'షబ్బీర్' కోసం ఆగిన శివ పూజలు
తిరువనంతపురం : మానవత్వానికి మతంతో సంబంధం లేదని చాటి చెప్పిన ఉదంతమిది. దుండగుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన ముస్లిం యువకుడు షబ్బీర్ (20)కు నివాళిగా స్థానిక శివాలయం అధికారులు స్పందించిన తీరు ఆసక్తికరంగా మారింది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ ఉదంతం పలువురి అభిమానానికి పాత్రమైంది. మరోవైపు మృతుడు షబ్బీర్కు సంబంధించి మరో కోణం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే ఒక కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న పాపానికి ఉన్మాదులు పొట్టనపెట్టుకున్న షబ్బీర్ స్థానిక శివాలయానికి సంబంధించిన వార్షిక ఉత్సవాల్లో చురుగ్గా పాల్గొనేవాడట. ప్రతి సంవత్సరం నిర్వహించే ఉత్సవాల నిర్వహణలో నిబద్ధతతో పనిచేసేవాడట. ఈ క్రమంలో షబ్బీర్ అకాల మరణ వార్త విన్న అలయ అధికారులు హతాశులయ్యారు. అతని మృతికి సంతాపం తెలుపుతూ సదరు ఆలయంలో రెండురోజులపాటు అన్ని పూజలను నిలిపివేయాలని దేవస్థాన పరిపాలక కమిటి నిర్ణయించింది. గుడిలో దీపం వెలగొద్దు... గుడి గంట మోగవద్దని తీర్మానించారు. గడిచిన సోమ, మంగళవారాల్లో దీపారాధాన, తీర్థప్రసాదాలను నిలిపివేశారు. రోజుకు అయిదు రకాల పూజలు నిర్వహించే దేవాలయంలో ముస్లిం యువకునికి గౌరవ సూచకంగా రెండు రోజుల పాటు పూజలు నిలిపివేయడం విశేషంగా నిలిచింది.
కాగా గత ఆదివారం పట్టపగలు నడిరోడ్డుపై షబ్బీర్ను కొట్టి చంపిన వీడియో సంచలనం రేపింది. అయితే బాధితుడిని రక్షించడం కష్టం అని నిర్ణయించుకున్న తర్వాతే ఈ దృశ్యాలు రికార్డు చేసినట్టు తెలుస్తోంది. కనీసం సాక్ష్యంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే అలా చేసినట్టు సమాచారం. ఈ వీడియో ఆధారంగానే పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.