మంత్రి పదవికి, పార్టీకి ఏరాసు రాజీనామా
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని వీడే నేతల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పగా, తాజాగా ఏరాసు ప్రతాప్ రెడ్డి పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ(తెలంగాణ) బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలపడంతో ఆయన పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. ఈ విభజన ప్రక్రియతో రాయలసీమ ప్రజల బతుకును అంధకారంలోకి వెళ్లిందని.. రాయలసీమకు తాగు, సాగు నీరు కోసం ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నామన్నారు.
తెలంగాణ ప్రాంత నాయకుల్లో ఉన్న ఐకమత్యం సీమాంధ్ర నేతల్లో లేకపోవడం వల్లే విభజన ప్రక్రియ సాధ్యపడిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్ర విభజన పాపంలో అన్ని పార్టీలకు భాగస్వామ్యం ఉందని ఏరాసు విమర్శించారు. తమ ప్రాంత అభివృద్ధికి ఎవరైతే పాటుపడతారో వారి వెంటే తాను నడుస్తానని స్పష్టం చేశారు.