సాక్షి, అనంతపురం : ‘సమైక్య’ పరిరక్షణకు జిల్లా వాసులు సమష్టిగా కదం తొక్కుతున్నారు. ఫలితంగా 77వ రోజైన మంగళవారం కూడా జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్ర పరిర క్షణ ఉద్యమం ఉధృతంగా కొనసాగింది. అనంతపురం నగరంలో పంచాయతీరాజ్, మునిసిపాలిటీ ఉద్యోగులు, న్యాయవాదులు, వైఎస్సార్‌సీపీ శ్రేణుల రిలే దీక్షలు కొనసాగాయి.
కేంద్ర మంత్రులు సీమాంధ్ర ద్రోహులంటూ అనంతపురం నగర పాలక సంస్థ ఉద్యోగులు స్థానిక సప్తగిరి సర్కిల్‌లో మెడకు ఉరి తగిలించుకుని నిరసన తెలిపారు. సర్వజనాస్పత్రి వైద్యులు సమ్మె బాట వీడకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఎస్కేయూలో జేఏసీ నాయకుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బ, రాయదుర్గం, గుంతకల్లు, గుత్తి, పామిడిలో జేఏసీ, వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యాన రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోనియా గాంధీని రావణుడితో పోలుస్తూ ప్రదర్శన నిర్వహించారు. సోనియా తలకు అటూ ఇటూ కేంద్ర మంత్రుల తలలు ఉన్నట్లు రూపొందించిన ఫ్లెక్సీని దహనం చేశారు. సప్తగిరి కళాశాల విద్యార్థులు స్థానిక రాజీవ్ సర్కిల్‌లో రోడ్డుపైనే చదువుతూ నిరసన తెలిపారు.
కదిరిలోని అంబేద్కర్ సర్కిల్‌లో స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్ష చేపట్టారు. వీరికి పలువురు నాయకులు, ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నేతలు మద్దతు తెలిపారు. సమైక్యాంధ్ర కోసం గ్రామగ్రామాన అలుపెరుగని పోరు కొనసాగించాలని వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త ఎస్‌ఎండీ ఇస్మాయిల్ పిలుపునిచ్చారు. తలుపులలో సమైక్యవాదులు రోడ్డుపైనే గడ్డం గీయించుకుని నిరసన తెలిపారు. కళ్యాణదుర్గంలో ఎన్‌జీఓల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యవాదులు పట్టణంలో టీ అమ్ముతూ నిరసన వ్యక్తం చేశారు. జేఏసీ నాయకులు భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు.
మడకశిరలోని సాయిబాబా ఆలయంలో జేఏసీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. రోడ్డుపై బుట్టలు అల్లుతూ.. విక్రయిస్తూ ఆందోళన చేపట్టారు. పెనుకొండలో వేపచెట్లపెకైక్కి నిరసన తెలిపారు. పంచాయతీరాజ్ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గోరంట్లలో జేఏసీ నాయకులు భారీ ర్యాలీ, మానవహారం చేపట్టారు. రాయదుర్గంలో ఎన్‌జీఓల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలకు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మద్దతు ప్రకటించారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఆర్టీసీ కార్మికుల జేఏసీ నూతన కమిటీని ఎన్నుకున్నారు. కణేకల్లు, డీహీరేహాళ్‌లో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. తాడిపత్రిలో ఉపాధ్యాయులు, ఇంజనీరింగ్ విద్యార్థుల రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. జేఏసీ నాయకులు కుర్చీలను తలపై అడ్డంగా పెట్టుకుని నిరసన తెలిపారు. ఉరవకొండలో 17,18,19 తేదీలలో తలపెట్టిన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడిని విజయవంతం చేయాలని జేఏసీ పిలుపునిచ్చింది. రాష్ట్ర విభజన జరిగితే వలసలు తప్పవంటూ బెళుగుప్పలో జేఏసీ నాయకులు వినూత్న నిరసన తెలిపారు.
విభజనాగ్ని
Published Wed, Oct 16 2013 2:34 AM | Last Updated on Tue, Oct 16 2018 6:47 PM
Advertisement
Advertisement