ఎక్కడి చెత్తఅక్కడే
సమ్మెలో కాంట్రాక్టు కార్మికులు
మురికి కూపాలుగా మున్సిపాలిటీలు
జిల్లావ్యాప్తంగా 3,918 మంది సమ్మెలోనే
గతి తప్పిన పారిశుధ్యం
జిల్లాలోని మున్సిపాలిటీల్లో పారిశుధ్యం గతి తప్పింది. వీధుల్లో ఎక్కడి చెత్త అక్కడే కనిపిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు నిరవధిక సమ్మె కొనసాగిస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. గత అక్టోబరులో వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కార్మికులు ఆందోళన బాట పట్టారు.
నూజివీడు, న్యూస్‌లైన్ :
దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ అనుబంధ సంస్థ అయిన జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి మున్సిపల్ కాంట్రాక్టు పారిశుధ్య సిబ్బంది నిరవధిక సమ్మెకు దిగారు. గతేడాది అక్టోబర్‌లో నాలుగురోజుల పాటు సమ్మె చేసిన నేపథ్యంలో అప్పట్లో ప్రభుత్వం దిగివచ్చి సమస్యలను పరిష్కరిస్తామని, త్వరలోనే జీవో జారీ చేస్తామని హామీ ఇచ్చింది. మూడునెలలవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాంట్రాక్టు కార్మికులు మళ్లీ సమ్మెకు దిగారు. జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీలైన నూజివీడు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, ఉయ్యూరు, నందిగామ, తిరువూరులతో పాటు విజయవాడ నగరపాలక సంస్థలో కూడా కాంట్రాక్టు కార్మికుల సమ్మె కొనసాగుతోంది. వీటిల్లో పనిచేస్తున్న దాదాపు 3,918 మంది కార్మికులు సమ్మెకు దిగడంతో పట్టణాల్లోని వీధులన్నీ చెత్తాచెదారంతో దర్శనమిస్తున్నాయి.
రెగ్యులర్ కార్మికులు ఉన్నా...
రెగ్యులర్ కార్మికులు విధుల్లోనే ఉన్నా వారి సంఖ్య నామమాత్రంగా ఉండటంతో పారిశుధ్యం మెరుగయ్యే అవకాశాలు కనిపించటం లేదు. నూజివీడులోనే చూస్తే 130 మంది కాంట్రాక్టు కార్మికులు ఉండగా, రెగ్యులర్ కార్మికులు 15 మంది మాత్రమే ఉన్నారు. దీంతో పురపాలక సంఘాలలో రోడ్లు ఊడ్చటం, చెత్తచెదారం ఎత్తి డంపింగ్ యార్డుకు తరలించడం, డ్రైనేజీలలో చెత్తాచెదారాన్ని తొలగించడం, అపరిశుభ్రంగా ఉన్నచోట బ్లీచింగ్, క్రిమిసంహారక మందులను చల్లడం వంటి పనులన్నీ చేయడం వీరికి కష్టసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడే చెత్త పేరుకుపోతోంది. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. మున్సిపల్ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
వ్యాధుల బెడద...
ఒక్క నూజివీడు పట్టణంలోనే రోజుకు 25 టన్నుల చెత్త వస్తున్న నేపథ్యంలో నాలుగు రోజుల్లో ఎంత చెత్త పట్టణంలో పేరుకుపోయిందో ఊహిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితే జిల్లాలోని అన్ని పట్టణాల్లోనూ ఉంది. నందిగామలో 70 మంది, గుడివాడలో 140 మంది, నూజివీడులో 130 మంది, పెడనలో 45 మంది, మచిలీపట్నంలో 322 మంది, జగ్గయ్యపేటలో 140 మంది, తిరువూరులో 30 మంది, ఉయ్యూరులో 45 మంది చొప్పున పారిశుధ్య కాంట్రాక్టు కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. విజయవాడ నగరంలో దాదాపు మూడువేల మంది సమ్మె చేస్తున్నారు. ఇదే పరిస్థితి మరికొద్దిరోజులు కొనసాగితే వ్యాధులు ప్రబలే ప్రమాదముందని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
మరింత ఉధృతం చేస్తాం
ప్రభుత్వం దిగిరాకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తాం. కార్మికుల న్యాయమైన 1డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేవరకు సమ్మె కొనసాగుతుంది. కార్మికులకు ఇచ్చే వేతనాలను పెంచాల్సిందే. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా మోసం చేయాలని చూస్తోంది.
- శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు