‘రేయ్..ఎక్కడ పండ్లు అమ్ముకునేది.. బండితీయ్... ట్రాఫిక్ చూడు ఎలా ఉందో... ‘ఏమయ్యా! ఎన్నిసార్లు చెప్పాలి అంగడి ఎదురుగా బండిపెట్టకూడదని.. ఫో.. పక్కకు ఫో!’... తోపుడుబండ్ల వ్యాపారులకు పోలీసులు, వ్యాపారదుకాణాల యజమానుల నుంచి నిత్యం వచ్చే హెచ్చరికలు ఇవి.
తోపుడు బండి నడిస్తేగానీ వారి బతుకుబండి నడవదు. ఆటుపోట్ల మధ్య జీవన ప్రయాణం చేస్తున్న తోపుడుబండ్ల వ్యాపారులకు మంచిరోజులు వచ్చాయి. వారికి గుర్తింపుకార్డులను ఇవ్వనున్నారు. స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకునే వెసులుబాటుతో పాటు ఆర్థికంగా ఆదుకునేందుకు రుణాలను ఇవ్వనున్నారు. లోక్‌సభతో పాటు రాజ్యసభలో కూడా ‘వీధివ్యాపారుల ’బిల్లుకు ఆమోదముద్రపడింది.
సాక్షి, కడప: పట్టణాల్లోఎక్కడ తోపుడు బండి పెట్టినా పోలీసులు, మునిసిపల్ అధికారులు, సమీపంలోని భవన యజమానులతో ఇబ్బందులు ఉండేవి. ఇకపై అలాంటి పరిస్థితి ఉండబోదు. వీరికి ప్రత్యేమైన గుర్తింపునిచ్చే ‘వీధివ్యాపారుల’ బిల్లును బుధవారం రాజ్యసభలో ఆమోదించారు. గత సెప్టెంబరు 6న లోక్‌సభలో కూడా ఈబిల్లు ఆమోదం పొందింది. బిల్లుపై రాష్ట్రపతి ఆమోదముద్రపడటమే తరువాయి. బిల్లుఆమోదంతో దశాబ్దాల కాలంగా ఒకే ప్రాంతంలో వ్యాపారం చేస్తున్న వారి జీవన స్థితిగతులు మెరుగుపడనున్నాయి. వీరి వ్యాపారాలకు దన్నుగా నిలిచేందుకు పట్టణ పేదరిక నిర్మూలన విభాగం కూడా చర్యలకు ఉపక్రమించింది. జిల్లాలో కడప కార్పొరేషన్‌తో పాటు ప్రొద్దుటూరు, రాయచోటి, రాజంపేట, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల, మైదుకూరు మునిసిపాలిటీలు ఎర్రగుంట్ల నగరపంచాయతీ ఉంది.
వీటిలో ఇప్పటికే తోపుడుబండ్ల వ్యాపారుల గుర్తింపుపై ప్రత్యేక సర్వే పూర్తయింది. కడప కార్పొరేషన్‌తో పాటు అన్ని పట్టణప్రాంతాల్లో 9,30,699 మంది జనాభా ఉన్నారు. వీరిలో దాదాపు 7,650మంది తోపుడు బండ్లవ్యాపారులు ఉండొచ్చని అంచనా. వీరితో పాటు జిల్లాలోని మండల కేంద్రాల్లో మరో 3వేలమందిదాకా ఉండొచ్చు. వీరిలో చాలా కాలంగా ఒకేచోట వ్యాపారం చేసుకునేవారు 60 శాతం ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఎక్కువమంది పండ్లు, ఇడ్లీ, పాస్ట్‌ఫుడ్(పానీపూరీ, గోబీ, వడలు, బజ్జీలు) తదితరాలను విక్రయిస్తుండగా కొందరు కులవృత్తులతో పాటు ఇతర వ్యాపారాలు చేస్తున్నారు. వీరంతా మునిసిపాలిటీలకు రోజూ నిర్ణీత రుసుం చెల్లిస్తున్నారు. అయినా సరైన భద్రత లేని పరిస్థితి. ట్రాఫిక్ సమస్య తలెత్తిన ప్రతిసారీ పోలీసుల ప్రతాపానికి గురవుతుంటారు. ఈ బిల్లుచట్టమైతే ఇకపై ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవు.
ప్రత్యేక కమిటీల ఆధ్వర్యంలో..
నగర, పురపాలక సంస్థ పరిధిలో ఉన్న వీధివ్యాపారులకు రేషన్, వాటర్, ఆధార్, ఓటర్ వంటి గుర్తింపు కార్డు ఉండాలి. దశాబ్దాల కాలానికి మించి ఒకేచోట వ్యాపారం చేస్తున్న వారిని స్వయం సహయక బృందాలుగా ఏర్పాటు చేస్తారు. వారికి బీమా సౌకర్యం కల్పిస్తారు. లక్షలోపు జనాభా ఉన్న మునిసిపాలిటీలో 10మంది, 1.50లక్షలోపు జనాభా ఉన్నచోట 15మంది, 3లక్షల జనాభా ఉంటే 20మందితో ప్రత్యేక కమిటీలు వేస్తారు. ఈ బృందాలు వీధివ్యాపారుల హక్కులతో పాటు వారి వ్యాపార అభివృద్ధికి సహకారం అందిస్తారు.
ఇవీ ప్రయోజనాలు
‘వీధివ్యాపారుల బిల్లు’ చట్టబద్ధం కావడంతో వ్యాపారులందరికీ ధ్రువీకరణపత్రాలు, గుర్తింపుకార్డులు ఇస్తారు. ఏప్రాంతంలో వ్యాపారం చేయాలో అందులో స్పష్టంగా ఉంటుంది. ఆప్రాంతం నుంచి వీరిని ఖాళీచేయించడానికి అధికారులకు అవకాశం ఉండదు.
మెప్మా ఆధ్వర్యంలో తగిన సహాయ సహకారాలు అందించేందుకు కేంద్రప్రభుత్వం విధివిధానాలను సిధ్ధం చేసింది. 2010-11 ఆర్థిక సంవత్సరంలోనే ఈ సర్వేను చేపట్టి వీధి వ్యాపారులను లెక్కించారు. జిల్లాలో పట్టణప్రాంతాల్లోనే దాదాపు 7వేలమంది ఉన్నట్లు తెలుస్తోంది. వ్యాపారుల పూర్తి వివరాలను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. మరో దఫా సర్వే చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతానికి ఎంపిక చేసిన వారికి మాత్రమే సౌకర్యాలు వర్తింపజేయనున్నారు.
గుర్తింపుకార్డులున్న వీధివ్యాపారులను సమూహాలుగా ఏర్పాటు చేసి రుణసదుపాయం ఇచ్చే అవకాశాలున్నాయి. వీరికి ప్రభుత్వ పథకాలను వర్తింప చేస్తారు. ఇళ్ల నిర్మాణం, స్థలాల కేటాయింపు, వ్యక్తిగతరుణాలు, ఇతర సౌకర్యాల కల్పనవంటి ప్రయోజనాలు ఉంటాయి.
మంచి రోజులు
Published Sat, Feb 22 2014 3:06 AM | Last Updated on Tue, Oct 16 2018 6:47 PM
Advertisement
Advertisement