సాక్షి, కడప: జిల్లాలోని పట్టణాలతో పాటు పల్లెల్లో కూడా విభజన చర్చ జోరందుకుంది. రెండురోజులుగా టీకొట్లు.. బస్టాండ్‌లు.. దుకాణాలు... ఎక్కడ నలుగురు ఒకచోట కలిసినా... అందరి నోట ఒకే చర్చ.. రాష్ట్రం విడిపోతుందా.. కలిసుంటుందా.. రాష్ట్రం విడిపోతున్నందుకు ప్రతి ఒక్కరూ తీవ్రంగా బాధపడుతున్నారు. బిల్లు ఆమోదానికి గురైతే రాష్ట్రం విడిపోయే నోట ‘సమైక్య’మాట రాకపోవడం దారుణమని పేర్కొంటున్నారు. విభజనబిల్లుపై 48 రోజులపాటు అసెంబ్లీలో చర్చ జరిగినట్లు సీమ ప్రజలు పేర్కొంటున్నారు.రాష్ట్రం విడిపోతే తెలంగాణకు, కోస్తా ప్రాంత అభివృద్ధికి దోహదం చేసే హామీలు బిల్లులో ఉన్నాయంటున్నారు.
అయితే సీమ అభివృద్ధిపై ఎటువంటి హామీలు లేవని మండిపడుతున్నారు. రాష్ట్రం విడిపోతే సీమకు వాటిల్లే నష్టం గురించి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబుతో పాటు సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ సాకే శైలజానాథ్ ఎందుకు చర్చ లేవనెత్తలేదని ప్రశ్నిస్తున్నారు. సీమ ఒకటి ఉంది...అది వెనకబడి ఉంది...దాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన కేంద్రానికి ఉన్నట్లు బిల్లులో ఎక్కడా కనపడలేదని ఆరోపిస్తున్నారు. పార్టీకి నష్టమని తెలిసినా ‘సమైక్య’మే అజెండాగా ఉద్యమాన్ని నడుపుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీమ వాసులు అభినందిస్తున్నారు. సీఎం కిరణ్, ప్రతిపక్షనేత చంద్రబాబు ఇటువంటి ప్రయత్నాలు చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదని పేర్కొంటున్నారు.