
కడియం: తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలో ప్రేమోన్మాది దాడికి తెగబడ్డాడు. యువతితో పాటు ఆమె అక్క, తల్లిపై దాడి చేసి గాయపర్చాడు. పొట్టిలంక గ్రామానికి చెందిన దాసరి వెంకటేష్ కడియపులంకకు చెందిన యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ నెల 20న యువతి తండ్రికి ఫోన్ చేసి.. నీ చిన్న కుమార్తె నన్ను ప్రేమించకుంటే చంపేస్తా.. అంటూ బెదిరించాడు.
అనంతరం శుక్రవారం రాత్రి యువతి ఇంటికి వెళ్లాడు. యువతితో పాటు, ఆమె అక్క, తల్లిపై సుత్తితో దాడి చేసి గాయపర్చాడు. వెంట తెచ్చుకున్న బ్లేడుతో తన మెడ, చేతిపై గాయపర్చుకున్నాడు. తల్లి, ఇద్దరు కుమార్తెలను బంధువులు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, వెంకటేష్‌ను అతడి స్నేహితులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కడియం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రభుత్వాస్పత్రిలో ఉన్న బాధితులను వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం రూరల్ కో ఆర్డినేటర్ చందననాగేశ్వర్, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి పరామర్శించారు. ఇదిలా ఉండగా నిందితుడు దాసరి వెంకటేష్ జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడని, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ అనుచరుడని గ్రామస్తులు చెబుతున్నారు.