కోజికోడ్: కేరళలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కదిలే రైలులో తన తోటి ప్రయాణికుడికి నిప్పటించగా.. బోగీలోని మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. అయితే ఇదే ఘటనలో.. పట్టాలపై పడి మరో ముగ్గురు చనిపోయారు. ఇందులో ఏడాది చిన్నారి ఉండడం గమనార్హం.
ఆదివారం రాత్రి పది గంటల ప్రాంతంలో.. అలప్పుజ్జా కన్నూర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైల్‌లో ఈ ఘోరం జరిగింది. రైలు కోరాపుళ రైల్వే బ్రిడ్జి వద్దకు చేరుకోగానే.. గుర్తు తెలియని ఓ వ్యక్తి తన తోటి ప్యాసింజర్‌కు నిప్పటించాడు. ఆ మంటలు వ్యాపించి పక్కనే ఉన్న ఎనిమిది మంది ప్రయాణికులకు గాయలయ్యాయి. ఇది గమనించిన తోటి ప్రయాణికులు చెయిన్ లాగి.. సహాయం కోసం రైల్వేసిబ్బందికి ఫోన్ చేశారు. ఈ గ్యాప్‌లో నిందితుడు అక్కడి నుంచి తప్పించుకోగా.. గాయపడిన వాళ్లను ఆంబులెన్స్‌ల ద్వారా ఆస్పత్రికి తరలించారు.
ఆపై రైలు కన్నూర్‌కి చేరుకోగా, ఓ మహిళ, చిన్నారి కనిపించకుండా పోయారనే ఫిర్యాదు అందింది. దీంతో.. వాళ్ల కోసం గాలింపు చేపట్టగా.. ఎళథూరు రైల్వే స్టేషన్ సమీపంలోని పట్టాల మీద సదరు మహిళ, ఏడాది వయసున్న చిన్నారితో పాటు మరో వ్యక్తి మృతదేహం లభ్యమయ్యాయి.
మంటల్ని చూసి భయంతో రైలు నుంచి దూకేయడమో లేదంటే ప్రమాదవశాత్తూ వాళ్లకు కిందపడిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆ మహిళ, ఆ చిన్నారికి బంధువని తేలింది. మరో వ్యక్తిని గుర్తించాల్సి ఉంది. దారుణానికి తెగబడిన వ్యక్తిగా అనుమానిస్తున్న వ్యక్తిని సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించి.. ట్రేస్ చేసే పనిలో ఉన్నారు పోలీసులు.
Comments
Please login to add a commentAdd a comment