Siva temple
-
మహిమాన్వితమైన సూగూరేశ్వర ఆలయం!..ఎక్కడ లేని విధంగా రథోత్సవం..
కర్ణాటక రాష్ట్రం శైవాలయాలకు, శివభక్తులకు పుట్టినిల్లు. ఏ మారుమూల గ్రామాలకెళ్లిన శివాలయాలు దర్శనమిస్తాయి. రాయచూరు నుంచి 20 కి.మీ దూరంలో సూగూరేశ్వర దేవాలయం ప్రసిద్ధి చెందింది. కృష్ణా నది పక్కనే 11వ శతాబ్దంలో వెలిశాయని శిలా శాసనాలు చెబుతున్నాయి. శివుని కొడుకుగా పిలువబడే వీరభద్రేశ్వరుడు వెలిశాడు. విజయనగర సామ్రాజ్యాధిపతులైన ప్రౌఢ దేవరాయలు గుడి నిర్మాణం చేపట్టారు. ప్రభువు అసర వీర ప్రతాప దేవరాయలు పూర్తి చేశారు. కొల్హాపుర దేవస్థాన రాజవంశస్థుడైన బసవంతు ప్రభు కుష్టు రోగంతో బాధపడుతుండగా సూగూరేశ్వరుడు ప్రభు కలలో కనిపించి తనను దర్శించుకుంటే వ్యాధి నయం అవుతుందని ఆజ్ఞాపించారు. రోగం నయం కావడంతో ప్రభు గర్భగుడిని నిర్మించారు. పిల్లలు పుట్టని దంపతులు దర్శించుకుంటే సంతానం కలుగుతుందని నమ్మకం గట్టిగా నెలకొంది. దేవాలయం ప్రవేశ ద్వారంలో దక్షిణామూర్తిగా వెలసిన శాంత మూర్తిగా దర్శనమివ్వడం భక్తులను ఆకట్టుకుంది. ధ్యాన మండపంలో విజ్ఞాలు కలగకుండా విఘ్నేశ్వరాలయం ఉంది. ప్రతి నిత్యం త్రికాల పూజలు స్వామి జాతర, రథోత్సవాలు రెండున్నాయి. దక్షిణ, తూర్పు, పడమరల్లో వెలసిన గోపురాల్లో దేవుళ్లను ఏర్పాటు చేయడం ఆకర్షణగా ఉంది. పడమరలో గోపురం వెలిస్తే దేవాలయం అభివృద్ధి చెందుతుందనే విశ్వాసం ఉంది. ఉదయం 5, మధ్యాహ్నం 11, రాత్రి 8 గంటలకు ప్రత్యేక త్రికాల పూజలు చేస్తారు. ప్రతి సోమ, గురువారం బెల్లం తేరులో ఊరేగింపు, పల్లకీ సేవలు నిర్వహిస్తారు.అభిషేకంతో పాటు మహా, కాశీ, నంద, ఆకుల, పువ్వుల, అక్షర, పల్లకీ, ఊయల పూజలు చేస్తారు. ప్రతి నిత్యం రెండు వందల మందికి ఉచిత ప్రసాదం, సోమ, గురువారం అమావాస్య రోజున 1000 మందికి భోజనం ఏర్పాటు దేవాలయం కమిటీ నిర్దారించారు. పెళ్లి చేసుకోవడానికి దాస సాహిత్య మండపం ఉంది. పేదలకు ఎలాంటి డబ్బులు లేకుండా ఉచితంగా కేటాయిస్తామని అధికారి సురేష్ వర్మ తెలిపారు.7న జోడు రథోత్సవాలు: శనివారం దేవసూగూరు సూగురేశ్వరుడి జోడు రథోత్సవాలు జరుగుతాయని దేవాలయ కమిటీ అధికారి అసిస్టెంట్ కమిషనర్ గజానన తెలిపారు. జోడు రథోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ముంబై, తమిళనాడుల నుంచి అధిక సంఖ్యలో పాల్గొంటారు. రథోత్సవానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారి చంద్రశేఖర్ వివరించారు.(చదవండి: మార్గశిర శుద్ధ షష్ఠినే సుబ్రహ్మణ్య షష్ఠి అని ఎందుకు పిలుస్తారు..? ఈ పండుగ విశిష్టత) -
చెరువు గర్భంలో నిర్మించిన ఇళ్లను తొలగించాలి
బొబ్బిలి : పట్టణంలోని 8వ వార్డులోని శివాలయం వీధి వద్ద ఉన్న కూర్మయ్య బందలో ఆక్రమణలు వెంటనే తొలగించాలని రామలింగేశ్వర దేవాంగుల సంక్షేమ సంఘం ధర్నా నిర్వహించింది. సంఘ సభ్యులకు పట్టణ పౌరసంక్షేమ సంఘం సంఘీభావంగా రావడంతో మున్సిపల్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్నూరు శంకరరావు మాట్లాడుతూ కూర్మయ్య బంద పూర్వం నుంచి స్మశాన వాటికగా ఉపయోగించుకునే వారమన్నారు. ఆ తరువాత ఇక్కడి చెరువు గట్టుపై అధికారులు ఇచ్చిన పట్టాలతో ఇళ్లను నిర్మించుకున్నారన్నారు. అధికారులు 30–10 వెడల్పుతో పట్టాలు ఇస్తే సుమారు వంద అడుగుల వరకూ ఇళ్ల నిర్మాణం చేపట్టి స్మశానం ముందుకు వచ్చేశారని సంఘం సభ్యులు ఆరోపించారు. స్మశానంగా వాడుకునే చెరువు గర్భంలోకి ఇళ్ల నిర్మాణంతో వాడుకున్నది కాక ఇప్పుడు స్మశాన నిర్మాణాన్ని అడ్డుకోవడం ఏమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇళ్లను, నిర్మించుకున్న కొలతలను పరిశీలించాలని వారు డిమాండ్ చేశారు. తహసీల్దార్ పరిశీలన.. పట్టణంలోని స్మశాన వాటిక నిర్మాణానికి ఆక్రమణ దారులే అడ్డుపడుతున్నారని తహసీల్దార్‌కు వినతిపత్రం ఇవ్వడంతో తహసీల్దార్ సాయికృష్ణ తన సిబ్బందితో వచ్చి పరిశీలన చేశారు. స్థలం ఎంత వరకు ఉంది? అక్కడ ఇళ్లను ఎంత వరకు నిర్మించుకున్నారన్న విషయం పరిశీలించారు. దీనిపై పూర్తి స్థాయిలో అందరినీ విచారించి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. మాకు స్మశాన వాటికను నిర్మించి ఇవ్వాలని స్థానికులు కోరారు. వి ఇందిర, జాడ గోవింద రావు, కే పార్వతీశం, ఆదెం అప్పారావు, సర్వేశ్వరరావు, బాబ్జీ, బల్ల శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
మీ పాపాలు మటాష్.. ఇదిగో సర్టిఫికెట్!
పాపాలు చేశామన్న భయంతోనే చాలామంది రకరకాల మందిరాల చుట్టూ తిరుగుతుంటారు. అయితే, అలా వెళ్లినంత మాత్రాన పాపం పోతుందని గ్యారంటీ ఏంటని అడిగేవాళ్లు కూడా లేకపోలేరు. అందుకే రాజస్థాన్‌లోని ఓ ఆలయంలోని కొలనులో స్నానం చేసి, రూ. 11 దక్షిణ ఇస్తే చాలు.. పాపాల నుంచి పూర్తిగా విముక్తి లభించినట్లు ఓ సర్టిఫికెట్ కూడా ఇస్తారట. ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఉన్న గోమఠేశ్వర్ మహాదేవ పాపమోచన్ తీర్థ అనే అనే శివాలయంలో మాత్రం పాపముక్తి సర్టిఫికెట్ కూడా ఇస్తున్నారట. అది కూడా ఈమధ్య వచ్చింది కాదు.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అక్కడ గల మందాకినీ కుండంలో స్నానం చేసి, శివాలయంలో పూజలు చేసుకుని వస్తే వాళ్లకు పాపవిముక్తి సర్టిఫికెట్లు ఇస్తున్నారు. సర్టిఫికెట్ ఖరీదు కేవలం ఒక్క రూపాయేనట. మిగిలిన 10 రూపాయలు దోషనివారణ కోసం అని చెబుతున్నారు. చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికొచ్చి, పాపముక్తి సర్టిఫికెట్లు తీసుకుని వెళ్తున్నట్లు ప్రధానార్చకుడు నందకిశోర్ శర్మ చెబుతున్నారు. ఈ ఆలయానికి గిరిజనుల హరిద్వార్‌గా గుర్తింపు ఉంది. కొన్ని శతాబ్దాలుగా ఇక్కడకు భక్తుల రాకపోకలు బాగున్నాయని ముఖ్యంగా గిరిజనులు పెద్ద సంఖ్యలో వస్తారని అంటున్నారు. ప్రధానంగా మే నెలలో నిర్వహించే గోమఠేశ్వర తీర్థానికి లక్షల్లో భక్తులు వస్తారని శర్మ తెలిపారు. ఇటీవలి కాలంలో భక్తుల సంఖ్య పెరిగినా, సర్టిఫికెట్లు తీసుకునేవాళ్లు మాత్రం తగ్గారట. ఈసారి మేలో జరిగిన 8 రోజుల తీర్థంలో దాదాపు రెండు లక్షల మంది పాల్గొన్నా, కేవలం మూడు సర్టిఫికెట్లు మాత్రమే ఇచ్చారు. రైతులు వ్యవసాయం చేసేటపుడు చాలా రకాల కీటకాలు చనిపోతాయని, వాళ్లు పాపభీతితో బాధపడుతూ ఇక్కడికొచ్చి పాపవిముక్తి చేసుకుంటారని మరో పూజారి కన్హయ్యలాల్ శర్మ చెప్పారు. -
'షబ్బీర్' కోసం ఆగిన శివ పూజలు
తిరువనంతపురం : మానవత్వానికి మతంతో సంబంధం లేదని చాటి చెప్పిన ఉదంతమిది. దుండగుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన ముస్లిం యువకుడు షబ్బీర్ (20)కు నివాళిగా స్థానిక శివాలయం అధికారులు స్పందించిన తీరు ఆసక్తికరంగా మారింది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ ఉదంతం పలువురి అభిమానానికి పాత్రమైంది. మరోవైపు మృతుడు షబ్బీర్‌కు సంబంధించి మరో కోణం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే ఒక కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న పాపానికి ఉన్మాదులు పొట్టనపెట్టుకున్న షబ్బీర్ స్థానిక శివాలయానికి సంబంధించిన వార్షిక ఉత్సవాల్లో చురుగ్గా పాల్గొనేవాడట. ప్రతి సంవత్సరం నిర్వహించే ఉత్సవాల నిర్వహణలో నిబద్ధతతో పనిచేసేవాడట. ఈ క్రమంలో షబ్బీర్ అకాల మరణ వార్త విన్న అలయ అధికారులు హతాశులయ్యారు. అతని మృతికి సంతాపం తెలుపుతూ సదరు ఆలయంలో రెండురోజులపాటు అన్ని పూజలను నిలిపివేయాలని దేవస్థాన పరిపాలక కమిటి నిర్ణయించింది. గుడిలో దీపం వెలగొద్దు... గుడి గంట మోగవద్దని తీర్మానించారు. గడిచిన సోమ, మంగళవారాల్లో దీపారాధాన, తీర్థప్రసాదాలను నిలిపివేశారు. రోజుకు అయిదు రకాల పూజలు నిర్వహించే దేవాలయంలో ముస్లిం యువకునికి గౌరవ సూచకంగా రెండు రోజుల పాటు పూజలు నిలిపివేయడం విశేషంగా నిలిచింది. కాగా గత ఆదివారం పట్టపగలు నడిరోడ్డుపై షబ్బీర్‌ను కొట్టి చంపిన వీడియో సంచలనం రేపింది. అయితే బాధితుడిని రక్షించడం కష్టం అని నిర్ణయించుకున్న తర్వాతే ఈ దృశ్యాలు రికార్డు చేసినట్టు తెలుస్తోంది. కనీసం సాక్ష్యంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే అలా చేసినట్టు సమాచారం. ఈ వీడియో ఆధారంగానే పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.