
మిలటరీని దించినా మమ్మల్ని ఆపలేరు
మిలటరీని దించినా తమను మాత్రం సమ్మె చేయకుండా ఆపలేరని ఏడు మునిసిపల్ పారిశుధ్య కార్మిక సంఘాల జేఏసీ స్పష్టం చేసింది. తమ డిమాండ్లను పూర్తిగా నెరవేర్చేంత వరకు సమ్మెను ఆపేది లేదని కార్మికుల సంఘాల నాయకులు తెలిపారు. ప్రభుత్వ బెదిరింపులకు తాము భయపడేది లేదని, సమ్మెను మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఎంతమంది ప్రైవేటు కార్మికులను పెట్టుకుని పని చేయిస్తారో కూడా తాము చూస్తామన్నారు.
గత ఏడు రోజులుగా మునిసిపల్ పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తుండటంతో రాజధాని హైదరాబాద్ సహా పలు నగరాలు మొత్తం చెత్తమయంగా మారిపోయాయి. ప్రధాన వీధులు సహా.. అన్ని ప్రాంతాల్లో పెద్దఎత్తున చెత్త పేరుకుపోయింది. ప్రస్తుతానికి వర్షాలు లేవు గానీ.. ఒక్క వర్షం పడిందంటే ప్రజారోగ్యానికి భారీ ముప్పు పొంచి ఉన్నట్లే. అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు ఎవరి పట్టుదలతో వాళ్లు ఉండటంతో సమ్మె వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు.