సాక్షి, పట్నంబజారు(గుంటూరు): అబద్ధాలు చెబుతూ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఇక చెప్పటానికి అబధ్ధాలే లేకుండా పోయాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి విమర్శించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఏపీ ఏన్జీవో సంఘం ప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. చంద్రబాబు చెక్క భజన చేసుకుంటూ సమస్యలను వదిలేశారని ఆరోపించారు. గుంటూరులో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పీఆర్‌సీ విషయంలో సంఘం పట్టించుకోలేదని, కేవలం 4 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. నారావారి పల్లె నుండి విజయవాడకు కూడా ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ దుబారా చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఏపీలో వ్యవసాయం పూర్తిస్ధాయిలో పడిపోయిందన్నారు. సంఘాలకు ప్రశ్నించే తత్వం లేకుండా పోయిందని, నాలుగేళ్ళలో ఒక్క నోటీసు కానీ, ధర్నా కాని చేసిన పాపాన పోలేదని అన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అభివృధ్ధికి అడ్డుపడుతున్నారని విమర్శిస్తున్న టీడీపీ నేతలు మీరు ఏ అభివృధ్ధి చేస్తే ఆయన అడ్డుపడ్డారో చెప్పగలరా అని ప్రశ్నించారు. రుణమాఫీ దగ్గర నుండి పోలవరం వరకు ఏ ఒక్క అంశంలోనైనా ఎప్పుడైనా ఎక్కడైనా బహిరంగ చర్చకు సిధ్ధమేనని సవాల్ విసిరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు బి.సాంబిరెడ్డి, ఉద్యోగ సంఘాల నేతలు ఆల్‌ఫ్రెడ్, నాగరాజు, అంజిరెడ్డి, బాలకృష్ణారెడ్డి, ఎస్.వి.సత్యనారాయణ, సైదులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment