పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న బాధితులు
బొమ్మలసత్రం (నంద్యాల): రూ.లక్ష అప్పు తీర్చలేదని ఇద్దరు మహిళలపై మున్సిపల్ ఉద్యోగి సైకిల్ చైన్, కత్తితో కిరాతకంగా దాడి చేశాడు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణ శివార్లలోని వైఎస్సార్ నగర్‌లో చోటుచేసుకున్న ఈ దారుణం వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాలకు చెందిన సామేలు స్థానిక ప్రభుత్వ కళాశాలలో అటెండర్‌గా పనిచేస్తూ పదేళ్ల క్రితం చనిపోయాడు. అతని భార్య మరియమ్మ ఒక కుమార్తె, ఇద్దరు కుమారులను కష్టపడి పోషించింది. ఇద్దరు కుమారులు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. కుమార్తె స్వప్న మానసిక వికలాంగురాలు. మరియమ్మ పిల్లల చదువు కోసం గత ఏడాది ఏప్రిల్‌లో మున్సిపల్ ఉద్యోగి శేషన్న వద్ద రూ.లక్ష అప్పు తీసుకుంది. రూ.4 వడ్డీతో అప్పు తీసుకున్న ఆమె.. కూలి పనులకు వెళ్లగా వచ్చిన డబ్బుతో కొంత మేర వడ్డీ చెల్లించింది.
మూడు నెలలుగా స్వప్న ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు. దీంతో వడ్డీ చెల్లించడం మరియమ్మకు భారంగా మారింది. ఈ నేపథ్యంలో వడ్డీ, అసలు చెల్లించాలని వారం రోజులుగా శేషన్న వేధించడం మొదలుపెట్టాడు. మూడు నెలలు గడువు కావాలని కోరినా అతను అంగీకరించలేదు. ఈ క్రమంలో ఆదివారం ఇంట్లో ఉన్న మరియమ్మ, స్వప్నపై సైకిల్ చైన్, కత్తితో దాడికి పాల్పడ్డాడు. దెబ్బలు భరించలేక బాధితులు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని అడ్డుకోబోయారు. దీంతో వారిపైనా దాడికి ప్రయత్నించాడు. స్థానికుల సమక్షంలో బాధితులపై రెండోసారి కూడా దాడి చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గాయాలతో పడి ఉన్న తల్లి, కుమార్తెను స్థానికులు చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నంద్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment