పుర సమరం | To day nominations will be decide | Sakshi
Sakshi News home page

పుర సమరం

Published Mon, Mar 10 2014 2:47 AM | Last Updated on Tue, Oct 30 2018 7:25 PM

To day nominations will be decide

 ఎన్నికల సంగ్రామంలో నేటి నుంచి తొలిఘట్టం మొదలవనుంది. 41 నెలలుగా వాయిదా పడిన ‘పురపోరు’లో నేడు నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. గత ఎన్నికలు కడప కార్పొరేషన్‌తో పాటు ఆరు మున్సిపాలిటీల్లో నిర్వహించారు. 2005 వరకూ కడప, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలు మాత్రమే ఉండేవి. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం పీఠం అధిరోహించిన తర్వాత కడపను కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేయడంతో పాటు జమ్మలమడుగు, రాజంపేట, రాయచోటి, పులివెందుల, బద్వేలును మున్సిపాలిటీల జాబితాలో చేర్చారు. వీటి పాలకవర్గం గడువు ముగిసిన తర్వాత ఎన్నికలు వాయిదా పడ్డాయి. తర్వాత  మునిసిపాలిటీల జాబితాలో మైదుకూరు, ఎర్రగుంట్ల నగరపంచాయతీలు చేరాయి.
 
 దీంతో కడప కార్పొరేషన్‌తో పాటు7 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీల విలీనానికి సంబంధించిన కేసు కోర్టులో నడస్తుండటంతో రాజంపేట ఎన్నికలు వాయిదా పడ్డాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో అన్ని అధ్యక్షస్థానాలను కాంగ్రెస్‌పార్టీ దక్కించుకుంది. తెలుగుదేశం పార్టీకి ఒక్కస్థానం కూడా దక్కలేదు. ప్రస్తుత ఎన్నికల్లో అన్ని మున్సిపాలిటీల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో మూడున్నరేళ్ల తర్వాత జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ముఖచిత్రాలను పరిశీలిద్దాం.
 -  సాక్షి, కడప
 
 జమ్మలమడుగు
 జమ్మలమడుగు మున్సిపాలిటీగా 2005లో అప్‌గ్రేడ్ అయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దీన్ని మున్సిపాలిటీ జాబితాలో చేర్చేలా చొరవచూపారు. జమ్మలమడుగు కూడా వస్త్రవ్యాపారానికి ప్రసిద్ధి. ఇక్కడ చేనేతలు కూడా అధికంగా ఉన్నారు. అద్దకం పరిశ్రమపై ఆధారపడి జీవించేవాళ్లు అధికంగా ఉన్నారు. ఇక్కడ మున్సిపాలిటీని 2005లో కాంగ్రెస్‌పాలక వర్గం దక్కించుకుంది. గత ఎన్నికల్లో బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో బండారు రాగుసుధ చైరపర్సన్‌గా కొనసాగారు. ప్రస్తుతం ఈ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ కూడా మహిళా ఓటర్లే అధికం.
 
 మొత్తం ఓటర్లు:     35,485
 పురుషులు:            17,139
 మహిళలు:    18,346
 వార్డులు:    20
 
 మైదుకూరు
 రెండేళ్ల క్రితం మైదుకూరు మునిసిపాలిటీగా మారింది. ఇక్కడ అమ్మవారిశాలతో పాటు మసీదు, శ్రీ షిర్డిసాయిబాబా ఆలయాలు ప్రసిద్ధి. జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వెళ్లేందుకు ప్రధాన కూడలి మైదుకూరు. ఈ స్థానం బీసీ జనరల్‌కు రిజర్వ్ అయింది. ఇక్కడా మహిళా ఓటర్లే అధికం.
 
 మొత్తం ఓటర్లు:     33,318
 పురుషులు:    16,385
 మహిళలు:    16,933
 వార్డులు:    23
 
 కడప కార్పొరేషన్
 కడప పురపాలికకు వందేళ్లపైబడి చరిత్ర ఉంది. 2005లో కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయింది. జిల్లాలో మొట్టమొదటి మున్సిపాలిటీ కడప. పట్టణం నుంచి నగరంగా ఉన్నతి సాధించిన కడపలోని దేవుని కడపలో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంతో పాటు పెద్దదర్గా, కేథడ్రల్ చర్చి ఉన్నాయి.
 
 నగరంలో ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్నారు. అలాగే రాజస్థాన్ నుంచి వలసలు వచ్చి ఇక్కడే స్థిరపడిన మార్వాడీలు ఓటర్లుగా ఉన్నారు. మహావీర్ దేవస్థానం కూడా నిర్మించారు. కడప కార్పొరేషన్ తొలిమేయర్  స్థానాన్ని కాంగ్రెస్‌పార్టీ మద్దతుతో పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి కైవసం చేసుకున్నారు. కార్పొరేషన్‌లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ప్రస్తుతం మేయర్ స్థానం బీసీ జనరల్‌కు రిజర్వ్ అయింది.
 
 మొత్తం ఓటర్లు:     2,71,532
 పురుషులు:        1,35,216
 మహిళలు:      1,36,280
 ఇతరులు:    36
 వార్డులు:    50
 
 ప్రొద్దుటూరు
 కడప తర్వాత జిల్లాలో మున్సిపాలిటీ హోదా దక్కించుకున్న పట్టణం ప్రొద్దుటూరు. ప్రొద్దుటూ రు పట్టణంలో ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. రామేశ్వరం ముక్తిరామలింగేశ్వరస్వామి దేవస్థానంతో పాటు శ్రీ కన్యకాపరమేశ్వరి కొలువై ఉన్న అమ్మవారిశాల, శివాలయం ఉన్నాయి. పసిడిపురిగా కీర్తిగడించిన ప్రొద్దుటూరులో బంగారు వ్యాపారానికి ప్రసిద్ధి.
 
 ఈ మున్సిపాలిటీని గత ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ దక్కించుకుంది.  ఇరగం మల్లీశ్వరి చైర్‌పర్సన్‌గా రెండున్నరేళ్లు కొనసాగారు. తర్వాత వీఎస్ సైరాభాను చైర్‌పర్సన్ పీ ఠం అధిరోహించారు. ఈమె దీర్ఘకాలిక సెలవులో ఉండటంతో వీఎస్ ముక్తియార్ ఇన్‌చార్జ్ చైర్‌పర్సన్‌గా తక్కిన కాలం కొనసాగారు. ప్రస్తుతం చైరపర్సన్ స్థానం అన్‌రిజర్వ్‌డ్‌గా ఉంది. ఇక్కడ మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు.
 
 మొత్తం ఓటర్లు:     55,159
 పురుషులు:       27,101
 మహిళలు:       28,058
 వార్డులు:      26
 
 రాయచోటి
 రాయచోటి కూడా వైఎస్ హయాంలోనే మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయింది. 2005 ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. అప్పట్లో చైర్మన్ స్థానం బీసీ జనరల్‌కు రిజర్వ్ అయింది. వీరభద్రయ్య తొలి చైర్మన్‌గా ఎన్నిక య్యారు. ఐదేళ్లు ఆయన అధ్యక్షతనే పాలకవర్గం కొనసాగింది. ప్రస్తుతం ఈ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ కూడా మహిళా ఓటర్లే అధికం.
 
 మొత్తం ఓటర్లు:     60,087
 పురుషులు:         30,861
 మహిళలు:       31,226
 వార్డులు:      31
 
 బద్వేలు
  బద్వేలు కూడా వైఎస్ హయాంలోనే మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయింది. అయితే దీనికి మున్సిపల్ ఎన్నికలు ఆలస్యంగా జరిగాయి. దీంతో తక్కిన మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం ముగిసినా బద్వేలు పాలకవర్గం గతేడాది వరకూ కొనసాగింది. గత ఎన్నికల్లో ఆ స్థానం ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ అయింది. బవనాసి మునెయ్య తొలి చైర్మన్‌గా కొనసాగారు. ప్రస్తుతం ఈ స్థానం బీసీ జనరల్‌కు రిజర్వ్ అయింది. ఇక్కడ మహిళా ఓటర్లే అధికం.
 
 మొత్తం ఓటర్లు:     52,401
 పురుషులు:        26,040
 మహిళలు:      26,360
 ఇతరులు:      1
 వార్డులు:      26
 
 ఎర్రగుంట్ల
 ఎర్రగుంట్ల నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ అయింది. నాపరాళ్ల పరిశ్రమకు ఎర్రగుంట్ల ప్రసిద్ధి. సిమెంట్ పరిశ్రమలు కూడా ఎర్రగుంట్ల మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి. ఈ స్థానం బీసీ జనరల్‌కు రిజర్వ్ అయింది.  జమ్మలమడుగు మున్సిపాలిటీతో పాటు ఎర్రగుంట్ల నగర పంచాయతీ కూడా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉంది. జిల్లాలో ఒకే నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు ఉండటం ఇక్కడే. ఇక్కడ కూడా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.
 
 మొత్తం ఓటర్లు:     23,367
 పురుషులు:         11,462
 మహిళలు:       11,905
 వార్డులు:       20
 
 పులివెందుల
 పులివెందుల కూడా వైఎస్ హయాంలోనే మున్సిపాలిటీ హోదా దక్కించుకుంది. ఇది పంచాయతీగా ఉన్న సమయంలో కూడా వైఎస్ మద్దతుదారులే గెలిచారు. 2004లో రాష్ట్రముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ రాజశేఖరరెడ్డి పులివెందుల నుంచే ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. వైఎస్ కుటుంబానికి ఇది కంచుకోటగా కొనసాగుతోంది. గత ఎన్నికల్లో ఈ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయింది.
 
 రుక్మిణీదేవి తొలి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈ స్థానం జనరల్ మహిళకే రిజర్వ్ అయింది. పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.
 
 మొత్తం ఓటర్లు:     55,159
 పురుషులు:        27,101
 మహిళలు:       28,058
 వార్డులు:      26
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement