సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం అనంతపురం జిల్లాలోని రాప్తాడు పర్యటనలో భాగంగా రాప్తాడు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వివిధ వర్గాల ప్రజల నుంచి వినతుల్ని స్వీకరిస్తూ వారు చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించి వారి సమస్యల పరిష్కారంపై తక్షణమే స్పందించారు.
వెంటనే ప్రభుత్వం తరపున బాధితులకు సాయం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమికి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో ఇద్దరు బాధితులకు చెక్కులను జిల్లా కలెక్టర్ అందజేశారు.
కమలానగర్‌కు చెందిన పర్లపాటి సుజాత
1. అనంతపురం నగరంలోని కమలానగర్ కు చెందిన పర్లపాటి సుజాత మాట్లాడుతూ.. తన భర్త చనిపోయాడని, తన ఇద్దరు పిల్లలు, తనకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని అభ్యర్థించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాధితురాలు పర్లపాటి సుజాతకు 2 లక్షల రూపాయల చెక్ ను జిల్లా కలెక్టర్ అందజేశారు. అలాగే సుజాతకు ఇంటి పట్టా ఇవ్వాలని, ఆరోగ్యశ్రీ కార్డు అందించాలని, పింఛన్ మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
అనంతపురం నగరంలోని విద్యుత్ నగర్కు చెందిన రాచూరి ఝాన్సీకి లక్ష రూపాయల చెక్కును అందజేస్తున్న డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి
2. అనంతపురం నగరంలోని విద్యుత్ నగర్కు చెందిన రాచూరి ఝాన్సీ మాట్లాడుతూ తాను వికలాంగురాలినని, తనుకు ఆర్థిక సాయం చేయాలని సీఎం జగన్‌ను అభ్యర్థించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాధితురాలు రాచూరి ఝాన్సీకి 1 లక్ష రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ ఆదేశాలతో డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి అందజేశారు. బాధితురాలికి ఆరోగ్యశ్రీ కార్డు అందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాధితులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయాన్ని ఉపయోగించుకోవాలని బాధితులకు సూచించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమ సమస్యను చెప్పుకున్న వెంటనే తమను ఆదుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి నరసింహారెడ్డి, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డా.కిరణ్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment