ్చాం. దాని మేరకే చర్యలు తీసుకున్నాం. ఇవాళ్టి చర్చలు సానుకూలంగా సాగాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కార్మికులు సమ్మె విరమించాలని కోరుతున్నాం. మరోసారి మంత్రివర్గ ఉపసంఘంతో ఇతర సమస్యలపైనా చర్చిస్తాం’’ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. పారిశుద్ధ్య సంఘాల ప్రతినిధులతో మంత్రుల బృందం మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సుదీర్ఝ చర్చలు జరిపింది. మంత్రి ఆదిమూలపు సురేష్‌తో పాటు బొత్స సత్యనారాయణతో పాటు ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. పారిశుధ్య కార్మికుల డిమాండ్లలో ప్రధానమైనటువంటి కేటగిరీల వారీగా బేసిక్ ఫే నిర్ణయం, పొరుగు సేవల విధానాన్ని కాంట్రాక్టు & శాశ్వత ఉద్యోగులుగా క్రమబద్దీకరించడం తదితర అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఝ చర్చలు జరిగాయి. వీటితో పాటు అవుట్ సోర్సింగ్ పై పనిచేసే పారిశుధ్య, ఇంజనీరింగ్, ఇతర సిబ్బందికి అన్ని ప్రభుత్వ పథకాలు వర్తింపచేయడం, నియామకాల్లో వెయిటేజీ మార్కులు కేటాయించడం, ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టులను వెంటనే భర్తీ చేయడం, అవసరానికి తగ్గట్టుగా పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచడం, కాంట్రాక్టు విదానంలో ఘన వ్యర్థాలను తరలించే వాహనాల పనితీరును మెరగుపర్చడం, పారిశుధ్య కార్మికులు, ఇంజనీరింగ్ సిబ్బంది, పార్కుల నిర్వహణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్ల నిర్వహించే పనుల ఆధారంగా వారికి బేసిక్ పే నిర్ణయించడం తదితర అంశాలపై కూడా సుదీర్ఝ చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహా దారులు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్. చంద్ర శేఖర రెడ్డి, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మీ, సిడిఎంఎ కోటేశ్వరరావు, స్వచ్ఛాంధ్రకార్పొరేషన్ విసి & ఎండి గంధం చంద్రుడు, ఆప్కాస్ ఎండి వాసుదేవ రావు తదితర అధికారులతో పాటు రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగుల సంఘాల నాయకులు ఆనంద్ రావు (YSRTUC రాష్ట్ర ప్రెసిడెంట్), వై.వి.రమణ (YSRTUC ప్రధాన కార్యదర్శి), ఎ. రంగనాయకులు (AITUC రాష్ట్ర అధ్యక్షులు), పి. సుబ్బారాయుడు (AITUC ప్రధాన కార్యదర్శి), అబ్రహం లింకన్ (IFTU ప్రెసిడెంట్), జి. ప్రసాద్ (APCITU ప్రెసిడెంట్), కె. ఉమామహేశ్వరరావు (AP CITU ప్రధాన కార్యదర్శి), జి.రఘురామరాజు (TNTUC రాష్ట్ర ప్రెసిడెంట్), శ్యామ్ (TNTUC ప్రధాన కార్యదర్శి), మధుబాబు (AP MEWU రాష్ట్ర ప్రెసిడెంట్), అంజినీయులు (AP MEWU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి), GVRKH వరప్రసాద్ (AICTU రాష్ట్ర అధ్యక్షులు), కె. శ్రీనివాసరావు (AICTU జనరల్ సెక్రటరీ) తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ మహిళా కౌన్సిలర్ ఓవరాక్షన్.. ఉద్యోగిపై దాడియత్నం!
తాడిపత్రి: టీడీపీ కౌన్సిలర్ల దాష్టీకం పరాకాష్టకు చేరుకుంది. రెండు రోజుల క్రితం మున్సిపల్ ఉద్యోగిపై ఏకంగా దాడికి యత్నించి, దూషణలకు దిగారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. రెగ్యులర్ నాన్ మస్టర్ రోల్ (ఆర్‌ఎన్‌ఎంఆర్) ఉద్యోగి జేసీ సూర్యనారాయణరెడ్డి శుక్రవారం ఉదయం విధుల విషయమై కమిషనర్ వద్దకు వెళ్లాడు. అప్పటికే చైర్మన్ చాంబర్లో కూర్చుని ఉన్న మున్సిపల్ వైస్ చైర్మన్, 36వ వార్డు టీడీపీ కౌన్సిలర్ జింకా లక్ష్మీదేవి, మరికొంతమంది కౌన్సిలర్లు ఉద్యోగి సూర్యనారాయణపైకి దూసుకొచ్చారు. ‘ఎప్పుడు చూసినా కమిషనర్ చాంబర్ వద్దే ఉంటావు.. ఇక్కడ ఏం పని’ అంటూ గద్దించారు. వారి మాటలను పట్టించుకోకుండా సదరు ఉద్యోగి కమిషనర్ చాంబర్ నుంచి బయటకు వెళ్తుండగా కౌన్సిలర్ లక్ష్మీదేవి అడ్డుకుని.. చొక్కా పట్టుకునేందు ప్రయచింది. కమిషనర్ జోక్యం చేసుకుని సర్దిచెప్పబోయారు. అయినా వినకుండా మహిళా కౌన్సిలర్‌తో పాటు మరి కొందరు కౌన్సిలర్లు ఉద్యోగిపై తిట్ల దండకం మొదలు పెట్టారు. ఉద్యోగిపై కార్యాలయంలోనే దాడికి యత్నించి, మానసిక స్థైర్యం దెబ్బతీసేలా ప్రవర్తించిన టీడీపీ కౌన్సిలర్ల తీరు పట్ల అక్కడే ఉన్న ప్రజలు అసహ్యించుకోవడం కనిపించింది. రెస్ట్ హౌస్‌గా చైర్మన్ చాంబర్ టీడీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి చాంబర్‌ను రెస్ట్ హౌస్లా వాడుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. వీరు నిత్యం ఉద్యోగుల విధుల్లోకి తలదూర్చడం, వారిని భయపెట్టడం వంటి చర్యలకు పూనుకుంటున్నారన్నది కొందరు మున్సిపల్ ఉద్యోగుల వాదన. ఎవరు ఏ పని చేయాలి.. ఎవరిని కలవాలనేది కూడా కౌన్సిలర్లే తమకు చెబితే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఆ ఉద్యోగికి పని చేయకున్నా జీతమా..? మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు, టీడీపీ సానుభూతిపరుడు అయిన రెగ్యులర్ నాన్‌మస్టర్ రోల్ ఉద్యోగి తిరుపాల్‌రెడ్డి పని చేయకున్నా జీతం వస్తోంది. మరి ఆ ఉద్యోగి విధులు ఏవి.. ఎక్కడ పని చేస్తున్నాడు.. వంటి వివరాలను ప్రజలకు తెలిపి ప్రజాధనం దురి్వనియోగం కాకుండా కాపాడాల్సిన బాధ్యత టీడీపీ కౌన్సిలర్లపై లేదా అని ఉద్యోగులు నిలదీస్తున్నారు. కౌన్సిలర్లపై ఫిర్యాదు తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు దాడికి యత్నించిన టీడీపీ కౌన్సిలర్ లక్ష్మీదేవితో పాటు మరికొంతమంది కౌన్సిలర్లపై ఆర్‌ఎన్‌ఎంఆర్ ఉద్యోగి జేసీ సూర్యనారాయణరెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దాడిని ఖండిస్తూ నిరసన ఆర్‌ఎన్‌ఎంఆర్ ఉద్యోగిపై దాడికి యతి్నంచి, మానసిక స్థైర్యం దెబ్బతీసేలా టీడీపీ కౌన్సిలర్ జింకా లక్ష్మీదేవి, మరికొందరు ప్రవర్తించిన తీరుపై మున్సిపల్ ఉద్యోగులు శనివారం నిరసన తెలిపారు. దురుసుగా మాట్లాడిన కౌన్సిలర్ లక్ష్మీదేవిపై చర్యలు తీసుకోవాలని కార్యాలయ మేనేజర్ రాజేశ్వరీబాయికి ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు. చర్యలు తీసుకోకుంటే మున్సిపల్ సేవలు స్తంభింపజేసేందుకు సైతం వెనుకాడబోమని హెచ్చరించారు. -
కన్నీళ్లు లేని కరోనా కథలు
హడావుడిగా అంతిమ వీడ్కోలు.. కన్నబిడ్డలు పక్కన ఉండరు.. కన్నీళ్లు కార్చడానికి కావల్సిన వారు రాలేరు.. కాడె మోసే వాళ్లు కనిపిం చరు.. శ్మశానం దాకా ఎవరూ వెంట రారు.. ఒక అనాథలా అంతిమ సంస్కారాలు జరిగిపోతున్నాయి.. కరోనా సృష్టించిన భయోత్పాతంతో అంతిమ వీడ్కోలు భారంగా మారింది.కన్నబిడ్డలు పక్కన ఉండరు. కన్నీళ్లు కార్చడానికి కావల్సిన వారు రాలేరు. పాడె మోసే వాళ్లు కనిపించరు. శ్మశానం దాకా ఎవరూ వెంటరారు. ఒక అనాథలా అంతిమ సంస్కారాలు జరిగిపోతున్నాయి. కరోనా సృష్టించిన భయోత్పాతంతో అంతిమ వీడ్కోలు భారంగా మారింది. చెన్నై, ముంబై: దేవాలయాలన్నీ వెలవెలబోతున్నాయెందుకు? దేవుళ్లందరూ వైద్యుల రూపంలో కరోనా రోగులకు చికిత్స చేస్తున్నారు. ఇదీ ఈ మధ్యకాలంలో వాట్సాప్‌లో తిరుగుతున్న ఒక సందేశం మరి అలాంటి దేవుళ్లనే కరోనా కాటేస్తూ ఉంటే వారికి తుది వీడ్కోలు చెప్పే దిక్కు కూడా లేదు. మొన్నటికి మొన్న నెల్లూరుకి చెందిన ఓ డాక్టర్ కోవిడ్–19తో పోరాడి చెన్నై ఆస్పత్రిలో మరణిస్తే స్థానికుల నిరసనల మధ్య ఆదరాబాదరాగా అంతిమ సంస్కారం నిర్వహించాల్సి వచ్చింది. అదే వారంలో మేఘాలయలో వైద్యుడు కోవిడ్–19 బాధితులకు చికిత్స చేసి తాను కూడా ప్రాణాలు కోల్పోతే మున్సిపాల్టీ కార్మికులే దహన ప్రక్రియలు పూర్తి చేశారు. వైద్యులే కాదు ఇప్పటివరకు భారత్‌లో కరోనాతో 775 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వారి అంతిమ సంస్కారాలన్నీ ఇలాగే జరుగుతున్నాయి. కరోనా మృతదేహం దగ్గరకి వెళ్లాలంటే అయినవారు కూడా హడలెత్తిపోతున్నారు. స్థానిక ప్రజలు మృతదేహాన్ని తీసుకువెళుతున్నా అడ్డుకుంటున్నారు. రాళ్లతో దాడులకూ దిగుతున్నారు. పటిష్టమైన బందోబస్తు మధ్య వారికి అంతిమ సంస్కారం నిర్వహించాల్సి వస్తోంది. వాస్తవానికి కోవిడ్‌తో మరణించినప్పటికీ మృతదేహం నుంచి వైరస్ సోకదు. అయినా ప్రజల్లో నెలకొన్న భయం, అవగాహనారాహిత్యం వారిలో సున్నితత్వాన్ని కూడా చంపేస్తోంది. దహనమా? ఖననమా? పంజాబ్ గాయకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత కోవిడ్–19తో మృతి చెందితే ఆయన మృతదేహాన్ని దహనం చేయడానికి ఆయన ఊరి ప్రజలే అంగీకరించలేదు. దహనం చేస్తే అందులోంచి వచ్చే పొగ వల్ల వైరస్ సోకుతుందని అంతిమ సంస్కారాన్ని అడ్డుకున్నారు. శ్మశానవాటికకు తాళాలు కూడా వేశారు. దీంతో ఆయన మృతదేహాన్ని ఊరి శివారు ప్రాంతాలకు తరలించి దహనం చేశారు. పంజాబ్‌లో కపుర్తాలాకు చెందిన ఒక మహిళ మరణిస్తే చివరి చూపు చూడడానికి కూడా కన్న కొడుకు రాలేదు. కరోనా భయంతో రావడానికి నిరాకరిస్తే మున్సిపాల్టీ సిబ్బందే మృతదేహాన్ని అంతిమ వీడ్కోలు పలికారు. మరోవైపు ముంబై కార్పొరేషన్ కోవిడ్‌తో మరణించే వారు ఎవరైనా, మతంతో సంబంధం లేకుండా దహనం చేస్తామంటూ నోటీసులు ఇచ్చింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో రాష్ట్ర మైనార్టీ వ్యవహారాల శాఖ ఆ నోటీసులు వెనక్కి తీసుకునేలా చేసింది. దీంతో మృతదేహాన్ని ఖననం చేయడానికి యంత్రాంగం అనుమతిచ్చినా స్థానికులు అడ్డుకుంటున్నారు. మృత దేహాలను దహనమే చేయాలని, లేకపోతే వైరస్ సోకుతుందని అంటున్నారు. భౌతిక దూరం నిబంధనల కారణంగా అయిన వారు మరణించినా అయిదారుగురి కంటే ఎక్కువ మంది హాజరవడానికి ఎక్కడా అనుమతులివ్వడం లేదు. కోవిడ్‌తో మరణిస్తే పోలీసులు, కార్పొరేషన్ సిబ్బంది హడావుడిగా అంతిమ సంస్కారాలు నిర్వహించడమే తప్ప, కన్నీళ్లు రాల్చేవారూ కరువయ్యారు. ఇంతకు మించిన విషాదం ఏముంటుంది? న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్న వైద్యుడి భార్య ఇదో వైద్యుడి భార్య వ్యథ. చెన్నైకి చెందిన ఓ డాక్టర్ కోవిడ్ రోగులకి అలుపెరుగకుండా చికిత్స చేశారు. దీంతో ఆ మహమ్మారి ఆయనకీ అంటుకుంది. కొద్ది రోజులు ప్రాణాలతో పోరాడి కన్నుమూశారు. ఆ డాక్టర్ మృతదేహం నుంచి వైరస్ తమకు ఎక్కడ అంటుకుంటుందోనని స్థానికులు ఆయన మృతదేహాన్ని తీసుకువెళుతున్న అంబులెన్స్‌ని అడ్డుకున్నారు. రాళ్లతో దాడి చేశారు. దీంతో వెలంగాడు శ్మశాన వాటికలో మున్సిపల్ అధికారులు హడావుడిగా పూడ్చి పెట్టేశారు. అయితే ఆయన భార్య ఆనంది సైమన్ తన భర్త చివరి కోరిక మేరకు కిల్పాకలోనే మతపరమైన ప్రార్థనలు నిర్వహించాకే అంతిమ సంస్కారం చేయాలని పట్టుపడుతోంది. మృతదేహం నుంచి వైరస్ సోకదని డబ్ల్యూహెచ్ఓ చెప్పినా ప్రజల్లో అవగాహన లేకపోవడం విచారకరమని కన్నీరు మున్నీరవుతోంది. దీనిపై ఎంత దూరమైనా వెళతానని న్యాయపోరాటానికైనా సిద్ధమని చెబుతోంది. డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పింది ? కరోనా వైరస్‌తో కన్నుమూస్తే ఆ మృతదేహం నుంచి వైరస్ సోకే అవకాశం లేదు. రోగి ప్రాణాలు కోల్పోయిన రెండు, మూడు గంటల్లో వైరస్ కూడా చచ్చిపోతుంది. అందుకే అంతిమ సంస్కారాలు వారి కోరిక మేరకు నిర్వహించుకోవచ్చు. -
అప్పు తీర్చలేదని కిరాతకం
బొమ్మలసత్రం (నంద్యాల): రూ.లక్ష అప్పు తీర్చలేదని ఇద్దరు మహిళలపై మున్సిపల్ ఉద్యోగి సైకిల్ చైన్, కత్తితో కిరాతకంగా దాడి చేశాడు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణ శివార్లలోని వైఎస్సార్ నగర్లో చోటుచేసుకున్న ఈ దారుణం వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాలకు చెందిన సామేలు స్థానిక ప్రభుత్వ కళాశాలలో అటెండర్‌గా పనిచేస్తూ పదేళ్ల క్రితం చనిపోయాడు. అతని భార్య మరియమ్మ ఒక కుమార్తె, ఇద్దరు కుమారులను కష్టపడి పోషించింది. ఇద్దరు కుమారులు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. కుమార్తె స్వప్న మానసిక వికలాంగురాలు. మరియమ్మ పిల్లల చదువు కోసం గత ఏడాది ఏప్రిల్‌లో మున్సిపల్ ఉద్యోగి శేషన్న వద్ద రూ.లక్ష అప్పు తీసుకుంది. రూ.4 వడ్డీతో అప్పు తీసుకున్న ఆమె.. కూలి పనులకు వెళ్లగా వచ్చిన డబ్బుతో కొంత మేర వడ్డీ చెల్లించింది. మూడు నెలలుగా స్వప్న ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు. దీంతో వడ్డీ చెల్లించడం మరియమ్మకు భారంగా మారింది. ఈ నేపథ్యంలో వడ్డీ, అసలు చెల్లించాలని వారం రోజులుగా శేషన్న వేధించడం మొదలుపెట్టాడు. మూడు నెలలు గడువు కావాలని కోరినా అతను అంగీకరించలేదు. ఈ క్రమంలో ఆదివారం ఇంట్లో ఉన్న మరియమ్మ, స్వప్నపై సైకిల్ చైన్, కత్తితో దాడికి పాల్పడ్డాడు. దెబ్బలు భరించలేక బాధితులు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని అడ్డుకోబోయారు. దీంతో వారిపైనా దాడికి ప్రయత్నించాడు. స్థానికుల సమక్షంలో బాధితులపై రెండోసారి కూడా దాడి చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గాయాలతో పడి ఉన్న తల్లి, కుమార్తెను స్థానికులు చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నంద్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
మేనేజర్ లంచావతారం
సాక్షి, బోడుప్పల్: బోడుప్పల్ నగర పాలక సంస్థలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ కమ్ మేనేజర్ పి.రాజేందర్‌రెడ్డి కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. కాంట్రాక్టర్ జె.వెంకటేశ్‌గౌడ్ చేసిన పనులకు బిల్లులు మంజూరు చేసేందుకు గాను కమీషన్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏసీబీ సీటీ రేంజ్–2 డీఎస్పీ అచ్చేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం... పీర్జాదిగూడలో నివసించే పి.రాజేందర్‌రెడ్డి బోడుప్పల్ నగర పాలక సంస్థలో సీనియర్ అసిస్టెంట్ కమ్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. బోడుప్పల్లో నివసించే జె.వెంకటేశ్‌గౌడ్ నగర పాలక సంస్థలో కాంట్రాక్టర్. ఈయన ఇటీవల రూ.62 లక్షల విలువైన రోడ్డు పనులు చేశాడు. వాటిలో రూ.27 లక్షలకు బిల్లు చేశాడు. అయితే వాటిని మంజూరు చేయాలంటే తనకు 7శాతం కమీషన్ ఇవ్వాలని రాజేందర్‌రెడ్డి కాంట్రాక్టర్‌ను డిమాండ్ చేశాడు. అంత ఇవ్వలేనని వేడుకున్నా వినలేదు. దీంతో కమీషన్ ఇస్తానని ఒప్పుకున్న వెంకటేశ్‌గౌడ్ 20 రోజుల క్రితం రూ.లక్ష అందజేశాడు. మళ్లీ ఈ నెల 19న రూ.20 వేలు ఇచ్చాడు. శుక్రవారం మరో రూ.50 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. ఈలోపు వెంటేశ్‌గౌడ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రూ.50 వేలు ఇస్తానని శుక్రవారం ఉదయం రాజేందర్‌రెడ్డికి ఫోన్ చేశాడు. ఆఫీసులో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న ఆసిఫ్‌కు ఇవ్వమని రాజేందర్‌రెడ్డి చెప్పాడు. కాంట్రాక్టర్ వద్ద రూ.50 వేలు తీసుకున్న ఆసిఫ్ రాజేందర్‌రెడ్డికి ఇచ్చేందుకు ఆయన క్యాబిన్‌కు వెళ్లాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు రాజేందర్‌రెడ్డిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన క్యాబిన్లో రెండు గంటలకు పైగా సోదాలు చేశారు. రాజేందర్‌రెడ్డి, ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అధికారుల్లో టెన్షన్.. బోడుప్పల్ నగర పాలక సంస్థపై ఏసీబీ అధికారులు దాడి చేయడంతో వివిధ శాఖల అధికారుల్లో భయం మొదలైంది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో భోజనానికి సిద్ధమవుతుండగా ఈ దాడులు జరిగాయి. ఏసీబీ ఆఫీసర్లు రావడంతో అధికారులంతా అవాక్కయ్యారు. తొలుత ఏసీబీ అధికారులు మీసేవ కేంద్రంలో బిల్లులు చెల్లించే వారికి అనుమతినిచ్చారు. అధికారులతో పని ఉన్న వారిని అనుమతించలేదు. ఏసీబీ దాడులు జరుగుతున్న సమయంలో కమిషనర్ శంకర్, టీపీఓ శ్రీధర్‌రెడ్డి తప్ప మిగతా శాఖల అధికారులు అందుబాటులో లేరు. -
మృతదేహాలను చెత్త బండిలో వేసి...
తూర్పుగోదావరి ,రాజమహేంద్రవరం సిటీ: రోడ్డు ప్రమాదాలు, ఫుట్‌పాత్‌లపై మరణించే అనాథల శవాలను రోటరీ కైలాసభూమికి తరలింపులో మున్సిపల్, పోలీసు సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అనాథుల మృతదేహాలను శ్మశానవాటికకు తరలించేందుకు రోటరీ కైలాసభూమి నుంచి ఉచితంగా వాహనాలు అందించే అవకాశం ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదు. చెత్తను తరలించే తొట్టెలో అమానవీయంగా తరలిస్తుండడంపై నగరవాసులు మండిపడుతున్నారు. రాజమహేంద్రవరం ఇన్నీసుపేట కైలాస భూమికి అనాథ మృతదేహాన్ని మున్సిపల్ సిబ్బంది పోలీసులు ఇలా చెత్త బండిలో తరలిస్తుండడంతో ఓ వ్యక్తి తీసిన ఫొటో సామాజిక మాద్యమాల్లో హల్చల్ చేస్తోంది. నగరంలో మానవత్వం మంటగలిసేలా ఈ చర్యలేంటని పోలీసులు, మున్సిపల్ సిబ్బంది తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పోలీస్ అధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా.. అనాథ మృతదేహాల తరలింపులో సంబంధిత సిబ్బందికి రూ.వెయ్యి స్టేషన్ నుంచి ఇస్తామని చెబుతున్నారు. అయితే రాజమహేంద్రవరంలోని రోటరీ కైలాసభూమి నిర్వాహకులు పట్టపగలు వెంకట్రావును సంప్రదించగా ఇన్నీసుపేట, కోటిలింగాల రేవు శ్మశానవాటికలకు సంబంధించి రెండు వాహనాలు అనాథ మృతదేహాలను ఉచితంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ సంఘటన జరిగిన రోజు మున్సిపాలిటీ, పోలీసుల వద్ద నుంచి ఏవిధమైన సమాచారం రాలేదని రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ అనాథ మృతదేహాన్ని తీసుకుని వచ్చి కైలాసభూమిలో అప్పగించి వెళ్లిపోయారని వెంకట్రావు తెలిపారు. -
టిక్‌టాక్ చేసిన సిబ్బందిపై చర్యలు
ఖమ్మం ,మయూరిసెంటర్: ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బందిలో క్రమశిక్షణ కొరవడడంతో వారిని గాడిలో పెట్టేందుకు ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. గత కొన్ని రోజులుగా కార్యాలయ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమ విధులను పక్కన పెట్టి సెల్ఫోన్లో టిక్‌టాక్ యాప్ ద్వారా సరదా వీడియోలు అప్లోడ్ చేశారు. ఈ టిక్‌టాక్ వీడియోలు వైరల్ కావడంతో కార్పొ రేషన్ సిబ్బంది తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలో పనులను పక్కనపెట్టి ఇలా టిక్‌టాక్‌లతో కాలక్షేపం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో కార్పొరేషన్ అధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. మొదటి చర్యగా ఆయా ఉద్యోగుల సెక్షన్లు మార్చారు. అయితే టిక్‌టాక్ వీడియోలు సోషల్ మీడియాలో మరింత హల్చల్ చేయడంతో వారిని శానిటేషన్ విభాగానికి మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. -
మారని మృగాడు!
అనంతపురం న్యూసిటీ: కటకటాలకు వెళ్లొచ్చినా ఈ మృగాడిలో మార్పురాలేదు. పడుపు వృత్తినే ప్రవృత్తిగా మార్చుకుని సమాజంలో చెలామణి అవుతున్నాడన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. కూతురు వయసున్న అమ్మాయిలు కన్పిస్తే చాలు టక్కున వాలిపోయి వారి ఫోన్ నంబర్లను సేకరించి వ్యభిచార కూపంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. నగరపాలక సంస్థలో పనిచేసే ఈ ఉద్యోగి ఈ నెల 13న అనంతపురంలోని సాయినగర్‌లో ఓ అమ్మాయికి మాయమాటలు చెప్పి సెల్ నంబర్ సేకరించిన విషయం విదితమే. పదేళ్ల క్రితమే కేసు నమోదు నగరపాలక సంస్థలోని సదరు ఉద్యోగిపై పదేళ్ల క్రితమే వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. అమ్మాయిలను ట్రాప్ చేసే విషయంలో జైలు జీవితం అనుభవించాడు. 2007–08లో వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఓ గుర్తు తెలియని అమ్మాయిని వాహనంలో తీసుకెళ్తూ ఉండగా పోలీసులు నిఘా ఉంచి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. అప్పట్లో ఈ విషయం పెద్ద సంచలనమైంది. పోలీసులు ఆ ఉద్యోగితో బాధితురాలి కాళ్లు పట్టించారు. చివరకు రిమాండ్‌కు పంపారు. అప్పటి అ«ధికారులు ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు తలొగ్గి వదిలేశారు. దీన్ని అలుసుగా తీసుకుని ఆ ఉద్యోగి మళ్లీ అమ్మాయిలను ట్రాప్ చేసే పనిలో నిమగ్నమయ్యాడు. ఇంటెలిజెన్స్ పోలీసుల విచారణ సదరు ఉద్యోగిపై ఇంటెలిజెన్స్ పోలీసులు ఆదివారం ఆరా తీశారు. నగరపాలక సంస్థలో పని చేస్తున్న ఉద్యోగి అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న వైనం గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దీనిపై మరింత లోతుగా విచారణ చేసే దిశగా చర్యలు తీసుకోనున్నారు. కమిషనర్ విచారణ నగరపాలక సంస్థలోని ఉద్యోగిపై కమిషనర్ పీవీవీఎస్ మూర్తి విచారణకు ఆదేశించారు. సోమవారం ఉద్యోగిని తన ముందు హాజరుపర్చాలని కిందిస్థాయి అధికారులకు సూచించారు. దీనిపై ఉద్యోగుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. రెడ్‌కార్పెట్ నగరపాలక సంస్థ అధికారులు ఈ ఉద్యోగికి రెడ్‌కార్పెట్ వేస్తున్నారు. ఇతని జీతం నెలకు రూ.50 వేల పైమాటే. గత కొన్నేళ్లుగా ఈయన ఒక్క పనీ చేయడం లేదు. కాలక్షేపానికి ఆఫీసుకు వచ్చి వెళ్తుంటారు. ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో పని చేయాల్సి ఉన్నా..పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఏ ఒక్క పనిలోనూ ఇతని ప్రమేయం లేదంటే అధికార పార్టీ నేతల మద్దతు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. -
పెద్దలు.. గద్దలు
ఈ ఫొటోలో కనిపిస్తున్న స్థలం జిల్లాకేంద్రంలోని కోతిరాంపూర్ 415 సర్వేనంబర్లోనిది. ఈ స్థలం ప్రభుత్వ భూమి. దీనిని ఎన్టీవోస్ల కోసం ఏళ్లక్రితమే ప్లాట్లుగా చేసి పార్కు కోసం రెండెకరాల స్థలాన్ని వదిలిపెట్టారు. ఈ స్థలాన్ని కొందరు అక్రమార్కులు క్రమక్రమంగా ఆక్రమించారు. వారు ఇళ్లు నిర్మించుకునేందుకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించాల్సిన అధికారులు కళ్లుమూసుకుని అనుమతితోపాటు ఇళ్లకు నంబర్లు కూడా ఇచ్చారు. ఈ స్థలం పూర్వాపరాలు తెలిసిన ఓ వ్యక్తి ఇటీవల కోర్టును ఆశ్రయించాడు. ప్రభుత్వ భూమిని రక్షించాలని పిటిషన్ దాఖలు చేశాడు. దీనిని విచారించిన కోర్టు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేసింది. దీంతో కార్పొరేషన్ అధికారులు సర్వేచేయగా.. సదరు స్థలంలో ఏకంగా ఓ కార్పొరేటర్ కూడా ఇల్లు కట్టుకున్నట్లు గుర్తించి కూల్చివేశారు. ఇంకా ఆ స్థలంలో అక్రమంగా నిర్మించిన ఇళ్లు చాలా ఉన్నాయి. కరీంనగర్ కార్పొరేషన్: సీనియర్ సిటిజన్ల కాలక్షేపం, పిల్లల ఆటల కోసం పార్కులు ఏర్పాటు చేద్దామంటే సెంటు భూమి లేకుండా పోతోంది. రాజకీయ జోక్యం మితిమీరిపోవడంతో స్థానికులు నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు అధికారులు çహడావుడి చేయడం తప్ప అడ్డుకున్న సంఘటనలు కానరావడం లేదు. కరీంనగర్ నగరపాలక సంస్థకు చెందిన స్థలాలు 44 ప్రాంతాల్లో 19.22 ఎకరాలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నా యి. కబ్జాల బారిన పడి ఇప్పటికే సగానికి పైగా భూములు మాయమయ్యాయి. ఇప్పుడు వేళ్లపై లెక్కపెట్టే విధంగా స్థలాలు కనిపిస్తున్నాయి. అవి కూడా నాలుగు వైపులా ఆక్రమణలకు గురై కుంచించుకుపోయాయి. కనీసం ఉన్న భూములునైనా కాపాడుకోవాలనే ధ్యాస కూడా అధికారులకు లేకుండా పోతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కింది స్థాయి అధికారుల అండదండలతో కబ్జాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా ప్రభుత్వ స్థలాలన్నీ పరులపాలవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మున్సిపల్ పార్కుస్థలాలు కబ్జా.. నగరంలోని మున్సిపల్‌కు చెందిన సుమారు 44 పార్కుల స్థలాలుండగా.. కేవలం ఏడు ప్రాంతా ల్లోనే పార్కుల ఆకారాలు కనిపిస్తున్నాయి. కాశ్మీర్‌గడ్డ, హౌసింగ్‌బోర్డుకాలనీ, వావిలాలపల్లి, బ్యాం కుకాలనీ, అలకాపురి, జ్యోతినగర్, జెడ్పీ క్వార్టర్స్ ప్రాంతాల్లో మాత్రమే పార్కు స్థలాలకు ప్రహరీలు నిర్మించారు. మిగతా ప్రాంతాల్లో పార్కు స్థలాలు ఎక్కడ ఉన్నాయని బూతద్దం పెట్టి వెతకాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. వినాయకమార్కెట్ స్థలం పూర్తిగా అన్యాక్రాంతమై భవనాలు వెలిశాయి. కోతిరాంపూర్ ఎన్జీవో కాలనీలోని 415, 711 సర్వేనెంబర్లలోని ఐదెకరాల పార్కు స్థలంలో గుడిసెలు వెలిశాయి. ఆ తర్వాత పక్కా భవనాలు నిర్మాణం జరిగాయి. వాటికి నగరపాలక సంస్థ అధికారులు నంబర్లు ఇచ్చేశారు. భగత్‌నగర్ ఎన్జీవో కాలనీల్లో పార్కుకు చెందిన రెండెకరాల స్థలం మాయమైంది. క్రిస్టియన్ కాలనీ, జ్యోతినగర్ మోర్ సూపర్‌మార్కెట్ ముందు, శివథియేటర్ వెనుక స్థలం, కట్టరాంపూర్ ప్రాంతాల్లోని స్థలాలు వివాదాస్పం గా మారాయి. హౌసింగ్ బోర్డులో 21 గుంటల పార్కు స్థలం కబ్జా కోరల్లో చిక్కింది. సాయికృష్ణ థియేటర్ వెనుక ఉన్న స్థలం అన్యాక్రాంతం కావడానికి సిద్ధంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే దేవేందర్‌రావు ఇంటివద్ద నున్న పార్కు స్థలాన్ని స్థానికులు సుప్రీంకోర్టు వరకు వెళ్లి కాపాడుకోగలిగారు. ఈ స్థలానికి ఇటీవలే ప్రహరీ నిర్మించారు. పార్కు పనులు చేపట్టారు. ఇవే కాకుండా మరిన్ని స్థలాలు కబ్జాలకు గురై కోర్టు కేసుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. వీటిపై అధికారులు పోరాడడం మానేయడంతో అవి కబ్జాదారులకే దక్కే అవకాశం ఉంది. రెవెన్యూ స్థలాల పరిస్థితీ ఇంతే.. నగరంలో ఉన్న 243 ఎకరాల రెవెన్యూ స్థలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించినవి మినహా మిగతా స్థలాలన్నీ పక్కా నిర్మాణాలే వెలిశాయి. గుడిసెలు వేయడం కబ్జాలు చేయడం, ఆ తర్వాత అధునాతన భవనాలు నిర్మించడం.. పూర్తిగా రాజ కీయంగా మారిన కబ్జాల వ్యవహారాన్ని అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరించడంతో కబ్జాదారులకు అడ్డూఅదుపూ లేకుండాపోతోంది. నగరంలోని సప్తగిరికాలనీలోని 1026 స ర్వేనంబర్లో గతంలోనే అక్రమ నిర్మాణాలు వెలి శాయి. సర్వేనెంబర్ 1026లో సుమారు 11 ఎకరాల స్థలం, ఎస్సారార్ కళాశాల గ్రౌండ్‌లోని కొం తభాగం కూడా ఆక్రమణపాలైంది. ఇలా ప్రభు త్వ స్థలాలన్నీ ఆక్రమణకు గురయ్యాయి. భవిష్యత్తులో ఏదైనా ప్రభుత్వ కార్యాలయం, పాఠశాల, ఆసుపత్రి నిర్మాణం చేయాలన్నా సెంటుస్థలం కూ డా లేకుండాపోయింది. పాలకులు, అధికారులు స్థలాలు కాపాడడంలో విఫలమవడంతోనే ఈ పరి స్థితి నెలకొందనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఆలస్యంగా మేల్కొని.. స్థలాలన్నీ కబ్జాలకు గురయ్యాక ఆలస్యంగా అధికారులు మేల్కొన్నారు. ఇటీవల అమృత్ నిధులతో పార్కుల నిర్మాణం చేపట్టారు. అమృత్ కోసం ఎంపిక చేసిన పార్కుల్లో సైతం కోర్టు వివాదాలు తలెత్తడంతో బల్దియా అధికారులకు తలనొప్పిగా మారింది. పార్కు స్థలాలను కబ్జాకోరల నుంచి కాపాడేందుకు, ఆహ్లాద వాతావరణాన్ని కల్పించేందుకు అధికారులు ప్రణాళికాబద్ధగా ముందుకెళ్లి పార్కుల నిర్మాణానికి కదులుతున్నారు. జ్యోతినగర్ మోర్‌సూపర్ మార్కెట్ ఎదురుగా ఉన్న 1.04 ఎకరాల స్థలంపై ఇటీవలే కోర్టు తీర్పునిచ్చింది. బల్దియాకే స్థలం చెందుతుందని తేల్చిచెప్పింది. వెంటనే స్థలానికి ప్రహరీ పనులు ప్రారంభించారు. శివథియేటర్ సమీపంలోని స్థలానికి సైతం కోర్టు నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో పోలీసు పహార మధ్యన ప్రహరీ పనులను ప్రారంభించారు. హౌసింగ్‌బోర్డులోని రెండు ప్రాంతాల్లో కబ్జాకు గురైన పార్కుల స్థలాలను మున్సిపల్ స్వాధీనం చేసుకుంది. కోతిరాంపూర్‌లోని 415 సర్వేనంబర్‌లో ఆ డివిజన్ కార్పొరేటర్ ఇల్లు నిర్మాణం చేసుకుంటే కోర్టు ఆదేశంతో కూల్చివేశారు. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సైతం పార్కుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నాయి. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని మున్సిపాలిటీలు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని మిగిలి ఉన్న ప్రభుత్వ స్థలాలకు పెన్సింగ్, ప్రహరీ నిర్మించి రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్థలాలను కాపాడి పార్కులుగా అభివృద్ధి చేస్తున్నాం ఇప్పటికే ఐదు విలువైన పార్కు స్థలాలను కాపాడాం. హౌసింగ్‌బోర్డులో రెండు స్థలాలు, జ్యోతినగర్‌లో రెండు స్థలాలు, కోతిరాంపూర్‌లో ఒక స్థలాన్ని మున్సిపల్ ఆధీనంలోకి తీసుకుని రక్షణ ఏర్పాటు చేస్తున్నాం. కార్పొరేషన్ ఆధీనంలో ఉన్న విలువైన భూముల్ని రక్షించేందుకు చర్యలు చేపడతున్నాం. రాబోయే రోజుల్లో అన్ని స్థలాలను కాపాడి పార్కులుగా అభివృద్ధి చేస్తాం. – కె.శశాంక,నగరపాలక సంస్థ కమిషనర్ -
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
కడప కార్పొరేషన్: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఫెడరేషన్ జేఏసీ పిలుపు మేరకు మంగళవారం కడప కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించా రు. ఈ సందర్భంగా సీఐటీయూ నగర గౌరవాధ్యక్షుడు ఏ. రామ్మోహన్, ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు వేణుగోపాల్ మాట్లాడుతూ మున్సిపల్ సమస్యలు పరిష్కరించాలని కొన్నేళ్లుగా వివిధ రూపాల్లో ఆందోళన చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, జీఓ నంబర్ 151ని రద్దు చేసి, 151 జీవో ప్రకారం పెరిగిన వేతనాలు ఇవ్వాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పీఎఫ్, ఈఎస్ఐ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు గోపీ, గోవింద్, కేశవ, విజయ్‌భాస్కర్, రవి, హరి, జాన్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వార్డు కార్యాలయాల ఎదుట.. కడప వైఎస్ఆర్ సర్కిల్: నగర కార్పొరేషన్లో పని చేస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (ఆర్టీయూ) జిల్లా కార్యదర్శి సుంకర రవి డిమాండ్ చేశారు. మంగళవారం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నగర కార్పొరేషన్ పరిధిలోని వార్డు కార్యాలయాల ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. సిద్ధిరామయ్య, లక్ష్మీదేవి, కొండయ్య, కార్మికులు పాల్గొన్నారు. -
సాక్షిగా నేను నిలబడతా
విజయనగరం మున్సిపాలిటీ : సాక్షిగా నేను నిలబడతా, కౌన్సిల్‌కు దమ్ముంటే ఇప్పటి వరకు నేను ఇచ్చిన డిసెంట్ నోట్లపై విచారణ జరిపించండి. పాలకవర్గం, అధికార యంత్రాంగం చేస్తున్న అవినీతి నిజాలు నిగ్గు తేలుతాయని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీకి చెందిన సీనియర్ కౌన్సిలర్ ఎస్వీవీ రాజేష్ సవాల్ విసిరారు. గురువారం మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశం వాడీవేడీగా సాగింది. అజెండాలోని 23 అంశం చర్చకు వచ్చిన సమయంలో గ్రాడ్యుయేటెడ్ టెక్నికల్ వర్క్ ఇన్స్పెక్టర్స్ను 12 నెలల కాలపరిమితికి నియమించుకోవడంపై రాజేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ చైర్మన్‌కు ఆ అంశాన్ని వ్యతిరేకిస్తూ డీసెంట్ నోట్ ఇచ్చారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ మొత్తం 12 మంది ఇన్స్పెక్టర్ల నియామకాల్లో అవతవకలు చోటు చేసుకున్నాయని, డబ్బులు తీసుకుని నియామకాలు చెపట్టారని ఆరోపించారు. వారిని పంపిణీ చేసే విశాఖకు చెందిన సినెర్జీ ఎంటర్ప్రైజెస్ సంస్థ స్వయానా మున్సిపల్ ఇంజినీర్ రాజేంద్రకృష్ణ బినామీ సంస్థగా పేర్కొన్నారు. ఈ నియామకాల ద్వారా అవకతవకలు చోటు చేసుకోవడంతో పాటు భవిష్యత్‌లో భారీ అవినీతి చోటు చేసుకునే అవకాశం ఉందని సభ దృష్టికి తీసుకొచ్చారు. నకమహాలక్ష్మి ఇన్చార్జి కమిషనర్‌గా ఉన్న సమయంలో వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని పట్టణంలో అభివృద్ధి స్తంభించటానికి బినామీలే కారణమంటూ తూర్పరబట్టారు. ప్రతిపక్షం డిసెంట్ నోట్ ఇవ్వడంపై స్పందించిన అధికార పార్టీ కౌన్సిలర్లు కేవలం అధికారులను బెదిరించేందుకు ఇలాంటి నోట్ ఇస్తున్నారని మాటల దాడికి దిగడంతో స్పందించిన ప్రతిపక్ష కౌన్సిలర్ ధీటుగా సమాధానమిచ్చారు. తాను ఇప్పటి వరకు ఇచ్చిన డీసెంట్ నోట్లపై విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. ఇంజినీరింగ్ అధికారులపై విరుచుకుపడ్డ కౌన్సిల్.. మున్సిపాలిటీని ప్రగతి పథంలో నడిపించాల్సిన ఇంజినీరింగ్ అధికారుల తీరుపై గురువారం మున్సిపల్ కౌన్సిల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. నెలల తరబడి వీధి దీపాలు వెలగకున్నా కుంటి సాకులతో నెట్టుకురావడంపై 21వ వార్డు కౌన్సిలర్ గేదెల ఆదినారాయణ ఆగ్రహంతో ఊగిపోయారు. రూ.200లకే మంచి నీటి కుళాయిల మంజూరుపై మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ మండిపడ్డారు. ఈ సమయంలో మున్సిపల్ ఇంజినీర్ రాజేంద్రకృష్ణ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా, చైర్మన్ అవసరం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్ అధికారుల తీరుతో కౌన్సిలర్లు తలదించుకోవాల్సి వస్తోంది. లొసుగులు లేకుంటే టెండర్లను కౌన్సిల్‌కు చూపడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఏసీ సంతకాలు చేసిన టెండర్లను కౌన్సిల్లో ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. అసలు మున్సిపాలిటీలో ఏపీఎండీపీ స్కీం, అమృత్ స్కీంల అమలుపై అవగాహన ఉందా అంటూ ప్రశ్నించారు. ఇంజినీరింగ్ అధికారుల నిర్వాకంతో అభివృద్ధి పనుల్లో జాప్యం చోటు చేసుకుంటుందని, నిధులు వినియోగంలో నిర్లక్ష్యం వహించడంతో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద మంజూరైన కోట్లాది నిధులు వెనక్కి మళ్లిపోయే పరిస్థితి దాపురించిందని ఇలా అయితే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ఎప్పటికి జరుగుతుందని 1వ వార్డు కౌన్సిలర్ సోము స్రవంతి ప్రశ్నించారు. స్వయానా జిల్లా కలెక్టర్ వార్డుల్లో పర్యటించడం చూస్తుంటే కౌన్సిల్ పనితనం ఏంటో ప్రజలకు సందేశం వెళ్లిపోయిందని, మున్సిపాలిటీలో అధికారులు పని చేస్తున్నారా అంటూ 24వ వార్డు కౌన్సిలర్ రొంగలి రామారావు నిలదీశారు. సమావేశంలో లైటింగ్ సమస్యపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ టి.వేణుగోపాలరావు మాట్లాడుతూ రానున్న రెండు మూడు రోజుల్లో శతశాతం వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కనకల మురళీమోహన్, అసిస్టెంట్ కమిషనర్ కె.కనకమహాలక్ష్మి, ఇతర కౌన్సిల్ సభ్యులు, వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
డీఈఈ ఇంటిపై ఏసీబీ దాడులు
-
మున్సిపల్ కౌన్సిలర్ బూతు పురాణం
జహీరాబాద్: జహీరాబాద్ మున్సిపాలిటీలోని ఓ వార్డు అభివృద్ధి పనుల్లో వార్డు కౌన్సిలర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్‌కు నడుమ జరిగిన ఫోన్ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. మున్సిపల్ ఇంజనీర్‌పై కౌన్సిలర్ బూతు పురాణానికి దిగిన ఘటన 4 రోజుల క్రితం జరగ్గా, మంగళవారం సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగు చూసింది. కౌన్సిలర్ తీరుపై మున్సిపల్ ఉద్యోగులు ఆందోళనకు దిగగా, సదరు కౌన్సిలర్ క్షమాపణ చెప్పడంతో వివాదం సమసిపోయింది. జహీరాబాద్ మున్సిపాలిటీలోని 11వ వార్డులో 14వ ఆర్థిక సంఘం నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించారు. పనులకు సంబంధించి కాంట్రాక్టరుతో ఒప్పందం కుదిరినా ఇంకా పనులు ప్రారంభం కాలేదు. వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ కౌన్సిలర్ రాములు ఈ నెల 5న మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ అవినాశ్‌రెడ్డికి ఫోన్ చేశారు. పనులు ఎందుకు ప్రారంభించడం లేదని కౌన్సిలర్ రాములు ప్రశ్నించగా, 7వ తేదీ నుంచి ప్రారంభిస్తామని కాంట్రాక్టు పొందిన వ్యక్తులు చెప్పారని ఏఈ సమాధానం ఇచ్చారు. దీంతో ఫోన్ సంభాషణ గాడి తప్పి.. కౌన్సిలర్ రాములు బూతు పురాణం ఎత్తుకున్నారు. పత్రికలో రాయలేని భాషలో ఏఈని దుర్భాషలాడారు. ‘చేతనైతే పనులు చేయండి. లేదంటే వెళ్లిపోండి. ఆర్‌అండ్‌బీకి సంబంధించిన బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదని’గద్దించారు. పనితీరు నచ్చక పోతే కమిషనర్‌కు ఫిర్యాదు చేయాలని ఏఈ చెప్పినా, బూతు పురాణం ఆపలేదు. ఈ వ్యవహారంపై ఏఈ మంగళవారం మున్సిపల్ కమిషనర్ జైత్రాంకు ఫిర్యాదు చేశారు. కౌన్సిలర్‌పై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీనివ్వగా, పనులు ప్రారంభం కాకపోవడంతో వార్డు ప్రజల నుంచి ఒత్తిడితోనే సహనం కోల్పోయానని కౌన్సిలర్ అన్నారు. -
జీవో 14 ప్రకారం వేతనాలు చెల్లించాలి
పెద్దపల్లిటౌన్ : సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్ధీకరణ, వేతనాల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోవడంతో జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు బుధవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా మున్సిపల్ జేఏసీ పెద్దపల్లి నాయకులు మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, జీహెచ్ఎంసీలో చెల్లిస్తున్న మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులకు ఒకే విధంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం గతంలో సమ్మె చేసినపుడు కార్మికులతో జరిపిన చర్చల్లో జీవో 14 ప్రకారం వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. పలుమార్లు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ తమ సమస్యలను పట్టించుకోక పోవడం శోచనీయమన్నారు. రెక్కాడితేగాని డొక్కాడని తమకు చాలీ చాలని వేతనాలతో కుటుంబాల పోషణ భారమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించిన వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కార్మికుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికుల వేతనాలు పెంచి, వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని కార్మికులు స్పష్టం చేశారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్ మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ కార్మికుల వేతన పెంపుపై మున్సిపాలిటీ తీర్మానం చేసి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వేతనాలు చెల్లిస్తామన్నారు. సమ్మెతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు ఎరవెల్లి ముత్యంరావు, ఆరెపల్లి చంద్రయ్య, సావనపల్లి వెంకటస్వామి, మల్లారపు కొమురయ్య, ఆరెపల్లి సాగర్, శంకర్, వంశీ, గద్దల శ్రీనివాస్, బొంకూరి చంద్రయ్య, మామిడిపల్లి శ్రీనివాస్, సలిగంటి పద్మ, కాదాసి లక్ష్మి, చింతల మరియా తదితరులు పాల్గొన్నారు. -
వీరింతే!
కర్నూలు(టౌన్) : ఈ ఏడాది జనవరి 27న కర్నూలు నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బాలసుబ్రమణ్యం రూ.15 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. ఓ కాంట్రాక్టర్‌కు బిల్లులు క్లియరెన్స్ చేసేందుకు ఈ లంచం డిమాండ్ చేశారు. అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది. ఇది మరువక ముందే తాజాగా మంగళవారం నగర పాలక రెవెన్యూ విభాగంలో పనిచేసే బిల్ కలెక్టర్ సుధాకర్ రూ.5 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఈ ఘటనలు నగర పాలక సంస్థ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. ప్రక్షాళన ఏదీ? పన్ను వసూళ్లలో నగర పాలక రెవెన్యూ విభాగం కీలకమైనది. ఈ విభాగంలో ఇద్దరు రెవెన్యూ అ«ధికారులు, ఏడుగురు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, 23 మంది బిల్ కలెక్టర్లు ఉన్నారు. వీరంతా 94 వేల అసెస్మెంట్లకు సంబంధించిన ఆస్తి పన్ను, 48 వేల కొళాయి కనెక్షన్ల నీటి పన్ను వసూలు చేయాల్సి ఉంటుంది. రెండు అర్ధ సంవత్సరాల్లో ఆస్తి పన్ను రూ.36 కోట్లు, నీటిపన్ను రూ.8 కోట్లు వసూలు చేయాలి. అలాగే నూతనంగా చేపట్టే ఇళ్లు, భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, అపార్టుమెంట్లు .. ఇలా ప్రతి నిర్మాణానికి పన్ను వేయాల్సి ఉంటుంది. ఇక్కడే పెద్దఎత్తున అవినీతి జరుగుతోందన్న విమర్శలున్నాయి. రూ.5 వేలు లంచం తీసుకుంటూ.. కర్నూలు నగరంలోని కల్లూరు అయ్యప్పస్వామి నగర్లో నాగ లక్ష్మీదేవి కుటుంబం ( రెవెన్యూ వార్డు 77) నివసిస్తోంది. వారికి అక్కడే సాయి విద్యానికేతన్ స్కూలు ఉంది. ఈ స్కూలుకు కొళాయి కనెక్షన్ కావాలని అదే ఏరియాకు చెందిన బిల్ కలెక్టర్ సుధాకర్‌ను ఆశ్రయించారు. కొళాయి కనెక్షన్ కావాలంటే ముందుగా పన్ను వేయాలంటూ నెలరోజుల పాటు తిప్పుకున్నారు. చివరకు బిల్ కలెక్టర్ రూ.5 వేలు లంచం డిమాండ్ చేశారు. అప్పటికే విసిగి వేజారిన నాగలక్ష్మీదేవి తమకు తెలిసిన వ్యక్తి రవికుమార్ ద్వారా మాట్లాడించి.. రూ.5 వేలు ఇచ్చేందుకు అంగీకరించారు. ఇదే విషయంపై రాతపూర్వకంగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సుధాకర్‌ను వల పన్ని పట్టుకునేందుకు వారు పక్కా వ్యూహాన్ని అమలు చేశారు. ఇందులో భాగంగా మంగళవారం స్థానిక శ్రీరామ థియేటర్ వద్ద బిల్ కలెక్టర్ రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా.. అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన్ను అదుపులోకి తీసుకొని.. అక్కడి నుంచి నగరపాలక రెవెన్యూ విభాగానికి తరలించి విచారించారు. ఇంటికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని.. రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ జయరామరాజు తెలిపారు. నగరపాలక సంస్థలో మరికొంత మంది ఉద్యోగులపై ఫిర్యాదులు ఉన్నాయని, వాటిపైనా దృష్టి పెట్టామని డీఎస్పీ తెలిపారు. -
కబ్జాలకు కేరాఫ్..అతడు
పుత్తూరులో కి చెందిన ఓ తృతీయశ్రేణి నాయకుడు కబ్జాలకు కేరాఫ్ ‘అతడే’ అన్నట్లు మారాడు. ఇటీవల కాలంలో ఆయన ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఖాళీగా ఉన్న డీకేటీ స్థలాలను కబ్జా చేయడం అతని పని. ఇటీవల సదరు నాయకుడి కబ్జాపర్వాన్ని ఎదురించిన ఓ మహిళపై కూడా తన మనుషులతో భౌతిక దాడి చేయించాడు. ఈ గొడవను అడ్డుకోవడానికి వెళ్లిన పోలీసులపైనా సదరు నాయకుడి మనుషులు ఎదురు తిరగబోయారంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉందో ! పుత్తూరు : మున్సిపల్ పరిధిలోని భవానీనగర్‌లో టీడీపీకి చెందిన ఓ చోటా నాయకుడు పెట్రేగుతున్నాడు. ఖాళీ స్థలాలను కబ్జా చేయడం, ప్రశ్నించిన స్థానికులపై దాడులకు చేయించడం ఆయనకు నిత్యకృత్యమైపోయింది. రాత్రయితే చాలు సదరు నాయకుడి గ్యాంగ్ పట్టణంలో స్వైరవిహారం చేస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకుడు సాగిస్తున్న ఆగడాలకు స్థానికులను బెంబేలెత్తుతున్నారు. మున్సిపల్ పరి« దిలో ఇళ్లులేని నిరుపేదలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు గత ప్రభుత్వం భవానీనగర్‌లోని ఇంటిపట్టాలను మంజూరు చేసినా వారికి స్థలాలను చూపలేదు. దీంతో చాలామంది లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోలేకపోయారు. అయితే అంతకుమునుపు అనుభవంలో ఉన్న డీకేటీ పట్టాదారులు న్యాయస్థానం ఆశ్రయించడంతో వివాదం కోర్టు పరిధిలోకి వెళ్లింది. ఏరియా ఒకటి..పది ప్లాట్లు కబ్జా ప్రస్తుతం సుమారు వంద కుటుంబాల వరకు భవానీనగర్‌లో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. బైపాస్కు ఆనుకుని ఉండడంతో ఇక్కడ ఫ్లాట్ ధర రూ.5 లక్షల వరకు పలుకుతోంది. దీంతో ఆ చోటా నాయకుడి కన్ను ఖాళీ స్థలాలపై పడింది. న్యాయస్థానం ఆదేశాలు ఉండడంతో ఇక్కడ కొత్తగా ఇళ్లు నిర్మించుకోలేని పరిస్థితి. అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్న చోటా నాయకుడు సుమారు పది ప్లాట్ల వరకు కబ్జా చేసేశాడనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నా యి. కాలనీలో పెరియపాలితమ్మ అమ్మవారి ఆలయానికి ఆనుకుని ఉన్న సుమారు 10 సెంట్ల వరకు ఖాళీ స్థలంపై కూడా చోటా నాయకుడి కన్ను పడింది. ఆలయ అభివృద్ధి సాకుతో ఆ స్థలాలను విక్రయించే పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం. మహిళపై దాడి.. ఇటీవల సదరు నేత కబ్జా పర్వాన్ని ఎదురించిన ఒక మహిళపై ఆయన బ్యాచ్ రాత్రి వేళ ఆమె ఇంట్లోకి చొరబడి తీవ్రంగా కొట్టినట్లు సమాచారం. తనపై జరిగిన దాడి విషయాన్ని ఆ మహిళ 100కు ఫోన్ చేయడంతో స్థానిక పోలీసులు భవానీనగర్‌కు చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్న చోటా నాయకుడి బ్యాచ్ పోలీసు వాహనాన్ని నిర్బంధించారు. ఆ అల్లరిమూకలను పోలీస్ కానిస్టేబుల్ తీవ్రంగా ప్రతిఘటించడంతో తప్పించుకున్నారు. తనకు ఉన్న రాజకీయ పలుకుబడితో కేసు నమోదు కాకుండా తప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో సదరు నాయకుడి ఆగడాలకు అడ్డూ ఆపులేకుండా పోతోంది. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని భవానీనగర్ వాసులు వేడుకుంటున్నారు. ఫిర్యాదు వచ్చింది వాస్తవమే భవానీనగర్‌లో ఒక మహిళపై దాడికి పాల్పడినారనే ఆరోపణలపై ఆ మహిళ ఫిర్యాదు చేసిన మాట వాస్తవమే. ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. భవానీనగర్ ప్రాంతంలో ఎవరైనా రౌడీయిజం, పంచాయతీలు చేయడం, స్థాని కులపై దాడులకు పాల్పడడం వంటి సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. -
చెరువు గర్భంలో నిర్మించిన ఇళ్లను తొలగించాలి
బొబ్బిలి : పట్టణంలోని 8వ వార్డులోని శివాలయం వీధి వద్ద ఉన్న కూర్మయ్య బందలో ఆక్రమణలు వెంటనే తొలగించాలని రామలింగేశ్వర దేవాంగుల సంక్షేమ సంఘం ధర్నా నిర్వహించింది. సంఘ సభ్యులకు పట్టణ పౌరసంక్షేమ సంఘం సంఘీభావంగా రావడంతో మున్సిపల్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్నూరు శంకరరావు మాట్లాడుతూ కూర్మయ్య బంద పూర్వం నుంచి స్మశాన వాటికగా ఉపయోగించుకునే వారమన్నారు. ఆ తరువాత ఇక్కడి చెరువు గట్టుపై అధికారులు ఇచ్చిన పట్టాలతో ఇళ్లను నిర్మించుకున్నారన్నారు. అధికారులు 30–10 వెడల్పుతో పట్టాలు ఇస్తే సుమారు వంద అడుగుల వరకూ ఇళ్ల నిర్మాణం చేపట్టి స్మశానం ముందుకు వచ్చేశారని సంఘం సభ్యులు ఆరోపించారు. స్మశానంగా వాడుకునే చెరువు గర్భంలోకి ఇళ్ల నిర్మాణంతో వాడుకున్నది కాక ఇప్పుడు స్మశాన నిర్మాణాన్ని అడ్డుకోవడం ఏమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇళ్లను, నిర్మించుకున్న కొలతలను పరిశీలించాలని వారు డిమాండ్ చేశారు. తహసీల్దార్ పరిశీలన.. పట్టణంలోని స్మశాన వాటిక నిర్మాణానికి ఆక్రమణ దారులే అడ్డుపడుతున్నారని తహసీల్దార్‌కు వినతిపత్రం ఇవ్వడంతో తహసీల్దార్ సాయికృష్ణ తన సిబ్బందితో వచ్చి పరిశీలన చేశారు. స్థలం ఎంత వరకు ఉంది? అక్కడ ఇళ్లను ఎంత వరకు నిర్మించుకున్నారన్న విషయం పరిశీలించారు. దీనిపై పూర్తి స్థాయిలో అందరినీ విచారించి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. మాకు స్మశాన వాటికను నిర్మించి ఇవ్వాలని స్థానికులు కోరారు. వి ఇందిర, జాడ గోవింద రావు, కే పార్వతీశం, ఆదెం అప్పారావు, సర్వేశ్వరరావు, బాబ్జీ, బల్ల శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీ దాడులు.. కోట్లలో అక్రమాస్తులు గుర్తింపు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఆదిలాబాద్ మున్సిపల్ డీఈ కొండల్రావు ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఆదిలాబాద్, వరంగల్, కొత్తగూడెంలలో పలుచోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు రూ. 6 కోట్ల అక్రమాస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. కొత్తగూడెం జిల్లా రామానుజ కాలనీలోని మున్సిపల్ డీఈ మామ ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ రోజు సాయంత్రం వరంగల్‌లో మీడియాకు వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. -
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఉద్యోగుల సమ్మె
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం నుంచి నిరవధిక సమ్మెను ప్రారంభించారు. మొత్తం 110 మున్సిపాల్టీలకుగాను తొలిరోజు 98 మున్సిపాల్టీల్లో సమ్మె విజయవంతంగా జరిగింది. సీఐటీయూ, ఐఎఫ్టీయూసీల ప్రాబల్యం ఉన్న మున్సిపాల్టీల్లోని కార్మికులు, ఉద్యోగులు విధులకు హాజరుకాకుండా సమ్మెను జయప్రదం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లలో ధర్నాలు, రాస్తారాకోలు, ప్రదర్శనలు నిర్వహించారు. సోమవారం సాయంత్రంలోపు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీ రాకపోతే మంగళవారం నుంచి సమ్మెలో పాల్గొంటామని ఏఐటీయూసీ ప్రకటించిన విషయం విదితమే. ఈ మేరకు ఆ సంఘానికి చెందిన కార్మికులు సోమవారం విధులకు హాజరయ్యారు. విజయవాడ, గుంటూరుల్లో సీఐటీయూ సంఘాల నాయకత్వంలో, మిగిలిన జిల్లాల్లో ఉద్యోగ సంఘాల ప్రాబల్యానికి అనుగుణంగా ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు.కార్మికులందరినీ ఉద్యోగాల్లో కొనసాగించడం, ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. -
20 మందికి ‘కమిషనర్లు’గా పదోన్నతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పురపాలికల్లో మేనేజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్న 20 మంది ఉద్యోగులకు గ్రేడ్– 3 మున్సిపల్ కమిషనర్లుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని వివిధ పురపాలికల్లో శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేనేజర్లుగా పనిచేస్తున్న డి.జైత్రామ్, సీహెచ్.వేణు, ఎస్.రాజమల్లయ్య, జీ.శ్రీనివాసన్, ఎంఆర్.జైరాజ్, బి.గోపాల్, ఎం.దేవేందర్, ఎన్.వెంకట స్వామి, జి.స్వరూపారాణి, కె.జయంత్ కుమార్ రెడ్డి, పి.సుధీర్ సింగ్, ఎం.పూర్ణచందర్, ఎండీ అయాజ్, పి.భోగేశ్వర్లు, ఎ.జగదీశ్వర్ గౌడ్, కె.అమరేందర్ రెడ్డి, ఎన్.క్రిష్ణారెడ్డి, బి.సత్యనారాయణ రెడ్డి, ఎన్.వసంత, కె.మల్లయ్యలు గ్రేడ్– 3 మున్సిపల్ కమిషనర్లుగా పదోన్నతి పొందారు. 21 మంది అధికారులకు గ్రేడ్– 3 మున్సిపల్ కమిషనర్లుగా పదోన్నతలు కల్పించాలనే ప్రతిపాదనలు ఏడాదిగా పెండింగ్‌లో ఉండగా, ఇటీవల రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ఆమోదం తెలిపారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అధికారికి మినహా మిగిలిన 20 మందికి పదోన్నతి కల్పించారు. -
మంత్రి ‘పల్లె’ కళాశాల సీజ్
⇒ ఆస్తి పన్ను చెల్లించని ఫలితం ⇒ ‘వాళ్లకెంత ధైర్యం.. వాళ్ల కథ నేను చూస్తాలే’ అంటూ సమాధానం కదిరి: ఆస్తి పన్ను చెల్లించని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డికి సంబంధించిన ఓ కాలేజీని మున్సిపాలిటీ అధికారులు సీజ్ చేశారు. కదిరిలో మంత్రి పల్లెకు చెందిన శ్రీనివాస జూనియర్ కాలేజీకి రూ. 1.61 లక్షల మేర ఆస్తి పన్ను బకాయి ఉంది. మున్సిపల్ కమిషనర్ భవానీప్రసాద్ మంగళవారం రెవెన్యూ సిబ్బందితో కాలేజీ వద్దకు వెళ్లి పన్ను చెల్లించాలంటూ గంటకు పైగా డప్పు వాయిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఆస్తిపన్ను గురించి బిల్డింగ్ యజ మానితో మాట్లాడుకోవాలని ఆ కాలేజీ ప్రిన్సి పల్ సూర్యప్రకాశ్ చెప్పడంతో మున్సిపల్ కమిషనర్ అక్కడి నుంచే బిల్డింగ్ యజమాని రామ సుబ్బారెడ్డితో ఫోన్లో మాట్లాడారు. బిల్డింగ్ పన్నులన్నీ కడతానని మంత్రి పల్లె తనకు అగ్రిమెంట్ రాసిచ్చాడని ఆయన సమాధానం చెప్పారు. నా కాలేజీలోనే డప్పు వాయిస్తారా! ఇదంతా జరుగుతుండగానే సదరు కాలేజీ ప్రిన్సిపాల్ అసెంబ్లీలో ఉన్న మంత్రి పల్లెకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేశారు. స్పందిం చిన మంత్రి ‘మన కళాశాల ఆవరణలోకి వచ్చి డప్పు వాయిస్తారా? వారికెంత ధైర్యం.. వాళ్ల కథ నేను చూస్తాలే.. ఆ విషయం నేను మున్సి పల్ మంత్రి నారాయణతో మాట్లాడతాను’ అని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే బకాయి కోసం వారం కిందటే రెడ్ నోటీస్ ఇచ్చామని చెప్పిన కమిషనర్.. కాలేజీ ఆఫీస్ రూం, స్టాఫ్ రూంలకు తాళం వేసి, సీల్ వేశారు. కాగా, కదిరిలోనే మంత్రి పల్లె నిర్వహిస్తున్న వివేకానంద డిగ్రీ కాలేజీ కూడా రూ. 84 వేల ఆస్తి పన్ను బకాయి ఉంది. ఆ పన్ను బిల్డింగ్ ఓనర్‌కే సంబంధం కదిరిలో మా శ్రీనివాస కాలేజీ బిల్డింగ్‌కు సంబంధించి ఆస్తి పన్నుకు మాకు ఎలాంటి సబంధం లేదు. ఆ బకాయి బిల్డింగ్ యజమానే చెల్లించాలి. అయినప్పటికీ మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన బకాయి చెక్కు రూపంలో పంపాను. – మంత్రి పల్లె రఘునాథరెడ్డి -
'ఏసీబీ దాడిలో కుట్ర కోణం'
నిజామాబాద్: అవినీతి నిరోధక శాఖాధికారుల దాడిలో కుట్ర కోణం కనిపిస్తోందని మాజీమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. నిజామాబాద్ ఏసీబీ అధికారులకు చిక్కి ఆత్మహత్య చేసుకున్న మున్సిపల్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు కుటుంబాన్ని ఆదివారం ఆయన పరామర్శించారు. చదవండి : (అవమాన భారం ఉసురు తీసింది! ) ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ వెంకటేశ్వర్లు చాలా నిజాయితీ పరుడని కావాలనే ఈ కుట్రలో ఇరికించారన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి వెంకటేశ్వర్లు కుటుంబసభ్యునికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
ప్రజారోగ్య సాంకేతిక శాఖలో భారీ మార్పులు
వరంగల్ అర్బన్ : జిల్లాల పునర్విభజనతో పబ్లిక్ హెల్త్ మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. నూ తనంగా ఏర్పడే జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో, పురపాలక సంఘాల్లో పనిచేస్తున్న ఇంజనీర్ల కేటాయింపు కసరత్తు ఇప్పటికే పూర్తయ్యింది. ఈ మేరకు వరంగల్ రీజినల్ పబ్లిక్ హెల్త్ ము న్సిపల్ ఇన్చార్జ్ ఎస్ఈ రాజేశ్వర్‌రావు ప్రతిపాదనలు రాష్ట్ర ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ధన్సింగ్కు నివేదించారు. పబ్లిక్ హెల్త్ మునిసిపల్ ఇంజినీరింగ్ శాఖ వరంగల్ రీజియన్ పరిధిలో వరంగ ల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల కేంద్రాల్లో కార్యాలయాలు ఉన్నాయి. ఈ నాలుగు జిల్లాల పరిధి లో ఒక గ్రేటర్ కార్పొరేషన్, రెండు మునిసిపల్ కార్పొరేషన్లు, 31 మునిసిపాలిటీలు, నగర పం చాయతీలు ఉన్నాయి. పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లు మునిసిపాలిటీల్లో, మునిసిపల్ ఇంజినీర్లు నగర పంచాయతీల్లోని తాగునీటి శుద్ధి, సరఫరా, రోడ్లు, డ్రెయినేజీలు, ఇతర అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తుంటారు. అంతేకాకుండా ముసాయిదాలోని 12 జిల్లాల పరిధిలో గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్, కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్, రామగుండం మునిసిపల్ కార్పొరేషన్లలో తాగునీరు, ఫిల్టర్బెడ్ల నిర్మాణం లాంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో చేపట్టనున్న పనులను పబ్లిక్ హెల్త్ మున్సిపల్ ఇంజనీర్లు పర్యవేక్షిస్తుంటారు. ఇదిలా ఉండగా మున్సిపల్ ఇంజినీర్లకు కార్పొరేషన్ల నుంచి మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు బదిలీ లు ఉంటాయి. తాజాగా జిల్లాల పునర్విభజనతో నాలుగు జిల్లాలు పరిధిలో ఖమ్మం, కొత్తగూడెం, మానుకోట, జయశంకర్(భూపాలప ల్లి), వరంగల్, హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, కొమురంభీం జిల్లా, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలుగా విస్తరించనున్నారు. రీజినల్ కార్యాలయంపై స్పష్టత కరువు వరంగల్ కేంద్రంగా ఉన్న రీజినల్ కార్యాలయంపై కొత్త జిల్లా ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యాక భవితవ్యం తేలుతుందని ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. ఆరు జిల్లాలకు కలిసి ఒక రీజినల్ కార్యాలయాలు ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదనే వాదనలు వినవస్తున్నాయి. లేనియెడల ఆర్డీ కార్యాలయాన్ని ఎత్తివేసి, హైదరాబాద్‌కు తరలించే అవకాశం ఉంది. నాలుగైదు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
అమ్మ గర్భంలోనే అంతం చేశారు..
మిర్యాలగూడ: నల్లగొండ జిల్లాలో భ్రూణ హత్యలు చోటు చేసుకున్నాయి. గురువారం తెల్లవారుజామున నిత్యం రద్దీగా ఉండే మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ అతిథిగృహం ముందు రోడ్డుపై రెండు పిండాలు ప్లాస్టిక్ కవర్లో పడి ఉన్నాయి. వాటితో పాటు ఆస్పత్రుల్లో ఉపయోగించే గ్లౌజ్‌లు, ఇంజెక్షన్ల కవర్లు ఉన్నాయి. ఉదయం 6.30 గంటలకు వాకింగ్‌కు వెళ్లిన వారు చూసి పక్కనే ఉన్న టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి వైద్యాధికారులకు సమాచారం ఇచ్చారు. కాగా డిప్యూటీ డీఎంహెచ్ఓ కృష్ణకుమారి పరిశీలించి మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతో నెలలు నిండని పిండాలను ఏరియా ఆస్పత్రికి తరలించారు. జిల్లా వైద్యాధికారి భానుప్రసాద్ నాయక్, ఫోరెన్స్ నిపుణులు బాలనరేందర్లు ఏరియా ఆస్పత్రిలో ఉన్న నెలలు నిండని పిండాలను పరిశీలించారు. రెండు పిండాలు కూడా ఆడ శిశువులని, ఐదు నెలలలోపు ఉన్న పిండాలుగా గుర్తించినట్లు వారు పేర్కొన్నారు. అనంతరం పోలీసుల సహకారంతో వైద్యాధికారులు పట్టణంలో అనుమానంలో ఉన్న మూడు ప్రైవేట్ ఆస్పత్రులు శ్వేత నర్సింగ్ హోం, శ్రీదేవి నర్సింగ్‌హోం, లక్ష్మీసాయి ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. ఓపీ విభాగం, ఆపరేషన్ల రికార్డులు పరిశీలించారు. బ్రూణహత్యలపై దర్యాప్తు చేస్తున్నామని నిందితులను గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ఏలూరు మున్సిపల్ డీఈ ఇంటిపై ఏసీబీ దాడి
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని మున్సిపల్ డీఈ వంగపండు వెంకట సత్యనారాయణ నివాసంపై ఏసీబీ అధికారులు గురువారం దాడి చేశారు. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడని సత్యనారాయణపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సత్యనారాయణ ఇంటిపై ఏసీబీ అధికారులు అకస్మిక దాడులు చేశారు. అతడి బంధువుల ఇళ్లపై కూడా ఏసీబీ అధికారులు దాడి చేసి... సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 1.10 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అలాగే పలు కీలక పత్రాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు కృష్ణాజిల్లా గుడివాడలోని మరో ప్రదేశాలలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారని సమాచారం. -
గొంతెండుతోంది
మున్సిపాలిటీల్లో తాగునీటికి కటకట డేంజర్ జోన్లో 44 పట్టణాలు సాక్షి, హైదరాబాద్: మనకూ లాతూర్ పరిస్థితి రాబోతోందా..? గుక్కెడు నీటి కోసం రైలు ద్వారా నీళ్లు తెప్పించుకోవాల్సిన దుస్థితి ముంచుకురానుందా..? క్షేత్రస్థాయిలో వాస్తవాలు చూస్తుంటే ఆ పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేద నిపిస్తోంది. ఒకటికాదు రెండు కాదు.. రాష్ట్రంలో 44 పట్టణాలు, వందల సంఖ్యలో గ్రామాలు తీవ్ర మంచినీటి ఎద్దడిని ఎదుర్కోబోతున్నాయి. మరో నెలన్నర తర్వాత ఈ పట్టణాలకు నీటి సరఫరా పూర్తిగా బంద్ అయ్యే ప్రమాదం పొంచి ఉంది. నీటి వనరులు ఎక్కడికక్కడ అడుగంటిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తనుంది. పట్టణ నీటి సరఫరా స్థితిగతులపై రాష్ట్ర పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం తాజాగా రూపొం దించిన నివేదిక ఈ మేరకు స్పష్టంచేసింది. గ్రేటర్ హైదరాబాద్ మినహాయిస్తే రాష్ట్రంలో 67 నగరాలు, పట్టణాలుండగా... అందులో 44 పట్టణాలు డేంజర్ జోన్లో కొట్టుమిట్టాడుతున్నాయి. మిగతా చోట్ల కూడా అరకొరగానే నీటి వనరులున్నాయి. ఈ 44 పట్టణాలకు అతికష్టంగా మరో 45 రోజులు, ఆ లోపు మాత్రమే నీటిసరఫరా కొనసాగించే పరిస్థితి ఉందని నివేదిక పేర్కొంది. అతికష్టంగా ఏప్రిల్ నెల గడిచిపోయినా మే నెలలో రాష్ట్రంలో అనేక ప్రాంతాలు నీటి గండాన్ని ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. వేసవిపై రెండేళ్ల కరువు ప్రభావం వరుసగా రెండేళ్లపాటు వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో దాని ప్రభావం ఈ వేసవిపై తీవ్రంగా పడింది. ఇప్పటికే కృష్ణా, గోదావరి నదులు తడారిపోయి ఎడారులను తలపిస్తున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్, దిగువ మానేరు, నిజాంసాగర్ జలాశయాల అడుగున ఉన్న కొద్దిపాటి నీటి నిల్వలూ భానుడి భగభగలకు వేగంగా ఆవిరైపోతున్నాయి. ఎస్సారెస్పీ, సింగూరు, మంజీర, జూరాల, రామన్‌పాడు జలాశయాలు ఎండిపోవడంతో వీటిపై ఆధారపడిన పట్టణాలు, పల్లెలకు నీటి సరఫరా ఆగిపోయింది. దీంతో బోరుబావులు, ట్యాంకర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. భూగర్భ జలాలే దిక్కు: రాష్ట్రంలో ఇప్పటికే అనేక పట్టణాలు తాగునీటికి అల్లాడుతున్నాయి. భూగర్భ జలాలు పాతాళానికి చేరుకోవడంతో బోర్లు కూడా ఎండిపోతున్నాయి. డేంజర్ జోన్లో ఉన్న 44 పట్టణాలకు భూగర్భ జలాలే దిక్కు. అయితే భూగర్భ జలమట్టం దారుణంగా పడిపోతుండడంతో చేతి పంపులు, బోర్లు ఎండిపోతున్నాయి. 67 పురపాలికల్లో 4,853 పవర్ బోర్లు ఉండగా, 608 బోర్లు ఇప్పటికే ఎండిపోయాయి. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన బోరుబావుల లోతు పెంచాలని, కొత్త బోర్ల తవ్వకాలు చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించిం ది. అవసరమైతే ప్రైవేటు బోరు బావులను అద్దెకు తీసుకుని నీటి సరఫరా చేయాలంది. అయితే పురపాలికల వద్ద ప్రత్యామ్నాయ నీటి సరఫరా ఏర్పాట్లకు కావాల్సిన నిధుల్లేవు. విపత్తుల నివారణ నిధి కింద ప్రభుత్వం 67 మున్సిపాలిటీలకు రూ.36.38 కోట్లు విడుదల చేసినా అవి ఇప్పటికే ఖర్చయిపోయాయి. అదనంగా మరో రూ.64.61 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా నిధులు విడుదల కాలేదు. దీంతో మున్సిపాలిటీలు తమ సాధారణ నిధుల నుంచి ఖర్చు చేసి నీటి సమస్య ఉత్పన్నం కాకుండా చూసుకోవాలని పురపాలక శాఖ ఆదేశించింది. ఆ 44 పట్టణాలివే.. కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, మణుగూరు, సత్తుపల్లి, ఇల్లందు, సదాశివపేట, జహీరాబాద్, మెదక్, ఆర్మూర్, తాండూరు, నారాయణపేట మున్సిపాలిటీలు తాగునీటి పరంగా డేంజర్‌జోన్‌లో ఉన్నాయి. హుస్నాబాద్, హుజూరాబాద్, వేములవాడ, జమ్మికుంట, పెద్దపల్లి, పరకాల, భూపాలపల్లి, మహబూబాబాద్, నర్సంపేట, మధిర, హుజూర్నగర్, కోదాడ, మేడ్చెల్, నాగర్ కర్నూల్, షాద్‌నగర్‌లు కూడా ఇదే జాబితాలో ఉన్నాయి. నిర్మల్, మందమర్రి, సిరిసిల్ల, కొల్లాపూర్, ఐజా, కల్వకుర్తి, అచ్చంపేట, బాదేపల్లి, దుబ్బాక, సిద్దిపేట, సంగారెడ్డి, దేవరకొండ, బడంగ్‌పేట, ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్‌పేట, గద్వాల్, ఖమ్మం పట్టణాల్లో కాస్త మెరుగ్గా ఉంది. ఇక్కడ 45 నుంచి 90 రోజుల వరకు నీటి సరఫరా కొనసాగనుంది. -
అదిలాబాద్ జిల్లా బోథ్‌లో ఉద్రిక్తత
స్థానికంగా ఉన్న మున్సిపల్ కోర్టును ఎచ్చోడకు తరలించాలనుకునే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాని కోరుతూ అదిలాబాద్ జిల్లా బోథ్ వాసులు రోడ్డెక్కారు. మున్సిపల్ కోర్టును తరలించేందుకు న్యాయమూర్తి చేస్తున్న ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ.. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ రోజు బోథ్ బంద్‌కు పిలుపు నిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎటువంటి అవాంఛనీయ చర్యలు జరగకుండా ఏర్పాట్లు చేశారు. భారీగా పోలీసులను మొహరించారు. -
మున్సిపల్ ఉద్యోగుల ఆందోళనబాట
మదనపల్లి టౌన్: చిత్తూరు జిల్లా మదనపల్లి మునిసిపాలిటీ కార్మికులు, ఉద్యోగులు సోమవారం చైర్మన్ అనుచరుల తీరుకు నిరసనగా ధర్నా చేపట్టారు. ఆదివారం రాత్రి చైర్మన్ అనుచరులు ఓ ఉద్యోగిపై చేయి చేసుకోవడంతో దాన్ని నిరసిస్తూ విధులు బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
సమ్మెట
సంగారెడ్డి మున్సిపాలిటీ : అటు కార్మికుల సమ్మె సడలదు.. ఇటు చెత్త వాహనాలు కదలవు.. దీంతో చెత్త కుప్పల్లా పేరుకుపోతోంది. జిల్లా కేంద్రం, గ్రేడ్-1 మునిసిపాలిటీ అయిన సంగారెడ్డిలో ప్రజారోగ్యం పెనుముప్పు బారిన పడుతోంది. మునిసిపల్ కాంట్రాక్టు కార్మికుల సమ్మెతో పారిశుద్ధ్యం పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోంది. ఇప్పటికే పట్టణానికి చెందిన 17 మందికి డెంగీ లక్షణాలున్నట్టు జిల్లా వైద్యాధికారి ఒకరు చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. ఒకే ఒక్కడు.. సంగారెడ్డి మునిసిపాలిటీ పరిధిలో నిత్యం పారిశుద్ధ్య పనులు నిర్వహించేందుకు 160 మంది కార్మికులు ఉన్నారు. వీరిలో 40 మంది మాత్రమే రెగ్యులర్ కార్మికులు. మిగతా వారంతా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందే. వీరంతా గత 42 రోజులుగా తమ సమస్యల సాధనకు సమ్మె కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కాగా, చెత్త తరలింపు పనుల నిర్వహణకు 5 ట్రాక్టర్లు, 5 ఆటోలు, ఒక డంపింగ్ డోజర్, ఒక హైడ్రాలిక్ డీసీఎం ఉన్నాయి. వీటిని నడిపే డ్రైవర్లంతా కాంట్రాక్టు సిబ్బందే. వీరంతా సమ్మెలో పాల్గొంటున్నారు. రెగ్యులర్ డ్రైవర్ ఒక్కరే ఉన్నారు. దీంతో దాదాపు 40 రోజులుగా మునిసిపల్ కార్యాలయం ఆవరణ నుంచి వాహనాలు కదలడం లేదు. జిల్లా కేంద్రంలో చెత్త గుట్టలుగా పేరుకుపోతోంది. తొలగించే దిక్కులేకపోవడంతో వీధులన్నీ కంపుకొడుతున్నాయి. చెత్త ఎత్తే దిక్కులేదు.. పేరుకే జిల్లా కేంద్రం.. మునిసిపల్ కార్మికులు రోజుల తరబడి విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నా ఇప్పటికీ యంత్రాంగం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేకపోయింది. మున్సిపాలిటీలో పనిచేస్తున్న 160 మంది కార్మికుల్లోని 40 మంది రెగ్యులర్ సిబ్బంది కాగా, వీరిలో ఎక్కువ మంది మహిళలే. దీంతో వీరు రోడ్లు ఊడ్చడం తప్ప మరే పనులూ చేయలేకపోతున్నారు. చెత్త తరలింపు వాహనాలున్నా.. వాటినే నడిపే వారు, చెత్త ఎత్తే వారు లేకపోవడంతో ప్రధాన చౌరస్తాలతో పాటు కాలనీల్లో చెత్త గుట్టల్లా పేరుకుపోతోంది. ఇంత జరుగుతున్నా.. ఇప్పటికీ ప్రత్యామ్నాయ చర్యల గురించి మునిసిపాలిటీ అధికారులు ఆలోచించడం లేదు. రెగ్యులర్ సిబ్బంది లేకే ఇబ్బంది సంగారెడ్డి మునిసిపాలిటీలో పని చేస్తు న్న వారిలో ఎక్కువ మంది కాంట్రాక్ట్ కార్మికులే కావడంతో, వారంతా సమ్మె లో ఉండటంతో పారిశుద్ధ్య సమస్య విషమిస్తోంది. అసలే గుట్టల్లా పేరుకున్న వ్యర్థాలు.. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు తోడవడంతో భరించలేని వాసన వ్యాపిస్తోంది. కాలనీలన్నీ దుర్గంధభూయిష్టంగా మారిపోయాయి. వీధుల్లో ఎటుచూసినా చెత్తకుప్పలే కనిపిస్తున్నాయి. పూడికతీతకు నోచుకోక మురిగి కాలువలు వ్యర్థాలతో పొంగిపొర్లుతున్నాయి. చెత్త, మురుగునీటి ప్రవాహం, పందుల విహారంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది. ప్రబలుతున్న డెంగీ అసలే వర్షాకాలం.. సీజనల్ వ్యాధుల ప్రమాదం.. దీనికి తోడు పారిశుద్ధ్య సమస్య తలెత్తడంతో కాలనీలు, మురికివాడల్లో ప్రజలు భీతిల్లుతున్నారు. పట్టణంలో వివిధ కాలనీలకు చెందిన పలువురికి డెంగీ వ్యాధి లక్షణాలు బయటపడినట్టు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. మార్క్స్‌నగర్, ఇంద్రాకాలనీ, నారాయణరెడ్డి కాలనీ, ఎల్బీ నగర్, నేతాజీనగర్, రిక్షా కాలనీలకు చెందిన 17 మంది డెంగీ తరహా వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారని ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన ఓ వైద్యాధికారి తెలిపారు. పారిశుద్ధ్య లోపమే ఇందుకు కారణం కావచ్చన్నారు. -
మలి దశలో పట్టణ వాటర్‌గ్రిడ్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు తొలి దశలో గ్రామీణ ప్రాంత పనులే జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) ఆధ్వర్యంలో జరగనున్న పనులు కొలిక్కి వచ్చిన తర్వాతే.. పట్టణ ప్రాంతాల్లో వాటర్‌గ్రిడ్ నిర్మాణ పనులను ప్రారంభించనుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఒకేసారి పనులు చేపడితే ప్రయోజనం ఉండదనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. పట్టణ శివార్ల వరకు ప్రాజెక్టు పనులన్నీ ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలోనే జరపాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఆర్డబ్ల్యూఎస్ పట్టణాల శివార్ల వరకు ప్రధాన పైప్లైన్లు వేస్తే, మునిసిపాలిటీలు అక్కడి నుంచి నీటిని తరలించుకుని పట్టణ ప్రజలకు సరఫరా చేస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో దాదాపు రూ.35 వేల కోట్ల అంచనా వ్యయంతో ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పనులను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పనులను 26 ప్యాకేజీలుగా విభజించి 11 ప్యాకేజీల పనులకు టెండర్లను ఆహ్వానించారు. ఈ నెలాఖరులోగా మిగిలిన 15 ప్యాకేజీలకూ టెండర్లను ఆహ్వానించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ పనులు కొలిక్కి వచ్చిన తర్వాతే పట్టణ ప్రాంతాల్లో పనులు ప్రారంభం కానున్నాయి. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో తాగునీటి వనరుల అనుసంధానం పూర్తయిన తర్వాతే పట్టణాల్లో సర్వీసు రిజర్వాయర్లు, క్లియర్ వాటర్ ఫీడర్ మెయిన్స్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, ఇంటింటికి నల్లా కనెక్షన్ తదితర పనులను చేపట్టనున్నారు. 2035 అవసరాలకు తగ్గట్లు.. వాటర్‌గ్రిడ్ కింద పట్టణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులకు ప్రభుత్వం నుంచి పరిపాలనపర అనుమతులు రాలేదు. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని 67 మునిసిపాలిటీల్లో ఇంటింటికి నీటి సరఫరా కోసం రూ.3,038 కోట్లతో పనులు చేయాల్సి ఉందని పబ్లిక్ హెల్త్, మునిసిపల్ ఇంజనీరింగ్ విభాగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. 2035 సంవత్సరం నాటికి పట్టణ జనాభా అవసరాలకు తగ్గట్లు తాగునీటి సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ఈ నిధులతో పనులను చేపట్టనుంది. ఈ ప్రతిపాదనలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు హడ్కో నుంచి రుణం అందిన తర్వాతే ఈ పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
మున్సిపల్ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు
నల్లగొండ టూ టౌన్ : నల్లగొండ మున్సిపాలిటీలో జరిగిన ఆస్తిపన్ను కుంభకోణంపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. మున్సిపాలిటీలో 2011 నుంచి 2015 మధ్య వసూలుచేసిన ఆస్తిపన్ను డబ్బులు మున్సిపల్ కార్యాలయంలో జమ చేయకుండా స్వాహ చేసిన ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేయాలని ప్రభుత్వం మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు మున్సిపల్ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు తెలిసింది. 2011 నుంచి 2015 మార్చి నెలాఖరు వరకు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అన్ని రకాల రికార్డులు, పన్ను వసూలు, ఖర్చు, రశీదు బక్కులు, చెక్కు బుక్కులు తదితర వాటిపై స్పెషల్ ఆడిట్ బృందం చేస్తున్న విచారణ ముగింపు దశకు చేరింది. ఇటీవల ఏజీ ఆడిట్ అధికారుల బృందం కూడా వారం రోజులు విచారణ జరిపి పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ఒక్క రెవెన్యూ విభాగంలోనే ఆస్థి పన్నుకు సంబంధించిన విషయంలో 3.32 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు వెలుగుచూసింది. దీంతో 2011 సంవత్సరం నుంచి ఎంతమంది ఉద్యోగులకు ఈ కుంభకోణంలో భాగస్వామ్యం ఉందన్న దానిపై పూర్తి విచారణ జరిపినట్లు సమాచారం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నలుగురు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఒక యూడీఆర్ఐకి, 17మంది బిల్ కలెక్టర్లకు అక్రమాలలో పాత్ర ఉన్నట్లు వెల్లడైంది. దీంతో వీరిపై సస్పెన్షన్ వేటు వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులపై కొరఢా ఝులిపించి వేటు వేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే సస్పెండ్ అయిన ఇద్దరు ఉద్యోగులు.. మున్సిపాలిటీ కార్యాలయంలో ఆస్తిపన్ను కాజేసిన వ్యవహారంలో ఇప్పటికే ఇద్దరు ఉద్యోగులను రెండు నెలల క్రితమే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అకౌంట్ విభాగంలో ఉన్న రశీదు బుక్కులు దొంగతనానికి గురయ్యాయి. మున్సిపాలిటీ కార్యాలయంలో దొంగతనం జరగడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించడంతో కలెక్టర్, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశించింది. ఇదే విషయంలో ఇప్పటికే ఐదుగురి ఉద్యోగులపై మున్సిపల్ కమిషనర్ నల్లగొండ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా విచారణ కొనసాగుతుంది. ఇంకా చోరీకి గురైన ఆస్తిపన్నుకు సంబంధించిన రశీదు బుక్కులు దొరకాల్సి ఉంది. ఆ బుక్కులు దొరికితే అవినీతి మరికొంత పెరిగే అవకాశం ఉంది. -
'మున్సిపల్ కార్మికులనూ మోసం చేశారు'
-
'మున్సిపల్ కార్మికులనూ మోసం చేశారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులు, మహిళలు, విద్యార్థులను నిలువునా ముంచారు... అదే విధంగా మున్సిపల్ కార్మికులను కూడా మోసగించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కె.పార్థసారధి ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో పార్థసారధి మాట్లాడుతూ....మున్సిపల్ కార్మికులపై దాడి హేయమైన చర్యగా పార్థసారధి అభివర్ణించారు. ఈ దాడిని ఖండిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఎన్నికల ముందు ఒకలా తర్వాత మరోలా వ్యహరించడం చంద్రబాబు నైజం అని ఎద్దేవా చేశారు. తక్షణమే మున్సిపల్ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని చంద్రబాబును కె. పార్థసారధి డిమాండ్ చేశారు. -
'కేసీఆర్‌ది సవతితల్లి ప్రేమ'
హైదరాబాద్: మున్సిపల్ కార్మికులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ది సవతితల్లి ప్రేమ అని సీపీఐ నేత కె.నారాయణ ఆరోపించారు. మున్సిపల్ కార్మికులకు మద్దతుగా శుక్రవారం హైదరాబాద్ నారాయణగూడలో వామపక్ష పార్టీల ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా కె.నారాయణ మాట్లాడారు. కార్మికుల డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన విరమించమని ఆయన స్పష్టం చేశారు. మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెకు వామపక్ష పార్టీలు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. -
మిలటరీని దించినా మమ్మల్ని ఆపలేరు
మిలటరీని దించినా తమను మాత్రం సమ్మె చేయకుండా ఆపలేరని ఏడు మునిసిపల్ పారిశుధ్య కార్మిక సంఘాల జేఏసీ స్పష్టం చేసింది. తమ డిమాండ్లను పూర్తిగా నెరవేర్చేంత వరకు సమ్మెను ఆపేది లేదని కార్మికుల సంఘాల నాయకులు తెలిపారు. ప్రభుత్వ బెదిరింపులకు తాము భయపడేది లేదని, సమ్మెను మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఎంతమంది ప్రైవేటు కార్మికులను పెట్టుకుని పని చేయిస్తారో కూడా తాము చూస్తామన్నారు. గత ఏడు రోజులుగా మునిసిపల్ పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తుండటంతో రాజధాని హైదరాబాద్ సహా పలు నగరాలు మొత్తం చెత్తమయంగా మారిపోయాయి. ప్రధాన వీధులు సహా.. అన్ని ప్రాంతాల్లో పెద్దఎత్తున చెత్త పేరుకుపోయింది. ప్రస్తుతానికి వర్షాలు లేవు గానీ.. ఒక్క వర్షం పడిందంటే ప్రజారోగ్యానికి భారీ ముప్పు పొంచి ఉన్నట్లే. అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు ఎవరి పట్టుదలతో వాళ్లు ఉండటంతో సమ్మె వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. -
మున్సిపల్ కార్మికల సమ్మె మరింత ఉద్ధృతం
హైదరాబాద్: తెలంగాణలో పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె ఆదివారం ఏడో రోజుకు చేరింది. సమ్మె చేపట్టి వారం గడుస్తున్న ప్రభుత్వం వైఖరిలో మార్పు రాకపోవడంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దాంతో సమ్మెను మరింత ఉద్దృతం చేయాలని మున్సిపల్ కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. సోమవారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపడతామని కార్మిక సంఘాలు ఆదివారం వెల్లడించాయి. అలాగే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని ప్రకటించాయి. జులై 14 నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాల విధులకు దూరంగా ఉండాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఇదే విషాయాన్ని ప్రభుత్వానికి కార్మిక సంఘాలు స్పష్టీకరించాయి. -
మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల ఆందోళన
గాంధీనగర్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు ఆందోళన చేపట్టారు. జేఏసీ ఆధ్వర్యంలో లెనిన్‌సెంటర్‌లో శనివారం మానవహారం నిర్వహించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదని జేఏసీ నాయకులు విమర్శించారు. 10వ పీఆర్సీ ప్రకారం కనీసం వేతనం రూ.15432 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇంజినీరింగ్ సిబ్బందికి స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని కోరారు. కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న వారిని తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. పర్మినెంట్ ఉద్యోగులకు జీపీఎఫ్ అకౌంట్స్, హెల్త్‌కార్డులు, 010 పద్దు కింద జీతాలు చెల్లించాలని కోరారు. పాఠశాలల్లో స్వీపర్లుగా పనిచేస్తున్న వారిని ఫుల్‌టైమ్ వర్కర్స్‌గా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. కార్మికులకు జేఎన్యూఆర్ఎం ఇళ్లు కేటాయించాలన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కె.ఉమామహేశ్వరరావు, టి.వెంకటరెడ్డి, ఎంవీ నారాయణ, ఎ.సామ్రాజ్యం, ఎం. డేవిడ్, జే.జేమ్స్, సుబ్బారావు, లక్ష్మి, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ఎక్కడి చెత్త అక్కడే.. పారిశుధ్య కార్మికుల సమ్మె నేపథ్యంలో నగరంలో చెత్త పేరుకుపోతోంది. చెత్త తీసుకెళ్లేందుకు కార్మికులు రాకపోవడంతో రెండు రోజులుగా ఇళ్లలోనే ఉండిపోయింది. డంపర్బిన్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వెహికిల్ డిపో నుంచి వెళ్లిన వాహనాలు ఖాళీగా వెనుతిరుగుతున్నాయి. అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. మరో రోజు గడిస్తే ఇళ్ల నుంచి దుర్గంధం వెదజల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
సమరానికి సై...
సాక్షి, హైదరాబాద్: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. తమ సమస్యలపై గత కొంతకాలంగా ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో జూలై 1 నుంచి సమ్మె చేస్తామంటూ పలు కార్మిక సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. ఇందుకు సంబంధించి ఈ నెల 16నే సమ్మె నోటీసు సైతం ఇచ్చాయి. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన కరువైన నేపథ్యంలో.. సోమవారం మున్సిపల్ కార్యాలయాల ఎదుట ధర్నాలు, నిరసనలు చేపట్టేందుకు మున్సిపల్ ఉద్యోగ, కార్మిక ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ) పిలుపు ఇచ్చింది. ఈ మేరకు సోమవారం మొత్తం 111 మున్సిపాలిటీల్లో నిరసనలు తెలిపేందుకు కార్మిక సంఘాలు సమాయత్తమయ్యాయి. తాము జూన్ 16నే సమ్మె నోటీసిచ్చినా ప్రభుత్వం తాత్సారంపై అవి తీవ్రంగా మండిపడ్డాయి. దీంతో ప్రభుత్వం స్పందించింది. కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. ఈ మేరకు పురపాలక మంత్రి పి.నారాయణ ఆధ్వర్యంలో సోమవారం సచివాలయంలో చర్చలు జరగనున్నాయి. అయితే ఈ చర్చల్లో తమ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించకుంటే ముందు ప్రకటించినట్టుగా జూలై 1 నుంచి సమ్మెకు దిగుతామని కార్మికసంఘాలు స్పష్టం చేశాయి. ప్రధాన డిమాండ్లివే... : మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులకు 10వ వేతన సవరణ కమిటీ సిఫార్సులు వర్తింపచేయాలి ఈ సవరణ ప్రకారం కనీసం వేతనం రూ.15,432 ఇవ్వాలి. ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ జీతాలివ్వాలి. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదు.. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి సోమవారం నాటి చర్చల్లో ప్రభుత్వం అంగీకరించకపోతే ముందు ప్రకటించినట్టుగా జూలై 1 నుంచి సమ్మె చేస్తాం. సమస్యలు పరిష్కారమయ్యే వరకూ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం. మా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకరిస్తుందని ఆశిస్తున్నాం. -కె.ఉమామహేశ్వరరావు, జేఏసీ నాయకులు(సీఐటీయూ) -
‘నీలగిరి’ అక్రమాలపై సీబీ‘ఐ’
నల్లగొండ మున్సిపాలిటీలో రశీదు బుక్కులు మాయం చేసి కోట్లాది రూపాయలను నొక్కేసిన ఉద్యోగుల భరతం పట్టేందుకు రంగం సిద్ధమైంది. 2009 నుంచి రశీదు బుక్కులు ఏ విధంగా మాయమయ్యాయి..దీనికి కారకులు ఎవరూ.. ఎంతమంది ఉద్యోగుల భాగస్వామ్యం ఉంది..అక్రమాలు బయటపడినా సదరు ఉద్యోగులపై చర్య తీసుకోకపోవడానికి కారణాలు ఏమిటీ..? తదితర అంశాలన్నీ త్వరలోనే నిగ్గుతేలనున్నాయి. చైర్పర్సన్ సీబీఐకి ఫిర్యాదు చేసిన విషయం తెలియడంతో ఇప్పటికే అక్రమార్కుల వెన్నులో వణుకు మొదలైనట్టు తెలిసింది. ముక్కుపిండి మరీ.. దోపిడీ మున్సిపాలిటీలో ఉద్యోగాలు పొంది ఇక్కడే దీర్ఘకాలంగా సీట్లకు అతుక్కుపోయిన కొందరుమ ఉద్యోగులు తమ అక్రమాల ఆగడాలు శృతిమించిపోయాయనే వాదనలు ఉన్నాయి. పట్టణంలో వివిధ పనుల కోసం వచ్చే ప్రజల నుంచి వారు ముక్కుపిండి ముడుపులు తీసుకుంటున్న విషయాలు జగమెరిగిన సత్యమేనని పలువురు చెవులు కొరుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఒక పని చేస్తే కింది నుంచి పై స్థాయి వారి వరకు తలా కొంత ఇచ్చుకుంటే తమకు మిగిలేది ఏముందిలో కొద్దో గొప్పో అనుకున్నారో ఏమో తెలియదు గానీ ఈ ఘనులు భారీ అక్రమాలకు తెరలేపారు. తాము దిగమింగిన కోట్ల రూపాయల నగదును ఇతరుల కంటపడకుండా గూడుపుఠాణి నడిపించినట్లు తెలుస్తోంది. సుమారు రూ.15 కోట్ల స్వాహా కార్యంలో ఇన్చార్జి కమిషనర్లు, ఒకరిద్దరు రె గ్యులర్ కమిషనర్ల హస్తం సైతం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అక్రమార్కులకు వీరి అండదండలు పుష్కలంగా ఉండడం వల్లే గుట్టు చప్పుడు కాకుండా ఐదేళ్ల పాటు అక్రమంగా కోట్ల రూపాయలు కొల్లగొట్టగలిగారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అత్యాషే.. కొంపముంచిందా..? మున్సిపల్ కార్యాలయంలో అవినీతికి అంతే లేకుండా పోయిందని ప్రజలు ఉద్యోగులతో గొడవకు దిగిన ఘటనలు ఉన్నాయి. ప్రతి పనికి వ్యక్తిని బట్టి, పనిని బట్టి అందినకాడికి డబ్బులు దండుకున్నారనే విమర్శలు లేకపోలే దు. పైసా ఇవ్వనిదే పనిచేయని కొంత మంది ఉద్యోగులు హైటెక్ దోపిడీకి వ్యూహం రచించి అడ్డంగా దొరికిపోయారు. పర్సేంటేజీలు తీసుకుంటే లక్షలు మాత్రమే సంపాదిస్తాం ...అడ్డదారిలో వెళితే కోట్లు గడించవచ్చు అనుకున్న ఆ ఉద్యోగుల అత్యాషే ఇప్పుడు బెడిసికొట్టింది. మున్సిపాలిటీకి వివిధ రకాలుగా పన్నుల రూపంలో వచ్చే డబ్బును స్వాహా చేశారు. ఇప్పుడు అవినీతి కుంభకోణంలో తెలంగాణ రాష్ట్రంలోనే నల్లగొండ మున్సిపాలిటీ పేరు మార్మోగుతుండడం గమనార్హం. ‘సాక్షి’ కథనాలు జోడించి.. మున్సిపల్ కార్యాలయంలో 2009 నుంచి ఇప్పటి వరకు రశీదు బుక్కులు, రికార్డులు మాయం చేసి కోట్లు కొల్లగొట్టిన వ్యవహారంపై మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీని వాస్ మంగళవారం ఫ్యాక్స్ ద్వారా సీబీఐకి ఫిర్యాదు చేశారు. కార్యాలయంలో అక్రమాల వివరాలు, సాక్షిలో వచ్చిన వరుస కథనాలు జోడించి ఫిర్యాదు చేశారు. అదే విధంగా డీ ఎంఏ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. నల్లగొండలో జరిగిన రశీదు బుక్కుల మా యం, కోట్ల రూపాయల దోపిడీపై సాక్షిలో కథనాలు రావడంతో వీటిని ఆధారంగా చేసుకుని 2009 నుంచి రాష్ట్రం లోని అన్ని మున్సిపాలిటీలలో సెంట్రల్ ఆడిట్ బృందంతో ఆడి ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చిన ట్లు తెలిసింది. సెంట్రల్ ఆడిట్ జరిగితే ఇక్కడి మున్సిపాలిటిలో దాదాపు 20 మంది ఉద్యోగులపై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
పురపాలనలో సొంత ముద్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఉద్యోగులందరికీ ఏకీకృత సర్వీసు రూల్స్ అమలుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఉద్యోగులకు వేర్వేరు సర్వీసు రూల్స్ ఉండడంతో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల మధ్య ఉద్యోగుల పరస్పర బదిలీలకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఉద్యోగులందరినీ ఏకీకృత సర్వీసు రూల్స్ పరిధిలోకి తీసుకురావాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. పురపాలన, పట్టణాభివృద్ధికి సంబంధించిన అంశాలపై అధ్యయనం కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం గురువారం ఇక్కడ మూడోసారి సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అలాగే ఆంగ్లేయుల కాలం నాటి ఏపీ మున్సిపల్, టౌన్ ప్లానింగ్ చట్టాలకు బూజు దులిపి తాజా అవసరాలకు అనుగుణంగా తెలంగాణ ముద్రతో కొత్త చట్టాలను రూపొందించాలని నిర్ణయించింది. పాత నిబంధనలను సరళీకరించడం ద్వారా ప్రజలకు ఉపశమనం కలిగించేలా కొత్త చట్టాలు ఉండాలని ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. ఈ సమావేశంలో మంత్రులు జోగు రామన్న, పట్నం మహేందర్ రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు పాపారావు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జి గోపాల్, శాఖ డెరైక్టర్ జనార్దన్‌రెడ్డితోపాటు పలు నగరాలు, పట్టణాల మేయర్లు, చైర్మన్లు, కమిషనర్లు పాల్గొన్నారు. పురపాలన, పట్టణాభివృద్ధికి సంబంధించి అమలు చేయాల్సిన స్వల్ప కాలిక ప్రణాళికలపై గత సమావేశంలో నిర్ణయం తీసుకోగా తాజా సమావేశంలో పలు మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాలు, సిఫారసులపై రెండు మూడు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. సమావేశంలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు.. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 25 నగర పంచాయతీల్లో అవసరమైన 306 పోస్టులకుగానూ రానున్న 3నెలల్లో కనీసం 100 పోస్టుల భర్తీ. ఆధునిక హంగులతో శాకాహార, మాంసాహార మార్కెట్లు, పార్కులు, శ్మశానవాటికల అభివృద్ధి. ఒకే రీతిలో డిజైన్లు. ప్రతి పట్టణంలో రెండు మార్కెట్ల ఏర్పాటు జాతీయ పట్టణ జీవనోపాధి పథకం కింద కేంద్రం లక్ష జనాభా ఉన్న పట్టణాలకే నిధులిస్తున్న నేపథ్యంలో మిగిలిన పట్టణాల్లో ‘మెప్మా’ కార్యక్రమాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు కేటాయించాలి. ఉపగ్రహ సమాచార వ్యవస్థ (జీఐఎస్) సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నగరాలు, పట్టణాల్లో ఆస్తి పన్నుల గణన. మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం నగరాలకు హైదరాబాద్ తరహాలో ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణం. మున్సిపల్ పనుల్లో నాణ్యత పరిశీలనకు ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగంలో క్వాలిటీ కంట్రోల్ విభాగం ఏర్పాటు. లే అవుట్లు, భవన నిర్మాణ నియమావళి ఏకీకృతమే లే అవుట్లు, భవన నిర్మాణాల అనుమతుల విషయంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ఒకే తరహా నిబంధనలు పాటించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఇందు కోసం ల్యాండ్ డెవలప్మెంట్ కోడ్, కామన్ బిల్డింగ్ కోడ్లను రూపొందించాలని ప్రభుత్వానికి సూచించింది. అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణకు నిర్ణీత గడువుతో మళ్లీ ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని, దీన్ని వినియోగించుకోని అక్రమ లే అవు ట్లలో భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరాదని పేర్కొంది. అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు మళ్లీ బీపీఎస్‌ను అమలు చేసేందుకు న్యాయ నిపుణుల సలహాను బట్టి చర్యలు తీసుకోవాలని సూచించింది. -
పురపాలికల్లో 744 ఖాళీ పోస్టులు
కేసీఆర్‌కు పురపాలకశాఖ నివేదికలు సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని 67 నగర, పురపాలక సంస్థల్లో మొత్తం 1535 పోస్టులు ఉండగా.. అందులో 744 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రజారోగ్యం, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో మరో 666 పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శనివారం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల మేయర్లు, చైర్మన్లు, కమిషనర్లతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పురపాలికల స్థితిగతులతోపాటు ఉద్యోగుల కొరతపై తాజా సమాచారంతో కూడిన నివేదికలను రాష్ట్ర పురపాలకశాఖ ఆయనకు సమర్పించింది. పురపాలక సంస్థల్లోని పరిపాలన, రెవెన్యూ, అకౌంట్స్, ప్రజారోగ్యం-పారిశుద్ధ్యం, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీ పోస్టుల వివరాలను కేటగిరీల వారీగా ఈ నివేదికలో పేర్కొంది. నిబంధనల ప్రకారం పదోన్నతులు, నియామకాల (డెరైక్ట్ రిక్రూట్మెంట్) ద్వారా భర్తీ చేయాల్సిన ఖాళీ పోస్టులను సైతం నివేదికలో పొందుపరిచింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఖాళీల భర్తీపై సీఎం ప్రకటన చేసే అవకాశం లేదు. కోడ్ ముగిశాక ఖాళీల భర్తీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఖాళీ పోస్టుల వివరాలు కేటగిరీల వారీగా... -
సస్పెన్షన్‌లో ఉన్నా సొంతూరులో పోస్టింగ్
మునిసిపల్ అధికారుల నిర్వాకం ఆర్డీ ఆదేశాల మేరకే అంటున్న కమిషనర్ జనగామ : ‘అవినీతిని సహించేది లేదు. ఎంతటివారినైనా శిక్షిస్తాం’ అంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా డిప్యూటీ సీఎంనే తప్పించి అన్నంత పని చేసింది.. అయితే ఈ నియమాలు మాకు వర్తించవన్నట్లుగా వ్యవహరిస్తున్నారు మునిసిపాలిటీ ఉన్నతాధికారులు. ఇందుకు జనగామ మునిసిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్‌గా సోమవారం బాధ్యతలు చేపట్టిన తాటి బిక్షపతి ఉదంతం తాజా ఉదాహరణగా నిలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన తాటి బిక్షపతి గతంలో జనగామ మునిసిపాలిటీలో పనిచేసేవారు. కాగా ప్రత్యేక అధికారుల పాలనలో మునిసిపాలిటీలోని పలు అవినీతి ఆరోపణలపై 2012లో లోకాయుక్తకు ఫిర్యాదులు అందాయి. మునిసిపల్ ఉన్నతాధికారులు విచారణ జరిపి ఇక్కడి వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. పరిశీలించిన అప్పటి ఏపీ ప్రభుత్వం జనగామ మునిసిపాలిటీలో పనిచేసిన నలుగురు కమిషనర్లకు, సుమారు ఎనిమిది మంది సిబ్బందికి 2014 జనవరి 10న చార్జ్ మెమోలను జారీ చేసింది. వారిలో తాటి బిక్షపతి కూడా ఉన్నారు. అయితే ఈ ఉద్యోగిని అప్పటికే మహబూబాబాద్‌కు బదిలీ చేయగా అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఈయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడనే అభియోగాలున్నాయి. ఏకంగా వివిధ సర్టిఫికెట్లపై కమిషనర్ సంతకం ఉండాల్సిన చోట తన సంతకం చేసి జారీ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అతడిని ఉన్నతాధికారులు 2014 డిసెంబర్ 24న సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ వేటు పడి రెండు నెలలు గడవకముందే తన సొంతూరు జనగామలో మళ్లీ పోస్టింగ్ తెచ్చుకోవడం చర్చనీయూంశంగా మారింది. ఈ విషయమై కమిషనర్ సత్యనారాయణను వివరణ కోరగా నియామకాలు ఆర్డీ పరిధిలో ఉంటాయని, తమ శాఖ ఆర్డీ శ్రీనివాస్‌రెడ్డి ఉత్తర్వుల మేరకు బిక్షపతిని విధుల్లోకి తీసుకున్నట్లు తెలిపారు. ఆయనపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో విచారణ జరుగుతందని తెలిపారు. -
పీఆర్సీ కోసం మున్సిపల్ ఉద్యోగుల నిరసన
వేతన సవరణ అమలు చేయాలంటూ అనంతపురం పురపాలక సంఘం ఉద్యోగులు గురువారం నాడు నిరసన తెలిపారు. అనంతపురం పురపాలక సంఘం ఉద్యోగులు గురువారం నాడు విధులు బహిష్కరించి, మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. పీఆర్సీ అమలు వెంటనే చేయాలంటూ పురపాలక సంఘం ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
సస్పెండ్ చేసే అధికారం వారికి లేదు
మున్సిపల్ ఉద్యోగుల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు ప్రహ్లాద్ సంగారెడ్డి మున్సిపాలిటీ: మున్సిపల్ ఉద్యోగులను సస్పెండ్ చేసే అధికారం ఇతర శాఖల అధికారులకు లేదని మున్సిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రహ్లాద్ స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని మున్సిపల్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంగారెడ్డి మున్సిపాల్టీలో నిధులు దుర్వినియోగమయ్యాయనే ఆరోపణపై కమిషనర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించడాన్ని ఆయన తప్పుబట్టారు. అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, స్పెషల్ ఆడిట్ నిర్వహించాకే చర్యలు చేపట్టాలన్నారు. ఇన్చార్జలుగా పనిచేసిన శరభలింగం, వీణాకుమారి కేవలం 15 రోజులు మాత్రమే ఇంచార్జలుగా ఉన్నారని అంత తక్కువ సమయంలో ఎలా అవినీతికి పాల్పడతారన్నారు. ఉద్యోగులు ప్రజాప్రతినిధుల వత్తిడికి లొంగవద్దని సూచించారు. ప్రజాప్రతినిధులకు, జిల్లా అధికారులకు సిబ్బందిని సరెండర్ చేసే అధికారం లేదని కేవలం కమిషనర్‌కు మాత్రమే ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాబేర్‌అలీ, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు వెంకట్రావు, కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు. -
అమ్మో... నల్లగొండ
ఈ ఒత్తిడి నేను భరించలేను * సెలవుపై మునిసిపల్ కమిషనర్ * మరోసారి ఇన్చార్జ్ పాలన * సిమ్‌తో సహా ఇచ్చి వెళ్లిపోయిన వేణుగోపాల్‌రెడ్డి నల్లగొండ టూటౌన్ : రాష్ట్రంలో ఒక పార్టీది అధికారం ... మునిసిపాలిటీలో మరోపార్టీ వారిది అధికారం ... కరవమంటే కప్పకు కోపం..విడవమంటే పాముకు కోపం..అధికారం మాదే మేము చెప్పిందే వినాలని ఒకరు.. మునిసిపాలిటీలో అధికారం మాది మేము ఏది చెప్పితే అదే ఫైనల్ చేయాలంటూ మరొకరు... ఇలా ఇరుపార్టీల నేతలు చేస్తున్న ఒత్తిళ్లకు ఇప్పుడు అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ‘‘ఈ ఒత్తిడి తట్టుకోలేను బాబు ఇక్కడ పనిచేస్తే లేని పోని రోగాలు వస్తాయి... ఇక ఇక్కడ నేను పని చేయలేను’’ అని నల్లగొండ మునిసిపల్ కమిషనర్ జి.వేణుగోపాల్‌రెడ్డి సెలవులో వెళ్లిపోయారు. కలెక్టర్ తొలుత అనుమతించకపోయినా, తన ఆవేదనను అర్థం చేసుకోమని చెప్పి తన ఫోన్ సిమ్‌కార్డు మరీ ఇచ్చేసి 15 రోజులు సెలవుపై వెళ్లిపోయారాయన. ఆయన సెలవు పెట్టేందుకు అధికార పార్టీ నేతల ఒత్తిడే కారణమని ప్రచారం జరుగుతోంది. ఇటీవల కొంత మంది కౌన్సిలర్లు చిన్నచిన్న విషయాలకు కూడా కమి షనర్‌తో ఘర్షణకు దిగుతుండడంతో ఆయన ఇక్కడి నుంచి వెళ్లి పోవడానికే నిర్ణయించుకున్నుట్లు తెలుస్తోంది. మునిసిపల్ లీజు షాపుల వేలం ఆపడానికేనా ...? మునిసిపాలిటీకి చెందిన 238 దుకాణాలు, స్థలాలను బహిరంగవేలం ద్వారా లీజుకు ఇచ్చేందుకు గత నెలలో జరిగిన మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆమోదం కోసం పెట్టారు. కాగా దీనిని ఆపడానికి తెర వెనుక కొంతమంది నాయకులు తీవ్రంగానే ప్రయత్నించినా, కమిషనర్ హైకోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని ఎవరి ఒత్తిళ్లకు లొంగలేదని అప్పట్లోనే చర్చించుకున్నారు. ఈ నెలాఖరులోగా ఎలాగైనా ఆ స్థలాలు, దుకాణాలను వేలం వేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కమిషనర్ ఇక్కడి నుంచి పోతేనే తమకు నచ్చిన అధికారిని పెట్టుకొని పనులు చక్కబెట్టుకోవచ్చనే ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. ముక్కుసూటిగా వెళ్లడమే... వేణుగోపాల్‌రెడ్డి ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అమలు చేయడం కూడా కొంతమంది నేతలకు రుచించడంలేదని సమాచారం. తాము చెప్పింది చేయాలి కానీ నిబంధనలు తమకెందుకు అనేరీతిలో కొంతమంది మాట్లాడిన తీరుపై కమిషనర్ తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలిసింది. ఎవరు ఏ పని చేయమన్నా, తానుమాత్రం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే చేస్తాను అని ఖరాఖండిగా చెప్పి ముక్కుసూటిగా వ్యవహరించిన తీరు కూడా ఇరుపార్టీల నాయకులకు నచ్చలేదని సమాచారం. ఆసరా పింఛన్ల జాభితాపై కూడా కాంగ్రెస్ నాయకులు కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను నిక్కచ్చిగా వ్యవహరించి అర్హులైన వారికి పింఛన్లు ఇస్తున్నా, తనపైనే ఏ అధికారం లేని వ్యక్తి పెత్తనం చెలాయించడం ఏంటని ఉన్నతాధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. అదేవిధంగా కార్యాలయంలో ఇటీవల అధికారుల సెక్షన్ల మార్పు కూడా కమిషనర్ సెలవు పెట్టడానికి కారణమైనట్లు తెలుస్తుంది. అధికారులను పనిచేయించుకోవాల్సిన తాను చెప్పిన విధంగా కాకుండా దానిని కూడా రాజకీయం చేయాలని చూడడం ఆయనకు నచ్చలేదు. దీంతో ఆయన వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. మరోసారి ఇన్చార్జ్ పాలన... నల్లగొండ మునిసిపాలిటీలో విధులు నిర్వహించాలంటేనే అధికారులు, ఉద్యోగులు హడలిపోయే పరిస్థితి వ చ్చింది. గతంలో దాదాపు మూడు సంవత్సరాల పాటు ఇన్చార్జ్ పాలన కొనసాగింది. ప్రత్యేకాధికారి పాలన ఉన్న రోజులలో పట్టణ ప్రజలు చిన్న పనులకు కూడా అనేక అవస్థలు పడ్డారు. మళ్లీ మరోసారి ఇన్చార్జ్ పాలనకు దారితీసింది. మునిసిపల్ ఈఈగా పనిచేస్తున్న రాజయ్యకు (ఎఫ్ఏసీ ) అదనపు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తూ డీఎంఏ కార్యాలయం నుంచి శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరి ఈయన ఎలా నెట్టుకొస్తారో, ఈయన పట్ల అధికార పార్టీ నేతలు ఎలా వ్యవహరిస్తారోననే చర్చ మునిసిపల్ వర్గాల్లో జరుగుతోంది. -
మున్సిపల్ ఉద్యోగుల సమ్మె నోటీసు
* 20వ తేదీలోగా సమస్యలు పరిష్కరించాలి * మంత్రి నారాయణకు వర్కర్స్ యూనియన్ నోటీసు * పెన్ డౌన్ యోచనలో మున్సిపల్ కమిషనర్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. తమ డిమాండ్లు ఈ నెల 20వ తేదీలోగా పరిష్కరించకపోతే ఆ తర్వాత ఏ క్షణంలో అయినా సమ్మెలోకి వెళతామని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) హెచ్చరిం చింది. ఈమేరకు ఆ సంఘం అధ్యక్షురాలు సామ్రాజ్యం, ప్రధాన కార్యదర్శి ఉమా మహేశ్వరరావులతో పాటు మరి కొంతమంది సభ్యులు మంగళవారం సచివాలయంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు సమ్మె నోటీసును అందజేశారు. ఈ నెల 20వ తేదీలోగా తమ సమస్యలను పరిష్కరించకపోతే ఏ క్షణంలో అయినా సమ్మెలోకి వెళతామని సీఐటీయూ కార్యదర్శి ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. మంత్రితో పాటు మున్సిపల్ కమిషనర్ అండ్ డెరైక్టర్కూ నోటీసు ఇచ్చారు. ఈ సమ్మెకు తమ మద్దతు ఇస్తున్నట్టు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జేఏసీ తెలిపింది. పెన్ డౌన్ యోచనలో కమిషనర్లు మంత్రితో పాటు ఉన్నతాధికారుల వ్యవహార తీరుపై ఏపీ మున్సిపల్ కమిషనర్లు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. త్వరలోనే పెన్ డౌన్ నిరసన చేపట్టాలనే వారు ఆలోచిస్తున్నట్లు తెలిసిం ది. రోజూ సమావేశాలు, ఫోన్ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తుండటం, రాత్రి 11 గంటలకు కూడా మంత్రి పేషీ వద్దే ఉండాల్సిరావడం, వారానికోసారి హైదరాబాద్‌కు పిలవ డం, పగలు రాత్రి తేడా లేకుండా మీటింగ్‌లు పెట్టడం తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని కమిషనర్లు వాపోతున్నారు. దీనివల్ల మున్సిపాలిటీల్లో ఒక్క పనీ జరగడం లేదని.. పైగా పనిచేయలేకపోతే ఇంటికెళ్లిపోండి అంటూ మంత్రి అనడం బాధ కలిగిస్తోందని ఓ కమిషనర్ ఆవేదన వ్యక్తంచేశారు. పెన్ డౌన్ ఎప్పటి నుంచి చేపట్టాలనే అంశంపై కమిషనర్లు చర్చిస్తున్నట్లు తెలిసింది. -
ల్యాండ్.. మీ 'దయా'!
* అభివృద్ధికి భూమి ఆటంకాలు * శ్రద్ధ చూపనంటున్న రెవెన్యూ సిబ్బంది * నిధులు మంజూరైనా సాగని నిర్మాణాలు * చీమకుర్తి నగర పంచాయతీకి తీరని కష్టాలు చీమకుర్తి: దేవుడు కరుణించినా.. పూజారి జాలి చూపలేదట. నగర పంచాయతీ స్థాయి పెంచేందుకు.. కీర్తి పంచేందుకు ఎన్నో నిర్మాణాలు కావాలి. అందుకే వాటి కోసం ప్రభుత్వం నిధుల మంజూరుకు అనుమతించింది. కానీ అధికారులు మోకాళ్లడ్డుతారే! నిర్మాణాలకు అవసరమైన స్థలాలు కేటాయించరే! ఇలాంటి పరిస్థితుల్లో చీమకుర్తి నగర పంచాయతీ కొట్టుమిట్టాడుతోంది. ప్రజలకు అవసరమైన పనులకు దిక్కులేకుండా పోతోంది. రెండేళ్ల క్రితమే చీమకుర్తి నగర పంచాయతీగా ఆవిర్భవించింది. ప్రజలంతా దీనిపై హర్షం వ్యక్తం చేశారు. కానీ అప్పటి నుంచి కష్టాలు పెరిగాయే కానీ ఫలితం మాత్రం శూన్యం. మున్సిపల్ భవనం సమకూరేనా? మొదటి నుంచి నాటి పంచాయతీ భవనంలోనే మున్సిపాలిటీ కూడా కొనసాగుతోంది. సొంత బిల్డింగ్ కేటాయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రూ. 50 లక్షలు మంజూరు చేసింది. అయితే స్థల సమస్య కొలిక్కి రాలేదు. పంచాయతీ భవనం ఆనుకొని ఉన్న తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణంలోనే 88 సెంట్ల స్థలాన్ని మున్సిపాలిటీకి కేటాయించారు. తహశీల్దార్ ద్వారా ఆర్డీఓ నుంచి కలెక్టర్‌కు ప్రతిపాదనల ఫైలు పంపించారు. అయితే ఇక్కడే చిక్కు వచ్చి పడింది. సాంకేతిక కారణాల వల్ల ఫైలును రెవెన్యూ అధికారులు తిరిగి వెనక్కు తీసుకున్నారు. ఇదంతా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగింది. అప్పటి దాకా కాంగ్రెస్‌ను తిట్టిపోసిన టీడీపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏం సాధించలేకపోయింది. రవాణాశాఖ మంత్రి ఏరియా! చీమకుర్తికి చెందిన శిద్దా రాఘవరావు ప్రస్తుతం రాష్ర్ట రవాణాశాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే కొంతమంది టీడీపీ నాయకులే అభివృద్ధిపై శ్రద్ధ చూపించడంలేదని అధికారులు వాపోతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గతం తాలూకూ పాలనపై విమర్శలు గుప్పించడమే కానీ తక్షణ కర్తవ్యం గుర్తించడంలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిధులు మంజూరైనప్పటికీ.. సకాలంలో వాటిని వినియోగించకుంటే తిరిగి వెనక్కు వెళ్లే ప్రమాదం నెలకొంది. గారెలున్నాయ్.. బూరెలున్నాయ్ పాయసం..పులిహోరా నోరూరిస్తోంది కానీ ఏం లాభం తింటే రోగం.. రుచికరమైన వంటకాలను అలా చూస్తూ ఉండాల్సిందే! సరిగ్గా.. ఇలాగే! చీమకుర్తి మున్సిపాలిటీ పరిస్థితి ఉంది ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన గెలాక్సీ గ్రానైట్ దీని ద్వారా కోట్ల రూపాయల రాయల్టీ వేలాది మంది పౌరులు.. ఇలా ఈ పట్టణం అయ్యింది మున్సిపాలిటీ! వివిధ అభివృద్ధి పనులకు డబ్బులు మంజూరయ్యాయి ఇక తిరుగులేదనుకుంటుంటే.. వాటి నిర్మాణాలకు భూములు కేటాయించరు.. మున్సిపల్ భవనం.. డంపింగ్ యార్డు.. ఎస్ఎస్ ట్యాంకు.. ఇలాంటి ప్రతిపాదనలన్నీ జనంకల్లి ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నాయి... చెత్త పోసే దిక్కులేదు చీమకుర్తి పట్టణంగా మారిన తర్వాత నివాస గృహాలు పెరిగిపోయాయి. దుకాణ సముదాయాలు, తోపుడు బండ్ల వ్యాపారులు కూడా ఎక్కువయ్యారు. దీనికితోడు గ్రానైట్ వ్యర్థాలు ఎలాగూ ఉంటాయి. ఇలాంటి వాతావరణంలో రోజూ క్వింటాల కొద్దీ చెత్త ఉత్పత్తి అవుతూ ఉంటుంది. దీనంతటినీ తరలించాలంటే డంపింగ్ యార్డు కావాలి. కానీ చీమకుర్తికి ఇలాంటి సౌకర్యం లేకపోవడంతో చెత్తంతా పాటిమీదపాలెం పోయేదారిలోనున్న రెండు ఎకరాల్లో రోడ్డుకు సమీపంలోనే వేస్తున్నారు. ఆ చోటు కూడా సరిపోకపోవడ ంతో చెత్తంతా రోడ్డుమీదకు వచ్చి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. సమస్య పరిష్కారం కోసం పాటిమీదపాలెం సమీపంలో 10 ఎకరాలు డంపింగ్ యార్డు కోసం పరిశీలించినట్లు మున్సిపాలిటీ అధికారులు గత శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేకు తెలియ జేశారు. ఇదిలా ఉంటే సమస్యను తహశీల్దార్ దృష్టికి తీసుకుపోయి డంపింగ్‌కు అవసరమైన స్థలాన్ని గుర్తించటంలో మున్సిపాలిటీ అధికారులు ఏడాదిగా కుస్తీలు పడుతూనే ఉన్నారు. దాహార్తి తీర్చేందుకూ ముందుకు రారు కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ ద్వారా చీమకుర్తి మున్సిపాలిటీకి తాగునీరు అందించేందుకు దాదాపు రూ. 52 కోట్లతో ప్రతిపాదనలను పంపించారు. రామతీర్థం రిజర్వాయర్‌లోని తాగునీటిని చీమకుర్తి పరిసరాల్లోకి తీసుకొచ్చి స్టోర్ చేస్తే ప్రజల దాహార్తి తీరుతుంది. దీనికోసం కావాల్సింది కేవలం ఒక్క ఎకరా మాత్రమే! కానీ ఈ విషయంలోనూ రెవె న్యూ అధికారులు మున్సిపాలిటీవారికి సహకరించక పోవడంతో మహత్తర పథకానికి మంగళం పాడినట్లయింది. మహిళా స్వశక్తి భవన్‌కు నిధులొచ్చినా.. మహిళా స్వశక్తి భవన్ నిర్మించేందుకు మున్సిపాలిటీకి ఏడాది క్రితం రూ. 25 లక్షలు మంజూరయ్యాయి. అలాగే కమ్యూనిటీ రిసోర్స్ సెంటర్ పేరుతో రెండు భవనాలకు మొత్తం రూ. 22 లక్షలు కూడా మంజూరు చేశారు. నిర్మాణాలకు అవసరమైన భూములు అందజేస్తామంటున్న రెవెన్యూ అధికారులు.. మున్సిపాలిటీ అధికారులను తమ చుట్టూ తిప్పుకుంటూనే ఉన్నారు. -
కార్పొరేషన్లలో బదిలీలకు రంగం సిద్ధం
15 రోజుల్లో ఉద్యోగుల వివరాలు తెలపాలంటూ ఉన్నతాధికారుల ఆదేశాలు రాజకీయ రంగు పులుముకుంటున్న మున్సిపల్ ఉద్యోగుల బదిలీలు కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ వ్యూహాలు తిరుపతి కార్పొరేషన్: కార్పొరేషన్, మున్సిపల్ ఉద్యోగుల బదిలీలకు తెలుగుదేశం పార్టీ నాయకులు రంగంలోకి దిగారు. త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం నిలుపుకునేందుకు అధికార పార్టీ నాయకులు పావులు కదుపుతున్నారు. జిల్లాలోని తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లతో పాటు ఆరు మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఉన్న ఫలంగా బదిలీలు చేసేందుకు డెరైక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. అందులో భాగంగానే సోమవారం జీవోఎంఎస్.నెం.186 ఫైనాన్స్ (డీసీఎం-2) డిపార్ట్.తేదీ 05.09.2014 ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు ఆర్వోసీ.నెం.11163/2014/కే1-2 తేదీ 06.09.2014 పేరిట సర్క్యులర్‌ను విడుదల చేశారు. అది కూడా బదిలీకానున్న ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలను ఈనెల 15వ తేదీలోగా పంపించాలంటూ సంబంధిత మున్సిపల్, కార్పొరేషన్ల కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 30కి ఉన్న బదిలీల గడువును అక్టోబర్ 10 వరకు పొడిగించారు. అదే నెల 11 నుంచి బదిలీలపై నిషేధం ఉంటుందని ఆదేశాల్లో పేర్కొన్నారు. మెడికల్ అండ్ హెల్త్ డిపార్టుమెంట్లో పనిచేసే ప్రత్యేక డాక్టర్లు, లెక్చరర్లకు ప్రత్యేక గైడ్‌లైన్స్ ఇవ్వనున్నారు. ఏ ఉద్యోగులు ఎక్కడికి.. ప్రస్తుతం జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లు, అకౌంటెంట్లు, రెవెన్యూ అధికారులు, ఎవరైతే 23 సంవత్సరాలు పూర్తిచేసుంటారో వారిని బదిలీ చేసేందుకు ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఈవివరాలను పూర్తిస్థాయిలో తమకు అందించాలని డీఎంఏ కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఇక్కడి మున్సిపల్, కార్పొరేషన్ కమిషనర్లు ఆ పనిలో తలమునకలై ఉన్నారు. విశ్వసనీయ స మాచారం మేరకు కార్పొరేషన్లో పనిచేసే రికార్డు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వరకు జిల్లాలోనే బదిలీలు ఉంటాయి. సీనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగులకు అనంతపురం రీజియన్ పరిధిలో బదిలీ చేస్తారు. సూపరింటెండెంట్, అకౌంటెంట్, రెవెన్యూ అధికారులు, మేనేజర్లకు రాష్ట్ర స్థాయిలో బదిలీలు ఉంటాయి. వీరితో పాటు ఇంజినీర్లు, డీఈ స్థాయి అధికారులను ఈఎన్సీ విభాగం, ఏఈలను ఎస్ఈ అధికారులు బదిలీ చేయనున్నారు. అసిస్టెంట్ సిటీప్లానర్, టౌన్‌ప్లానింగ్ సూపర్వైజర్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లను డెరైక్టర్ ఆఫ్ టౌన్‌ప్లానింగ్ విభాగపు ఉన్నతాధికారులు బదిలీలు చేయనున్నారు. ఇందులో డెప్యూటేషన్‌పై వచ్చిన సెక్రటేరియట్ ఉద్యోగులను బదిలీల నుంచి మినహాయించారు. సర్వీసు రూల్స్ ఆమోదానికి ఓకే సాధారణంగా కార్పొరేషన్లలో సర్వీసు రూల్స్‌కు ఆమోదం లేకపోవడం వల్ల ఇక్కడి ఉద్యోగులకు బదిలీలు ఉండవు. అయితే ప్రస్తుతం సర్వీసు రూల్స్‌ను ఒకటి రెండు రోజుల్లో ఆమోదించేందుకు ఫైల్ సిద్ధంగా ఉంది. మాట వినని వారికి బెదిరింపులు తమకు అనుకూలమైన ఉద్యోగులను నిబంధనలకు విరుద్ధంగా అదే స్థానంలో కూర్చోబెట్టేందుకు ఒత్తిళ్లు తెస్తున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ (అధికార)కి పనిచేయని, మాట వినని, తాము చెప్పినట్టు నడుచుకోని ఉద్యోగులను ఇక్కడి నుంచి సాగనంపేందుకు సిద్ధమయ్యారు. పైగా పరోక్షంగా వేధింపులకు పాల్పడుతూ, విజిలెన్స్, ఏసీబీ అధికారుల పేరుతో ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఉద్యోగులే బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇటీవల కర్నూలు నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చిన ఏసీపీ స్థాయి అధికారి వేధింపులు తాళలేక సెలవుపై వెళ్లిపోయినట్టు సమాచారం. అదే బాటలో ఉద్యోగ, కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడిగా గుర్తింపు పొందిన ఓ అధికారితో పాటు పలువురు కీలకమైన ఉద్యోగులు కూడా వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ పరిణామాలు మున్సిపల్ ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. -
11 మంది సస్పెన్షన్
నంద్యాల టౌన్: ఆస్తి పన్ను వసూళ్లలో అక్రమాలకు పాల్పడిన మునిసిపల్ ఉద్యోగులపై వేటు పడింది. నంద్యాల మునిసిపాలిటీలో తొమ్మిది మంది బిల్కలెక్టర్లను, ఇద్దరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేస్తూ పురపాలక శాఖ రీజనల్ డెరైక్టర్ మురళీకృష్ణగౌడ్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కుంభకోణంపై విచారణ జరపడానికి ప్రత్యేక అధికారిగా అడిషనల్ డెరైక్టర్ రమేష్‌బాబును నియమించే సూచనలు కనిపిస్తున్నాయి. మునిసిపాలిటీలో కొత్తగా నిర్మించిన దుకాణాలు, భవనాలు, అపార్ట్మెంట్లను కొలిచి కొందరు బిల్ కలెక్టర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు..పన్నును నిర్ధారించారు. యజమానుల నుంచి భారీగా మామూళ్లు దండుకొని ఆస్తి పన్ను తగ్గించి ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ వ్యవహారాన్ని గత నెల 29వ తేదీన ‘సాక్షి’ బయట పెట్టింది. నంద్యాల మున్సిపాలిటీలో భారీగా ఆస్తి పన్ను స్వాహా చేశారంటూ వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రభుత్వం దృష్టికి వెళ్లగా పురపాలక శాఖ మంత్రి నారాయణ సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డెరైక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జనార్దన్‌రెడ్డిని ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ఆర్డీ మురళీకృష్ణగౌడ్ విచారణను చేపట్టారు. అక్రమాలు తేలడంతో తొమ్మిది మంది బిల్ కలెక్టర్లను, ఇద్దరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండైన వారు వీరే..: అమీర్అలీబేగ్, మద్దిలేటి, ప్రభాకర్, ఫజుల్ రహెమాన్, మల్లికార్జున, బీవీ రామసుబ్బయ్య, రసూల్(నంద్యాల), జీవీ కృష్ణమూర్తి(డోన్), వీసీ ఓబులేసు(ఆదోని), రెవెన్యూ ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వరగౌడ్(డోన్), ఏసుదాసు(ఆదోని)లు సస్పెండయ్యారు. ఎంబుక్ అదృశ్యం కేసులో సస్పెండైన రెవెన్యూ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, రిటైర్డు రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుబ్రమణ్యంలపై కూడా చర్యలు తీసుకోవాలని ఆర్డీ మురళీకృష్ణగౌడ్ ఆదేశించారు. ఆర్ఐని తప్పించిన వైనం..: మునిసిపల్ అధికారులు పంపిన నివేదికలో ప్రస్తుత ఆర్ఐ పేరును తప్పించినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఆడిట్ అధికారులు పరిశీలించిన ఎంఎల్ రికార్డుల్లోని ఆర్ఐ పేరు కూడా ఉంది. ఇతని పేరును తప్పించాలని అధికార పార్టీకి చెందిన కొందరు నేతల నుండి ఒత్తిళ్లు వచ్చినట్లు తెలిసింది. గతంలో స్టేషనరీ కుంభకోణంలో సస్పెండైన ఇతన్ని రెవెన్యూ ఇన్స్పెక్టర్గా నియమించడం కూడా వివాదాస్పదమైంది. ఇతని పేరును తప్పించడంపై ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. -
ఆదాయానికి ‘నీళ్లొ’దిలారు...
విజయనగరం మున్సిపాలిటీ: మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం అధికారుల నిర్లక్ష్యంతో ఆ శాఖకు పెద్ద మొత్తంలో ఆదాయానికి గండిపడింది. మూడేళ్ల నుంచి నీటి పన్ను వసూలు కాకపోవడంతో రూ.అర కోటికి పైగా ఆదాయం నిలిచిపోయింది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 2000 కుళాయి కనెక్షన్లకు మూడేళ్లుగా డిమాండ్ నోటీసులు జారీ చేయకపోగా... అనధికారికంగా పుట్టుకొచ్చిన మరో 500 వర కూ కుళాయి కనెక్షన్లు ఉన్నట్టు తెలిసినా వాటిపై చర్యలు తీసుకోలేదు. విజయనగరం మున్సిపాలిటీలో 19 వేల వరకు కుళాయి కనెక్షన్లుండగా, వాటి ద్వారా ఏడాదికి రూ.60 నుంచి రూ.70 లక్షల వరకు పన్ను రూపంలో ఆదాయం వస్తుంది. అయితే 2010-11 సంవత్సరంలో మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు అదనంగా 2000 కుళాయి కనెక్షన్లు మంజూరు చేశారు. వీటికి సంబంధించిన వివరాలను రికార్డుల్లో చూపిస్తున్నప్పటికీ డిమాండ్ నోటీసులు జారీ చేసేందుకు వీలుగా వాటిని ఆన్లైన్ చేయలేదు. దీంతో పన్ను వసూలు చేసేందుకు రెవెన్యూ విభాగం అధికారులకు అవకాశంలేకుండా పోయింది. 2000 కనెక్షన్లకు గత మూడేళ్లుగా ఒక్క నోటీసూ జారీకాలేదు. ఏడాదికి రూ. 14.40 లక్షల చొప్పున ఈ మూడేళ్లలో రూ.43 లక్షల 20వేల వరకు ఆదాయానికి గండిపడింది. అంతేకాకుండా ఇంజినీరింగ్ విభాగం అనుమతులు లేకుండా మరో 500 కనెక్షన్లు అనధికారికంగా ఉన్నట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఇవి కూడా మూడేళ్ల క్రితం నుంచి ఉన్నప్పటికీ వాటిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో వీటి ద్వారా ఈ మూడేళ్లలో మరో రూ.10.80 లక్షల వరకూ రావలసిన ఆదాయానికి గండిపడినట్లు తెలుస్తోంది. అనధికారిక కుళాయి కనెక్షన్లు కంటోన్మెంట్ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిసినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లో మరేతర కార ణాలతోనో వాటిపై చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ఈ మూడేళ్లలో అటు అధికారిక, ఇటు అనధికారిక కుళాయి కనెక్షన్ల నుంచి రావాల్సిన రూ 54 లక్షల ఆదాయానికి బ్రేక్ పడింది. వార్డు పర్యటనల్లో గమనించిన మున్సిపల్ కమిషనర్ ఆర్.సోమన్నారాయణ ఆరా తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ ఇంజినీర్‌కు నోటీసులు ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ ఆర్.సోమన్నారాయణను వివరణ కోరగా.. పట్టణంలో అధికారికంగా మంజూరు చేసిన 2000 కుళాయి కనెక్షన్లకు మూడేళ్లుగా డిమాండ్‌నోటీసులు జారీ చేయకపోవడం వాస్తవమేనన్నారు. దీనిపై మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారి బాబుకు నోటీసుతో పాటు మెమో జారీ చేసినట్టు తెలిపారు. విచారణ చేసేందుకు డీఈతో కమిటీ వేశామని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనధికారికంగా 500 వరకు కుళాయి కనెక్షన్లు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని వాటిపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. -
బంద్‌కు సన్నద్ధం
ఉద్యోగ సంఘాల మద్దతు సాక్షి,సిటీబ్యూరో: పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణవాదులు బంద్ ను విజయవంతం చేసేందుకు సన్నద్ధమయ్యారు. తెలంగాణ ఉద్యోగ, విద్యార్థి, కార్మిక సంఘాలు బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపాయి. జీహెచ్ఎంసీ గుర్తింపు కార్మిక సంఘం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపింది. పారిశుద్ధ్య విధులు మినహా మిగతా సేవలు నిలిపివేయనున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు గోపాల్ తెలిపారు. తెలంగాణ టీచర్స్ జేఏసీ సెక్రటరీ జనరల్ కమిషనర్ నియామకం మినహా మిగతా డీసీపీ మొదలు అదనపు కమిషనర్ల వరకు ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారులనే కొన సాగించేలా ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు రానున్నాయి. అలాగే సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌తో పాటు అక్కడి డీసీపీలు జాయింట్ పోలీసు కమిషనర్ కూడా యథాతథంగా ఉంటారు. ఈ విషయంలో ఏమైనా మార్పులు చేర్పులు నెల, రెండు నెలల తరువాతే జరుగుతాయని అధికార వర్గాలను బట్టి తెలుస్తోంది. అనురాగ్‌శర్మ కోసం ప్రత్యేక ఉత్తర్వులు ఇదిలా ఉండగా ప్రస్తుతం అదనపు డీజీ హోదాలో ఉన్న నగర పోలీసు కమిషనర్ స్థానాన్ని డీజీపీ హోదాకు పెంచుతూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులు కేవలం డీజీ హోదాలో కొత్వాల్‌గా కొనసాగుతున్న అనురాగ్‌శర్మ కోసమే జారీ చేశారని తెలిసింది. తిరిగి కమిషనర్ స్థానాన్ని డీజీ స్థాయి నుంచి అదనపు డీజీ స్థాయికి కుదిస్తారని, బుధవారం వెలువడిన ఉత్తర్వులు తాత్కాలికమే అని తెలుస్తోంది. కొత్త కొత్వాల్ ముందు పెనుసవాళ్లు నగర 55వ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టబోయే అధికారి ముందు పెద్ద సవాళ్లే ఉన్నాయి. రెండు రాష్ట్రాల సచివాలయాలు, అసెంబ్లీలు, రెండు రాష్ట్రాల ఆందోళనలకు హైదరాబాద్ కేంద్ర బిందువు కావడంతో బందోబస్తు పెద్ద సమస్యగా మారనుంది. దీంతో పాటు రోజువారి బందోబస్తు, క్రైమ్ అలర్ట్ తదితర విధులు మన పోలీసులకు ఉండనే ఉన్నాయి. ఇంత పెద్ద సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రస్తుతం ఉన్న నగర పోలీసు సిబ్బంది సంఖ్యకు మరో 5500 మంది కానిస్టేబుళ్లను పెంచాల్సిన అవసరం ఉందని ఇప్పటికే గవర్నర్‌తో పాటు ప్రభుత్వానికి డీజీపీ ప్రసాదరావు ప్రతిపాదనలు పంపారు. దీంతో పాటు రెండు ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ (ఐఆర్)లు కూడా అవసరం ఉంటుందని ప్రతిపాదనలో పేర్కొన్నారు. మహేందర్‌రెడ్డి నేపథ్యం... మహేందర్‌రెడ్డి 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా రాష్ట్ర కేడర్‌కు ఎంపికయ్యాక నిజామాబాద్ ఎస్పీగా, నగర తూర్పు మండలం డీసీపీగా జాతీయ పోలీస్ అకాడమీలో ఎస్పీ స్థాయిలో పనిచేసి అక్కడే డీఐజీ స్థాయిలో పదోన్నతి పొందారు. అనంతరం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ (ఫిబ్రవరి 12, 2003) ఏర్పడిన తరువాత తొలి కమిషనర్‌గా నియమితులయ్యారు. నాలుగేళ్ల అనంతరం ఇంటెలిజెన్స్ ఐజీగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడే అదనపు డీజీగా పదోన్నతి పొంది ఆ విభాగానికి అధిపతి అయ్యారు. దాదాపు ఐదు సంవత్సరాలకు పైగానే ఆయన నిఘా విభాగాధిపతిగా కొనసాగుతున్నారు. -
మున్సిపల్ సిబ్బందికి వాకీటాకీలు
సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: సిద్దిపేట మున్సిపల్ పరిధిలో పనిచేసే కింది స్థాయి సిబ్బంది నుంచి కమిషనర్ స్థాయి అధికారి వరకు సమాచారం సమన్వయానికి మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రధాన విభాగాలకు చెందిన సిబ్బందికి మున్సిపల్ అధికారులు వాకీటాకీలను అందించారు. వీటిని సమన్వయ పరిచేందుకు మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం మున్సిపల్ సిబ్బందికి వాకీటాకీల వినియోగం, వాటి ఉద్దేశం గూర్చి అవగాహన కల్పించారు. సిద్దిపేట పట్టణంలో సుమారు లక్ష జనాభాకు అనుగుణంగా మున్సిపల్ సేవలను సత్వరం అందించేందుకు కమిషనర్ రమణాచారి 31 వాకీటాకీలను సిబ్బందికి పంపిణీ చేశారు. పారిశుద్ధ్యం, నీటి సరఫరా, పన్నుల వసూలు, ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్, పరిపాలన విభాగంతో పాటు వీధి దీపాలు లాంటి ముఖ్య విభాగాలు అధికారులకు వీటిని అందించనున్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, ప్రభుత్వ మార్గదర్శక సూత్రాలు, పారిశుద్ధ్య సమస్యలు, నీటి సరఫరాలో ఎదురయ్యే అవాంతరాలను ఎప్పటికప్పుడు మెరుగు పర్చుకునేందుకు వీటిని వినియోగించనున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం కొన్ని విభాగాలకు చెందిన సిబ్బందికి వీటి వినియోగం గూరించి వివరిస్తూ అవగాహన కల్పించారు. -
మంచి రోజులు
‘రేయ్..ఎక్కడ పండ్లు అమ్ముకునేది.. బండితీయ్... ట్రాఫిక్ చూడు ఎలా ఉందో... ‘ఏమయ్యా! ఎన్నిసార్లు చెప్పాలి అంగడి ఎదురుగా బండిపెట్టకూడదని.. ఫో.. పక్కకు ఫో!’... తోపుడుబండ్ల వ్యాపారులకు పోలీసులు, వ్యాపారదుకాణాల యజమానుల నుంచి నిత్యం వచ్చే హెచ్చరికలు ఇవి. తోపుడు బండి నడిస్తేగానీ వారి బతుకుబండి నడవదు. ఆటుపోట్ల మధ్య జీవన ప్రయాణం చేస్తున్న తోపుడుబండ్ల వ్యాపారులకు మంచిరోజులు వచ్చాయి. వారికి గుర్తింపుకార్డులను ఇవ్వనున్నారు. స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకునే వెసులుబాటుతో పాటు ఆర్థికంగా ఆదుకునేందుకు రుణాలను ఇవ్వనున్నారు. లోక్‌సభతో పాటు రాజ్యసభలో కూడా ‘వీధివ్యాపారుల ’బిల్లుకు ఆమోదముద్రపడింది. సాక్షి, కడప: పట్టణాల్లోఎక్కడ తోపుడు బండి పెట్టినా పోలీసులు, మునిసిపల్ అధికారులు, సమీపంలోని భవన యజమానులతో ఇబ్బందులు ఉండేవి. ఇకపై అలాంటి పరిస్థితి ఉండబోదు. వీరికి ప్రత్యేమైన గుర్తింపునిచ్చే ‘వీధివ్యాపారుల’ బిల్లును బుధవారం రాజ్యసభలో ఆమోదించారు. గత సెప్టెంబరు 6న లోక్‌సభలో కూడా ఈబిల్లు ఆమోదం పొందింది. బిల్లుపై రాష్ట్రపతి ఆమోదముద్రపడటమే తరువాయి. బిల్లుఆమోదంతో దశాబ్దాల కాలంగా ఒకే ప్రాంతంలో వ్యాపారం చేస్తున్న వారి జీవన స్థితిగతులు మెరుగుపడనున్నాయి. వీరి వ్యాపారాలకు దన్నుగా నిలిచేందుకు పట్టణ పేదరిక నిర్మూలన విభాగం కూడా చర్యలకు ఉపక్రమించింది. జిల్లాలో కడప కార్పొరేషన్‌తో పాటు ప్రొద్దుటూరు, రాయచోటి, రాజంపేట, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల, మైదుకూరు మునిసిపాలిటీలు ఎర్రగుంట్ల నగరపంచాయతీ ఉంది. వీటిలో ఇప్పటికే తోపుడుబండ్ల వ్యాపారుల గుర్తింపుపై ప్రత్యేక సర్వే పూర్తయింది. కడప కార్పొరేషన్‌తో పాటు అన్ని పట్టణప్రాంతాల్లో 9,30,699 మంది జనాభా ఉన్నారు. వీరిలో దాదాపు 7,650మంది తోపుడు బండ్లవ్యాపారులు ఉండొచ్చని అంచనా. వీరితో పాటు జిల్లాలోని మండల కేంద్రాల్లో మరో 3వేలమందిదాకా ఉండొచ్చు. వీరిలో చాలా కాలంగా ఒకేచోట వ్యాపారం చేసుకునేవారు 60 శాతం ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఎక్కువమంది పండ్లు, ఇడ్లీ, పాస్ట్‌ఫుడ్(పానీపూరీ, గోబీ, వడలు, బజ్జీలు) తదితరాలను విక్రయిస్తుండగా కొందరు కులవృత్తులతో పాటు ఇతర వ్యాపారాలు చేస్తున్నారు. వీరంతా మునిసిపాలిటీలకు రోజూ నిర్ణీత రుసుం చెల్లిస్తున్నారు. అయినా సరైన భద్రత లేని పరిస్థితి. ట్రాఫిక్ సమస్య తలెత్తిన ప్రతిసారీ పోలీసుల ప్రతాపానికి గురవుతుంటారు. ఈ బిల్లుచట్టమైతే ఇకపై ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవు. ప్రత్యేక కమిటీల ఆధ్వర్యంలో.. నగర, పురపాలక సంస్థ పరిధిలో ఉన్న వీధివ్యాపారులకు రేషన్, వాటర్, ఆధార్, ఓటర్ వంటి గుర్తింపు కార్డు ఉండాలి. దశాబ్దాల కాలానికి మించి ఒకేచోట వ్యాపారం చేస్తున్న వారిని స్వయం సహయక బృందాలుగా ఏర్పాటు చేస్తారు. వారికి బీమా సౌకర్యం కల్పిస్తారు. లక్షలోపు జనాభా ఉన్న మునిసిపాలిటీలో 10మంది, 1.50లక్షలోపు జనాభా ఉన్నచోట 15మంది, 3లక్షల జనాభా ఉంటే 20మందితో ప్రత్యేక కమిటీలు వేస్తారు. ఈ బృందాలు వీధివ్యాపారుల హక్కులతో పాటు వారి వ్యాపార అభివృద్ధికి సహకారం అందిస్తారు. ఇవీ ప్రయోజనాలు ‘వీధివ్యాపారుల బిల్లు’ చట్టబద్ధం కావడంతో వ్యాపారులందరికీ ధ్రువీకరణపత్రాలు, గుర్తింపుకార్డులు ఇస్తారు. ఏప్రాంతంలో వ్యాపారం చేయాలో అందులో స్పష్టంగా ఉంటుంది. ఆప్రాంతం నుంచి వీరిని ఖాళీచేయించడానికి అధికారులకు అవకాశం ఉండదు. మెప్మా ఆధ్వర్యంలో తగిన సహాయ సహకారాలు అందించేందుకు కేంద్రప్రభుత్వం విధివిధానాలను సిధ్ధం చేసింది. 2010-11 ఆర్థిక సంవత్సరంలోనే ఈ సర్వేను చేపట్టి వీధి వ్యాపారులను లెక్కించారు. జిల్లాలో పట్టణప్రాంతాల్లోనే దాదాపు 7వేలమంది ఉన్నట్లు తెలుస్తోంది. వ్యాపారుల పూర్తి వివరాలను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. మరో దఫా సర్వే చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతానికి ఎంపిక చేసిన వారికి మాత్రమే సౌకర్యాలు వర్తింపజేయనున్నారు. గుర్తింపుకార్డులున్న వీధివ్యాపారులను సమూహాలుగా ఏర్పాటు చేసి రుణసదుపాయం ఇచ్చే అవకాశాలున్నాయి. వీరికి ప్రభుత్వ పథకాలను వర్తింప చేస్తారు. ఇళ్ల నిర్మాణం, స్థలాల కేటాయింపు, వ్యక్తిగతరుణాలు, ఇతర సౌకర్యాల కల్పనవంటి ప్రయోజనాలు ఉంటాయి. -
ఎక్కడి చెత్తఅక్కడే
సమ్మెలో కాంట్రాక్టు కార్మికులు మురికి కూపాలుగా మున్సిపాలిటీలు జిల్లావ్యాప్తంగా 3,918 మంది సమ్మెలోనే గతి తప్పిన పారిశుధ్యం జిల్లాలోని మున్సిపాలిటీల్లో పారిశుధ్యం గతి తప్పింది. వీధుల్లో ఎక్కడి చెత్త అక్కడే కనిపిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు నిరవధిక సమ్మె కొనసాగిస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. గత అక్టోబరులో వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కార్మికులు ఆందోళన బాట పట్టారు. నూజివీడు, న్యూస్‌లైన్ : దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ అనుబంధ సంస్థ అయిన జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి మున్సిపల్ కాంట్రాక్టు పారిశుధ్య సిబ్బంది నిరవధిక సమ్మెకు దిగారు. గతేడాది అక్టోబర్‌లో నాలుగురోజుల పాటు సమ్మె చేసిన నేపథ్యంలో అప్పట్లో ప్రభుత్వం దిగివచ్చి సమస్యలను పరిష్కరిస్తామని, త్వరలోనే జీవో జారీ చేస్తామని హామీ ఇచ్చింది. మూడునెలలవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాంట్రాక్టు కార్మికులు మళ్లీ సమ్మెకు దిగారు. జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీలైన నూజివీడు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, ఉయ్యూరు, నందిగామ, తిరువూరులతో పాటు విజయవాడ నగరపాలక సంస్థలో కూడా కాంట్రాక్టు కార్మికుల సమ్మె కొనసాగుతోంది. వీటిల్లో పనిచేస్తున్న దాదాపు 3,918 మంది కార్మికులు సమ్మెకు దిగడంతో పట్టణాల్లోని వీధులన్నీ చెత్తాచెదారంతో దర్శనమిస్తున్నాయి. రెగ్యులర్ కార్మికులు ఉన్నా... రెగ్యులర్ కార్మికులు విధుల్లోనే ఉన్నా వారి సంఖ్య నామమాత్రంగా ఉండటంతో పారిశుధ్యం మెరుగయ్యే అవకాశాలు కనిపించటం లేదు. నూజివీడులోనే చూస్తే 130 మంది కాంట్రాక్టు కార్మికులు ఉండగా, రెగ్యులర్ కార్మికులు 15 మంది మాత్రమే ఉన్నారు. దీంతో పురపాలక సంఘాలలో రోడ్లు ఊడ్చటం, చెత్తచెదారం ఎత్తి డంపింగ్ యార్డుకు తరలించడం, డ్రైనేజీలలో చెత్తాచెదారాన్ని తొలగించడం, అపరిశుభ్రంగా ఉన్నచోట బ్లీచింగ్, క్రిమిసంహారక మందులను చల్లడం వంటి పనులన్నీ చేయడం వీరికి కష్టసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడే చెత్త పేరుకుపోతోంది. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. మున్సిపల్ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. వ్యాధుల బెడద... ఒక్క నూజివీడు పట్టణంలోనే రోజుకు 25 టన్నుల చెత్త వస్తున్న నేపథ్యంలో నాలుగు రోజుల్లో ఎంత చెత్త పట్టణంలో పేరుకుపోయిందో ఊహిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితే జిల్లాలోని అన్ని పట్టణాల్లోనూ ఉంది. నందిగామలో 70 మంది, గుడివాడలో 140 మంది, నూజివీడులో 130 మంది, పెడనలో 45 మంది, మచిలీపట్నంలో 322 మంది, జగ్గయ్యపేటలో 140 మంది, తిరువూరులో 30 మంది, ఉయ్యూరులో 45 మంది చొప్పున పారిశుధ్య కాంట్రాక్టు కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. విజయవాడ నగరంలో దాదాపు మూడువేల మంది సమ్మె చేస్తున్నారు. ఇదే పరిస్థితి మరికొద్దిరోజులు కొనసాగితే వ్యాధులు ప్రబలే ప్రమాదముందని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరింత ఉధృతం చేస్తాం ప్రభుత్వం దిగిరాకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తాం. కార్మికుల న్యాయమైన 1డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేవరకు సమ్మె కొనసాగుతుంది. కార్మికులకు ఇచ్చే వేతనాలను పెంచాల్సిందే. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా మోసం చేయాలని చూస్తోంది. - శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు -
దద్దరిల్లిన అనంత
సాక్షి, అనంతపురం : రాష్ర్ట విభజనను అడ్డుకునేందుకు ఉద్యోగులు తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ఇప్పటివరకు రెవెన్యూ, ఎపీ ఎన్జీఓలు ఆందోళనలు చేస్తుండగా వారికి అండగా బుధవారం నుంచి మున్సిపల్ ఉద్యోగులు కూడా సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే నగర పాలక సంస్థ ఉద్యోగులు, కార్మిక జేఏసీ నాయకులు మంగళవారం మున్సిపల్ ఇంజనీర్ శివరామిరెడ్డికి సమ్మె నోటీసు ఇచ్చారు. మున్సిపల్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తున్నందున పారిశుద్ధ్యం సమస్య నెలకొనే అవకాశం వుంది. మంగళవారం పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులను బయటకు వెళ్లిపోవాలని రెవెన్యూ ఉద్యోగులు కోరినప్పటికీ తమ తమ స్థానాల నుంచి కదలకపోవడంతో ఆగ్రహంతో అక్కడే ఉన్న కంప్యూటర్ గది అద్దాలను పగులగొట్టారు. కొంతమంది ఉద్యోగులే ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా విధులు నిర్వర్తిస్తూ వేతనాలు తీసుకునేందుకు తహతహలాడుతున్నారని రెవెన్యూ ఉద్యోగులు ఆరోపించారు. రెవెన్యూ, ఎన్జీఓ, పౌరసరఫరాల శాఖ ఉద్యోగులంతా సమ్మెలో ఉన్నారని ఎవరికీ డ్యూటీ సర్టిఫికెట్ ఇవ్వకూడదని కలెక్టర్, జేసీ, డీఆర్వోలను కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ రెవెన్యూ ఉద్యోగులు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎస్కేయూ వద్ద ఉద్రిక్తత సమైక్యాంధ్రకు మద్దతుగా శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ విద్యార్థులు బంద్ నిర్వహించారు. తర్వాత అనంతపురం-చెన్నై జాతీయ రహదారిని దిగ్బంధించారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. ఈ తోపులాటలో రమేష్ అనే విద్యార్థి స్వల్పంగా గాయపడ్డాడు. విద్యార్థులను అరెస్టు చేసి ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. విభజన బిల్లును తిరస్కరించడంలో మౌనముద్ర వహించిన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ దిష్టిబొమ్మను దహనం చేశారు. రెండుగా విడదీస్తే కాంగ్రెస్ పతనమే.. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో ఏర్పడిన తెలుగుజాతిని తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రెండుగా విడదీస్తే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పతనం చేయాల్సిన అవసరం మనందరిపై ఉందని పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ రాచంరెడ్డి భాస్కర్‌రెడ్డి కోరారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో స్థానిక జెడ్పీ ప్రాంగణంలో ఉద్యోగులు సమైక్య నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. విభజనతో వైద్య రంగం నిర్వీర్యం అవుతుందని.. దానికి నిరసనగా డాక్టర్లు, స్టాప్‌నర్సులు, తదితర సిబ్బంది ఓపీ బ్లాక్ ఎదుట గంట పాటు ధ ర్నా నిర్వహించారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు హైదరాబాద్‌లోనే ఉన్నాయని రాష్ట్రం విడిపోతే తమ పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు నిరసనగా వాటికి బాధ్యులైన ప్రజాప్రతినిధుల ఫొటోల ఫ్లెక్సీలను దహనం చేయడంతో పాటు పార్లమెంట్లో బిల్లుపెట్టే రోజు పెన్‌డౌన్ చే యడం, రాస్తారోకోలు నిర్వహించడం వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్య జేఏసీ చైర్మన్ డాక్టర్ వెంకటేశ్వర్లు వెల్లడించారు. సమైక్యంగా ఉన్న తెలుగు రాష్ట్రాన్ని కేవలం ఓట్లు, సీట్లు కోసం విభజించాలనే ప్రయత్నం చేసే రాజకీయ పార్టీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులను సీమాంధ్రలో తిరగనివ్వమని గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీ. శంకర్‌నాయక్ హెచ్చరించారు. తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడాన్ని నిరసిస్తూ ఎస్‌యూసీఐ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కళ్యాణదుర్గం, హిందూపురం మున్సిపాలిటీల్లో ఉద్యోగులు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోతే జోలె పట్టాల్సిందేనని ఇప్పటికైనా నాయకులు స్పందించి విభజనను అడ్డుకోవాలని రాయదుర్గంలో ఏపీ ఎన్జీఓలు, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో యూపీఏ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు సమ్మెలో పాల్గొన్నారు. -
తిరువూరులో పడకేసిన పారిశుద్ధ్యం
కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుల సమ్మె తో తిరువూరులో గత మూడురోజులుగా పారి శుధ్య పనులు అరకొరగా జరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వీధు ల్లో చెత్తాచెదారం తొలగించక, మురుగుకాలువల్లో పూడిక తీయకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. నగరపంచాయతీలో 35 మంది ఔట్సోర్సింగ్ కార్మికులుండగా, 14 మంది సమ్మెలో పాల్గొంటున్నారు. అసలే చాలీచాలని పారిశుద్ధ్య సిబ్బందితో పట్టణంలో పనులు జరగక ప్రజలు ఇబ్బంది పడుతుండగా, కార్మికుల సమ్మెతో పరిస్థితి మరింత దిగజారింది. నగరపంచాయతీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో కుండీలలో చెత్త పేరుకుపోయి, వీధుల్లో చెత్తాచెదారం చెల్లాచెదురుగా పడేస్తుండడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పారిశుధ్య లేమితో పట్టణంలో దోమల బెడద తీవ్రతరమైంది. రాత్రివేళల్లో దోమకాటుకు గురై పలువురు జ్వరాల బారిన పడుతున్నారు. పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో చెత్తతొలగింపులో ఇబ్బంది కలుగుతోందని నగరపంచాయతీ కమిషనర్ మల్లేశ్వరరావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. -
మున్సిపల్ సమ్మె ఉదృతం
-
మిశ్రమ స్పందన
సమైక్య సమ్మెలో ఉద్యోగులు ఐసీడీఎస్ వీడియోకాన్ఫరెన్స్‌ను అడ్డుకున్న ఎన్జీవోలు తిరుపతిలో రాస్తారోకో, తెలుగుతల్లి విగ్రహానికి పాలాభిషేకం మూతపడిన తిరుపతి, చిత్తూరు, మదనపల్లె ఆర్డీవో కార్యాలయాలు సమ్మెలో పాల్గొనని విద్యుత్, ఉపాధ్యాయ, మున్సిపల్ ఉద్యోగులు సాక్షి, చిత్తూరు : సమైక్యాంధ్రకు మద్దతుగా ఎన్జీవోలు, ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు జిల్లా వ్యాప్తంగా తొలి రోజు గురువారం మిశ్రమ స్పందన లభించింది. రెవెన్యూశాఖ ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొన్నారు. జిల్లాలోని 66 తహశీల్దారు కార్యాలయాలకు తాళాలు వేశారు. తిరుపతి, చిత్తూరు, మదనపల్లె రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు మూతపడ్డాయి. ఆర్డీవో కార్యాలయాల వద్దకు చేరుకున్న రెవెన్యూ ఉద్యోగులు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు నిరసన తెలిపారు. శ్రీకాళహస్తిలో ఉద్యోగులు రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. చిత్తూరులోని కొత్తకలెక్టరేట్‌లో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఎన్జీవో సంఘం నాయకులు మూయించారు. ఉద్యోగులు కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా నాయకులు అడ్డుకున్నారు. వీడియో కాన్ఫరెన్సకు వెళ్లిన ఐసీడీఎస్ ఉద్యోగులను బలవంతంగా బయటకు పంపించారు. మున్సిపల్ ఉద్యోగులు ఆయా మున్సిపాల్టీల్లో నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలిపారు. తిరుపతిలో వందలాదిమంది విద్యార్థులు రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. అయితే విద్యుత్, మున్సిపల్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెకు దూరంగా ఉన్నారు. చాలా ప్రభుత్వ కార్యాలయాలు పని చేశాయి. చిత్తూరులో ఎన్జీవోలు బైక్‌ర్యాలీ నిర్వహిం చారు. నగరంలోని డీఈవో, జిల్లా పరిషత్, అటవీశాఖ, ఆర్అండ్బీ, పాత కలెక్టరేట్లో ని కార్యాలయాలను మూయించారు. రెవె న్యూ సర్వీసెస్ ఉద్యోగుల సంఘం నాయకులు కలెక్టరేట్లోని ఉద్యోగులు విధులకు హాజరుకాకుండా అడ్డుకున్నారు. తిరుపతి రెవెన్యూ డివిజన్, తిరుపతి రూరల్, అర్బన్ తహశీల్దారు కార్యాల యాలు, స్టాటిస్టికల్ విభాగం, సివిల్ సప్లయిస్ విభాగాలు మూతపడ్డాయి. ఉద్యోగులు, తహశీల్దార్లు సమ్మెలో ఉన్నారు. ఉద యం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన తెలిపారు. శాప్ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు సమైక్యాంధ్రకు మద్దతుగానిరసన తెలిపారు. ఎన్జీవోల ఆధ్వర్యంలో పొట్టిశ్రీరాములు, తెలుగుతల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ఎన్జీవోల ఆధ్వర్యంలో విద్యార్థులు మెడికల్‌కాలేజీ సర్కిల్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. మదనపల్లెలో విద్యార్థి జేఎసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద మానవహారం, ర్యాలీలు నిర్వహించారు. ఎన్జీవోలు ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. బీటీ కళాశాలలో సమాచారహక్కు చట్టం కమిషనర్ ఇంతియాజ్ అహ్మద్ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉద్యోగులు బహిష్కరించారు. పలమనేరులో అన్ని ప్రభుత్వ కార్యాలయాలూ మూతపడ్డాయి. ఎంపీడీవో కార్యాలయం వద్ద వార్డుమెంబర్ల శిక్షణ కార్యక్రమాన్ని అడ్డుకుని వారిని బయటకు పంపేశారు. వార్డు మెంబర్లూ సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించారు. మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. కార్యాలయాలకు రాకుండా బయట ఉండే నిరసన తెలిపారు. పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాలు ఏమీ పని చేయలేదు. శ్రీకాళహస్తిలో పెండ్లి మండపం వద్ద రెవెన్యూశాఖ ఉద్యోగులు రిలే నిరాహారదీక్షలు నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయం మినహా మిగిలిన ప్రభుత్వ కార్యాలయాలు పనిచేశాయి. పుత్తూరు పట్టణంలోనూ తహశీల్దారు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఉద్యోగులు నిరసన తెలిపారు. -
సమ్మె షురూ!
మచిలీపట్నం, న్యూస్‌లైన్/సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన మలివిడత సమ్మె గురువారం జిల్లాలోనూ ప్రారంభమైంది. మున్సిపల్ ఉద్యోగులు జిల్లా వ్యాప్తంగా పెన్‌డౌన్ చేసి విధులను బహిష్కరించారు. మొత్తం 80 శాతం మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారని అంచనా. బందరులోని పలు ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. కలెక్టరేట్ ప్రాంగణంలోని వివిధ సంక్షేమ కార్యాలయాలు, గ్రామీణాభివృద్ధి శాఖ, ఖజానాశాఖ, పంచాయతీ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయంలోని అన్ని సెక్షన్లు, డీఎస్వో, విద్యాశాఖ కార్యాలయాలు తెరుచుకోలేదు. ఏపీ ఎన్జీవో నాయకులు సమ్మెలో పాల్గొనాలని కార్యాలయాలు తిరుగుతూ ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. జేఏసీ తూర్పు కృష్ణా చైర్మన్ రొండి కృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని విభజించేందుకే కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పార్టీలకతీతంగా వ్యతిరేకించాలని, అందుకు సహకరించని ప్రజాప్రతినిధులను రాబోయే ఎన్నికల్లో ఓడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రావి శ్రీనివాసరావు, ఎల్.వి.సూర్యకుమార్, పి.సాయికుమార్, బి.సీతారామయ్య, ఆకూరి శ్రీనివాసరావు, హుస్సేన్, తస్లీంబేగ్, శ్రీమన్నారాయణ, రాజేంద్రప్రసాద్, వి.సత్యనారాయణసింగ్, శివశంకర్, శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. చల్లపల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు రాస్తారోకో చేశారు. జగ్గయ్యపేట పట్టణంలో రంగుల మహోత్సవానికి తరలివచ్చిన శ్రీ తిరుపతమ్మ ఉత్సవమూర్తులకు రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం సభ్యులు వినతిపత్రం సమర్పించారు. జగ్గయ్యపేటలో మున్సిపల్ కూడలిలో ధర్నా చేసి మానవహారం చేపట్టారు. నూజివీడు పట్టణంలోని చిన్నగాంధీబొమ్మ సెంటరులో ముత్తంశెట్టి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో అఖిలపక్ష జేఏసీ రిలేదీక్షలను ప్రారంభించింది. నూజివీడు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు సెంటరులో రిలేనిరాహార దీక్షలను ప్రారంభించారు. సెయింట్ థామస్ హైస్కూల్ విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి చిన్నగాంధీబొమ్మ సెంటరులో మానవహారం నిర్వహించారు. నందిగామ పట్టణంలోని గాంధీ సెంటర్లో సమైక్యాంధ్రకు మద్దతుగా వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. కంకిపాడు సినిమాహాలు సెంటరులో సమైక్యవాదులు రాస్తారోకో చేపట్టారు. బెజవాడలో.. విజయవాడలో ఎన్జీవో నేతలు ఉదయం 10 గంటలకు ఇరిగేషన్ కార్యాలయానికి వెళ్లి సమ్మెలో పాల్గొనాలని ఉద్యోగులను కోరారు. అక్కడి నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లారు. జేఏసీ కన్వీనర్ ఎ.విద్యాసాగర్ నేతృత్వంలో ఉద్యోగ సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో ఈ ఆందోళనలో పాల్గొన్నారు. సబ్‌కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి సిబ్బందిని బయటకు పంపించి వేశారు. సబ్‌కలెక్టర్ హరిచందనను కలిసి సమ్మెకు సహకరించాలని కోరారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాలకు ఎన్జీవో నేతలు తాళాలు వేశారు. న్యాయవాదులు ఎడ్లబండ్లతో ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
కూలిన ఆశలు
ఖమ్మం అర్బన్,న్యూస్‌లైన్: నిన్నటి వరకు పిల్లాపాపలతో కళకళలాడిన ఖమ్మం సమీపంలోని ఎన్నెస్పీ కాల్వ కట్ట పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. పదేళ్లుగా తాము నివసిస్తున్న ఇళ్లను అధికారులు కూల్చివేయడంతో నిర్వాసితులు గుండెలవిసేలా విలపించారు. ఒకవైపు మహిళలు, పిల్లల రోదనలు, మరోవైపు అధికారుల హడావిడితో ఆ ప్రాంతంలో గురువారం కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చెప్పా పెట్టకుండా గుడిసెలు తొలగిస్తే ఉన్నట్టుండి తట్టాబుట్టా సర్దుకుని ఎక్కడికి వెళ్లాలంటూ గుడిసెవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాల పేరుతో ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు తొలగించడంతో పెట్టే బేడా సర్దుకుని ప్రత్యామ్నాయ స్థావరాలు వెతుక్కుంటూ బయటపడాల్సి వచ్చిందని విలపిస్తున్నారు. తమకు ముందుగా ఎక్కడైనా స్థలం కేటాయించి, ఆ తర్వాత తొలగిస్తే ఎలాంటి ఇబ్బందీ ఉండేది కాదంటున్నారు. పేదల కోసమే పని చేస్తున్నామని చెపుతున్న పాలకులు, అధికారులు ఇప్పుడు ఇలా చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం తమవద్దకు వచ్చే నాయకులు ఇప్పుడెక్కడికి వెళ్లారని ప్రశ్నిస్తున్నారు. కొందరు పెద్దల కోసం తమను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. బుధవారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేశారని, దీంతో పిల్లలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని వాపోయారు. తాము అడ్డుకున్నా తొలగింపులు ఆపరనే భయంతో ఇంట్లోని సామగ్రి, రేకులను కాపాడుకునేందుకు అన్నీ సర్దుకుని స్వచ్ఛందంగానే బయటకు వచ్చామన్నారు. పోలీసుల బందోబస్తు మధ్య తొలగింపు... భారీ పోలీసు బందోబస్తు.. రహదారుల దిగ్బంధం మధ్య రెండోరోజు గురువారం కూడా కూల్చివేతల పర్వం కొనసాగింది. ఖమ్మం ఆర్డీఓ సంజీవరెడ్డి, డీఎస్పీ బాలకిషన్ పర్యవేక్షణలో తొలగింపులు చేపట్టారు. ఒక్కో టీమ్‌కు ఒక సీఐ, ముగ్గురు ఎస్సైలు, 15 మంది సివిల్, 15 మంది ఏఆర్, ఆరుగురు మహిళా పోలీసులతో పాటు ఒక తహశీల్దార్, ఒక సర్వేయర్లతో 16 టీమ్‌లుగా ఏర్పడ్డారు. వీరి పర్యవేక్షణలో, జేసీబీల సహాయంతో మున్సిపల్ సిబ్బంది ఇళ్లు తొలగించారు. కూల్చివేతల సందర్భంగా ఎవరూ అక్కడికి రాకుండా ప్రధాన రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులతో పాటు వైరా, ఇల్లెందు, సత్తుపల్లి డీఎస్పీలు సాయిశ్రీ, క్రిష్ణ, అశోక్ పర్యవేక్షణలో మరో 250 మంది పురుష, 200 మంది మహిళా కానిస్టేబుళ్లు కూడా బందోబస్తు నిర్వహించారు. ఎనిమిది 108 వాహనాలు, రెండు ఫైర్ ఇంజన్లను సిద్ధంగా ఉంచారు. బుధవారం నుంచే కాల్వల పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు. కలెక్టర్, జేసీ, ఎస్పీ సూచనలతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు గణేష్, నారాయణరెడ్డి, సమజ తొలగింపులను పర్యవేక్షించారు. ప్రార్థనా మందిరాలకు తాత్కాలిక మినహాయింపు... గుడిసెల కూల్చివేత ప్రాంతంలో ఉన్న దేవాలయాలు, మసీదులు, చర్చీలను తొలగించకుండా వాటికి తాత్కాలిక మినహాయింపు ఇచ్చారు. ఉన్నతాధికారుల సూచన మేరకు గుడిసెలన్నీ తొలగించిన తర్వాత వాటిపై నిర్ణయం తీసుకుంటామని ఆర్డీఓ సంజీవరెడ్డి తెలిపారు. కాగా, మొత్తం 1200 పైగా గుడిసెలు ఉన్నాయని, అందులో సగం మంది మాత్రమే అర్హులు ఉన్నారని, వారికి ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతాల్లో స్థలాలు ఇస్తామని చెప్పారు. ఇవి కాక కొందరు పెద్దలు నిర్మించిన భవనాలు సుమారు 50 వరకు ఉంటాయని, వాటిని కూడా తొలగిస్తామని తెలిపారు. ముందస్తుగా అదుపులోకి... కూల్చివేతలను అడ్డుకోకుండా పలువురు నాయకులను పోలీసులు ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతురావు, నాయకులు మౌలానా, సలాం, జానీమియా, ఏనుగు గాంధీ, మల్లేష్, రామకృష్ణ, కాంగ్రెస్ నాయకుడు పువ్వాడ అజయ్‌కుమార్ తో పాటు మొత్తం 27 మంది ఉన్నారు. గుడిసెవాసులతో పాటు నాయకులను కూడా టేకులపల్లిలోని మహిళా ప్రాంగణం, డైట్ కాలేజీ, సర్దార్ పటేల్ స్టేడియం, పాకబండలోని కమ్యూనిట్ హాల్లో ఏర్పాటు చేసిన స్థావరాలకు తరలించినట్లు ఆర్డీఓ తెలిపారు. ఇళ్లు కోల్పోయిన పేదలకు ఈ స్థావరాల్లోనే భోజన, వసతి సదుపాయాలు కల్పించామన్నారు. -
రైలు కింద పడి మున్సిపల్ ఉద్యోగి ఆత్మహత్య
పార్వతీపురం టౌన్, న్యూస్‌లైన్ :స్థానిక టౌన్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి మున్సిపల్ ఉద్యోగి చాప త్రినాథరావు(చిన్ని) (43) ఆదివారం మృతి చెందాడు. జీఆర్పీ హెచ్‌సీ జి.వి.ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం... పార్వతీపురం మున్సిపాలిటీకి చెందిన తోటపల్లి పంపుహౌస్ వద్ద తాగునీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న చాప త్రినాథరావు శనివారం దోమలమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు అతనిని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించారు. అయితే ఆదివారం ఉదయం అతను ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. సాయంత్రం ఐదు గంటల సమయంలో రాయగడ నుంచి పార్వతీపురం వైపు వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మనస్తాపంతోనేనా..? త్రినాథరావు సుమారు రెండేళ్ల క్రితం నుంచి ఒంటరిగా ఉంటున్నాడు. భార్యతో గొడవలు పడి విడిపోయినట్లు సమాచారం. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సహచర ఉద్యోగులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులెవరూ పట్టించుకోకవడంతో తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శనివారమే ఆత్మహత్య చేసుకునేందుకు అతను ప్రయత్నించాడు. స్థానికులు అప్రమత్తం కావడం, వైద్యులు సకాలంలో స్పందించి చికిత్స అందించడంతో అతను కోలుకున్నాడు. అయితే, ఆదివారం ఆస్పత్రి నుంచి ఎవరికీ చెప్పకుండా పరారై, మరోమారు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈసారి మృతి చెందడంతో తోటి ఉద్యోగులు, స్థానికులు కన్నీటిపర్యంతమవుతున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మున్సిపల్ ఉద్యోగులకు ఏకీకృత నిబంధనలు!
సాక్షి, హైదరాబాద్: .మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి సంస్థలకు ఏకీకృత సర్వీసు నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది తద్వారా సూపరింటెండెంట్ స్థాయి నుంచి పై స్థాయిలోని అధికారులకు మల్టీ జోనల్, దిగువశ్రేణి సిబ్బందికి రీజినల్ స్థాయిలో బదిలీలకు, పదోన్నతులకు అవకాశం ఏర్పడనుంది. ఇప్పటివరకు మున్సిపల్ కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థల్లో నియమితులైన సిబ్బంది ఇతర కార్పొరేషన్లు లేదా పట్టణాభివృద్ధి సంస్థలకు బదిలీపై వెళ్లడానికి అవకాశం లేదు. దీనితో సిబ్బంది, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీర్ఘకాలంగా ఏకీకృత సర్వీసు నిబంధనల అమలుకు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికి ఒక కొలిక్కి వచ్చాయి. ఏకీకృత విధానానికి న్యాయశాఖ ఆమోదం తెలిపిందని, ఆర్థిక శాఖ నేడో రేపో ఆమోదం తెలుపవచ్చని పురపాలక శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. ఒకప్పుడు కేవలం ఏడు మాత్రమే ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు ఇప్పుడు 19కి చేరారుు. కొన్ని జిల్లాల్లో రెండేసి మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. అయితే రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నల్లగొండ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ కూడా లే దు. కాగా కార్పొరేషన్ల పరిధిలో సూపరింటెండెంట్ స్థాయి నుంచి పై అధికారులను మల్టీజోన్ పరిధిలోకి తీసుకుని వచ్చి వారిని ఒక కార్పొరేషన్ నుంచి మరో కార్పొరేషన్‌కు, అదే సీనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు రీజియన్ పరిధిలో ఉండే కార్పొరేషన్ల పరిధిలో బదిలీ చేయడానికి అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ఇక రాష్ట్రంలో 9 పట్టణాభివృద్ధి సంస్థలు ఉన్నాయి. ఏదైనా పట్టణాభివృద్ధి సంస్థలో ఉద్యోగం చేస్తుంటే ఆ సంస్థలోనే ఒక సీటు నుంచి మరో సీటుకు మార్చడం మి నహా.. ఇప్పటివరకు ఇతర ప్రాంతాలకు బదిలీ చేసే అధికారం లేదు. మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఏకీకృత సర్వీసు నిబంధనలు అమలు చేయనున్నా రు. గతంలో బిల్ కలెక్టర్లుగా నియమితులయ్యేవారు ఆ మునిసిపాలిటీలోనే పదవీ విరమణ చేసేవారు. కానీ ఏకీకృత సర్వీసు విధానంతో జిల్లా పరిధిలో ఉండే ఇతర మున్సిపాలిటీలకు బదిలీ చేయడానికి అవకాశం ఏర్పడింది. జూనియర్, సీనియర్ అసిస్టెంట్లను రీజియన్ పరిధిలో బదిలీ చేయడానికి వీలు కలుగుతుంది. -
మున్సిపల్ ఇంజినీర్లపై బొత్స అసహనం
విజయనగరం మున్సిపాల్టీ, న్యూస్‌లైన్ :పట్టణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పను లు చెప్పేందుకు ఇంజినీర్లు ఎవరూ లేవడం లేదు. అసలు ఇంజినీర్లు ఉన్నారా? లేదా? వారికి పనుల గురించి తెలియదా? అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మున్సిపల్ డీఈ నెల రోజుల్లో 20 రోజులు సెలవులోనే ఉంటున్నారని ఆయనకేమి తెలుస్తుందని మాజీ కౌన్సిలర్ పిళ్లా విజయ్‌కుమార్ మంత్రి దృష్టికి తెచ్చారు. స్పందించిన ఏఈ లేచారు. సమాధానం చెప్పారు. ఇంత నెమ్మదిగా ఉంటే ఎలాగని మంత్రి ప్రశ్నించారు. మున్సిపాలిటీలో మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులు, మాజీ కౌన్సిలర్లతో పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై గురువారం సమీక్షించారు. ముందుగా రచ్చబండపై సమీక్షించారు. పింఛన్లు, రేషన్‌కార్డులు తదితర వాటిపై వివరాలు తెలుసుకున్నారు. మున్సిపాలిటీలో రెండు బృందాలు శుక్రవారం పర్యటించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని మంత్రి ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో కూడా కౌంటర్ ఏర్పాటు చేయూలని ఆదేశించారు. తరువాత 30 రోజుల్లో 30 పథకాల శంకుస్థాపన కార్యక్రమాలపై సమీక్షించారు. 30 రోడ్ల పరిస్థితి ఎంత వరకు వచ్చిందని అధికారులను ప్రశ్నించారు. పనులను పర్యవేక్షించేందుకు ఐదుగురు ఏఈలు ఉండాల్సి ఉండగా ఇద్దరే ఉన్నారని ఉద్యోగి చెప్పడంతో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే అశోక్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యక్తిగత ఆరోపణలు మంచిది కాదని, పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. పట్టణంలోని పైపులైను పురాతన కాలం నాటిది కావడంతో లీకులు అవుతున్నాయని అధికారులు తెలిపారు. పట్టణంలో 307 లీకేజీలు ఉన్నాయని మంత్రి దృష్టికి తేగా 13వ ఆర్థిక సంఘం నిధులు పారిశుద్ధ్యం, డ్రింకింగ్ వాటర్, లైట్లు వంటి వాటిని వినియోగించాలని సూచించారు. పట్టణంలో నూతనంగా పైపులైనులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.39 కోట్లు మంజూరు చేసిందని మంత్రి చెప్పారు. బంగారుతల్లి పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పోలీసు, మున్సిపల్, రెవెన్యూ శాఖలతో సమావేశమై యూక్షన్ ప్లాన్ తయూరు చేయూలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, మున్సిపల్ ప్రత్యేకాధికారి జేసీ పీఏ శోభ, రచ్చబండ కమిటీ సభ్యుడు పిళ్లా విజయ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ ఎస్.గోవిందస్వామి, తహశీల్దార్ పెంటయ్య, మాజీ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. -
మూడు నెలల్లో రెండు మున్సిపల్ చేపలు
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: ఇదే తేదీ.. అదేస్థాయి.. మధ్యలో మూడు నెలల వ్యవధి. ఏసీబీ వలలో రెండు మున్సిపల్ చేపలు ఇలా ఏసీబీ వలలో చిక్కుకోవడం యాధృచ్ఛికమే అయినా విశేషమే. మూడు నెలల క్రితం ఆగస్టు 20న శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్ రూ.50 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు సీనియర్ అసిస్టెంట్ పద్మనాభం కూడా దొరికిపోయారు. కాగా బుధవారం పాలకొండ నగర పంచాయతీ కమిషనర్ నాగభూషణరావు రూ.12 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. మూడు నెలల వ్యవధిలోనే ఇద్దరు మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారులు పట్టుబడటం ఒక విశేషం కాగా, కొత్తగా ఏర్పాటైన పాలకొండ నగర పంచాయతీకి తొలి కమిషనర్‌గా వచ్చిన అధికారే పట్టుబడటం మరో విశేషం. జిల్లా చరిత్రలో ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్లు కూడా వీరిద్దరే.. ఆ విధంగా కూడా వీరు రికార్డుల్లోకెక్కారు. -
మున్సిపోల్స్‌కు కసరత్తు
అరండల్‌పేట(గుంటూరు), న్యూస్‌లైన్ :మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పంచాయతీ ఎన్నికలు పూర్తయిన అనంతరం మున్సిపోల్స్ ప్రక్రియ చేపట్టాలని భావించింది. అయితే వెంటనే రాష్ర్ట విభజన ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం.. సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఎగసిపడిన నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అడుగు ముందుకు పడలేదు. ఉద్యోగ సంఘాల సమ్మె విరమణతో ప్రస్తుతం రాష్ర్టంలో పరిస్థితి మెరుగుపడిందని భావిస్తున్న సర్కారు ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల పాలవర్గం గడువు 2009 సెప్టెంబరు 30తో ముగిసింది. అప్పటి నుంచి ఎన్నికల ఊసెత్తని ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబరులో నిర్వహించాలని యోచిస్తోంది. దీనిపై ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. పురపాలకసంఘాల్లోని ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ప్రక్రియ తదితర వివరాలను కోరింది. నవంబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబరులో రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. వివరాలు అందజేయాలని ఆదేశం.. జిల్లాలోని 12 పురపాలక సంఘాలతోపాటు గుంటూరు నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఓటర్ల జాబితాలు, సామాజిక, ఆర్థిక కులగణన, రిజర్వేషన్లు తదితర వివరాలను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం పురపాలక సంఘాల అధికారులను ఆదేశించింది. అదేవిధంగా జిల్లాలో రెండు మున్సిపాలిటీలో వార్డుల వారీగా ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. వార్డుల పునర్విభజన పూర్తిచేశారు. ఈ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించింది. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఆధారంగా వార్డు రిజర్వేషన్లను ప్రకటించారు. గుంటూరు నగరపాలకసంస్థ వార్డుల పునర్విభజనపై హైకోర్టు ఆదేశాల ప్రకారం వార్డుల పునర్విభజన నోటిఫికేషన్ మరోసారి ఇవ్వాల్సి ఉంది. ప్రజలు, రాజకీయపార్టీల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం ప్రభుత్వ ఆమోదంతో వార్డుల రిజర్వేషన్లు ప్రకటించాల్సి ఉంది. తొలిసారిగా తాడేపల్లికి ఎన్నికలు.. జిల్లాలో ఈసారి కొత్తగా ఏర్పడిన తాడేపల్లి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. పిడుగురాళ్ళ, సత్తెనపల్లి మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్యను పెంచారు. తెనాలి మున్సిపాలిటీల్లో అత్యధికంగా 40 వార్డులు ఉండగా, నరసరరావుపేట 34, బాపట్ల 34, చిలకలూరిపేట 34, మంగళగిరి 32, పొన్నూరు 31, వినుకొండ 26, పిడుగురాళ్ల 30, సత్తెనపల్లి 30, మాచర్ల 29, రేపల్లె 28, తాడేపల్లిలో 23 వార్డులు ఉన్నాయి. సాధ్యాసాధ్యాలపై చర్చ.. ప్రభుత్వం పురపాలక సంఘాల ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అందుకు సహకరిస్తాయా లేదా అన్న మీమాంస అధికారుల్లో, ప్రజాప్రతినిధుల్లో నెలకొంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఏపీఎన్జీఓలు భాగస్వాములు కావడంతో పాటు తెలంగాణ బిల్లు శాసనసభకు వచ్చే అవకాశం ఉందంటూ కేంద్రం ప్రకటించింది. బిల్లు అసెంబ్లీకి వస్తే సమ్మెకు దిగుతామని ఎన్జీవోలు ప్రకటించారు. ఈ పరిణామాల మధ్య మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా అన్న చర్చ అధికారుల మధ్య సాగుతోంది. -
కదంతొక్కిన మున్సిపల్‌కార్మికులు
ఖమ్మం, న్యూస్‌లైన్ : సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె రెండోరోజుకు చేరింది. ఖమ్మం, కొత్తగూడెం, మణుగూరు పట్టణాలలో మంగళవారం కూడా కార్మికులు విధులు బహిష్కరించి ర్యాలీలు నిర్వహించారు. ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయంతోపాటు, మణుగూరు, కొత్తగూడెం మున్సిపాలిటీల ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కార్మికుల సమ్మె కారణంగా పారిశుధ్యపనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వీధులు దుర్గంధం వెదజల్లు తున్నాయి. గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండగా... మురికికాలువలు తీసేవారు లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైకి వచ్చి ఇబ్బందికరంగా మారింది. కాగా, మున్సిపల్ కార్మికుల సమ్మెకు వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ, సీపీఎం మద్దతు ప్రకటించాయి. ఆయాపార్టీల నాయకులు ఆందోళన జరుపుతున్న కార్మికుల వద్దకు వెళ్లి సంఘీభావం తెలిపారు. ఖమ్మంలో మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె రెండోరోజు విజయవంతమైంది. నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి కలెక్టరెట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్మిక విభాగం జిల్లా కన్వీనర్ ఎస్. వెంకటేశ్వర్లు, సీపీఎం డివిజన్ కార్యాదర్శి ఎర్రా శ్రీకాంత్, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి విష్ణు, ఐఎన్టీయూసీ నాయకులు బుర్రి వినయ్ కూమార్ మద్దతు తెలిపి... మాట్లాడుతూ ప్రభుత్వం దిగిరాకపోతే పతనం తప్పదని హెచ్చరించారు. కొత్తగూడెం మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె రెండోరోజు కొనసాగింది. సమ్మె శిబిరం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మందా నర్సింహారావు, మధు సంఘీభావం తెలిపారు. కార్మికుల సమ్మె కారణంగా పట్టణంలో కొంతమేరకు పారిశుధ్య పనులు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మణుగూరులో మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం నుంచి పూలమార్కెట్ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్మికుల న్యాయమైన సమస్యలు వెంటే పరిష్కరించాలని సీఐటీయూ డివిజన్ ప్రదాన కార్యదర్శి గద్దల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. -
ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఉద్యోగి
పిడుగురాళ్ల, న్యూస్‌లైన్ :బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్‌కు రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా మున్సిపల్ ఉద్యోగిని ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అయితే పెద్దచేపలు తప్పించుకొని చిన్నచేప దొరికిందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. సంఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీఆర్.విజయపాల్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని చెరువుకట్ట బజారుకు చెందిన కొల్లి బ్రహ్మం తనకున్న 2 సెంట్ల స్థలంలో భవనాన్ని నిర్మించుకునేందుకు ప్లాను తయారు చేయించుకుని అప్రూవల్ కోసం మున్సిపల్ కార్యాలయంలోని టౌన్‌ప్లానింగ్ అధికారులకు ఆగస్టులో దరఖాస్తు చేసుకున్నాడు. ఇంతవరకు అప్రూవ్ చేయకపోవటంతో బిల్డింగ్ ఓవర్సీయర్ బి.వి.మధుసూదనరావును కలిశాడు. మధుసూదనరావు రూ.8 వేలు డిమాండ్ చేయగా రూ.5వేలకు రేటు కుదిరింది. లంచం ఇచ్చేందుకు అయిష్టంగా ఉన్న బ్రహ్మం సోమవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల ఆధారంగా మంగళవారం ఉదయం టౌన్‌ప్లానింగ్ కార్యాలయానికి వ చ్చిన బ్రహం, అతని సోదరుడు తిరుపతి పౌడర్ చల్లిన పది రూ.500 నోట్లను మధుసూదనరావుకు ఇచ్చారు. ఆయన వాటిని బల్లపై ఉన్న తన డైరీలో పెట్టుకోగానే ఏసీబీ అధికారులు వచ్చి నోట్లను స్వాధీనం చేసుకున్నారు. మధుసూదనరావు చేతిని కెమికల్స్‌లో ముంచగా అవి రంగుమారటంతో లంచం తీసుకున్నట్లు నిర్థారణకు వచ్చినట్లు డీఎస్పీ విజయపాల్ తెలిపారు. లంచం డిమాండ్‌లో పైఅధికారుల ప్రమేయం ఉందా అని విలేకరులు ప్రశ్నించగా, ఆ విషయంపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. గుంటూరులోని వసంతరాయపురంలో ఉన్న మధుసూదనరావు నివాసగృహంలోనూ ఏసీబీ ఎస్ఐ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించేందుకు ఒక టీమును పంపినట్లు డీఎస్పీ తెలిపారు. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని మధుసూదనరావు అద్దెకుంటున్న గదిలోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏసీబీ ఎస్ఐలు రవి, శ్రీనివాస్, నాగరాజు, సీతారాం సిబ్బంది పాల్గొన్నారు. ప్లాన్ అప్రూవల్ కోసం రెండునెలల నుంచి తిరుగుతున్నా పనిచేయకుండా చాలా ఇబ్బంది పెట్టారని, చివరకు అసలు విషయం చెప్పండని సోమవారం అడుగగా రూ.8 వేలు ఇస్తే ప్రాసెస్ మొదలు పెడతానని బ్లాక్మెయిల్ చేశాడని బాధితుడు కొల్లి బ్రహ్మం చెప్పారు. -
కొనసాగుతున్న పారిశుధ్య కార్మికుల సమ్మె
విశాఖ: పారిశుధ్య కార్మికుల సమ్మె జీవీఎంసీలో రెండోరోజు కూడా కొనసాగుతోంది. దాంతో నగరంలో ఎక్కడికక్కడే చెత్త పేరుకుపోయింది. దుర్గంధంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పారిశుధ్య కార్మికులు సోమవారం నుంచి సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. అసలే పారిశుధ్యం అధ్వానంగా ఉన్న నేపథ్యంలో కార్మికుల సమ్మె కారణంగా పరిస్థితి మరింత దిగజారటంతో ప్రజలు సతమతమవుతున్నారు. ఒక్క విశాఖలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరస్థితి నెలకొంది. హైదరాబాద్ లో నిన్న ఒక్కరోజు సమ్మెతోనే ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. సాయంత్రం కురిసిన వర్షం సమస్యను మరింత తీవ్రం చేసింది. మరోపక్క ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడం, సమ్మె ను ఉధృతం చేస్తామని కార్మిక సంఘాల హెచ్చకరితో నేడు పరిస్థితి మరింత అధ్వా నం కానుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రోజూ జవహర్‌నగర్ డంపింగ్‌యార్డుకు వెళ్లాల్సిన 3600 మెట్రిక్ టన్నుల చెత్త ఎక్కడికక్కడే పేరుకుపోతే పరిస్థితి ఎంత నరకప్రాయం కానుందో ఊహిస్తేనే భీతిగొల్పుతోంది. -
మునిసిపల్ ఖాళీ స్థలాలపై పన్ను
సాక్షి, హైదరాబాద్: పట్టణాలు, నగరాల్లో ఖాళీ స్థలాలపై పన్ను వడ్డించాలని పురపాలక శాఖ కమిషనర్ అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కమిషనర్లను ఆదేశించారు. ఈ మేరకు ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక సంస్థలు ఆదాయ వనరులు పెంచుకోవడానికి వీలుగా ఖాళీ స్థలాలపై తప్పనిసరిగా పన్ను వసూలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఇంటి పన్ను వసూలు చేస్తున్న మాదిరిగానే ఖాళీ స్థలాలపై పన్ను వసూలు చేయాలని పేర్కొన్నారు. మున్సిపాలిటీల చట్టంలోనూ ఈ నిబంధన ఉన్నప్పటికీ ఆయా మున్సిపాలిటీలు దీనిని పట్టించుకోవడం లేదని, ఇకపై కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. పట్టణాల్లో ఖాళీ స్థలం మార్కెట్ విలువపై 0.20 శాతం పన్ను, నగరాల్లో 0.50 శాతం పన్ను విధించాలని, పన్నునోటీసులు పంపించిన తరువాత నిర్ణీత వ్యవధిలోగా చెల్లించని పక్షంలో వారి నుంచి అదనంగా రెండు శాతం వడ్డీ వసూలు చేయాలని కూడా సూచించారు. ముందుగా పట్టణాభివృద్ది సంస్థలు లేదా నగర పాలక సంఘాలు లే అవుట్లు మంజూరు చేసిన వాటిల్లో ఉన్న ఖాళీ ప్రదేశాలను సర్వే చేయాలని, ఆ తరువాత లే అవుట్లు లేకున్నా అభివృద్ది చెందిన ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. ఇంటి నిర్మాణం అనుమతి కోసం వచ్చినప్పుడు వేకె ంట్ ల్యాండ్ ట్యాక్స్(వీఎల్టీ) బకాయిలు ఏమీ లేని పక్షంలో భవ న నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని లేదంటే అనుమతి ఇవ్వడానికి వీల్లేదని పురపాలక శాఖ కమిషనర్ స్పష్టం చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారుల సాయంతో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని, ఆ తరువాత ఆయా స్థలాల యజమానుల గురించి తెలుసుకోవడానికి రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ఎంకంబరెన్స్ సర్టిఫికేట్లు(ఈసీ) తీసుకుని, నోటీసులు జారీ చేయాలని సూచించారు. ఈసీలు ఇవ్వడానికి రిజిస్ట్రేషన్ శాఖ ఆలస్యం చేసే పక్షంలో ఈ విషయాన్ని కలెక్టర్ల దృష్టికి తీసుకుని వెళ్లాలని పేర్కొన్నారు. యజమానులకు నోటీసులు జారీ చేసే కార్యక్రమాన్ని డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే ఖాళీ స్థలాలకు ఒక నంబర్ ఇచ్చి.. దాని ఆధారంగా ప్రతీ సంవత్సరం పన్ను వసూలు చేయాలని సూచించారు. -
విభజనాగ్ని
సాక్షి, అనంతపురం : ‘సమైక్య’ పరిరక్షణకు జిల్లా వాసులు సమష్టిగా కదం తొక్కుతున్నారు. ఫలితంగా 77వ రోజైన మంగళవారం కూడా జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్ర పరిర క్షణ ఉద్యమం ఉధృతంగా కొనసాగింది. అనంతపురం నగరంలో పంచాయతీరాజ్, మునిసిపాలిటీ ఉద్యోగులు, న్యాయవాదులు, వైఎస్సార్సీపీ శ్రేణుల రిలే దీక్షలు కొనసాగాయి. కేంద్ర మంత్రులు సీమాంధ్ర ద్రోహులంటూ అనంతపురం నగర పాలక సంస్థ ఉద్యోగులు స్థానిక సప్తగిరి సర్కిల్లో మెడకు ఉరి తగిలించుకుని నిరసన తెలిపారు. సర్వజనాస్పత్రి వైద్యులు సమ్మె బాట వీడకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఎస్కేయూలో జేఏసీ నాయకుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బ, రాయదుర్గం, గుంతకల్లు, గుత్తి, పామిడిలో జేఏసీ, వైఎస్సార్సీపీ ఆధ్వర్యాన రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోనియా గాంధీని రావణుడితో పోలుస్తూ ప్రదర్శన నిర్వహించారు. సోనియా తలకు అటూ ఇటూ కేంద్ర మంత్రుల తలలు ఉన్నట్లు రూపొందించిన ఫ్లెక్సీని దహనం చేశారు. సప్తగిరి కళాశాల విద్యార్థులు స్థానిక రాజీవ్ సర్కిల్లో రోడ్డుపైనే చదువుతూ నిరసన తెలిపారు. కదిరిలోని అంబేద్కర్ సర్కిల్లో స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్ష చేపట్టారు. వీరికి పలువురు నాయకులు, ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నేతలు మద్దతు తెలిపారు. సమైక్యాంధ్ర కోసం గ్రామగ్రామాన అలుపెరుగని పోరు కొనసాగించాలని వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త ఎస్ఎండీ ఇస్మాయిల్ పిలుపునిచ్చారు. తలుపులలో సమైక్యవాదులు రోడ్డుపైనే గడ్డం గీయించుకుని నిరసన తెలిపారు. కళ్యాణదుర్గంలో ఎన్జీఓల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యవాదులు పట్టణంలో టీ అమ్ముతూ నిరసన వ్యక్తం చేశారు. జేఏసీ నాయకులు భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. మడకశిరలోని సాయిబాబా ఆలయంలో జేఏసీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. రోడ్డుపై బుట్టలు అల్లుతూ.. విక్రయిస్తూ ఆందోళన చేపట్టారు. పెనుకొండలో వేపచెట్లపెకైక్కి నిరసన తెలిపారు. పంచాయతీరాజ్ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గోరంట్లలో జేఏసీ నాయకులు భారీ ర్యాలీ, మానవహారం చేపట్టారు. రాయదుర్గంలో ఎన్జీఓల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలకు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మద్దతు ప్రకటించారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఆర్టీసీ కార్మికుల జేఏసీ నూతన కమిటీని ఎన్నుకున్నారు. కణేకల్లు, డీహీరేహాళ్‌లో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. తాడిపత్రిలో ఉపాధ్యాయులు, ఇంజనీరింగ్ విద్యార్థుల రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. జేఏసీ నాయకులు కుర్చీలను తలపై అడ్డంగా పెట్టుకుని నిరసన తెలిపారు. ఉరవకొండలో 17,18,19 తేదీలలో తలపెట్టిన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడిని విజయవంతం చేయాలని జేఏసీ పిలుపునిచ్చింది. రాష్ట్ర విభజన జరిగితే వలసలు తప్పవంటూ బెళుగుప్పలో జేఏసీ నాయకులు వినూత్న నిరసన తెలిపారు. -
రోజు రోజుకు బలోపేతం
గుంటూరు,న్యూస్‌లైన్ :రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ జిల్లాలో చేపట్టిన ఉద్యమం 58వ రోజు గురువారం నిరసనలు, ఆందోళనలతో హోరెత్తింది. జిల్లాలో పలు చోట్ల ప్రదర్శనలు, రోడ్లపై వంటావార్పు కార్యక్రమాలు చేపట్టారు. తెనాలిలో మున్సిపల్ ఉద్యోగులు చేపట్టిన రిలేదీక్షలు 31వ రోజుకు, టీడీపీ రిలేదీక్షలు 29వ రోజుకు చేరాయి. ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు వీధుల్లో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. బాపట్లలో పాత బస్టాండు వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమైక్యాంధ్ర దీక్షలో ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. రాష్ట్రం సమైక్యాంగా ఉంటేనే ఎంతో మంచిదన్నారు. ప్రత్తిపాడులో సమైక్యాంధ్రకు మద్దతుగా రోటరీక్లబ్ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ఐదవ రోజుకు చేరుకున్నాయి. సమైక్యాంధ్ర కోరుతూ వేమూరు నియోజకవర్గం దోనేపూడిలో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. చిలకలూరిపేటలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా పట్టణంలో ర్యాలీ కొనసాగింది. ఏపీఎన్జీవోలు, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు, జాతీయరహదారిపై మానవహారంగా ఏర్పడ్డారు. మంగళగిరిలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు భారీ ప్రదర్శన చేశారు. అనంతరం రోడ్డుపై యోగా చేసి నిరసన తెలిపారు. నరసరావుపేట, మాచర్లలో సమైక్యాంధ్ర కోసం రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నరసరావుపేటలో 1000 మంది ఆర్యవైశ్యులు రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. రేపల్లెలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు 35వ రోజుకు చేరుకున్నాయి. వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మేళ్లవాగులో ఉపాధ్యాయులు జలదీక్ష నిర్వహించారు. వినుకొండలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మోటారు సైకిళ్లతో ప్రదర్శన జరిగింది. గుంటూరు నగరంలో ... ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శంకర్‌విలాస్ సెంటర్లో రోడ్డుపై బట్టలు ఉతికి రజకులు నిరసన తెలిపారు. ఇంటర్‌బోర్డు ఆర్జేడీ కార్యాలయం వద్ద ‘విభజన వాద సంహారం’ పేరుతో జూనియర్ కళాశాలల అధ్యాపకులు రోడ్డుపై లఘునాటిక ప్రదర్శించారు. విభజనవాదులను భరతమాత కాళికాదేవి అవతారంలో ఆగ్రహించి సంహరించినట్లు చూపారు. ప్రభుత్వ పాఠశాలలఉపాధ్యాయులు, జూనియర్, డిగ్రీ కళాశాలల అధ్యాపకులు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. కార్పొరేట్ కళాశాలల హాస్టళ్లకు వెళ్ళి అక్కడ ఉన్న విద్యార్థినులను ఇళ్లకు పంపారు. విద్యా సంస్థల బంద్ సందర్భంగా విద్యార్థి జేఏసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో బుడంపాడులోని గుంటూరు చానల్లో జలదీక్ష చేశారు. -
నేటి నుంచి GVMC సిబ్బంది 3 రోజుల సమ్మె
-
కదనపథం
సాక్షి, కడప : సమైక్యాంధ్ర రాష్ర్టమే ఆశయంగా జిల్లా వాసులు పోరాట పటిమ ప్రదర్శిస్తున్నారు. వాడవాడలా శిబిరాలు, రహదారులపై ర్యాలీలు, అడుగడుగునా నినాదాలు, ప్రధాన కూడళ్లలో మానవహారాలు, వినూత్న రీతిలో నిరసనలతో హోరెత్తిస్తున్నారు. విభజన ప్రకటనను వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేస్తున్నారు. కడప నగరంలో ప్రైవేటు వృత్తి విద్య కళాశాలల సమాఖ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మహిళా ఉద్యోగులు రోడ్డుపైనే కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరిగాయి. నీటిపారుదల, పంచాయతీరాజ్, మున్సిపల్ ఉద్యోగులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, వాణిజ్యపన్నులశాఖ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగాయి. జమ్మలమడుగులో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి గాంధీ మహాత్ముని విగ్రహం చుట్టూ చేరి నిరసన తెలిపారు. వీరికి ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి సంఘీభావం తెలిపారు. హౌసింగ్ అధికారుల రిలే దీక్షలు కొనసాగాయి. ఎర్రగుంట్ల, ఆర్టీపీపీలలో నిర్వహించిన రిలే దీక్షల్లో పలువురు పాల్గొన్నారు. రాజంపేటలో ఉద్యోగ జేఏసీ కన్వీనర్ జేవీ రమణ నేతృత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో సమైక్య ఉద్యమం ఉధృతం చేయాలని సమావేశాలను నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి సోదరుడు అనిల్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో బగ్గిడిపల్లెకు చెందిన 80 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ప్రొద్దుటూరులో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో రెండు వేల మందికి పైగా మహిళలు విజయకుమార్ థియేటర్ నుంచి పుట్టపర్తి సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. విభజన జరిగితే నీటి కరువేనని నినదించారు. బలిజ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి వంటా వార్పు చేపట్టారు. బ్రాహ్మణ సంఘం, ఉపాధ్యాయ జేఏసీ, విద్యార్థి జేఏసీ, న్యాయవాదులు, వైద్యుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. బద్వేలు, గోపవరం మండలాలకు చెందిన వేలాది మంది ఐకేపీ మహిళలు బద్వేలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి రిలే దీక్షల్లో పాల్గొన్నారు. 54 ఆకారంలో రోడ్డుపైనే కూర్చొని నిరసన తెలిపారు. రోడ్డుపైనే రింగ్‌బాల్ ఆడారు. పోరుమామిళ్లలో వైఎస్సార్ సీపీ నేతలు చిత్తా విజయప్రతాప్‌రెడ్డి, ఒ.ప్రభాకర్‌రెడ్డి, కరెంటు రమణారెడ్డి నేతృత్వంలో జగన్ మాస్క్‌లు ధరించి నిరసన తెలియజేశారు. అక్కల్‌రెడ్డిపల్లె కృపానగర్‌కు చెందిన 12 మంది యువకులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో యోగాసనాలు చేశారు. రాయచోటిలో న్యాయవాదులు, జేఏసీ సభ్యుల రిలే దీక్షలు కొనసాగాయి. ఈనెల 26వ తేదీన జరగనున్న సమైక్య సభ ఏర్పాట్ల గురించి ఆర్డీఓ వీరబ్రహ్మం జేఏసీ నాయకులతో సమావేశమై కార్యచరణను రూపొందించారు. పులివెందులలో జేఏసీ ఆధ్వర్యంలో శివకళానికేతన్ కళాకారులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. దీక్షా శిబిరం వద్ద సత్యహరిశ్చంద నాటకాన్ని ప్రదర్శించారు. ఉపాధ్యాయులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. రైల్వేకోడూరులో ఎన్జీఓలు కళ్లకు రిబ్బన్లు కట్టుకుని రోడ్డుపైన నిరసన తెలిపారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రోడ్డుపై బైఠాయించి సమైక్యాంధ్ర కోసం కలిసికట్టుగా పోరాడుతామని ప్రమాణాలు చేశారు. నల్లగొడుగులు చేతబట్టి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపైనే యోగసనాలు వేశారు. కమలాపురం నియోజకవర్గంలోని చదిపిరాళ్ల గ్రామం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. మానవహారంగా ఏర్పడి నిరసన తెలియజేశారు. మైదుకూరులో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు రోడ్లు ఊడ్చి ఆందోళన చేపట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరించారు. -
వజ్ర సంకల్పం
సాక్షి, కడప : సమైక్య రాష్ట్రమే లక్ష్యంగా అన్ని వర్గాలు ధృడసంకల్పంతో ఆందోళనల్లో మమేకమవుతున్నారు. ఉద్యమకారులకు రోజూ ఇదో దైనందిన కార్యక్రమంగా మారిపోయింది. వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తూ రోజూ వేలాది మంది రోడ్డెక్కుతూనే ఉన్నారు. విభజన ప్రకటన వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదంటూ ముక్తకంఠంతో నినదిస్తున్నారు. విజయవాడ ఆటోనగర్‌లో సమైక్యవాదులపై ఎంపీ లగడపాటి రాజగోపాల్ అనుచరుల దాడికి నిరసనగా కడప నగరంలో మున్సిపల్ ఉద్యోగులు, ఇరిగేషన్, న్యాయవాదులు రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఏపీ ఎన్జీఓల పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు స్వచ్ఛందంగా విద్యుత్ దీపాలను ఆర్పి నిరసన తెలిపారు. కడప నగరంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రిలే దీక్షలు సాగుతున్నాయి. ప్రైవేటు వృత్తి విద్య కళాశాలల అధ్యాపకులు భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. రిమ్స్ ఉద్యోగులు ర్యాలీగా వచ్చి రిలే దీక్షల్లో పాల్గొన్నారు. న్యాయవాదులు,న్యాయశాఖ ఉద్యోగులు, మున్సిపల్, వాణిజ్యపన్నులశాఖ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్‌సర్కిల్‌లో నియోజకవర్గ సమన్వయకర్త అంజాద్బాష, జిల్లా మహిళా అధ్యక్షురాలు పత్తి రాజేశ్వరి నేతృత్వంలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలియజేశారు. ప్రొద్దుటూరులో ఎన్జీఓలు రాష్ర్టం విడిపోతే ఎండిపోతాం..కలిసుంటే పచ్చగా ఉంటాం అంటూ నినాదాలు చేస్తూ వినూత్న రీతిలో ఎండుచెట్లు, పచ్చని చెట్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రైవేటు విద్యా సంస్థలు, విద్యార్థి జేఏసీ, మున్సిపల్ ఉద్యోగులు, న్యాయవాదులు, వైద్యుల రిలే దీక్షలు కొనసాగాయి. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో జగన్ మాస్క్‌లు ధరించి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నిరసన తెలిపారు. సోమవారిపల్లె సర్పంచ్ ప్రశాంతి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కార్యకర్తల దీక్షలు కొనసాగాయి. రాజంపేటలో వైఎస్సార్ సీపీ నేతృత్వంలో తొంగూరుపేట పంచాయతీకి చెందిన చెంగారెడ్డి ఆధ్వర్యంలో 60 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. అన్నమయ్య ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి 10 రకాల పూలతో అభిషేకం చేశారు. బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల పట్టణంలో వైఎస్సార్సీపీ నేతృత్వంలో వెంకటరామాపురానికి చెందిన మాజీ సర్పంచ్ బాలయ్య, వెంకటయ్య ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరిగాయి. బద్వేలు పట్టణంలో వీరారెడ్డి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి సేవ్ ఏపీ ఆకృతిలో కూర్చొని నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు నడిరోడ్డుపైనే పాఠాలు బోధించారు. పులివెందుల పట్టణంలో వైఎస్సార్సీపీ నేతృత్వంలో ఆర్టీసీ బస్టాండు నుంచి పూల అంగళ్ల కూడలి వరకు అర్ధనగ్నంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైఎస్సార్సీపీ నేతలు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, యర్రగంగిరెడ్డి, వరప్రసాద్ పాల్గొన్నారు. ఎన్జీఓలు, జేఏసీ సమన్వయకర్త శివప్రకాశ్‌రెడ్డి నాయకత్వంలో ఇంటింటికి వెళ్లి బొట్టుపెట్టి ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రైల్వేకోడూరు పట్టణంలో 1250 అడుగుల భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ జూనియర్ కళాశాల విద్యార్థుల భరతమాత, జాతీయ నాయకులు, కవుల వేషధారణలతో నృత్య ప్రదర్శనలు చేశారు. పిరమిడ్ విన్యాసాలు చేపట్టారు. చెక్కభజన ఆకట్టుకుంది. హార్టికల్చర్ విద్యార్థుల దీక్షలు కొనసాగుతున్నాయి. కమలాపురంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు సావిత్రమ్మ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. మండల జేఏసీ ఆధ్వర్యంలో నాలుగు రోడ్ల కూడలిలో రాస్తారోకో నిర్వహించి ఆందోళనచేపట్టారు. వివిధ పాఠశాలల విద్యార్థులు కోలాటం, నాయకుల వేషధారణలతో నిరసన తెలిపారు. మైదుకూరు పట్టణంలో ఏవీఆర్ స్కూలు విద్యార్థులు 300 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించి నాలుగురోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. దేశ నాయకుల వేషధారణలు, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జమ్మలమడుగులో పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. చెవిలో చెండుమల్లె పూలు పెట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. వీరికి మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి మద్దతు తెలిపారు. ఎర్రగుంట్లలో దీక్షలు కొనసాగాయి. రాయచోటిలో న్యాయవాదులు, జీవశాస్త్ర ఉపాధ్యాయులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులు తలపై కుర్చీలు పెట్టుకుని నిరసన తెలిపారు. -
స్తంభించనున్న సేవలు
తిరుపతి కార్పొరేషన్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర పరిరక్షణకు మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగ, కార్మికులు ఉద్యమబాటకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మున్సిపల్ ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.లోకేశ్వర వర్మ ఉద్యోగ కార్మికులకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా సోమవారం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అదనపు కమిషనర్ ఈశ్వరయ్య, ఉప కమిషనర్ ప్రతాప్‌రెడ్డికి ఉద్యోగుల సంతకాలతో కూడిన సమ్మె నోటీసును అందించారు. సీమాంధ్రలోని మున్సిపల్ కార్పొరేషన్లలో పనిచేసే ఉద్యోగ, కార్మికుల భద్రత, ఈ ప్రాంతంలో నివసించే ప్రజల హక్కుల సాధన కోసం సోమవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నామని నోటీసులో పేర్కొన్నారు. వర్మ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఈ నెల 12 అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళుతున్నట్టు ఇదివరకే ఏపీ ఎన్జీవోలతో కలసి తాము ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని గుర్తుచేశారు. అందులో భాగంగానే సీమాం ధ్రలోని 40వేల మంది ఉద్యోగులు, అన్ని రకాల కార్మికులు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొంటారని స్పష్టం చేశారు. ఇందులో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ల అసోసియేషన్ కూడా పాల్గొంటుందని అన్నారు. అయితే సమ్మెలో ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల సేవలకు మినహాయింపు ఇస్తున్నట్టు వర్మ తెలిపారు. ఈ సేవలకు ఎలాంటి ఆటం కమూ ఉండదన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని కేంద్రం ప్రకటించే వరకు తాము తలపెట్టిన నిరవధిక సమ్మెను విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈ ఆందోళనలో మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం నాయకులు సేతుమాధవ్, నాయకులు చిట్టిబాబు, షణ్ముగం, మధుసూదన్, మునిరాజ, కరుణాకర్, జ్యోతీశ్వర్‌రెడ్డి, రాజశేఖర్, కందాటి గిరిబాబు, జయప్రద, ఉమాదేవి, లక్ష్మీ, లావణ్య, రాణెమ్మ, రెడ్డికుమారి ఉన్నారు. -
మూడు రోజులు విధుల బహిష్కరణకు మున్సిపల్ ఉద్యోగుల నిర్ణయం
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సోమవారం నుంచి మూడు రోజులపాటు విధులను బహిష్కరించాలని 13 జిల్లాల్లోని మున్సిపల్ ఉద్యోగులు నిర్ణయించారు. ఈ మేరకు మున్సిపల్ మినిస్టీరియల్ ఉద్యోగులు, కమిషనర్ల సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. మూడు రోజుల తర్వాత మరోసారి భేటీ అయి తదుపరి కార్యాచరణను ఖరారు చేస్తామని మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం చైర్మన్ కృష్ణమోహన్‌రావు, కమిషనర్ల సంఘం అధ్యక్షుడు శివరామకృష్ణ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో సీమాంధ్రలోని 13 జిల్లాల్లోని మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న అన్ని స్థాయిల ఉద్యోగులు మూడు రోజులపాటు విధులు బహిష్కరించనున్నట్టు తెలిపారు. సమైక్యాంధ్ర జేఏసీ ఈ నెల 12 నుంచి నిరవధిక సమ్మె చేపడితే అందులో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. జేఏసీ చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు మున్సిపల్ ఉద్యోగులు సంపూర్ణ మద్దతు అందిస్తారని కృష్ణమోహన్‌రావు తెలిపారు. ప్రతి జిల్లాలోనూ విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తామని, ఈ సమావేశాల్లో ఉద్యమ కార్యాచరణను మరింత తీవ్రతరం చేస్తామని చెప్పారు. విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ప్రకటించారు.