మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న దేవాంగులు, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు
బొబ్బిలి : పట్టణంలోని 8వ వార్డులోని శివాలయం వీధి వద్ద ఉన్న కూర్మయ్య బందలో ఆక్రమణలు వెంటనే తొలగించాలని రామలింగేశ్వర దేవాంగుల సంక్షేమ సంఘం ధర్నా నిర్వహించింది. సంఘ సభ్యులకు పట్టణ పౌరసంక్షేమ సంఘం సంఘీభావంగా రావడంతో మున్సిపల్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్నూరు శంకరరావు మాట్లాడుతూ కూర్మయ్య బంద పూర్వం నుంచి స్మశాన వాటికగా ఉపయోగించుకునే వారమన్నారు. ఆ తరువాత ఇక్కడి చెరువు గట్టుపై అధికారులు ఇచ్చిన పట్టాలతో ఇళ్లను నిర్మించుకున్నారన్నారు. అధికారులు 30–10 వెడల్పుతో పట్టాలు ఇస్తే సుమారు వంద అడుగుల వరకూ ఇళ్ల నిర్మాణం చేపట్టి స్మశానం ముందుకు వచ్చేశారని సంఘం సభ్యులు ఆరోపించారు. స్మశానంగా వాడుకునే చెరువు గర్భంలోకి ఇళ్ల నిర్మాణంతో వాడుకున్నది కాక ఇప్పుడు స్మశాన నిర్మాణాన్ని అడ్డుకోవడం ఏమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇళ్లను, నిర్మించుకున్న కొలతలను పరిశీలించాలని వారు డిమాండ్ చేశారు.
తహసీల్దార్ పరిశీలన..
పట్టణంలోని స్మశాన వాటిక నిర్మాణానికి ఆక్రమణ దారులే అడ్డుపడుతున్నారని తహసీల్దార్‌కు వినతిపత్రం ఇవ్వడంతో తహసీల్దార్ సాయికృష్ణ తన సిబ్బందితో వచ్చి పరిశీలన చేశారు. స్థలం ఎంత వరకు ఉంది? అక్కడ ఇళ్లను ఎంత వరకు నిర్మించుకున్నారన్న విషయం పరిశీలించారు. దీనిపై పూర్తి స్థాయిలో అందరినీ విచారించి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. మాకు స్మశాన వాటికను నిర్మించి ఇవ్వాలని స్థానికులు కోరారు. వి ఇందిర, జాడ గోవింద రావు, కే పార్వతీశం, ఆదెం అప్పారావు, సర్వేశ్వరరావు, బాబ్జీ, బల్ల శంకరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment