Problems Solve
-
బాధితుల వినతులు స్వీకరించిన సీఎం జగన్.. వెంటనే పరిష్కారం
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం అనంతపురం జిల్లాలోని రాప్తాడు పర్యటనలో భాగంగా రాప్తాడు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వివిధ వర్గాల ప్రజల నుంచి వినతుల్ని స్వీకరిస్తూ వారు చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించి వారి సమస్యల పరిష్కారంపై తక్షణమే స్పందించారు. వెంటనే ప్రభుత్వం తరపున బాధితులకు సాయం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమికి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో ఇద్దరు బాధితులకు చెక్కులను జిల్లా కలెక్టర్ అందజేశారు. కమలానగర్‌కు చెందిన పర్లపాటి సుజాత 1. అనంతపురం నగరంలోని కమలానగర్ కు చెందిన పర్లపాటి సుజాత మాట్లాడుతూ.. తన భర్త చనిపోయాడని, తన ఇద్దరు పిల్లలు, తనకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని అభ్యర్థించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాధితురాలు పర్లపాటి సుజాతకు 2 లక్షల రూపాయల చెక్ ను జిల్లా కలెక్టర్ అందజేశారు. అలాగే సుజాతకు ఇంటి పట్టా ఇవ్వాలని, ఆరోగ్యశ్రీ కార్డు అందించాలని, పింఛన్ మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనంతపురం నగరంలోని విద్యుత్ నగర్‌కు చెందిన రాచూరి ఝాన్సీకి లక్ష రూపాయల చెక్కును అందజేస్తున్న డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి 2. అనంతపురం నగరంలోని విద్యుత్ నగర్‌కు చెందిన రాచూరి ఝాన్సీ మాట్లాడుతూ తాను వికలాంగురాలినని, తనుకు ఆర్థిక సాయం చేయాలని సీఎం జగన్‌ను అభ్యర్థించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాధితురాలు రాచూరి ఝాన్సీకి 1 లక్ష రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ ఆదేశాలతో డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి అందజేశారు. బాధితురాలికి ఆరోగ్యశ్రీ కార్డు అందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాధితులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయాన్ని ఉపయోగించుకోవాలని బాధితులకు సూచించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమ సమస్యను చెప్పుకున్న వెంటనే తమను ఆదుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి నరసింహారెడ్డి, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డా.కిరణ్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
రైతన్నకు సాయం ‘రైతుబంధు’
మహబూబ్‌నగర్ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ఈ నెల 10నుంచి ప్రారంభం కానుంది. ఎకరాకు రూ.4వేలు, ఏడాదికి రూ.8వేలు చెక్కుల రూపంలో అందించడం, చెక్కులతో పాటు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్‌నగర్ అర్బన్ మండలంలో ఆరు రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేశారు. శనివారం ఆర్‌అండ్‌బీలో తహసీల్దార్ ఎంవీ ప్రభాకర్‌రావు రెవెన్యూ, వ్యవసాయశాఖల అధికారులు, రైతు సమన్వయ సమితి సభ్యులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 10న ఎదిర జెడ్పీహెచ్ఎస్, 11న మహబూబ్‌నగర్ మహాత్మాగాంధీ రోడ్ హైస్కూల్, 12న ఏనుగొండ జెడ్పీహెచ్ఎస్, ఎర్రవల్లి యూపీఎస్, 14న బోయపల్లి జెడ్పీహెచ్ఎస్, 15న పాలకొండ యూపీఎస్ పాఠశాలల్లో చెక్కుల పంపిణీ ఉంటుందని తెలిపారు. రూ. 2.77కోట్ల చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఒక్కో బృందం సుమారు 300మంది రైతులకు పంపిణీ చేయనున్నారు. సమావేశంలో డీటీలు అఖిలప్రసన్న, కోట్ల మురళీధర్, ఏఓ నాగరాజు, ఆర్ఐ క్రాంతికుమార్‌గౌడ్, ఏఆర్ఐ హనీఫ్, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ రాములు తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారంలో ఏన్జీవో నేతలు విఫలం
సాక్షి, పట్నంబజారు(గుంటూరు): అబద్ధాలు చెబుతూ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఇక చెప్పటానికి అబధ్ధాలే లేకుండా పోయాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి విమర్శించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఏపీ ఏన్జీవో సంఘం ప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. చంద్రబాబు చెక్క భజన చేసుకుంటూ సమస్యలను వదిలేశారని ఆరోపించారు. గుంటూరులో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పీఆర్సీ విషయంలో సంఘం పట్టించుకోలేదని, కేవలం 4 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. నారావారి పల్లె నుండి విజయవాడకు కూడా ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ దుబారా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో వ్యవసాయం పూర్తిస్ధాయిలో పడిపోయిందన్నారు. సంఘాలకు ప్రశ్నించే తత్వం లేకుండా పోయిందని, నాలుగేళ్ళలో ఒక్క నోటీసు కానీ, ధర్నా కాని చేసిన పాపాన పోలేదని అన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి అభివృధ్ధికి అడ్డుపడుతున్నారని విమర్శిస్తున్న టీడీపీ నేతలు మీరు ఏ అభివృధ్ధి చేస్తే ఆయన అడ్డుపడ్డారో చెప్పగలరా అని ప్రశ్నించారు. రుణమాఫీ దగ్గర నుండి పోలవరం వరకు ఏ ఒక్క అంశంలోనైనా ఎప్పుడైనా ఎక్కడైనా బహిరంగ చర్చకు సిధ్ధమేనని సవాల్ విసిరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు బి.సాంబిరెడ్డి, ఉద్యోగ సంఘాల నేతలు ఆల్ఫ్రెడ్, నాగరాజు, అంజిరెడ్డి, బాలకృష్ణారెడ్డి, ఎస్.వి.సత్యనారాయణ, సైదులు తదితరులు పాల్గొన్నారు. -
36వ రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల సమ్మె
నల్లగొండ(మిర్యాలగూడ): తమ సమస్యల పరిష్కారం కోరుతూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మున్సిపల్ కార్మికుల చేపట్టిన సమ్మె 36వ రోజుకు చేరింది. పట్టణంలోని మున్సిపల్ కార్మికులు ఈ రోజు మున్సిపల్ ఆఫీస్ ఎదుట ఉరితాళ్లతో నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో పలువురు కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాల చేశారు. -
మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల ఆందోళన
గాంధీనగర్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు ఆందోళన చేపట్టారు. జేఏసీ ఆధ్వర్యంలో లెనిన్‌సెంటర్‌లో శనివారం మానవహారం నిర్వహించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదని జేఏసీ నాయకులు విమర్శించారు. 10వ పీఆర్సీ ప్రకారం కనీసం వేతనం రూ.15432 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇంజినీరింగ్ సిబ్బందికి స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని కోరారు. కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న వారిని తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. పర్మినెంట్ ఉద్యోగులకు జీపీఎఫ్ అకౌంట్స్, హెల్త్‌కార్డులు, 010 పద్దు కింద జీతాలు చెల్లించాలని కోరారు. పాఠశాలల్లో స్వీపర్లుగా పనిచేస్తున్న వారిని ఫుల్‌టైమ్ వర్కర్స్‌గా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. కార్మికులకు జేఎన్యూఆర్ఎం ఇళ్లు కేటాయించాలన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కె.ఉమామహేశ్వరరావు, టి.వెంకటరెడ్డి, ఎంవీ నారాయణ, ఎ.సామ్రాజ్యం, ఎం. డేవిడ్, జే.జేమ్స్, సుబ్బారావు, లక్ష్మి, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ఎక్కడి చెత్త అక్కడే.. పారిశుధ్య కార్మికుల సమ్మె నేపథ్యంలో నగరంలో చెత్త పేరుకుపోతోంది. చెత్త తీసుకెళ్లేందుకు కార్మికులు రాకపోవడంతో రెండు రోజులుగా ఇళ్లలోనే ఉండిపోయింది. డంపర్బిన్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వెహికిల్ డిపో నుంచి వెళ్లిన వాహనాలు ఖాళీగా వెనుతిరుగుతున్నాయి. అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. మరో రోజు గడిస్తే ఇళ్ల నుంచి దుర్గంధం వెదజల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.