తాడిపత్రి: టీడీపీ కౌన్సిలర్ల దాష్టీకం పరాకాష్టకు చేరుకుంది. రెండు రోజుల క్రితం మున్సిపల్ ఉద్యోగిపై ఏకంగా దాడికి యత్నించి, దూషణలకు దిగారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. రెగ్యులర్ నాన్ మస్టర్ రోల్ (ఆర్‌ఎన్‌ఎంఆర్) ఉద్యోగి జేసీ సూర్యనారాయణరెడ్డి శుక్రవారం ఉదయం విధుల విషయమై కమిషనర్ వద్దకు వెళ్లాడు. అప్పటికే చైర్మన్ చాంబర్‌లో కూర్చుని ఉన్న మున్సిపల్ వైస్ చైర్మన్, 36వ వార్డు టీడీపీ కౌన్సిలర్ జింకా లక్ష్మీదేవి, మరికొంతమంది కౌన్సిలర్లు ఉద్యోగి సూర్యనారాయణపైకి దూసుకొచ్చారు.
‘ఎప్పుడు చూసినా కమిషనర్ చాంబర్ వద్దే ఉంటావు.. ఇక్కడ ఏం పని’ అంటూ గద్దించారు. వారి మాటలను పట్టించుకోకుండా సదరు ఉద్యోగి కమిషనర్ చాంబర్ నుంచి బయటకు వెళ్తుండగా కౌన్సిలర్ లక్ష్మీదేవి అడ్డుకుని.. చొక్కా పట్టుకునేందు ప్రయచింది. కమిషనర్ జోక్యం చేసుకుని సర్దిచెప్పబోయారు. అయినా వినకుండా మహిళా కౌన్సిలర్‌తో పాటు మరి కొందరు కౌన్సిలర్లు ఉద్యోగిపై తిట్ల దండకం మొదలు పెట్టారు. ఉద్యోగిపై కార్యాలయంలోనే దాడికి యత్నించి, మానసిక స్థైర్యం దెబ్బతీసేలా ప్రవర్తించిన టీడీపీ కౌన్సిలర్ల తీరు పట్ల అక్కడే ఉన్న ప్రజలు అసహ్యించుకోవడం కనిపించింది.
రెస్ట్ హౌస్‌గా చైర్మన్ చాంబర్
టీడీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి చాంబర్‌ను రెస్ట్ హౌస్‌లా వాడుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. వీరు నిత్యం ఉద్యోగుల విధుల్లోకి తలదూర్చడం, వారిని భయపెట్టడం వంటి చర్యలకు పూనుకుంటున్నారన్నది కొందరు మున్సిపల్ ఉద్యోగుల వాదన. ఎవరు ఏ పని చేయాలి.. ఎవరిని కలవాలనేది కూడా కౌన్సిలర్లే తమకు చెబితే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు.
ఆ ఉద్యోగికి పని చేయకున్నా జీతమా..?
మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు, టీడీపీ సానుభూతిపరుడు అయిన రెగ్యులర్ నాన్‌మస్టర్ రోల్ ఉద్యోగి తిరుపాల్‌రెడ్డి పని చేయకున్నా జీతం వస్తోంది. మరి ఆ ఉద్యోగి విధులు ఏవి.. ఎక్కడ పని చేస్తున్నాడు.. వంటి వివరాలను ప్రజలకు తెలిపి ప్రజాధనం దురి్వనియోగం కాకుండా కాపాడాల్సిన బాధ్యత టీడీపీ కౌన్సిలర్లపై లేదా అని ఉద్యోగులు నిలదీస్తున్నారు.
కౌన్సిలర్లపై ఫిర్యాదు
తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు దాడికి యత్నించిన టీడీపీ కౌన్సిలర్ లక్ష్మీదేవితో పాటు మరికొంతమంది కౌన్సిలర్లపై ఆర్‌ఎన్‌ఎంఆర్ ఉద్యోగి జేసీ సూర్యనారాయణరెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
దాడిని ఖండిస్తూ నిరసన
ఆర్‌ఎన్‌ఎంఆర్ ఉద్యోగిపై దాడికి యతి్నంచి, మానసిక స్థైర్యం దెబ్బతీసేలా టీడీపీ కౌన్సిలర్ జింకా లక్ష్మీదేవి, మరికొందరు ప్రవర్తించిన తీరుపై మున్సిపల్ ఉద్యోగులు శనివారం నిరసన తెలిపారు. దురుసుగా మాట్లాడిన కౌన్సిలర్ లక్ష్మీదేవిపై చర్యలు తీసుకోవాలని కార్యాలయ మేనేజర్ రాజేశ్వరీబాయికి ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు. చర్యలు తీసుకోకుంటే మున్సిపల్ సేవలు స్తంభింపజేసేందుకు సైతం వెనుకాడబోమని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment