మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల ఆందోళన
గాంధీనగర్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు ఆందోళన చేపట్టారు. జేఏసీ ఆధ్వర్యంలో లెనిన్‌సెంటర్‌లో శనివారం మానవహారం నిర్వహించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదని జేఏసీ నాయకులు విమర్శించారు. 10వ పీఆర్‌సీ ప్రకారం కనీసం వేతనం రూ.15432 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇంజినీరింగ్ సిబ్బందికి స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని కోరారు.
కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న వారిని తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. పర్మినెంట్ ఉద్యోగులకు జీపీఎఫ్ అకౌంట్స్, హెల్త్‌కార్డులు, 010 పద్దు కింద జీతాలు చెల్లించాలని కోరారు. పాఠశాలల్లో స్వీపర్లుగా పనిచేస్తున్న వారిని ఫుల్‌టైమ్ వర్కర్స్‌గా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. కార్మికులకు జేఎన్‌యూఆర్‌ఎం ఇళ్లు కేటాయించాలన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కె.ఉమామహేశ్వరరావు, టి.వెంకటరెడ్డి, ఎంవీ నారాయణ, ఎ.సామ్రాజ్యం, ఎం. డేవిడ్, జే.జేమ్స్, సుబ్బారావు, లక్ష్మి, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.
ఎక్కడి చెత్త అక్కడే..
పారిశుధ్య కార్మికుల సమ్మె నేపథ్యంలో నగరంలో చెత్త పేరుకుపోతోంది. చెత్త తీసుకెళ్లేందుకు కార్మికులు రాకపోవడంతో రెండు రోజులుగా ఇళ్లలోనే ఉండిపోయింది. డంపర్‌బిన్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వెహికిల్ డిపో నుంచి వెళ్లిన వాహనాలు ఖాళీగా వెనుతిరుగుతున్నాయి. అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. మరో రోజు గడిస్తే ఇళ్ల నుంచి దుర్గంధం వెదజల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.