తెలంగాణ బిల్లును పార్లమెంటులో అడ్డుకోవాలని సమైక్య వాదులు డిమాండ్ చేశారు. కడప, ప్రొద్దుటూరు, రాజంపేటలో ఆదివారం ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు సమైక్య రన్ నిర్వహించారు. సమైక్యోద్యమ గీతాలు, నినాదాలతో హోరెత్తించారు. రాజ్యాంగ వ్యతిరేకమైన బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయడం దారుణమన్నారు. అవసరమైతే చలో పార్లమెంటు కార్యక్రమాన్ని నిర్వహించి బిల్లును అడ్డుకుంటామన్నారు. విభజనతో ప్రతి ఒక్కరూ నష్టపోతారన్నారు.
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లును సీమాంధ్రకు చెందిన ఎంపీలు అడ్డుకోవాలని సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం రాష్ట్ర పిలుపులో భాగంగా మున్సిపల్ స్టేడియం నుంచి అప్సర సర్కిల్, ఆర్టీసీ బస్టాండు, కోటిరెడ్డి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా ఏడురోడ్ల కూడలి వరకు ‘సమైక్య రన్’ నిర్వహించారు. వేలాది మంది విద్యార్థులు, ఎన్జీఓలు, రెవెన్యూ ఉద్యోగులు, ఎయిడెడ్ పాఠశాలల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు, వివిధ ప్రజాసంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దారిపొడవునా సమైక్యోద్యమ గీతాలు, నినాదాలతో హోరెత్తించారు. ప్రదర్శన కారణంగా కొన్నిప్రాంతాల్లో ట్రాఫిక్ కాసేపు ఆగిపోయింది.
పోలీసులు పెద్ద సంఖ్యలో బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్బంగా సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నాయకులు కేవీ శివారెడ్డి, సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి, గోవర్దన్‌రెడ్డి, మంత్రి అహ్మదుల్లా తనయుడు అస్రఫ్ మాట్లాడుతూ సీమాంధ్రుల మనోభావాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం దూకుడుగా పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టేందుకు చర్యలు చేపట్టడం దారుణమన్నారు. హడావుడిగా కేంద్ర కేబినెట్‌తో ఆమోదింపజేసి రాష్ట్రపతికి పంపారన్నారు.
రాజ్యాంగ విరుద్దంగా విభజన ప్రక్రియ సాగుతున్నప్పటికీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి బిల్లును పార్లమెంటుకు పంపేందుకు గుడ్డిగా సంతకం చేయడం దారుణమని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వానికి రబ్బరు స్టాంపులా మారారని ఆరోపించారు. ఈ నేపధ్యంలో అవసరమైతే ఛలో పార్లమెంటు కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా బిల్లును అడ్డుకుంటామని హెచ్చరించారు. విభజన వల్ల ముస్లింలు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాకం అశోక్‌కుమార్, నగర అధ్యక్షుడు నజీర్ అహ్మద్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అద్యక్షుడు వేదనాయకం, కోశాధికారి అలీఖాన్, ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, నిత్య పూజయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేష్‌కుమార్‌రెడ్డి, విద్యార్థి జేఏసీ జిల్లా కన్వీనర్ రవిశంకర్‌రెడ్డి, టీడీపీనాయకులు పీరయ్య, వెంగల్‌రెడ్డి, విద్యా సంస్థల అధినేత రాజోలి వీరారెడ్డి, రామచంద్రారెడ్డి, ఎలియాస్‌రెడ్డి, డాక్టర్ వారణాసి ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విభజన బిల్లును అడ్డుకోండి
Published Mon, Feb 10 2014 2:04 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement